ప్రజల నిలదీస్తారన్న భయంతోనే-విజయశాంతి


రాష్ట్రంలో ఉంటే ఎక్కడకు వెళ్లినా జనం నిలదీస్తారనే ఆందోళనతో జాతీయ రాజకీయాలు, ఫెడరల్ ఫ్రంట్ అంటూ రాష్ట్రం బయట తిరగడం మొదలుపెట్టారని కేసీఆర్ పై బీజేపీ నాయకులు విజయశాంతి విమర్శలు గుప్పించారు. తనను ఛీకొడుతున్న తెలంగాణ ప్రజల నుంచి తప్పించుకోవడానికే కేసీఆర్ సమ్మర్ వెకేషన్ గా ఈ ఊళ్లు తిరిగే కార్యక్రమం పెట్టుకున్నారు తప్ప మరొకటి కాదని అన్నారు. 

ఫెడరల్ ఫ్రంట్ అంటూ జాతీయ రాజకీయాల పేరిట తెలంగాణ సీఎం కేసీఆర్ ఆడుతున్న డ్రామాలు చూస్తుంటే... ప్రజల్ని మోసగించడానికి ఆయన ఏ స్థాయికైనా వెళ్లేందుకు సిద్ధపడతారని పదేపదే స్పష్టమవుతోందని ఆమె అన్నారు. సారు నాటకాలను 2009 నుంచి జనం చూస్తూనే ఉన్నారని... నాటి ఎన్నికల్లో టీడీపీ, సీపీఐలతో కూడిన మహాకూటమికి జై కొట్టిన కేసీఆర్... బ్యాలెట్ బాక్సులు తెరవకముందే పంజాబ్ లోని లుథియానాలో జరిగిన భారీ ర్యాలీలో ఎన్డీయేకి సై అన్నారని విమర్శించారు. 

2014లో అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కాంగ్రెస్ జపం చేసి, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడగానే తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేస్తానంటూ వారిని ఊరించి, చివరకు ఝలక్ ఇచ్చారని విజయశాంతి దుయ్యబట్టారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి, తాను సీఎం అయ్యాక కూడా తనకు అలవాటైన కప్పదాటుడు వ్యవహారాలు, ఇచ్చిన మాట తప్పడం, చేసిన వాగ్దానాలను మర్చిపోవడం వంటి చర్యలతో గత ఏడేళ్ల పైచిలుకు పాలనాకాలంలో పూర్తిగా విశ్వసనీయత కోల్పోయారని అన్నారు. తెలంగాణలో రైతులు, నిరుద్యోగుల ఆత్మహత్యలు, బీజేపీ విజయాల నేపథ్యంలో పూర్తిగా నైరాశ్యంలో కూరుకుపోయిన కేసీఆర్ గారికి.. కమలదళం తన పాలనకు చరమగీతం పాడుతుందనే భయం పట్టుకుందని అన్నారు. 

దేశంలో ప్రాణాలు కోల్పోయిన రైతులు, జవాన్ల కుటుంబాలకు సాయం చేయడాన్ని ఎవరూ తప్పుపట్టరు కానీ... కేసీఆర్ సీఎం అయ్యాక గత ఏడేళ్ల కాలంలో ఒక్క తెలంగాణలోనే 7 వేలకు పైగా రైతులు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని... వీరందరినీ గాలికొదిలేసి దేశాన్ని ఉద్ధరిస్తానంటూ తిరగడాన్ని ఎలా చూడాలని ప్రశ్నించారు. గత ఏడేళ్లలో దేశం మొత్తం మీద కూడా వివిధ రాష్ట్రాల్లో ఇలాంటి మరణాలు ఎన్నో జరిగాయని.. వారి కుటుంబాలను కేసీఆర్ ఆదుకుంటారా? అని అడిగారు. తనను ఎన్నుకున్న రాష్ట్రానికే న్యాయం చేయని వ్యక్తి కేసీఆర్ అని మండిపడ్డారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: