సూపర్ బాస్...ఉద్యోగులకు కార్ల బహుమతులు


లాభాలు వస్తే తనవల్లే అని యాజమాన్యాలు అనుకొనే రోజులివి. కానీ సంస్థలోని సిబ్బంది వల్లేనని చెప్పేవారు కొందరే ఉంటారు. ఆ కొందరిలో ఉద్యోగుల శ్రమ గుర్తించి బహుమతులు ఇచ్చేవారు అసలు ఉండరు అని స్పష్టంగా చెప్పేపరిస్థితి. కానీ ఓ యాజమాని మాత్రం తన గొప్ప మనస్సును ప్రతి ఏటా చాటుకొంటున్నాడు. సంస్థ అభివృద్ధికి నిరంతరం కృషిచేస్తున్న కనీసం 100 మంది ఉద్యోగులకు ఓ ఐటీ కంపెనీ ఊహించని కానుకలు ఇచ్చి, సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తింది. చెన్నై కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఐడియాస్2ఐటీ సంస్థ 100 మంది ఉద్యోగులకు మారుతీ సుజకీ కార్లను బహుమతిగా అందజేసింది. సంస్థ వృద్ధి కోసం ఉద్యోగుల నిరంతర కృషి, అసమాన భాగస్వామ్యానికి గుర్తింపుగా ఈ కానుకను అందించామని సదరు కంపెనీ ప్రకటించింది.

10 ఏళ్లకుపైగా సంస్థతో ప్రయాణం సాగిస్తున్న 100 మంది ఉద్యోగులకు కార్లను బహుమతి అందించినట్టు ఐడియాస్2ఐటీ మార్కెటింగ్ హెడ్ హరి సుబ్రమణియన్ చెప్పారు. ఉద్యోగుల కృషితో కంపెనీకి లభించిన సంపదను తిరిగి వారికే అందజేయాలనేది తమ ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. ఇక, సంస్థ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ మురళీ వివేకనందన్ ఉద్యోగులపై ప్రశంసలు కురిపించారు. తమ సంస్థ పురోభివృద్ధి కోసం ఉద్యోగులు ఎంతో పాటుపడ్డారని, ఎన్నో ప్రయత్నాలు చేశారని వారి సేవలను గుర్తించారు.

ఉద్యోగులకు కంపెనీయేమీ కార్లు ఇవ్వడం లేదని, వారే తమ కఠోర శ్రమతో సంపాదించుకున్నారని ఆయన కితాబిచ్చారు. సంస్థ నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకుంటే ఆదాయాన్ని ఉద్యోగులతో కూడా పంచుకుంటామని ఏడెనిమిదేళ్ల కిందటే తాము మాటిచ్చామని ఆయన గుర్తుచేసుకున్నారు. కార్లు అందజేయడం కేవలం ఆరంభం మాత్రమేనని, సమీప భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు చాలానే ఉంటాయని వివేకనందన్ సంకేతాలిచ్చారు.

ఈ ఐటీ కంపెనీలో మొత్తం 500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. సంస్థ తమ పనితీరును గుర్తించిన కార్లను బహుమతిగా అందించడంపై ఉద్యోగుల ఆనందానికి పట్టపగ్గాల్లేవు. యాజమాన్యం కానుకలపై సంబరపడుతున్నారు. ప్రత్యేక సందర్భాల్లో బంగారు నాణేలు, ఐఫోన్ల రూపంలో సంస్థ తన సంతోషాన్ని పంచుకుంటుందని ప్రశాంత్ అనే ఉద్యోగి చెప్పాడు. కాగా ఇటివలే చెన్నై కేంద్రంగానే పనిచేస్తున్న ఐటీ కంపెనీ కిస్‌ఫ్లో ఐదుగురు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు ఒక్కొక్కరికి రూ.1 కోటి విలువైన బీఎండబ్ల్యూ కార్లను బహుమతిగా ఇచ్చిన విషయం తెలిసిందే.

ఇక, తన దగ్గర పని చేసేవారికి వజ్రాల వ్యాపారి సావ్జీ ధోలకీయా ఏటా దీపావళి సందర్భంగా ఖరీదైన కార్లు, ఫ్లాట్‌లను బోనస్‌లుగా అందజేసే విషయం తెలిసిందే. దీపావళి వచ్చిందంటే చాలు ఆ సంస్థలో ఉద్యోగులకు ఊహించని రీతిలో బోనస్‌లు కానుకలు ఇస్తారు ధోలకీయా. 2018లో ఏకంగా 1500 మంది ఉద్యోగులకు ఖరీదైన కానుకలు అందించారు. ఇందులో 600 మందికి కార్లు, 900 మందికి ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఇచ్చారు. ఉద్యోగులే సంస్థ ఎదుగుదలకు కారణమని, వారి ద్వారా వచ్చిన సంపాదనను కొంత వారికి ఇవ్వాలనేది ధోలకీయా సిద్ధాంతం.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: