జాతిని కదిలించిన స్వాతంత్రోద్యమ నినాదాలు
భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామంలో ఎంతో మంది త్యాగధనులు తమరక్తాన్ని, ప్రాణాన్ని ధారపోసి స్వాతంత్ర్యాన్ని సాధించి పెట్టారు. దేశం స్వాతంత్ర్యం సాధించి ఏడున్నర దశాబ్దాలు అయిన సందర్భాన్ని పురస్కరించుకొని భారత స్వాతంత్ర్య అమృతోత్సవాలు జరుపుకుంటున్నవేళ ఉద్యమానికి స్పూర్తిని, ప్రేరణను అందించిన, శక్తివంతమైన కొన్ని నినాదాలను మననం చేసుకోవడం మన నైతిక కర్తవ్యం. సాధారణంగా రాజులు యుధ్ధాలకు వెళ్ళేటప్పుడు శత్రు సైన్యాన్ని భయపేట్టే ఉద్దేశంతో రకరకాల ధ్వనులు, భీకరమైన శబ్దాలు, రణన్నినాదాలు చేస్తారు. అరుపులు, కేకలు, నినాదాలతో యుధ్ధమైదానం మార్మోగిపోతుంది. ఢమరుక నాదం, శంఖానాదాలతో తమ సైనికుల్లో ఉత్సాహాన్నినింపడంతో పాటు, శత్రు సైన్యంలో భయోత్పాతాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తారు. అటువంటి సాధనాలలో నినాదం ఓ ప్రముఖ ఆయుధం. ' క్విట్ ఇండియా ' (1942 ) నినాదం మనందరికీ సుపరిచితం. ఇది భారతీయుల హదయాల్లో ఎంతగా నాటుకుపోయిందో బ్రిటిష్ పాలకుల గుండెల్లో కూడా అంతగా గుచ్చుకుపోయి వారిని భయకంపితుల్ని చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే దేశ స్వాతంత్య్రోద్యమాన్నే ఈ నినాదం ఓ మలుపు తిప్పింది. ' క్విట్ ఇండియా ' ఇంతటి శక్తివంతమైన నినాద రూపకర్త యూసుఫ్ మెహర్ అలీ. ఉద్యమ సమయంలో ఆయన ముంబై మేయర్‌గా ఉన్నారు. దేశ స్వాతంత్య్రోద్యమంలో ఆయన ఎనిమిది సార్లు జైలుకెళ్లారు. స్వాతంత్య్రోద్యమానికి ఊపునిచ్చిన 'క్విట్ ఇండియా ' అనే పదం నేపథ్యాన్ని చూసినట్లయితే.., దేశ స్వాతంత్య్రోద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు వ్యూహ రచన చేస్తున్న మహాత్మాగాంధీ తన సహచరులతో ముంబైలో సమావేశమైనప్పుడు స్వాతంత్య్ర పోరాటానికి పనికొచ్చే మంచి నినాదాలను సూచించాలని కోరారు. అప్పుడు ఒకరు' గెటవుట్ ' అని అన్నారు. అది బాగా లేదని గాంధీజీ తిరస్కరించారు. ' రిట్రీట్ ఆర్ విత్‌డ్రా ' అన్న పదాన్ని రాజగోపాలచారి సూచించగా, అక్కడే ఉన్న యూసుఫ్ మెహర్ అలీ ' క్విట్ ఇండియా ' అనే పదాన్ని ప్రతిపాదించారు. గాంధీజీ కి ఈనినాదం అమితంగా నచ్చి, వెంటనే ఆ పదాన్ని ఆమోదించారు. అలాగే ' సైమన్ గోబ్యాక్ ' అనే విప్లవాత్మక నినాదం కూడా యూసుఫ్ మెహర్ అలీదే. ఈ నినాదం కూడా విపరీతంగా ప్రజల్లోకి చొచ్చుకు పోయింది. 1928 లో నాటి బ్రిటీష్ ఇండియా ప్రభుత్వ పాలన మెరగుపర్చేందుకు సూచనలు, సలహాలు ఇవ్వడం కోసం బ్రిటిష్ పాలకులు సైమన్ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. అందులో ఒక్క భారతీయుడికీ స్థానం కల్పించలేదు. అందరూ బ్రిటిష్ అధికారులే ఉన్నారు. దీనికి నిరసనగా, 1928లో సైమన్ కమిషన్ ముంబై రేవులో దిగినప్పుడు యూసుఫ్ మెహర్ అలీ కొంత మందితో కలిసి కూలీల వేషంలో రేవుకువెళ్ళి ' సైమన్ గోబ్యాక్ ' అని గర్జిస్తూ నిరసన ప్రదర్శన చేశారు.
మరో స్తూర్తిదాయకమైన, చైతన్యశీల నినాదం ' ఇంక్విలాబ్ జిందాబాద్ ' . ఈ నినాదాన్ని ప్రముఖ ఉర్దూకవి, ప్రఖ్యాత స్వాతంత్ర్య సమరయోధుడు మౌలానా హస్రత్ మోహనీ రూపొందించారు. ఈ నినాదం భగత్ సింగ్ కు అమితంగా నచ్చింది. అత్యంత ప్రభావవంతమైన ఇంక్విలాబ్ జిందాబాద్ అనే ఈ నినాదాన్ని షహీద్ భగత్ సింగ్ విపరీతంగా ప్రాచుర్యం లోకి తెచ్చారు. ఇంక్విలాబ్ జిందాబాద్ అంటే.. విప్లవం వర్ధిల్లాలి. అని అర్ధం. ఈ నినాదం స్వాతంత్ర్య పోరాట రణ నినాదాలలో ఒకటిగా మారిపోయింది. భారతీయ యువతను స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొనేవిధంగా ప్రేరేపించింది. ఇది వారిలో దేశభక్తి భావనను, స్వాతంత్రేఛ్ఛను జాగృతం చేసింది.
సత్యమేవ జయతే - ఈనినాదాన్ని పండిట్ మదన్ మోహన్ మాలవీయ రూపొందించారు. ఎప్పటికైనా సత్యమే జయిస్తుంది అనేది దీని అర్ధం. దీన్నిమనం జాతీయ నినాదంగా స్వీకరించడమే కాకుండా మన జాతీయ చిహ్నం మీద కూడా ఇది రాయబడి ఉంటుంది.1918 లో భారత జాతీయ కాంగ్రెస్ సదస్సుకు అద్యక్షత వహిస్తూ పండిట్ మదన్ మోహన్ మాలవీయ ఈనినాదాన్ని ఉద్ఘోషించారు.
అలాగే, ఆసేతు హిమాచలం ఆబాల గోపాలాన్ని ఉర్రూతలూగించిన నినాదం ' జైహింద్ ' . దీన్ని హైదరాబాదుకు చెందిన ఆబిద్ హసన్ సఫ్రానీ రూపొందించారు. అతి కొద్దికాలంలోనే నేతాజీ ద్వారా ఈ నినాదం స్వాతంత్ర్య సమరయోధుల అధికారిక నినాదంగా మారిపోయింది. ఇప్పటికీ రాజకీయ నాయకులు, దేశభక్తులు తరచూ ఈ నినాదాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. అనుపమానమైన దేశభక్తికి తార్కాణంగా చేసే నినాదంగా నేటికీ ప్రజల హృదయాల్లో బలంగా ముద్రించుకు పోయింది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో సుభాష్ చంద్ర బోస్ భారతస్వాతంత్య్ర సమరానికి మద్దతు కూడగట్టేందుకు జర్మనీ వెళ్లారు. ఆ సమయంలో జర్మనీ బ్రిటన్‌తో యుద్ధం చేస్తోంది.
అదే సమయంలో అబిద్ కూడా తన ఇంజనీరింగ్ చదువు నిమిత్తం జర్మనీ వెళ్ళారు.
బోస్ ప్రసంగాలకు ప్రభావితమైన అబిద్ హసన్ తన ఇంజనీరింగ్ చదువును మధ్యలోనే విడిచిపెట్టి, ఆయనకు వ్యక్తిగత కార్యదర్శిగా, జర్మన్ భాష అనువాదకుడిగా చేరిపొయ్యారు.
బోస్ పునర్వ్యవస్థీకరించిన ఇండియన్ నేషనల్ ఆర్మీలో అబిద్ మేజర్‌గా కూడా పని చేశారు.
ఇండియన్ నేషనల్ ఆర్మీలో భిన్న వర్గాలకు చెందిన ప్రజలు ఉండే వారు. అందులో కొంత మంది 'నమస్కార్' అని సంబోధిస్తే, మరికొంత మంది 'రామ్ రామ్' అంటూ పలకరించుకునేవారు. 'సత్ శ్రీ అకాల్', 'అస్సలామలైకుం' అంటూ అభివాదం చేసుకునేవారు కూడా ఉండేవారు.
సెక్యులర్ భావాలు కలిగిన బోస్‌కు ఇన్ని రకాల అభివాదాలు ఉండటం సబబుగా అనిపించలేదు. అందరికీ ఆమోద యోగ్యమైన ఓ అభివాద నినాదాన్ని రూపొందించాలని బోస్ తన సన్నిహితులకు చెప్పారు. అబిద్ ముందుగా 'హలో' అని ప్రతిపాదించారు కాని బోస్ కు అదినచ్చలేదు. తర్వాత 'జై హిందుస్తాన్' ' జై హింద్ ' అనే నినాదాలను సూచించారు. జైహిందుస్తాన్ కాస్త పెద్దగా ఉండడంతో బోస్ 'జై హింద్' కే జై కొట్టారు. ఈనినాదం బోస్ కు ఎంతగానో నచ్చింది. వెంటనే ఆయన దాన్ని ఆమోదించి, విశేషంగా ప్రాచుర్యంలోకి తీసుకువచ్చారు. అప్పటి నుంచి 'జై హింద్' అనే పదం దేశ భక్తిని చాటుకునే ఒక నినాదంగా మారిపోయింది. అదేవిధంగా.. మీరు నాకు రక్తాన్నివ్వండి నేను మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను అని నినదించారు నేతాజీ. భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో భారత జాతీయ సైన్యంలో చేరాలని భారత యువతను కోరుతూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఈ నినాదాన్ని ప్రయోగించారు. మాతృభూమి కోసం తమ జీవితాలను త్యాగం చేయడానికి వేలాది యువ హృదయాలను ఈ నినాదం ప్రేరేపించింది. వేలాదిమంది యువతీ యువకులకు ఈనినాదం ఒక రణ నినాదమై అయస్కాంతంలా యువతను ఆకర్షించి స్వాతంత్రోద్యమం వైపు పరుగులు తీయించింది
అలాగే.. స్వరాజ్యం నా జన్మహక్కు అనే నినాదం. కాకా బాప్టిస్టా పలికిన ఈ నినాదాన్ని బాల గంగాధర్ తిలక్ స్వీకరించారు. స్వాతంత్ర్య పోరాటంలో దేశప్రేమికుల గుండెల్లో స్వతంత్ర జ్వాలలు రేకెత్తించారు. ఈ నినాదం దేశ ప్రజలను స్వేచ్ఛా, స్వాతంత్ర్యం కోసం పోరాడటానికి ప్రేరేపించడమే కాక, వేలాది మంది ప్రజల హృదయాల్లో దేశంపై ప్రేమను ఉరకలెత్తించింది.
ముందే చెప్పుకున్నట్లు, సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం ఆంగ్లేయులకు అంతిమంగా ఇచ్చిన ఒక వార్నింగ్ 'క్విట్ ఇండియా '. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ చేసిన బలమైన, అత్యంత గంభీరమైన ఒక విజ్ఞప్తి. బ్రిటిష్ వారిని ఒక్కసారిగా, స్పష్టంగా భారతదేశాన్ని విడిచిపెట్టమని చేసిన హెచ్చరిక. ఈ క్విట్ ఇండియా ఉద్యమం నుండి వచ్చిందే ' డూ ఆర్ డై' నినాదం. జాతీయ సమైక్యత, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలతో స్వాతంత్ర్య పోరాటం సాగుతుండగా గాంధీజీ ఇచ్చిన పిలుపు డూ ఆర్ డై ఉద్యమ కారుల్లో స్పూర్తిని నింపింది.
ఇవేకాకుండా ఇంకా ఇలాంటి అనేక నినాదాలు భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో ప్రధాన పాత్ర పోషించాయి. మన స్వాతంత్ర్యసమర యోధులు చేసిన నినాదాలు శతృహృదయాల్లో భీతిని కలిగించి మాతృభూమిని పరాయి బానిసత్వం నుండి విముక్తి చేశాయి.
రచయిత - యండి. ఉస్మాన్ ఖాన్
సీనియర్ జర్నలిస్టు
సెల్ నెం-99125-80645
Home
Unlabelled
జాతిని కదిలించిన స్వాతంత్రోద్యమ నినాదాలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: