పచ్చబొట్టు చెరిగిపోతుందిలే...అది కూడా ఉచితంగా


పచ్చబొట్టు చెరిగిపోదులే అన్నది ఓ నాటి పాట మనం వినే ఉంటాం.  కానీ పచ్చబొట్టు చెరిగిపోతుంది కానీ చాలా కాస్ట్లీ అన్నది ఇప్పటి వరకు మాట. కానీ  పచ్చబొట్టు చెరిగిపోతుందిలే...అది కూడా ఉచితంగా అంటోంది హైదరాబాద్ లోని ఉస్మానియా ఆసుపత్రి.

సరదాగానో, ఒకరిపై ప్రేమతోనే, ఇష్టంతోనే వేయించుకున్న పచ్చబొట్లు ఆ బంధానికి బీటలు వారాక ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వాటిని చూసినప్పుడల్లా మనసు చివుక్కుమంటుంది. అంతేకాదు, ఒక్కోసారి ఇవి ఉద్యోగానికి అనర్హులుగా మార్చుతుంటాయి. శరీరంపై పచ్చబొట్లు ఉంటే రక్షణశాఖలో కొన్ని ఉద్యోగాలకు అనర్హులవుతారు. కాబట్టి ఈ విషయంలో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలి. 

అయితే, ఒకసారి వేయించుకున్న పచ్చబొట్లను తొలగించుకోవాలంటే అందుకు చాలా ఖర్చవుతుంది. ఆ ఖర్చు భరించడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ఇలాంటి వారికి హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రి శుభవార్త చెప్పింది. పచ్చబొట్టును తొలగించుకోవాలనుకునే వారికి ఇక్కడ ఉచితంగా శస్త్రచికిత్సలు చేస్తున్నారు. ఆసుపత్రిలో ఇప్పటికే అనేకమందికి పచ్చబొట్లు తొలగించామని, అవసరమైన వారు తమను సంప్రదించాలని ఆసుపత్రి సీనియర్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ నాగప్రసాద్ తెలిపారు.

డెర్మ్ఎబ్రేషన్ అనే ప్రక్రియ ద్వారా లోపలి వరకు చర్మాన్ని తొలగించి పచ్చబొట్టును శాశ్వతంగా మాయం చేస్తారు. చర్మాన్ని తొలగించిన ఆ తర్వాత ఆ మచ్చ కనిపించకుండా ఉండేందుకు అక్కడ లేజర్ చికిత్స చేస్తారు. సాధారణంగా ప్రైవేటు ఆసుపత్రిలో ఈ చికిత్సకు లక్ష రూపాయలకు పైనే ఖర్చవుతుందని డాక్టర్ నాగప్రసాద్ తెలిపారు. టాటూలు, పచ్చబొట్లు వేయించుకోవద్దని, వాటి కోసం వాడే సూదులు శుభ్రంగా లేకపోతే రక్తం ద్వారా ఎయిడ్స్, హెపటైటిస్ వంటి వ్యాధులు సోకే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: