మన జాతీయ గీతంతో...పాకిస్తాన్ స్వాతంత్య్రదినోత్సవ శుభాకాంక్షలు


మన దాయది దేశమైన పాకిస్తాన్ వ్యక్తి మన భారతీయులకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపాడు. ఇందులో ప్రత్యేకత ఏముంది అంటారా...? ఇక్కడే ఓ ప్రత్యేకతను మనం గమనించాలి. 76వ స్వాతంత్రదినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న భారత్‌కు.. పాకిస్థానీ గాయకుడు తన వాయిద్యంతో మన జాతీయ గీతాన్ని ఆలపించి శుభాకాంక్షలు చెప్పి నెటిజన్ల హృదయాలను గెలుచుకున్నాడు. పాకిస్థాన్ ‘రాబబ్’ వాయిద్యకారుడు సియాల్ ఖాన్.. ‘జనగణమన’ను రాబబ్‌తో వాయించి ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. భారత్‌పై ఇలా తన అభిమానం చాటుకున్న సియాల్‌‌ వీడియో అందర్నీ విశేషంగా ఆకట్టుకుంటోంది.‌ అచ్చం సారంగి మాదిరిగా ఉండే రాబబ్.. అఫ్గనిస్థాన్, పాకిస్థాన్‌తో పాటు మన దేశంలోని కశ్మీర్‌లోనూ చాలా ప్రాచుర్యం పొందింది.

వెనుక ఆకుపచ్చదనంతో కూడిన సెరేనే పర్వతాల సమీపంలో రాబబ్‌పై ‘జనగణమన’ను సియాల్ ఖాన్ ఆలపిస్తుండటం వీడియోలో ఉంది. ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన సియాల్.. ‘‘ఇది సరిహద్దుల్లో ఉండే నా అభిమానులకు బహుమతి’’ అని రాశాడు. ‘‘భారత్‌కు స్వాతంత్రదినోత్సవ శుభాకాంక్షలు.. స్వాతంత్రదినోత్సవం 2022న మన మధ్య శాంతి, సహనం, మంచి సంబంధాల కోసం.. స్నేహం, సద్భావనకు చిహ్నంగా నేను భారతదేశ జాతీయ గీతాన్ని ప్రయత్నించాను’’ అని సియాల్ రాసుకొచ్చాడు.

24 గంటల్లోపే ఈ వీడియోకు దాదాపు మిలియన్ వ్యూస్.. 53 వేలకుపైగా లైక్‌లు, దాదాపు 8,500 రీట్వీట్‌లు వచ్చాయి. సియాల్ ఖాన్‌కు నెటిజన్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మాటలు రావడంలేదని, మీ బహుమతి వెలకట్టలేనిదని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా.. మీ ఈ ప్రయత్నం ఏదో ఒక రోజు రెండు దేశాల మధ్య శాంతిని నెలకొల్పడానికి చాలా దోహదపడతాయి అని మరొకరు కామెంట్ పెట్టారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: