స్వాతంత్య్రం సమిష్టి ఫలం
దేశవిముక్తి కోసం నెలకొరిగిన యోధులెందరో
భారతీయులకు జాతీయ పర్వదినాలు ప్రధానంగా రెండున్నాయి. ఒకటి స్వాతంత్ర్య దినోత్సవం. రెండవది గణతంత్ర దినోత్సవం. ఒకటి ఆంగ్లేయుల కబంద హస్తాల నుండి మనకు విముక్తి లభించిన రోజైతే, మరొకటి భారత రాజ్యాంగం అమల్లోకొచ్చినరోజు. భారతదేశ చరిత్రలో స్వాతంత్ర్యోద్యమం ఒక మహోజ్వల ఘట్టం. మనమీరోజు ఇంతహాయిగా స్వేఛ్ఛావాయువులు పీలుస్తున్నామంటే, దీనివెనుక అసంఖ్యాకమంది అమరుల త్యాగాలున్నాయి, బలిదానాలున్నాయి. హిందువులు, ముస్లిములు అన్న బేధభావం ఏకోశానా లేకుండా భారతీయులందరూ కలసి ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాటంచేశారు. భారతదేశ స్వాతంత్ర్య సముపార్జనలో ఎవరి పాత్రా తక్కువ కాదు, ఎవరి పాత్రా ఎక్కువ కాదు. అందరూ కలసికట్టుగా, ఐక్యంగా కేవలం భారతీయులుగా మాత్రమే ఆంగ్లమూకలను తరిమికొట్టారు. కాని గతకొంతకాలంగా భారత స్వాతంత్ర్యోద్యమంతో నామమాత్రపు సంబంధంకూడా లేని కొన్ని శక్తులు భారతీయ ముస్లింల దేశభక్తిని శంకించే స్థాయికి చేరుకున్నాయి. నిజానికి భారత స్వాతంత్రోద్యమంలో ముస్లింలు పోషించిన పాత్ర అనుపమానమైనది, అపూర్వమైనది. అసలు స్వాతంత్రోద్యమానికి బీజం వేసిందే వారు.
1857 కు వందేళ్ళ పూర్వమే ఆంగ్లేయులకు వ్యతిరేకంగా సమరశంఖం పూరించారు. మొట్టమొదట షా వలివుల్లా ముహద్దిస్ దహెల్వీ రహిమహుల్లా ఆంగ్ల ముష్కరుల కుట్రలను పసిగట్టి, ప్రజలను చైతన్యవంతం చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన వారసత్వాన్ని అంది పుచ్చుకున్న ఆయన కుమారులు ఆంగ్లమూకకు వ్యతిరేకంగా తిరుగుబాటు బావూటా ఎగురవేశారు. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ' జిహాద్ ' చేయాలని దేశంలో మొట్ట మొదట ఫత్వా జారీ చేసింది షా వలియుల్లా కుమారుడు షా అబ్దుల్ అజీజ్ జహీమాబాదీ. తరువాత అలీ వర్దీ ఖాన్ బెంగాల్ , ముర్షదాబాద్ ప్రాంతాల్లో ఆంగ్లేయులను ఢీకొన్నాడు. 1757లో వర్దీఖాన్ మనవడు, బెంగాల్ నవాబ్ , పాతికేళ్ళ యువకిషోరం సిరాజుద్దౌలా ఆంగ్ల ముష్కరులపై విరుచుకు పడ్డాడు.1766లో మీర్ ఖాసిం బ్రిటిష్ బలగాలతో తలపడ్డాడు. బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీకి వ్యతిరేకంగా మంజూషా నాయకత్వంలో ముస్లిం ఫకీర్లు తిరుగుబాటు ఉద్యమాన్ని ప్రారంభించారు. భవానీపాఠక్ నాయకత్వంలో హిందూ సన్యాసులుకూడా వీరికి తోడయ్యారు. అందుకే ఈఉద్యమం 'ఫకీర్లు సన్యాసుల ఉద్యమం'గా ప్రసిధ్ధి గాంచింది. 1780 లో మన విశాఖపట్నంలోని ఈస్టిండియా కంపెనీలో సూబేదారుగా పని చేస్తున్న షేఖ్ అహ్మద్ ను మైసూరుపై దండెత్తమని అక్కడి ఆంగ్లఅధికారులు ఆదేశించారు.
కాని ఆయన వారి ఆదేశాలను బేఖాతరుచేసి, తన మద్దతుదారులతో కలిసి ఈస్టిండియా సైన్యంపైన్నే కాల్పులు జరిపాడు. మొట్టమొదటి సైనిక తిరుగుబాటుదారుడు షేఖ్ అహ్మద్ . ఏకారణం వల్లనో చరిత్ర ఈ వీరుణ్ణి విస్మరించింది. ఉత్తరాదిన ప్లాసీ, బక్సర్ యుధ్ధాలతో తమ కబ్జాను పటిష్టం చేసుకొని, బెంగాల్ సంస్థానాన్ని హస్తగతం చేసుకున్న ఆంగ్లేయులు, తమ దృష్టిని దక్షిణాది వైపు మళ్ళించారు. వీరి దుష్టబుధ్ధిని, రాజ్యకాంక్షను పసిగట్టిన శతృభయంకరుడు, దక్షిణ భారతదేశ నెపోలియన్ గా పేరుగాంచిన సయ్యద్ హైదర్ అలీ ఆంగ్లేయులకులకు వ్యతిరేకంగా మాతృదేశ రక్షణకోసం కంకణబద్దుడై వారితో యుధ్ధానికి దిగాడు.1769 లో జరిగిన ఈయుధ్ధాన్ని ప్రధమ మైసూరు యుధ్ధం అంటారు. ఈయుధ్ధంలో ఆంగ్లేయులకు గత్యంతరంలేక హైదర్ అలీతో సంధి కుదుర్చుకున్నారు. తరువాత హైదరలీ కుమారుడైనటువంచి టిప్పుసుల్తాన్ ఆంగ్లేయుల రాజ్యవిస్తరణా కాంక్షపై నీళ్ళుచల్లుతూ, వారితో పోరాటానికి దిగాడు. ఒకవైపు ఆంగ్లేయులతో పోరాడుతూనే, మరోవైపు స్వదేశీ పాలకులందరికీ,' ఆంగ్లేయులకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో అందరూ తనతో కలసిరావాలని ఉత్తరాలు రాశాడు. ఈవిషయంలో ఆంగ్లాధికారులు మాట్లాడుతూ, 'స్వదేశీ పాలకులు టిప్పుసుల్తాన్ లేఖలకు స్పందించి, ఆయన మాటను గౌరవించిఉంటే, ఈనాడు భారతదేశంలో మేము పాలకులుగా ఉండేవాళ్ళమేకాము.' అని నిర్ద్వందంగా ప్రకటించారు. చివరికి 1799 మే 4 వ తేదీన ఆంగ్లబలగాలతో పోరాడుతూ టిప్పూ అమరగతి పొందాడు. బ్రిటిష్ అధికారి జనరల్ హారీ టిప్పుసుల్తాన్ శవాన్ని స్వయంగా పరిశీలించి, మరణించాడని నిర్ధారించుకున్న తరువాత మాత్రమే 'ఈరోజు నుండి భారతదేశం మాది' అని ప్రకటించే సాహసం చేయగలిగాడు. అంటే ఆంగ్లమూకలకు ఈమైసూరు పులి ఎంతటి సింహస్వప్నంగా నిలిచాడో అర్ధంచేసుకోవచ్చు.టిప్పుసుల్తాన్ తరువాత1857లో చివరి మొగల్ చక్రవర్తి బహద్దూర్ షా జఫర్ మాతృదేశాన్ని రక్షించుకోడానికి ఆంగ్లేయులకు వ్యతిరేకంగా సమరశంఖం పూరించాడు. అడుగడుగునా ఆంగ్లేయులతో పోరాడుతూ కంట్లో నలుసులా మారిన బహద్దూర్ షా జఫర్ ను ఎలాగైనా నిలువరించాలని బ్రిటిషర్లు పథకం రచించి ఎట్టకేలకు ఆయన్ని బంధించగలిగారు. ఆయన కళ్ళముందే ఆయన నలుగురు కుమారుల్ని అత్యంత అమానుషంగా కుత్తుకలు కోస్తూ, ఇప్పటికైనా మనసు మార్చుకొని తమకు సహకరించమని గర్జించారు. కాని జఫర్ పితృప్రేమతో పొంగుకొస్తున్న పుట్టెడు దుఖాన్ని పంటి బిగువున భరిస్తూ, దైవంపై భారమేసి కళ్ళుమూసుకున్నాడు తప్ప, దేశ ప్రేమలో వీసమెత్తు తేడాకూడా రానీయలేదు. దీంతో బ్రిటిష్ సైనిక మృగాలు కొడుకుల తలలను మొండాలనుండి వేరుచేసి తండ్రి ముందుంచారు. తరువాత ఆయన్ని బర్మాలోని రంగూన్ జైలుకు తరలించారు. దేశ స్వాతంత్ర్యంకోసం ప్రాణాలను పణంగా పెట్టిన అసంఖ్యాకమంది ముస్లింయోధుల్లో మన హైదరాబాదుకు చెందిన మౌల్వీసయ్యద్ అలావుద్దీన్ , తుర్రెబాజ్ ఖాన్ ముఖ్యులు. కోఠీలోని బ్రిటిష్ అధికారుల నివాసాలపై దాడిచేసి ఆంగ్ల సైన్యానికి చుక్కలు చూపించిన వీరులు. వీరిని అత్యంత ప్రమాదకారులుగా గుర్తించిన ఆంగ్లఅధికారులు మౌల్వీసయ్యద్ అలావుద్దీన్ ను బ్రిటీష్ ప్రభుత్వం అండమాన్ నికోబార్ లోని 'కాలాపానీ' జైలుకు తరలించి చిత్రహింసలు పెట్టిచంపేశారు. తుర్రెబాజ్ ఖాన్ తూఫ్రాన్ గ్రామంలో ఆశ్రయం తీసుకుంటుండగా సమాచారం తెలిసిన పోలీసులు అరెస్టు చేయడానికి పన్నాగం పన్నారు. వారికి సజీవంగా దొరక కూడదని నిర్ణయించుకున్న ఖాన్ వారితో వీరోచితంగా పోరాడి వీరమరణం పొందాడు. పరాయి దేశస్థులయిన ఆంగ్లేయులకు సజీవంగా దొరకరాదని నిర్ణయించుకున్న తుర్రెబాజ్ ఖాన్ తెలంగాణ ఆత్మగౌరవాన్ని, హైదరాబాదీ వీరత్వాన్ని ప్రదర్శించి తురుంఖాన్ గా నిలిచిపోయాడు. ఈవీరుని మృతదేహాన్ని హైదరాబాదుకు తీసుకువచ్చి, తలను, మొండాన్ని వేరుచేసి మూడు రోజులపాటు బహిరంగంగా వేలాడ దీశారు. ఈవిధంగా దేశంకోసం తమ సర్వస్వాన్నీ త్యాగం చేసిన ముస్లింలలో అనేక మంది మహిళలూ ఉన్నారు. బేగంహజ్రత్ మహల్ , ఆబాబీబాను, ముందర్ , బేగంరహీమా, బేగంహబీబా, అజ్గరిబేగం, సురయ్యా, అజీజున్ , హమీదాబేగం లాంటి మరెందరో వీర నారీమణులు తమ జీవితాలను త్యాగంచేశారు. ఈవిధంగా దేశంకోసం, దేశరక్షణ కోసం విదేశీయుల బారినుండి భారతదేశాన్ని కాపాడుకోవడంకోసం తమ జీవితాలనే త్యాగం చేసిన వారిగురించి ఈనాడు కొన్ని మతోన్మాద ఫాసిస్టు శక్తులు అవాకులు, చవాకులు పేలుతున్నాయి. ఆంగ్లేయుల శిక్షలకు భయపడి, తమను వదిలేస్తే భారత్ కు వ్యతిరేకంగా, జీవితాంతం తమకు రుణపడి ఉంటామని ఆంగ్లేయుల అరికాళ్ళు నాకినవాళ్ళు ఈరోజు దేశభక్తి సూక్తులు వల్లించడం విడ్డూరంగా ఉంది. ఆంగ్లేయుడు వదిలి వెళ్ళిన 'విభజించి పాలించు' సూత్రాన్ని వంట బట్టించుకున్న' పరివార్ 'శక్తులు చరిత్రను వక్రీకరిస్తూ, సోదరభావంతో కలసీ మెలసీ సామరస్యంగా సహజీవనం చేస్తున్న సోదర సమూహాల నడుమ మతపరమైన భావోద్రేకాలను రెచ్చగొట్టి తమ ప్రయోజనాలు నెరవేర్చుకునే ప్రయత్నాలు బలంగా చేస్తున్నాయి. కనుక దేశం లోని ప్రజాస్వామిక, లౌకికవాద, మేధావి వర్గం ఇలాంటి శక్తుల దుష్ ప్రచారానికి వ్యతిరేకంగా గళంవిప్పి, వాస్తవ చరిత్రను భావితరాలకు తెలియ జెప్పవలసిన అవసరం ఎంతైనాఉంది.
రచయిత - యండి. ఉస్మాన్ ఖాన్
సీనియర్ జర్నలిస్టు
సెల్ నెం-99125-80645
Post A Comment:
0 comments: