ఆగస్టు 2022

 కోర్టులో మరోసారి అనంతబాబుకు ఎదురు దెబ్బ


ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురవుతూనే ఉంది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడు, వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు తాజాగా కోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. అనంతబాబు బెయిల్ పిటిషన్ ను రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ న్యాయస్థానం కొట్టివేసింది. ఆయన బెయిల్ పిటిషన్ కోర్టులో తిరస్కరణకు గురికావడం ఇది మూడోసారి. నిర్దేశిత సమయంలో పూర్తి చార్జిషీట్ వేయనందున తనకు బెయిల్ ఇవ్వాలని అనంతబాబు కోర్టును కోరారు. అయితే కోర్టు అతడి విజ్ఞాపనను తోసిపుచ్చింది. 

తల్లి మరణం నేపథ్యంలో అనంతబాబు ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్నారు. ఇటీవల ఆయన తల్లి మరణించడంతో కోర్టు 3 రోజుల కండిషనల్ బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పొడిగించాలంటూ అనంతబాబు హైకోర్టును ఆశ్రయించగా సెప్టెంబరు 5 వరకు బెయిల్ పొడిగిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, బెయిల్ షరతులపై కిందికోర్టు ఇచ్చిన ఉత్తర్వులను యథాతథంగా పాటించాలని అనంతబాబుకు స్పష్టం చేసింది.  త్వరలోనే హైకోర్టు పొడిగించిన బెయిల్ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలోనే, మరోసారి బెయిల్ కు దరఖాస్తు చేసుకోగా, రాజమండ్రి కోర్టులో నిరాశ తప్పలేదు.

 అనుమతుల పేరుతో ఆంక్షలు సరికాదు


గణేశ్ ఉత్సవాలపై అనుమతుల పేరుతో ఆంక్షలు సరికాదని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వినాయక చవితి పర్వదినం నేపథ్యంలో ట్విట్టర్ లో స్పందించారు.  వినాయక చవితి కేవలం ఒక పండుగ మాత్రమే కాదని, భారత స్వాతంత్ర్య ఉద్యమానికి ప్రజలను ఏకంచేసి, వారిలో జాతీయ భావాన్ని నింపేందుకు దోహదపడిన ఒక సామాజిక స్ఫూర్తి అని పేర్కొన్నారు. అలాంటి గణేశ్ ఉత్సవాలపై అనుమతుల పేరుతో ఆంక్షలు సరికాదని ఈ సందర్భంగా ప్రభుత్వానికి సూచిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు. గణనాయకుని భక్తిశ్రద్ధలతో ఆరాధించే ప్రజలందరికీ వినాయక చతుర్థి శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు. ఆ విఘ్నేశ్వరుడు మీ సంకల్పాలన్నింటినీ నెరవేర్చాలని, మీ ఇంటిల్లిపాదికీ సుఖసంతోషాలను ప్రసాదించాలని కోరుకుంటున్నానని తెలిపారు.


సచివాల సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన.... 

పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)

నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలోని స్థానిక మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం నందు ఎంపీపీ నాగమద్దమ్మ ఎంపీడీవో విజయసింహారెడ్డి ఆధ్వర్యంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ శాఖ అధికారులతో మండలంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల గురించి పనుల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు తమ గ్రామంలో కరువు పనులు జరగడం లేదని, సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని, గ్రామాలలోని సమస్యలను, ఉండుట్ల గ్రామంలో 2005లో స్కూలు కట్టుకునేందుకు అనుమతిచ్చారని  అందులో అంగన్వాడి సెంటర్ కూడా ఉందని కానీ కొందరు ఇది మా స్థలం 2008 లో మాకు డీకెట్ పట్టా ఉందని ఇటువైపు  తిరగరాదని అంటున్నారనే సమస్యను పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. తెలియజేశారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో కరువు పనులను ఏ కారణం చేత నిలిపివేశారని, తప్పనిసరిగా మండలంలోనీ ప్రతి గ్రామంలో కరువు పనులను ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు, సచివాలయం సిబ్బంది గ్రామాలలోని ప్రజలందరికీ తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని మొక్కుబడిగా ఉద్యోగాలు చేయరాదని, సరియైన వేలకు విధులకు రావాలని వీకేసి వేసి ప్రజలకు అందుబాటులో లేకుండా బయట సొంత పనులకు వెళ్లే వారిపై తగిన చర్యలు తీసుకుంటామని, నిజమైన లబ్ధిదారులకు ఇల్లు కట్టుకునేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు 1,80,000 రూపాయలను పొదుపు గ్రూపులలో ఉన్న వారికి 2,15,000 రూపాయలను వారు ఇల్లు కట్టుకునే స్థాయిని బట్టి వారికి డబ్బులు అందజేయడం జరుగుతుందని,

గ్రామాలలో అత్యవసర పనులకు నిమిత్తం 20 లక్షల రూపాయలు మంజూరు అయ్యాయని, బిలకల గూడూరు గ్రామంలో పొలాలు పోయి పరిహారం రానీ నిజమైన రైతన్నలను తాసిల్దార్ గారిచే సర్వే జరిపించి వారికి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ శ్రీనివాసులు, జడ్పిటిసి ఆర్ బి చంద్రశేఖర్ రెడ్డి, వ్యవసాయ శాఖ సొసైటీ అధ్యక్షులు ఆర్.బి శేఖర్ రెడ్డి, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచులు, వివిధ శాఖల అధికారులు అందరూ పాల్గొన్నారు. 

 భర్త మరణాన్ని తట్టుకోలేక 24 గంటల్లో భార్య మరణం


చిన్న పొరపొచ్చలకే కాపురాలు పటాపంచలవుతున్న తరుణంలో ఒకరంటే ఒకరు అంటే ప్రాణంగా భావించే జంటలు కూడా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో విషాద ఘటన జరిగింది. భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య 24 గంటలు గడవకముందే కన్నుమూసింది. సిరిమామిడి పంచాయితీ తోటూరుకు చెందిన భర్తు సుందరరావు భార్యతో కలసి ఉపాధి రీత్యా బిలాయ్‌లో ఉంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం అనారోగ్యంతో సుందరరావు కన్నుమూశారు. భర్త చనిపోయిన బాధలో భార్య పుణ్యవతి కూడా సోమవారం మధ్యాహ్నం ప్రాణాలు విడిచారు. భార్యాభర్తల మరణంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు.

సుందరరావు పెద్ద కుమారుడికి వివాహం కాగా.. చిన్న కుమారుడికి ఈ నెల 20న పెళ్లి చేయాలని నిర్ణయించారు. కానీ అనివార్య కారణాలతో పెళ్లి వాయిదా పడింది. ఇంతలో సుందరరావు మరణం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. సుందరరావు వాడబలిజ సంక్షేమసంఘం జాతీయ సంఘ వ్యవస్థాపక సభ్యునిగా.. తోటూరు అరుణోదయ సంఘం అధ్యక్షునిగా సేవలు అందిస్తున్నారు. బిలాయ్‌ కుర్సీపార్‌ ఇందిరాగాంధీ విద్యాలయం ఉపాధ్యాయునిగా తెలుగు చదువులకు సేవలందిస్తున్నారు.

 నిజాయితీ ప్రదర్శించారు...ప్రశంసలు అందుకొంటున్నారు


నిజాయితీ కనుమరుగవుతున్న ఈ తరుణంలో ఓ రజక సోదరుడు నిజాయితీ చాటాడు...పలువురి ప్రశంసలు పొందాడు. డా బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వాచ్‌మన్ దంపతులు నిజాయితీ చాటుకున్నారు. తమకు దొరికిన బంగారాన్న తిరిగి అప్పగించి శభాష్ అనిపించుకున్నారు. అమలాపురం స్థానిక భూపయ్య అగ్రహారం మహానంద అపార్ట్‌మెంట్‌లో మల్లేశ్వరరావు దంపతులు వాచ్‌మన్‌గా పనిచేస్తున్నారు. మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ రుద్రరాజు నానిరాజు కుమార్తె డాక్టర్‌ ఆర్‌.సాయిశిల్ప పట్టణంలో సాయి సంజీవిని ఆస్పత్రి నిర్వహిస్తున్నారు.

శిల్ప తన మాసిన వస్త్రాలను ఉతికి ఇస్త్రీ చేసేందుకు రజకులైన మల్లేశ్వరరావు దంపతులకు ఇస్తుంటారు. ఎప్పటిలాగే రెండు రోజుల క్రితం డాక్టర్‌ సాయిశిల్ప మాసిన వస్త్రాలను ఓ బ్యాగ్‌లో ఉంచి మల్లేశ్వరరావు దంపతులకు ఇచ్చారు. గతంలో శిల్ప అదే బ్యాగ్‌తో ఊరెళ్లొచ్చారు. అయితే రూ.4 లక్షల విలువైన బంగారు నగ ఉన్న కవర్‌ను పొరపాటున బ్యాగ్‌లో మరచిపోయారు. మాసిన వస్త్రాలను అదే బ్యాగ్‌లో ఉంచి మల్లేశ్వరరావు దంపతులకు ఇచ్చారు. నగ సంగతి మర్చిపోయారు. ఇంతలో బంగారు నగ కనిపించకపోవడంతో డాక్టర్‌ శిల్ప కుటుంబ సభ్యులు కంగారుపడ్డారు.

ఈలోపు ఆ బ్యాగ్‌లో మాసిన వస్త్రాలను ఉతికేందుకు బయటకు తీసిన మల్లేశ్వరరావు దంపతులకు బంగారు నగ కనిపించింది. వెంటనే ఆ బంగారు నగను దంపతులు నిజాయితీగా తీసుకువెళ్లి డాక్టర్‌ సాయిశిల్పకు అందజేశారు. భార్యాభర్తల నిజాయితీకి మెచ్చిన సాయిశిల్ప తల్లిదండ్రులైన మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ రుద్రరాజు నానిరాజు, ఉషాకుమారి.. మల్లేశ్వరరావు దంపతులను సత్కరించారు. అంతేకాదు రూ.5 వేల నగదు బహుమతి అందజేశారు. మల్లేశ్వరరావు దంపతుల నిజాయితీని చాటుకున్నారని స్థానికులు అభినందించారు.

 అడవి నుంచి జనవాసాల్లోకి వచ్చి దాడి


అడవి నుంచి చీమలు జనవాసాల్లోకి వచ్చి మరీ దాడి చేస్తున్నాయి.  ఇదేక్కడో కాదండోయ్ మన పక్కనున్న తమిళనాడులోనే. బలవంతమైన సర్పము.. చలిచీమల చేత చిక్కి చావదె సుమతీ!.. ఇది సుమతీ శతకకారుడి పద్యం. ఆయన చెప్పింది అక్షరాలా నిజం.  అయితే ఇప్పుడు మనం చెప్పుకునేది చలి చీమల గురించి కాదు. ఎర్రటి చీమలు అడవి నుంచి జనవాసాల్లోకి వచ్చి దాడి చేస్తున్నాయి. కలసికట్టుగా కీటకాలు, పాములు, జంతువులను తినేస్తున్నాయి. ఇది ఆఫ్రికా దేశంలో అని అనుకోవద్దు. తమిళనాడులోని దిండిగల్ జిల్లా కరతమలై అటవీ పరిసర గ్రామాల్లో ప్రస్తుతం నెలకొన్న అసాధారణ పరిస్థితి.

వీటి పేరు ఎల్లో క్రేజీ యాంట్స్. ఆస్ట్రేలియాలోని చాలా ప్రాంతాల్లో ఇవి కనిపిస్తుంటాయి. మన దగ్గర కొత్తగా వీటి అస్తిత్వం బయటకు వచ్చింది. ఈ చీమల వల్ల పశువులకు కంటి చూపు పోతోంది. పంటలకు నష్టం కలుగుతోంది. పాములు, కుందేళ్లు, ఇతర చిన్న పాటి జంతువులను ఈ చీమల దండు దాడి చేసి తినేస్తోంది. వీటికంటూ ఫలానా ఆహారం ఏదీ లేదని, కనిపించిన దేన్నయినా తినేస్తాయని ఎల్లో క్రేజీ యాంట్స్ పై పరిశోధన చేసిన ఎంటమాలజిస్ట్ డాక్టర్ ప్రణయ్ బైద్య తెలిపారు.

ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన 100 జాతుల్లో ఎల్లో క్రేజీ యాంట్స్ కూడా ఒకటి. ఈ విషయాన్ని ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ చెబుతోంది. చీమ అంటే కుడుతుంది. కానీ, ఎల్లో క్రేజీ యాంట్స్ కుట్టవు. ఫార్మిక్ యాసిడ్ ను చిమ్ముతాయి. ఇది కళ్లల్లో పడితే కంటి చూపు పోతుంది. ఒక్కో చీమ 4ఎఎం పొడువు ఉంటుంది. పొడవాటి కాళ్లు ఉంటాయి. తలపై పొడవాటి యాంటెన్నాలా ఉంటుంది. 

ఈ చీమల దాడి, పంటల నష్టంతో దిండిగల్ జిల్లాలోని గ్రామాల నుంచి ప్రజలు వలసపోతున్నారు. కొన్నేళ్ల క్రితం నుంచి ఈ చీమలను తాము సమీప అడవుల్లో చూస్తున్నామని.. కానీ, పెద్ద సంఖ్యలో గుంపులుగా గ్రామాల్లోకి రావడం ఇదే మొదటిసారిగా స్థానికులు చెబుతున్నారు. చీమల మందు చల్లినా కానీ వాటిని నియంత్రించలేకపోతున్నారు. పైగా వాటి సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉందంటున్నారు. ప్రజల వినతి మేరకు అటవీ అధికారులు నిపుణుల సాయం కోరారు. 

 

 ముస్తాబు అవుతున్న... వినాయక మండపాలు

(జానో జాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)

నంద్యాల జిల్లా, గడివేముల మండలంలోని 18 గ్రామాలలో వినాయక చవితి  విగ్రహ మండపాలు చిన్నపిల్లల కేరింతలతో, రంగురంగుల అలంకరణలతో చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరూ కలిసి మండపాలనుముస్తాబు చేస్తున్నారు. గడివేముల బీసీ కాలనీలోని గణేష్ యూత్ వారు 31-08-22 వ తేదీ సాయంత్రం06:00 గంటలకు స్లో బైక్ రైసులు నిర్వహిస్తున్నారు.01-09-22 వ తేదీ సాయంకాలం 08:00 గంటలకు చెక్కభజన కార్యక్రమం ఉంటుందని,02-09-22 వ తేదీన సాయంకాలం 08:00 గంటల నుండి అన్నదాన కార్యక్రమాన్ని, అన్నదాన కార్యక్రమానంతరం ఉట్టి కొట్టే కార్యక్రమం ఉంటుందని ఈ కార్యక్రమానికి గడివేముల గ్రామం లోని ప్రజలందరూ పాల్గొనాలని శ్రీ వినాయకుని ఆశీస్సులు అందుకోవాలని బీసీ కాలనీ గణేష్ యూత్ కమిటీ వారు తెలియజేశారు.




 రగులుతున్న కుప్పం...టీడీపీ వర్సెస్ వైసీపీ

చిత్తూరుజిల్లాలోని కుప్పం నియోజకవర్గం టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్లుగా రగులుతోంది. చిత్తూరు జిల్లా కుప్పంలో మరోసారి అన్న క్యాంటీన్ ధ్వంసం కలకలంరేపింది. సోమవారం రాత్రి 11 గంటలకు దాడి చేసి అక్కడ ఏర్పాట్లు, ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ సమాచారం అందుకున్న టీడీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. గతవారమే చంద్రబాబు పర్యటన జరుగుతున్న క్రమంలో అన్న క్యాంటిన్‌ను వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు మళ్లీ క్యాంటిన్ ధ్వంసం చేయడం కలకలంరేపుతోంది.

అన్న క్యాంటీన్లపై దాడి జగన్‌ రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. కుప్పం ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ దగ్గర 86 రోజులులగా క్యాంటీన్ నిర్వహణ జరుగుతుందని.. అర్థరాత్రి దాడిని త్రీవంగా ఖండిస్తున్నామన్నారు. వైఎస్సార్‌సీపీ పాలనలో 201 అన్న క్యాంటీన్లను రద్దు చేశారని.. ఇప్పుడు పేదవాడి నోటి దగ్గరి కూడు లాక్కుంటున్నారని ధ్వజమెత్తారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా అన్న క్యాంటీన్లు నిర్వహించి తీరుతామని.. అన్నక్యాంటీన్‌పై దాడి చేసినవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

మరోవైపు నేడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం లోకేష్ రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి చిత్తూరు సబ్ జైలుకి వెళతారు. అక్కడ కుప్పంలో చంద్రబాబు పర్యటన సందర్భంలో అరెస్టైన మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులుతో సహా ఇతర నాయకులు, కార్యకర్తలను లోకేష్ పరామర్శిస్తారు.

అక్కడి నుంచి బయల్దేరి సాయంత్రం 5.30 గంటలకు చంద్రగిరి చేరుకుని ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోయిన టీడీపీ నాయకులు భాస్కర్, భాను ప్రకాష్ రెడ్డి చిత్రపటాలకు నివాళి అర్పించి కుటుంబసభ్యులను పరామర్శిస్తారు. ఆ తర్వాత పెరుమాలపల్లెలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన టీడీపీ నేత సోమనాధ్ రెడ్డిని పరామర్శిస్తారు. ఇదే సమయంలో కుప్పం అన్న క్యాంటిన్ ధ్వంసం చేయడం చర్చనీయాంశమైంది.

 ఆ సమయంలోపు ఏపీ బకాయిలు చెల్లించండి


ఏపీ విద్యుత్ సంస్థలకు బాకీపడిన రూ.6,756.92 కోట్లను నెల రోజుల్లోగా చెల్లించాలని తెలంగాణకు కేంద్రం డెడ్‌లైన్ పెట్టింది. రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఆదేశాల మేరకు.. తెలంగాణ డిస్కమ్‌లకు ఏపీ జెన్‌కో 8,890 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను సరఫరా చేసింది. 2014 జూన్‌ 2 నుంచి 2017 జూన్‌ 10 వరకూ తెలంగాణకు అందించిన ఈ విద్యుత్తు బకాయిలు చెల్లించలేదు.

గతంలో ఎన్నో సందర్భాల్లో తెలంగాణ నుంచి రావాల్సిన బకాయిల్ని వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం పలు సందర్భాల్లో కేంద్రాన్ని కోరింది. వారం క్రితంఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధాని మోదీతో సమావేశంలో ప్రస్తావించారు. అలాగే గతంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన కేంద్రం.. రూ.6,756.92 కోట్ల బకాయిలను 30 రోజుల్లోగా చెల్లించాలని తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థలను ఆదేశించింది.

ఏపీ జెన్‌కో సరఫరా చేసిన 8,890 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌కు.. తెలంగాణ డిస్కమ్‌లు రూ.3,441.78 కోట్లు చెల్లించాలి. ఈ బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో ఈ ఏడాది జూలై 31 నాటికి మరో రూ.3,315.14 కోట్లు లేట్‌ పేమెంట్‌ సర్‌ చార్జీ పడింది. ఈ మొత్తం రూ.6,756.92 కోట్లను ఏపీకి చెల్లించాలి. ఎన్నో సందర్భాల్లో ఈ బకాయిల్ని చెల్లించాలని కోరినా తెలంగాణ మాత్రం ఇవ్వలేదు.

విద్యుత్‌కు సంబంధించి తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్‌ బకాయిలపై జోక్యం చేసుకోవాలని కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వం ఎన్న సందర్భాల్లో కోరింది. గతేడాది నవంబర్‌లో కేంద్ర విద్యుత్‌ శాఖ నిర్వహించిన ఇరు రాష్ట్రాల ఇంధన శాఖ కార్యదర్శుల సమావేశంలోనూఏపీ అధికారులు బకాయిల అంశాన్ని ప్రస్తావించారు. ఇరు రాష్ట్రాలు చర్చించుకుని 15 రోజుల్లో ఓ నిర్ణయానికి రావాలని కేంద్రం కూడా సూచించింది. గడువులోగా తేల్చుకోలేని పక్షంలో తమ దృష్టికి తెస్తే కేంద్ర హోంశాఖతో సంప్రదించి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆ చర్చలు సఫలం కాలేదు.. అలాగే తమకే ఏపీ తిరిగి బకాయిలు చెల్లించాలంటోంది తెలంగాణ. ముఖ్యమంత్రి జగన్ పట్టుబట్టి ప్రధాని మోదీకి సమస్యను వివరించారు. ఇప్పుడు ఆ బకాయిల్ని చెల్లించాలని కేంద్రం ఆదేశించింది.


 పర్యావరణాన్ని పరిరక్షించండి


మట్టి విగ్రహాల వినియోగంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మట్టి విగ్రహాలను ప్రతిష్టించి.. పర్యావరణాన్ని పరిరక్షించాలని ఆయన ప్రజలను కోరారు. గణేష్ ఉత్సవాలపై బుద్ధ భవన్‌లో జీహెచ్ఎంసీ అధికారులతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మట్టి విగ్రహాల వినియోగంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లో 6 లక్షల మట్టి విగ్రహాల పంపిణీ జరుగుతోందని వివరించారు.

ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని మంత్రి తలసాని సూచించారు. గణేష్ ఉత్సవాలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని స్పష్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. నిర్వాహకులు సంబంధిత అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలని సూచించారు. సౌండ్ పొల్యూషన్ కాకుండా నిమజ్జనం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు.

 ఫ్రీజ్ ఉంది కదా అని ఏదిపడితే అది పెట్టకూడదు

ఫ్రీజ్ ఉంది కదా ఇంక ఎందుకు బెంగా అని ఏదైనా నిల్వచేయాలి అనుకొనే వారు చేసే ఒక ఆలోచన. నేడు టీవీ, ఫ్రిడ్జ్ లేని ఇల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు. మరీ పేదలు మినహాయిస్తే దాదాపు అందరి ఇళ్లల్లో రిఫ్రిజిరేటర్ దర్శనమిస్తుంది. ఒకప్పుడు కేవలం మంచి నీరు, కూరగాయలకే రిఫ్రిజిటేర్ పరిమితయ్యేది. కానీ కాలక్రమంలో అన్ని రకాల ఆహార పదార్థాలు, పండ్లను తీసుకెళ్లి ఫ్రీజర్ లో పెట్టేసే ధోరణి పెరిగిపోయింది. నిజానికి ఫ్రిడ్జ్ వినియోగం గురించి తెలిసింది తక్కువ మందికే. ఫ్రీజర్ లో కొన్ని రకాల పదార్థాలను పెట్టకూడదు. పాడైపోకుండా ఉండాలని ప్రతిదీ తీసుకెళ్లి శీతల బాక్స్ లో పెట్టేయడం సరికాదు. 

గుడ్లు

రిఫ్రిజిరేటర్లో గుడ్లను పెడుతుంటారు. గుడ్డులోని సొన ఘనీభవించిన తర్వాత దాని పరిమాణం విస్తరిస్తుంది. దీంతో అన్ని సందర్భాల్లో కాకపోయినా, కొన్ని సార్లు గుడ్డుపై పెంకు క్రాక్ ఇస్తుంది. దాంతో అది కలుషితం కావచ్చు. అందుకని గుడ్లను ప్రిజ్డ్ లో పెట్టి తీసుకునే సమయంలో పరీక్షించి చూడాలి. మంచిగా ఉంటే వాడుకోవచ్చు. క్రాక్ ఇస్తే దాన్ని వాడకూడదు. 

మాంసం

ఫ్రిజ్ లో ఒకసారి స్టోర్ చేసిన మాంసాన్ని బయటకు తీసి కొద్ది సేపు ఉంచిన తర్వాత, తిరిగి ఎట్టి పరిస్థితుల్లోనూ మరలా రిఫ్రిజిరేటర్ లో పెట్టొద్దు. దాని టెక్స్చర్ మారిపోతుంది. దీనికి బదులు కావాల్సినంతే బయటకు తీసుకోవాలి. 

పండ్లు, కూరగాయలు

నీటి శాతం ఎక్కువగా ఉండే కీరదోస, దోస, పుచ్చకాయ వంటివి రిఫ్రిజిరేటర్ లో పెట్టారనుకోండి. వాటిల్లో నీరు ఘనీభవిస్తుంది. బయటకు తీసి అలా కొద్దిసేపు ఉంచితే ఇవి తడిగా మారిపోతాయి. తినడానికి అంతగా బాగోవు. పుచ్చకాయను గది ఉష్ణోగ్రతలో ఉంచినప్పుడు అది ఇంకా పండాల్సి ఉంటే ఆ ప్రకియ కొనసాగేందుకు వీలుంటుంది. 

బంగాళాదుంపలను కూడా ఫ్రీజర్ లో పెట్టకూడదు. ఎందుకంటే వీటిల్లోనూ తేమ శాతం తగినంత ఉంటుంది. వాటిని బయట పెట్టినా చాలా రోజుల పాటు నిల్వ, రుచితో ఉంటాయి. టమాటాలను గదిలో ఉంచినప్పుడు అవి పండుతూనే ఉంటాయి. దాంతో రుచి పెరుగుతుంది. రిఫ్రిజిరేటర్ లో పెట్టేశారంటే ఆ పండే గుణం ఆగిపోతుంది. దాంతో వాటి అసలు రుచి తెలియదు. ఫ్రిడ్జ్ లో పెట్టకుండా టమాటాలను ఒకసారి వండుకుని రుచి చూడండి.  


వేయించిన పదార్థాలు

వేయించిన ఆహార పదార్థాలు, ఉడికించిన రైస్ ను కూడా రిఫ్రిజిరేటర్ లో పెట్టకూడదు. దీనికి బదులు వీటిని ఓవెన్ లో వేడి చేసుకుని ఉపయోగించుకోవచ్చు.

తేనె

తేనెలో చక్కెరలు ఎక్కువ. పైగా ఇది సహజ ప్రిజర్వేటివ్. కనుక దీనికి రిఫ్రిజిరేషన్ అవసరం లేదు. తేనెను ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే అది గట్టి పడి, రాయిగా మారుతుంది. 

కాఫీ

కాఫీ గింజలను కూడా పెట్టకూడదు. దీని ఫ్లావర్ ఇతర పదార్థాలకు వ్యాపిస్తుంది. ఆరోమాటిక్ గుణం తగ్గిపోతుంది. 

చాక్లెట్లు

మనలో చాలా మంది చాక్లెట్లను ఫ్రిడ్జ్ లో పెట్టేస్తుంటారు. ఓపెన్ చేయనివి పెట్టొచ్చు. కానీ ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత వాటిని బయటే ఉంచి వీలైనంత తొందరగా తినేయడమే మంచిది. అంతేకానీ రిఫ్రిజిరేటర్ లో పెడితే కంటామినేషన్ అవుతాయి. 

ఇంకా ఆనియన్స్, బ్రెడ్, అవకాడో, స్ట్రాబెర్రీ, వెల్లుల్లి రెబ్బలు, మూత తెరిచిన ఫుడ్ క్యాన్లు, గుమ్మడి కాయలు, యాపిల్, పండని మామిడి కాయలు, పీచ్ పండ్లను, తులసి ఆకులను కూడా రిఫ్రిజిరేటర్ లో పెట్టకూడదు.


 కెనడాలోని..ఆ వీధికి ఏ.ఆర్.రెహమాన్ పేరు పెట్టారు

మనదేశంలో ముస్లింల పేరుతో ఉన్న ప్రాంతాల పేర్లపై రాద్దాంతం చేస్తూ పేర్లు మార్చుతుంటే కెనడాలో మాత్రం అందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. గ్రామీ, ఆస్కార్ అవార్డుల గ్రహీత అయిన ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ పట్ల కెనడా తన గౌరవ భావాన్ని చాటుకుంది. కెనడాలోని మార్కమ్ అనే చిన్న పట్టణంలోని ఓ వీధికి ఏఆర్ రెహమాన్ పెరు పెట్టారు. 3.3 లక్షల జనాభా కలిగిన చిన్న పట్టణం ఇది. టొరంటోకు 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుందిది. ఈ విషయాన్ని ఏఆర్ రెహమాన్ స్వయంగా పంచుకున్నారు. 

ఈ సందర్భంగా మార్కమ్ పట్టణ మేయర్ ఫ్రాంక్ స్కార్ పిట్టికి ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక స్టేట్ మెంట్ జారీ చేశారు. కెనడా ప్రజల పట్ల కృతజ్ఞత భావాన్ని చాటుకున్నారు. ‘‘నేను నా జీవితంలో ఇలాంటిది ఊహించలేదు. నిజంగా మీ అందరికీ, మార్కమ్ మేయర్ ఫ్రాంక్ స్కార్ పిట్టి, కౌన్సిలర్లు, ఇండియన్ కాన్సులేట్ జనరల్ (అపూర్వ శ్రీవాస్తవ), కెనడా ప్రజలకు కృతజ్ఞుడిని. 

ఏఆర్ రెహమాన్ అన్న పేరు నాది కాదు. దీనర్థం దయాగుణం. మనందరి ఉమ్మడి దేవుడి గుణం. దీనికి మనం సేవకులం. కనుక ఈ పేరు ప్రశాంతతను, ఐశ్వర్యాన్ని, సంతోషాన్ని, ఆరోగ్యాన్ని కెనడా ప్రజలకు తీసుకురావాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ దేవుడి దీవెనలు ఉండాలి. భారత్ లో నా పట్ల ప్రేమ చూపించే నా సోదరులు, సోదరీమణులకు సైతం నేను ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎంతో సృజనాత్మకత కలిగిన వారు నాతో కలసి పనిచేసి నన్ను వందేళ్ల సినిమా ప్రపంచంలో సెలబ్రిటీని చేశారు. కానీ, నేను ఈ సముద్రంలో చిన్న బిందువును. విశ్రాంతి తీసుకోకుండా మరింత సేవ చేయాలని, స్ఫూర్తినీయంగా ఉండాలని నాపై బాధ్యతను ఇది పెంచింది’’ అని ఏఆర్ రెహమాన్ ట్వీట్ చేశారు.

 తహసిల్దారు పై తప్పుడు ఆరోపణలు సమంజసమా

గడివేముల మండల ఉపాధ్యక్షులు కాల్ నాయక్ 

(జానో జాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)

తహసిల్దార్ అవినీతి అక్రమాలకు పాల్పడిందని  తప్పుడు ప్రచారం సమంజసం కాదని గడివేముల మండలం ఎల్ కే తాండ గ్రామనికి చెందిన గడివేముల మండల  ఉపాధ్యక్షులు కాలు నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా తమ్ముడు లింబే నాయక్ కు ఏడుర్ల గవి వద్ద సర్వేనెంబర్ 461 రిజిష్టర్ భూమి కలదు. లింబె నాయక్ కుమార్తె  వివాహానికై సదరు భూమిని అమ్మేందుకు తిరుపాడు గ్రామానికి చెందిన మధు అనే వ్యక్తి కి విక్రయించేందుకు అంగీకరించి, సదరు భూమి పట్టా ఉన్నదా లేదా రిజిస్టర్ భూమా కాదా అని తాసిల్దారును  విచారించి భూమిని కొనుగోలు చేస్తామని చెప్పడం జరిగిందన్నారు.


తహసిల్దార్ నాగమణి  మా దగ్గరి బంధువు కావడంతో తహసిల్దార్ నాగమణి దృష్టికి తీసుకెళ్లామనీ ఈ విషయాన్ని వక్రీకరించి ఒక ప్రభుత్వ అధికారి పై ఒక పత్రిక ప్రతినిధి  అనుచిత  ప్రచురణ చేయడం ఎంత వరకు సమంజసమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గడివేముల మండలం తాసిల్దార్ నాగమణి అవినీతి అక్రమాలకు పాల్పడలేదని కాలు నాయక్ తెలిపారు.

 గంగా..జమున తెహిజీబ్ హైదరాబాద్ లో..మత కేసులు కూడా ఎక్కువేనటా

హైదరాబాద్ అంటే అందరూ గంగా. జమున తెహిజిబ్ అంటారు. కానీ దేశంలో ఎక్కడా లేని విధంగా మతం, జాతి, ప్రాంతీయతకు సంబంధించి దేశం మొత్తమ్మీద అత్యధిక కేసులు నమోదైంది హైదరాబాద్ నగరంలోనే అని తాజాగా వెల్లడైంది. హైదరాబాదులో అత్యధిక సంఖ్యలో ఈ తరహా కేసులు నమోదు కావడం ఇది వరుసగా మూడో ఏడాది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) విడుదల చేసిన క్రైమ్ ఇన్ ఇండియా-2021 నివేదికలో ఈ వివరాలు ఉన్నాయి. మొత్తం 19 నగరాల్లో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. 

ఐపీసీ సెక్షన్ 153ఏ కింద 2021లో హైదరాబాదులో 28 కేసులు నమోదు కాగా, ఢిల్లీలో 17, కోయంబత్తూరులో 14, నమోదయ్యాయి. 2021లో మొత్తం 19 నగరాల్లో 121 కేసులు నమోదు కాగా, ఒక్క హైదరాబాదులోనే అత్యధికంగా 23 శాతం కేసులు నమోదయ్యాయని ఎన్సీఆర్బీ పేర్కొంది. ఊరట కలిగించే అంశం ఏమిటంటే, 2020తో పోల్చితే కేసుల నమోదులో 44 శాతం తగ్గుదల కనిపించింది. 


అంతేకాదు, ఇతర రాష్ట్రాలతో పోల్చితే హైదరాబాదులో అల్లర్లు కూడా తక్కువేనని వెల్లడైంది. ఇక, రాష్ట్రాల విషయానికొస్తే... 2021లో తెలంగాణ వ్యాప్తంగా అల్లర్లకు సంబంధించి 562 కేసులు నమోదయ్యాయి. వాటిలో అత్యధికం భూవివాదాలు, రాజకీయ అంశాలు, మతపరమైన అంశాలు, ఆర్థిక వివాదాలు, తదితర అంశాలకు సంబంధించినవే ఉన్నాయి. అటు, హైదరాబాద్ లో సైబర్ క్రైమ్ కేసులు కూడా మరింత పెరిగినట్టు ఎన్సీఆర్బీ నివేదిక చెబుతోంది. 2020లో హైదరాబాదులో 1,379 సైబర్ కేసులు నమోదు కాగా, 2021లో ఆ సంఖ్య 5,646కి పెరిగింది.

 పర్యటకులను ఆకర్షించేందుకు..సింగపూర్ లో కొత్త వీసా విధానం

పర్యటకులను పెంచుకోవడమే ధ్యేయంగా సింగపూర్ కొత్త వీసా నిబంధనలు ప్రకటించింది. దేశంలోకి విదేశీ నిపుణులు, వ్యాపారవేత్తల వలసను పెంచేలా వీసా నిబంధనలను సడలిస్తూ నూతన వీసా విధానానికి రూపకల్పన చేసింది. కరోనా సంక్షోభం కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థకు పునరుజ్జీవం కల్పించే చర్యల్లో భాగంగా వర్క్ వీసాలకు సంబంధించి కొత్త నిబంధనలతో ఓ ప్రకటన జారీ చేసింది. 

తాజా నిబంధనల ప్రకారం.... నెలకు కనీసం రూ.17 లక్షలు సంపాదించే విదేశీయులకు ఐదేళ్ల వర్క్ వీసా పొందే వీలుంటుంది. అంతేకాదు, వారిపై ఆధారపడినవారు కూడా సింగపూర్ లో ఉపాధి వెదుక్కునేందుకు అర్హులవుతారు. క్రీడలు, కళలు, శాస్త్ర, విద్యా రంగాలకు చెందిన వారు వేతనాలతో సంబంధం లేకుండా ఈ దీర్ఘకాలిక వీసాకు అర్హులవుతారని సింగపూర్ మానవ వనరుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 


ఈ ఐదేళ్ల వర్క్ వీసా విధానానికి సింగపూర్ ప్రభుత్వం వన్ (ONE) అని నామకరణం చేసింది. ONE అంటే Overseas Networks and Expertise అని అర్థం. ఇది జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది.  దీనిపై సింగపూర్ మానవ వనరుల శాఖ మంత్రి తాన్ సీ లెంగ్ స్పందిస్తూ... "వ్యాపారవేత్తలు, నిపుణులు తమ పెట్టుబడులకు, ఉపాధికి, జీవనానికి సురక్షితమైన, సుస్థిరమైన ప్రదేశాలను వెదుకుతుంటారు. సింగపూర్ అలాంటి ప్రదేశమే. ప్రతిభకు పట్టం కట్టే ప్రపంచ కేంద్రంగా సింగపూర్ స్థానాన్ని మరింత బలోపేతం చేయడానికి ఇదే సరైన సమయం అని భావిస్తున్నాం" అని వివరించారు. సింగపూర్ ప్రధానంగా నగర ఆధారిత ఆర్థిక కేంద్రంగా విలసిల్లుతోంది. ఈ కేటగిరీలో ప్రధానంగా హాంకాంగ్, యూఏఈ నుంచి సింగపూర్ కు పోటీ ఎదురవుతోంది. ఈ నేపథ్యంలోనూ, కొత్త వర్క్ వీసా విధానం తమకు సత్ఫలితాలు అందిస్తుందని సింగపూర్ ప్రభుత్వం ఆశాభావంతో ఉంది.

 తెలుగు...వ్యాయామ ఉపాధ్యాయులకు... ఘన సన్మానం

(జానో జాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)

నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలోని గని గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవం, జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి. వెంకటేశ్వర్లు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు భాష దినోత్సవం గురించి మాట్లాడుతూ దేశభాషలందు తెలుగు లెస్స అని ఎందరో మహానుభావులను చిరకాలం తెలుగు భాష గుర్తు ఉండే విధంగా తెలుగు భాష సంస్కృతిని, మేధా శక్తి ని దేశ దేశాలకు చాటి చెప్పారని విశ్వ గుండం విశ్వేశ్వరయ్య,అష్టదిగ్గజ కవులను,శ్రీకృష్ణదేవరాయలు, శ్రీ శ్రీ, గిడుగు రామ్మూర్తి పంతులు వంటి మహానుభావుల గురించి విద్యార్థిని విద్యార్థులకు వివరించారు.


జాతీయ క్రీడ దినోత్సవం గురించి మాట్లాడుతూ ధ్యాన్ చంద్ ఆధ్వర్యంలో ఒలంపిక్స్  హాకీ లో వరుసగా ప్రపంచ కప్పులు అందించారని అతనిని భారతీయులు ఎవరు మర్చిపోలేరని, ధ్యాన్ చంద్  భారతదేశానికి గర్వకారమని ధ్యాన్ చంద్  పుట్టినరోజు దినోత్సవం భారతీయులం అందరం జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటున్నామని ఆయన తెలిపారు.అనంతరం తెలుగు  ఉపాధ్యాయులను, వ్యాయామ ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సుకన్య, మహబూబ్ బాషా, రాములు, రవి, లక్ష్మయ్య, రామాంజనేయులు, సూర్య ప్రకాష్ రెడ్డి, పుల్లయ్య, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.


 నితీశ్ కుమార్ తో భేటీ కానున్న సీఎం కేసీఆర్ 


బీజేపీ వ్యతిరేక శక్తులతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ములాఖత్ లో పెంచుతున్నారు. ఎన్డీయే వ్యతిరేక పక్షాలను కూడగట్టి, వచ్చే ఎన్నికల్లో బీజేపీని దీటుగా ఎదుర్కోవాలని భావిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ వీలు చిక్కినప్పుడల్లా తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. తన జాతీయ రాజకీయాల కార్యాచరణలో భాగంగా ఆయన ఈ నెల 31న బీహార్ సీఎం నితీశ్ కుమార్ తో సమావేశం కానున్నారు. పాట్నాలో నితీశ్ కుమార్ తో కలిసి మధ్యాహ్న భోజనం చేస్తారని తెలుస్తోంది. 

ఇదిలావుంటే చైనాతో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల్లో అమరులైన భారత జవాన్ల కుటుంబ సభ్యులను కూడా సీఎం కేసీఆర్ తన బీహార్ పర్యటనలో కలవనున్నారు. అమర జవాన్లకు గతంలో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఆర్థికసాయాన్ని ఈ సందర్భంగా వారికి అందిస్తారు. అంతేకాదు, సికింద్రాబాద్ టింబర్ డిపోలో ఇటీవల అగ్నిప్రమాదం జరిగి 12 మంది బీహార్ వలస కూలీలు దుర్మరణం పాలయ్యారు. వారి కుటుంబ సభ్యులను కూడా పరామర్శించనున్న సీఎం కేసీఆర్... బీహార్ సీఎం నితీశ్ కుమార్ తో కలిసి ఆర్థిక సాయం చెక్కులు అందిస్తారు.


 ఎంపీ గోరంట్లపై తగిన చర్యలు తీసుకోండి

ఏపీ సీఎస్ కు రాష్ట్రపతి కార్యాలయం సూచన

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియో కాలింగ్ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటనపై మహిళా జేఏసీ నేతల ఫిర్యాదు పట్ల తాజాగా రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. మహిళా నేతల ఫిర్యాదును రాష్ట్రపతి కార్యాలయం ఏపీ సీఎస్ కు పంపించింది. ఫిర్యాదును పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. 

అంతకుముందు, ఎంపీ మాధవ్ అంశంపై మహిళా జేఏసీ నేతలు మాధవ్ పై చర్యలు తీసుకునేలా చూడాలని రాష్ట్రపతిని కోరారు. అటు, ఉప రాష్ట్రపతి, జాతీయ మహిళా కమిషన్, కేంద్రమంత్రులకు కూడా ఫిర్యాదు చేశారు. కాగా, ఫిర్యాదు పట్ల స్పందించినట్టు మహిళా జేఏసీ కన్వీనర్ చెన్నుపాటి కీర్తికి రాష్ట్రపతి కార్యాలయం లేఖ పంపింది.

 క్యాంపు రాజకీయాలకు తెరలేపిన హేమంత్ సోరెన్

తనపై వేటుపడితే ఏం చేయాలి అన్న ఆలోచనతో ఉన్న ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ముందు జాగ్రత్తగా తన ఎమ్మెల్యేలను ఆయన క్యాంపునకు తరలించారు. ఇదిలావుంటే హేమంత్ సోరెన్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయవచ్చంటూ ఈసీ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అనర్హతపై గవర్నర్ నిర్ణయం తీసుకుంటే సోరెన్ ఎమ్మెల్యేగా అనర్హతకు గురవుతారు. ఈ నేపథ్యంలో హేమంత్ సోరెన్ ముందు జాగ్రత్తగా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యర్థి పార్టీ బేరసారాల నుంచి తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. 

నిన్న సాయంత్రమే సోరెన్ నివాసం వద్ద రెండు బస్సులు కనిపించాయి. ఈ ఉదయం పార్టీ ఎమ్మెల్యేలంతా బ్యాగులు సర్దుకుని అక్కడకు వచ్చారు. మధ్యాహ్నం సోరెన్ సంకీర్ణ ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలంతా రాంచీ నుంచి బస్సుల్లో బయల్దేరారు. వీరిని ఛత్తీస్ గఢ్ లేదా పశ్చిమబెంగాల్ కు తరలించే అవకాశం ఉందని చెపుతున్నారు. 

ఝార్ఖండ్ అసెంబ్లీలో 81 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సోరెన్ సంకీర్ణ ప్రభుత్వానికి 49 మంది సంఖ్యాబలం ఉంది. ఈ సంకీర్ణ ప్రభుత్వంలో సోరెన్ కు చెందిన జేఎంఎం పార్టీకి 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ కు 18 మంది, ఆర్జేడీకి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. ఒకవేళ సోరెన్ పై అనర్హత వేటు పడితే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మధ్యంతర ఎన్నికలు పెట్టాలనే డిమాండ్ బీజేపీ నుంచి వినిపిస్తోంది.  

 కెనాడా వెళ్లేందుకు ఏకంగా 75వేల మంది భారతీయుల ధరఖాస్తూ

కెనడా వెళ్లి ఉన్నత చదవులు చదివేందుకు ఏకంగా 75వేలకు పైగా మన భారతీయ విద్యార్థులు ధరఖాస్తు చేసుకొన్నారటా. కెనడాకు వెళ్లేందుకు ఈ ఏడాది ఎక్కువ మంది భారతీయ విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో పెద్ద ఎత్తున దరఖాస్తులు పరిష్కారానికి నోచుకోవాల్సి ఉంది. సెప్టెంబర్ లో మొదలయ్యే కోర్సులకు సంబంధించి విద్యార్థుల దరఖాస్తులను ప్రాధాన్య క్రమంలో పరిష్కరిస్తున్నట్టు కెనడా అధికారులు తెలిపారు. వేచి ఉండే సమయాన్ని తగ్గించేందుకు తమవంతు కృషి చేస్తున్నట్టు ‘రెఫ్యూజీస్ అండ్ సిటిజన్ షిప్ కెనడా (ఐఆర్ సీసీ) అధికారులు ప్రకటించారు. ఆగస్ట్ 15 నాటికి భారత్ నుంచి 75,000 మంది విద్యార్థులు స్టడీ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకున్నట్టు తెలిపారు. వీరంతా కెనడాలో ఉన్నత విద్య కోసం ఎదురు చూస్తున్నవారు కావడం గమనార్హం.

2022 మొదటి ఐదు నెలల్లో భారత్ నుంచి 1,23,500 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని, 2019లో ఇదే కాలంలో వచ్చిన దరఖాస్తుల కంటే ఇది 55 శాతం అధికమని వారు వెల్లడించారు. పెద్ద ఎత్తున దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నందున.. సెప్టెంబర్ లో బోధన ప్రారంభమయ్యే నాటికి అన్నీ పరిష్కారం కాకపోవచ్చని ఐఆర్ సీసీ అంటోంది.

 గడివేముల మండలంలో...దొంగల హల్చల్

మాయమవుతున్న రైతుల మోటర్లు

(జానో జాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)

నంద్యాల జిల్లా, గడివేముల మండలంలో దొంగలు హాల్ చల్ చేస్తున్నారు. దీంతో తమ పోలాలను తడిపేందుకు ఏర్పాటుచేసుకొన్న నీటి మోటర్లు మాయం కావడంతో రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. గత కొన్ని రోజుల క్రితం బూజునూరు గ్రామంలో కుందునది  నీరు పొలాలకు తరలించేందుకోసం రైతులు మోటార్లు ఏర్పాటు చేసుకొన్నారు. వీటిలో మూడు మోటార్లను గుర్తు తెలియని వ్యక్తులు(దొంగలు) అపహరించారు. ఈ ఘటనను మరువక ముందే పోలీసులకు సవాలు విసురుతూ దొంగలు మరిన్ని నీటి మోటార్లను దొంగలించారు. ఆళ్లగడ్డ, గడివేములకు చెందిన రైతుల  10 మోటార్లు దొంగలించారు.


కుందూనది లోని నీటిని వాడుకునే రైతుల మూడు మోటర్లు విప్పి ఎత్తుకెళ్లడానికి ప్రయత్నించగా కుందు నదిలో మట్టి ఎక్కువగా ఉండడంతో వాటిని అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. అన్నదాతలు పంటలకు పండించే నీరు పెట్టుకునే మోటర్లు ఎత్తుకెళ్లడంతో అన్నదాతలు కన్నీరు అవుతున్నారు. గతంలో కూడా గడివేముల మండలంలో రైతులకు సంబంధించిన  మోటర్ల కరెంటు వైర్లను, మోటార్లను, ద్విచక్ర వాహనాలను, ఇంటి ఆవరణలో కట్టేసుకున్న  పొట్టేళ్లు, గడివేముల మండలంలో చోరీకి గురయ్యాయి. పోలీసుల గస్తీ సరిగా తిరగడం లేదని రైతులు, గ్రామప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా పోలీస్ శాఖ వారు స్పందించి రాత్రిపూట గస్తిని పెంచి ఆగంతకులు దొంగతనాలు చేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని గడివేముల మండలంలోని రైతులు, గ్రామప్రజలు కోరుతున్నారు.

 రాహుల్ ను మించి పాన్ ఇండియా స్థాయి లీడర్ లేరు

పార్టీ బరువు బాధ్యతలు మోసేందుకు రాహుల్ ను మించి పాన్ ఇండియా స్థాయి ఉన్న నేత కాంగ్రెస్ లో లేరని రాజ్యసభ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ మల్లికార్జున ఖర్గే అన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో పార్టీ అధ్యక్ష పదవి నుంచి రాహుల్ గాంధీ స్వచ్ఛందంగా వైదొలగడం తెలిసిందే. ఆ తర్వాత పార్టీ సీనియర్ నేతలు కోరినా మళ్లీ ఏఐసీసీ పగ్గాలు అందుకునేందుకు రాహుల్ ముందుకు రాలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో సోనియా గాంధీనే తాత్కాలిక అధ్యక్షురాలిగా పార్టీ బాధ్యతలు మోస్తున్నారు. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభలో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ మల్లికార్జున ఖర్గే స్పందించారు. 

పార్టీ బరువు బాధ్యతలు మోసేందుకు రాహుల్ ను మించి పాన్ ఇండియా స్థాయి ఉన్న నేత కాంగ్రెస్ లో లేరని అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా మళ్లీ పగ్గాలు అందుకోవాలంటూ ఆయనపై ఒత్తిడి తీసుకువస్తామని వెల్లడించారు. "కాంగ్రెస్ పార్టీని నడిపించాలని ఎవరైనా భావిస్తుంటే వారు దేశం మొత్తానికి తెలిసిన వ్యక్తి అయివుండాలి. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు, పశ్చిమ బెంగాల్ నుంచి గుజరాత్ వరకు మద్దతు అందుకోగలిగి ఉండాలి. మంచి గుర్తింపు కలిగి ఉండి, పార్టీలో ఎవరూ అభ్యంతరపెట్టని వ్యక్తి అయివుండాలి. 

కానీ, కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి స్థాయి ఉన్న నేత రాహుల్ తప్ప మరెవరూ లేరు. కాంగ్రెస్ భవిష్యత్తు కోసం, దేశ భవిష్యత్తు కోసం పార్టీ నాయకత్వాన్ని చేపట్టాలంటూ రాహుల్ ను అడుగుతాం, అర్థిస్తాం, ఒత్తిడి చేస్తాం... ఆర్ఎస్ఎస్-బీజేపీపై పోరాటం సాగించి దేశాన్ని ఐక్యంగా ఉంచేందుకు పార్టీ అధ్యక్షుడిగా మళ్లీ రావాలని విజ్ఞప్తి చేస్తాం... ఆయన వెనుక మేముంటాం" అని మల్లికార్జున ఖర్గే వివరించారు.


 అగ్ని పర్వతంను కెలికితే...తట్టుకోలేం

సహజంగా నిప్పుతో చెలగాటం వద్దంటారు. మరి అగ్నిపర్వతంతో చెలగాటమడితే పరిస్థితి ఏమిటీ...అదే చేశారో  శాస్త్రవేతలు. అంతే ఏమైందో తెలుసా...? అది యాక్టివ్ గా ఉన్న అగ్ని పర్వతం.. ఇద్దరు వ్యక్తులు దాని బిలానికి పై నిలబడి చూస్తున్నారు. కాసేపటికి ఏదో బరువైన వస్తువును అగ్నిపర్వతంలోకి విసిరేశారు. అది వెళ్లి ప్రశాంతంగా ఉన్న లావామీద పడింది. ఒక్కసారిగా రియాక్షన్ మొదలై లావా వెదజల్లడం మొదలైంది. కాసేపటికే కణకణమంటూ భారీగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ప్రశాంతంగా ఉన్న అగ్నిపర్వతాన్ని ఇలా రెచ్చగొట్టడం ఓ పరిశోధనలో భాగంగా జరిగింది. ఇది ఎప్పటిదో పాత ఘటనే అయినా తాజాగా వైరల్ గా మారింది. 

మనుషులు పడితే ఎలా ఉంటుందో చూద్దామని..యాక్టివ్ గా ఉన్న అగ్ని పర్వతంలో మనుషులు పడితే ఎలా ఉంటుందోనన్న దానిపై ఇథియోపియాలోని ఎర్టా అలె అగ్ని పర్వతం వద్ద కొందరు పరిశోధకులు ప్రయోగం చేశారు. అయితే నేరుగా మనుషులను పడేయలేరు గనుక.. సుమారు 30 కిలోల బరువైన జంతు, జీవ వ్యర్థాలను మూటగట్టుకుని వెళ్లి ఎర్టా అలె అగ్నిపర్వతంలోకి విసిరేశారు. అగ్నిపర్వతానికి మరోవైపున ఉన్న మరికొందరు పరిశోధకులు దీనిని వీడియో తీశారు. పరిశోధకులు విసిరేసిన మూట నేరుగా వెళ్లి లావాపై పడింది. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న అగ్నిపర్వతం.. ఒక్కసారిగా పేలడం మొదలు పెట్టింది. కాసేపట్లోనే భారీగా లావాను వెదజల్లింది. జీవ వ్యర్థాల్లో 90 శాతం వరకు నీరే ఉంటుందని.. అత్యంత వేడిగా ఉన్న లావాలో జీవ వ్యర్థాలు పడటంతో.. అందులోని నీరు ఒక్కసారిగా ఆవిరై పేలుడు సృష్టించిందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ కదలిక వల్ల అగ్ని పర్వతం యాక్టివ్ గా మారిందని అంటున్నారు. అయితే ఎవరైనా పొరపాటున కూడా ఇలా అగ్నిపర్వతాల వద్దకు వెళ్లవద్దని.. తాము అన్ని రకాల రక్షణ పరికరాలు ధరించే వెళ్లామని హెచ్చరించారు. నిజానికి ఈ వీడియో దాదాపు పదేళ్ల కిందట తీసినదే. కానీ ఇటీవల సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ గా మరింది. యూట్యూబ్ లో అయితే రెండు కోట్ల మందికిపైగా ఈ వీడియోను వీక్షించారు. వేల కొద్దీ లైక్ లు వచ్చాయి.

 రికార్డ్ వేగంతో..వందే భారత్ పరుగులు

మన దేశానికి చెందిన వందే భారత్ రైళ్లు సరికొత్త రికార్డును నమోదు చేసుకొంది. భారత్ లోనూ హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు కేంద్రం సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో వందేభారత్ రైలుకు ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ టెస్టులో వందేభారత్ రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లడం విశేషం. భారత్ లో ఇంత వేగంతో దూసుకెళ్లిన రైలు ఇప్పటివరకు లేదు. దీనికి సంబంధించిన వివరాలను రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. కోటా-నాగ్డా సెక్షన్ మధ్య ఈ ట్రయల్ రన్ నిర్వహించారు. గంటకు 180 కిమీ వేగంతో వెళుతున్నా రైలు బోగీ అద్దం నిలకడగా ఉందని, ఆ వేగానికి ఎక్కడా అదిరిన దాఖలాలు లేవని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ వీడియోను పంచుకున్నారు. ఆ వీడియోలో నీళ్లతో ఉన్న గ్లాసు కూడా కనిపిస్తోంది. అందులోని నీరు ఎక్కడా తొణకకపోవడం వందేభారత్ రైలు బోగీల పటిష్ఠతను చాటుతోంది.

 రాష్ట్రానికి దక్కిన అవార్డు


రాష్ట్రానికి దక్కిన అవార్డును అందుకొన్న మంత్రి విడదల రజిని వాటిని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మో:హన్ రెడ్డికి అందజేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈఓబీడీ)లో గ‌త కొన్నేళ్లుగా ఏపీ అగ్ర స్థానంలోనే కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా వైసీపీ ప్రభుత్వం అధికారం చేప‌ట్టాక‌... రాష్ట్రంలో ప్ర‌జ‌ల‌ ఆరోగ్య వివ‌రాలు డిజిట‌లైజ్ అయిపోతున్నాయి. తొలుత పాఠ‌శాల విద్యార్థుల నుంచి మొద‌లుపెట్టిన ఈ కార్య‌క్ర‌మం రాష్ట్రంలోని ప్ర‌జలంద‌రి ఆరోగ్య వివ‌రాల డిజిట‌లైజేష‌న్ దిశ‌గా సాగుతోంది. ఈ రంగంలో విశేష ప్ర‌తిభ క‌న‌బ‌రచినందుకు ఏపీకి తాజాగా ఓ అవార్డు ద‌క్కింది.

ప్ర‌జ‌ల ఆరోగ్య వివ‌రాల‌ను డిజిట‌లైజ్ చేయ‌డంలో మెరుగైన ప్ర‌తిభ క‌న‌బ‌రుస్తున్న ఏపీకి ప్ర‌ముఖ ఆంగ్ల దిన‌ప‌త్రిక ద ఎకనమిక్ టైమ్స్ ఓ అవార్డు‌ను అంద‌జేసింది. ఏపీ ఆరోగ్య మంత్రిగా కొన‌సాగుతున్న విడ‌ద‌ల ర‌జని ఈ అవార్డును స్వీక‌రించారు. శుక్ర‌వారం విశాఖ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన జ‌గ‌న్‌ను క‌లిసిన ర‌జని... తాను అందుకున్న అవార్డును జ‌గ‌న్‌కు అంద‌జేశారు. ఈ అవార్డు రాష్ట్రానికి ద‌క్కిన కార‌ణం, ఆ దిశ‌గా త‌న ఆధ్వ‌ర్యంలోని ఆరోగ్య శాఖ చేస్తున్న కృషిని జ‌గ‌న్‌కు ర‌జని వివరించారు. 


 దర్శి అధికార పార్టీలో లుకలుకలు

ఏపీలోని అధికార వైసీపీలో ప్రతి జిల్లాలో లుకలుకలు మొదలయ్యాయి. తాజాగా ప్ర‌కాశం జిల్లా ద‌ర్శి నియోజ‌కవ‌ర్గానికి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యే మ‌ద్దిశెట్టి వేణుగోపాల్‌, మాజీ ఎమ్మెల్యే బూచేప‌ల్లి శివ‌ప్ర‌సాద్ రెడ్డి వ‌ర్గాల మ‌ధ్య గ‌త కొంత‌కాలంగా విభేదాలు కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో శుక్ర‌వారం ద‌ర్శి మార్కెట్ నూత‌న క‌మిటీ ప్ర‌మాణ స్వీకారోత్స‌వం సంద‌ర్భంగా ఇన్నాళ్లు త‌న‌లో దాచుకున్న అసంతృప్తిని ఎమ్మెల్యే మ‌ద్దిశెట్టి వెళ్ల‌గ‌క్కారు.

ఇన్నాళ్లుగా సొంత పార్టీ నేత‌లు పెట్టిన ఇబ్బందుల‌ను భ‌రిస్తూ వ‌చ్చాన‌ని చెప్పిన మ‌ద్దిశెట్టి... ఇక‌పై వాటిని స‌హించేది లేద‌ని తేల్యి చెప్పారు. పార్టీలో వ‌ర్గ పోరు త‌గ‌ద‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. పార్టీ, నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల కోసం మూడేళ్లుగా అన్నింటినీ భ‌రిస్తూ వ‌చ్చాన‌ని ఆయ‌న చెప్పారు. నియోజ‌క‌వ‌ర్గం కోసం ఇంత‌గా ప‌నిచేస్తున్నా ఎన్నోసార్లు త‌న‌ను అవ‌మానించారని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గ్రూపు రాజ‌కీయాలు చేస్తూ క‌నీసం ప్రొటోకాల్ పాటించ‌డం లేదని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 

వ్య‌క్తిగ‌త ల‌బ్ధి కోసం కొంద‌రు త‌న సామాజిక వ‌ర్గాన్ని ప్ర‌స్తావిస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. నియోజ‌కవ‌ర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలు స‌హా రెడ్లు కూడా త‌న వెంట‌నే ఉన్నార‌న్నారు. నియోజ‌క‌వ‌ర్గ కేంద్రంలో తాను క‌ట్టుకున్న ఇంటిపైనా కొంద‌రు రాజ‌కీయం చేస్తున్నార‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తాను ఎవ‌రి ప‌ద‌విని లాక్కోలేదని చెప్పిన మ‌ద్దిశెట్టి...అంద‌రూ కోరితేనే ఎమ్మెల్యేగా పోటీ చేశాన‌ని చెప్పారు.

 చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు ఎవరు పాల్పడిన ఉపేక్షించేది లేదు

ఎస్సై బి.టి. వెంకటసుబ్బయ్య

(జానో జాగో వెబ్ న్యూస్- గడివేముల ప్రతినిధి) 

ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు, ఆ సాంఘిక కార్యక్రమాలకు ఎవరు పాల్పడిన వారు ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని గడివేముల ఎస్సై బి.టి. వెంకటసుబ్బయ్య స్పష్టంచేశారు. ఇదిలావుంటే నంద్యాల జిల్లా, గడివేముల మండల పరిధిలోని గడిగరేవుల గ్రామం ఊరి బయట శ్రీ దుర్గా భోగేశ్వరం వెళ్ళు రహదారిలో ఉన్న ఖాళీ ప్రదేశంలో  రుద్రవరం మరియు గడివేముల గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు మూగజీవాలైన రెండు వరాహలతో (పందులతో) వాటి మధ్య డబ్బులను పందెం గా పెట్టీ పోటీలు నిర్వహిస్తున్నారని సమాచారం తెలుసుకున్న గడివేముల ఎస్సై బి.టి. వెంకటసుబ్బయ్య వెంటనే తన సహచర పోలీస్ సిబ్బందితో అప్రమత్తమై వెళ్లి 20 మంది వ్యక్తులను, 


17 మోటర్ సైకిలను ,2 ఆటోలను ,2 వరాహాలను(పందులను),9800/- రూపాయల ను  స్వాధీన పరచుకొని కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడివేముల మండలంలో ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు, ఆ సాంఘిక కార్యక్రమాలకు ఎవరు పాల్పడిన వారు ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడిన వారిపై పోలీసు శాఖ మరియు పోలీసు సిబ్బంది కఠినచర్యలు తీసుకుంటామని గడివేముల ఎస్సై బి.టి. వెంకటసుబ్బయ్య హెచ్చరించారు.

 హంద్రీ-నీవా సుజ‌ల స్ర‌వంతి ప‌నుల‌ను పరిశీలించిన చంద్రబాబు

కుప్పంలో హంద్రీ-నీవా సుజ‌ల స్ర‌వంతి ప‌నుల‌ను టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు పరిశీలించారు. చంద్రబాబు త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో గ‌డ‌చిన 3 రోజులుగా ప‌ర్య‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. తొలి రోజు రామ‌కుప్పం మండ‌లంలో ప‌ర్య‌టించిన చంద్ర‌బాబు... 2, 3 రోజుల్లో కుప్పం మండ‌లంలో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో నిలిచిన హంద్రీ-నీవా సుజ‌ల స్ర‌వంతి ప‌నుల‌ను ఆయ‌న శుక్ర‌వారం ప‌రిశీలించారు.

కుప్పం మండ‌లం స‌లార్ల ప‌ల్లి వ‌ద్ద హంద్రీ- నీవా ప‌నుల‌ను పరిశీలించిన చంద్ర‌బాబు... ఈ పనులు పూర్తి కాక‌పోవ‌డంతోనే కుప్పంకు హంద్రీ-నీవా నీళ్లు రాలేద‌ని ఆవేద‌న వ్యక్తం చేశారు. ఈ ప‌నుల్లో భాగంగా మ‌రో రూ.50 కోట్లు ఖ‌ర్చు పెట్టి ఉంటే కుప్పంకు కూడా హంద్రీ- నీవా నీళ్లు అందేవ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. తాను అధికారం దిగిపోయిన త‌ర్వాత మూడేళ్లుగా ఈ ప‌నుల‌ను వైసీపీ ప్ర‌భుత్వం ఉద్దేశ‌పూర్వ‌కంగానే నిలిపివేసింద‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

 బీజేపీ నేతల మెప్పుకొసం జీవితా తపుడు ఆరోపణలు చేస్తున్నారు


బీజేపీ నేతల మెప్పు పొందడానికే జీవిత రాజశేఖర్ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితాపై తపుడు ఆరోపణలు చేస్తున్నారని తెలంగాణ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ అనిల్ కూర్మాచలం మండిపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులపై బీజేపీ నాయకురాలు, సినీ నటి జీవిత విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పాత్ర ఉందని ఆమె అన్నారు. ఈ నేపథ్యంలో జీవిత వ్యాఖ్యలపై  అనిల్ కూర్మాచలం మండిపడ్డారు. లిక్కర్ స్కామ్ లో కవిత ప్రమేయం ఉందని... తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కవిత ఆస్తులు అమాంతం పెరిగాయంటూ జీవిత చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదని ఆయన అన్నారు. 

తనపై వచ్చిన ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని కవిత ఇప్పటికే చెప్పారని... అయినప్పటికీ, తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని చెప్పారు. ఒకవేళ కవిత నిజంగా అవినీతికి పాల్పడి ఉంటే కేంద్ర దర్యాప్తు సంస్థలతో పని చేయించవచ్చు కదా అని అన్నారు. బీజేపీ నేతల మెప్పు పొందడానికే జీవిత ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని అనిల్ మండిపడ్డారు. ఆమె ఇలాగే మాట్లాడితే ప్రజలు బుద్ధి చెపుతారని అన్నారు. కేటీఆర్ పై కూడా జీవిత అవినీతి ఆరోపణలు చేయడం ఆమె అజ్ఞానానికి నిదర్శనమని చెప్పారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు హీరోలని, అందుకే తెలంగాణ కోసం త్యాగాలు చేశారని అన్నారు. బీజేపీ నేతలు జీరోలు కాబట్టే అధికారం కోసం తహతహలాడుతున్నారని దుయ్యబట్టారు.

 గవర్నర్ తమిళిసైని కలసిన విహెచ్పీ, గణేష్ ఉత్సవ కమిటీ నేతలు

వినాయక చవిత దర్గరపడుతున్న నేపథ్యంలో తెలంగాణ గవర్నర్ తమిళిసైని విశ్వహిందూ పరిషత్, భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా నగరంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. కావాలనే విద్వేషాలను రెచ్చగొడుతున్నారని... అమాయకులను చిత్రహింసలు పెడుతున్నారని గవర్నర్ కు తెలిపామని వీహెచ్పీ రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు తెలిపారు. రాష్ట్రాన్ని కేసీఆర్ పాలిస్తుంటే... ఓల్డ్ సిటీని ఎంఐఎం పాలిస్తోందని అన్నారు. 

ఇక్కడ జరుగుతున్న విషయాలను ఉన్నది ఉన్నట్టుగా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని గవర్నర్ ను కోరామని గణేశ్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు భగవంత రావు చెప్పారు. ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నా ప్రభుత్వం, పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నారని విమర్శించారు. హైదరాబాద్ లో మునావర్ షో అవసరమా? అని ప్రశ్నించారు. ఈ షో కోసం 4 వేల మంది పోలీసులతో భద్రత అవసరమా? అని ప్రశ్నించారు. మైనార్టీలను ఉసిగొల్పి పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు. గణేశ్ ఉత్సవాలు ఎలాంటి అడ్డంకులు లేకుండా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ ను కోరామని చెప్పారు.

 గని గ్రామంలో...గడప గడపకు మన ప్రభుత్వం

(జానో జాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)

పాణ్యం ఎమ్యెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా ,గడివేముల మండల పరిధిలోని గని గ్రామంలో  గడప,గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. గని గ్రామంలోని ప్రతీ గడపకు వెళ్లి రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న జనరంజక పాలన,అవినీతి రహిత పాలన గురించి ప్రజలకు వివరిస్తూ జగనన్న ప్రభుత్వాన్ని దీవించాలని కోరారు.ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అర్హత కలిగిన ప్రతీ ఒక్కరికి అందేలా చూడాలని సంబంధిత సచివాలయ సిబ్బందిని ఆదేశించారు.


ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ సర్పంచ్ కత్తి తులశమ్మ ,ఎంపీపీ నాగ మద్దమ్మ, గడివేముల జడ్పీటీసీ ఆర్.బి.చంద్రశేఖర్ రెడ్డి , గని గ్రామ వైసీపీ నాయకులు శివానంద రెడ్డి, ప్రతాప్ రెడ్డి, మేఘనాథ్ రెడ్డి, రామ లింగేశ్వర రెడ్డి, రవీంద్ర రెడ్డి, పెసరవాయి శ్రీకాంత్ రెడ్డి, వైసిపి నాయకులు,కార్యకర్తలు,సచివాలయ సిబ్బంది,సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.


 రాజకీయాలు చర్చకు వచ్చివుంటాయి: జీవీఎల్ నరసింహారావు


కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సీనీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ల మధ్య జరిగిన భేటీపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు స్పందిస్తూ.. ఇద్దరూ కేవలం సినిమాల గురించే మాట్లాడుకున్నారని తాను అనుకోవడం లేదని చెప్పారు. ఇద్దరి మధ్య రాజకీయాలు చర్చకు వచ్చే ఉంటాయని అన్నారు. అయితే వారు ఏమేం చర్చించారనేది వారిద్దరికే తెలుసని చెప్పారు. అయినా, వీరి భేటీపై ఇతర పార్టీ నేతలకు ఎందుకంత ఆసక్తి అని ప్రశ్నించారు. బీజేపీలో చేరేందుకు చాలా మంది ఆసక్తిగా ఉన్నారని అన్నారు.  

లేపాక్షి నాలెడ్జి హబ్ లో భూముల వ్యవహారం పెద్ద ల్యాండ్ స్కామ్ అని జీవీఎల్ పేర్కొన్నారు. రూ. 10 వేల కోట్ల విలువ చేసే భూములను కేవలం రూ. 500 కోట్లకు కట్టబెట్టడంపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఏ ఉద్దేశంతో ఈ భూములను ఇచ్చారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.  ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రకంపనలు తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తున్నాయని అన్నారు. ఈ స్కాం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీ నేతలకు మేలు చేకూరిందనే ప్రచారం జరుగుతోందని చెప్పారు. ఈ స్కామ్ పై తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. విశాఖలో పెద్ద సంఖ్యలో ఓటర్లను తొలగిస్తున్నారని... 50 వేల మందిని జాబితా నుంచి తొలగించారని... దీనిపై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కు లేఖ రాశామని చెప్పారు.

 బతుకమ్మ చీరల తయారికి..సన్నద్దమవుతున్న టీఎస్ చేనేత జౌళి శాఖ 


తెలంగాణ రాష్ట్ర చేనేత జౌళి శాఖ మరో భారీ వస్త్రాల తయారికి సిద్దమవుతోంది. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా స్వల్ప వ్యవధిలో 1.20 కోట్ల జాతీయ జెండాలను అందించిన తెలంగాణ చేనేత జౌళి శాఖ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా కోటి బతుకమ్మ చీరలను పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది సెప్టెంబరు మూడో వారం నుంచి పంపిణీ ప్రక్రియ ప్రారంభించాలని ఆ శాఖ అధికారులు భాస్తున్నారు. ఇప్పటికే నేత కార్మికులతో కోటి చీరల తయారీకి ఆర్డర్లు ఇవ్వగా, దాదాపు 85 లక్షల చీరలు సిద్ధంగా ఉన్నాయి.

ఈ చీరలను సిరిసిల్లలో 20 వేల మంది పవర్‌లూమ్ నేత కార్మికులు తయారు చేస్తున్నారు. గడువుకు అనుగుణంగా రోజుకు సుమారు లక్ష చీరలు తయారు చేస్తున్నారని చేనేత జౌళి శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. పంపిణీ సమయంలో కొరత లేకుండా చూసేందుకు 3 లక్షల చీరలను బఫర్ స్టాక్‌గా అందుబాటులో ఉంచుతామన్నారు.

గతేడాది మాదిరిగానే చీరల డిజైన్లపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ఏడాది 17 రకాల రంగుల్లో 17 రకాల డిజైన్లను నేస్తున్నారు. కోటి చీరలలో  దాదాపు 90 శాతం చీరలు సిరిసిల్లలో తయారవుతుండగా మిగిలినవి కరీంనగర్‌లో తయారవుతున్నాయి. సెప్టెంబర్ 25 నుంచి రాష్ట్రంలో బతుకమ్మ పండుగ ప్రారంభం కానుంది. ఈ ఏడాది బతుకమ్మ చీరల పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.330 కోట్లు కేటాయించింది.

సిరిసిల్లలో చీరల తయారీ పూర్తయితే వాటిని ఫినిషింగ్, సార్టింగ్, ప్యాకింగ్ కోసం హైదరాబాద్‌కు తరలిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారిక ఆమోదం పొందిన తర్వాత జిల్లాలకు పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు. 2017 నుంచి రాష్ట్ర ప్రభుత్వం 18 ఏళ్లు పైబడిన మహిళలకు బతుకమ్మ చీరలను ఏటా పంపిణీ చేస్తోంది. ఈ ఏడాది అత్యధికంగా కోటి చీరలు అందించనుంది. 

ఇక 2017లో 95 లక్షలు, 2018లో 96.7 లక్షలు, 2019లో 96.5 లక్షలు, 2020లో 96.24 లక్షలు, 2021లో 96.38 లక్షలకు పైగా చీరలను పంపిణీ చేశారు. బతుకమ్మ చీరల ద్వారా వాటిని తయారు చేసే చేనేత కార్మికులే కాకుండా కూలీలు, హమాలీలు, ఆటో డ్రైవర్లు, వ్యాపారులు సహా అనుబంధ కార్మికులు కూడా ప్రభుత్వం జారీ చేసే వీటి ఆర్డర్ల ద్వారా లబ్ధి పొందుతున్నారు.