ఏప్రిల్ 2022

 రహదారులకు మాత్రం అలంకారప్రాయంగా...

పగలైన, రాత్రి అయిన నిద్రా దశలో.......  నిఘా నేత్రాలు ( సీసీ కెమెరాలు )

(జానో జాగో వెబ్ న్యూస్- గడివేముల ప్రతినిధి)

నంద్యాల జిల్లా, గడివేముల మండల పరిధిలోని గడివేముల గ్రామంలో నిఘా నేత్రాలు సీసీ కెమెరాలు నిద్ర పోతున్నాయి. వివరాల్లోకి వెళితే గడివేముల గ్రామం లోని ప్రధాన రహదారుల వెంట ఉన్న నిఘ నేత్రాలు (సీసీ కెమెరాలు) ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి. ఈ నిఘా నేత్రాల (సీసీ కెమెరాలు) ద్వారా పోలీసులు ఎంతో జటిలమైన కేసులను త్వరితగతిన చేధించారు. అయితే గడివేముల మండలం లోని ప్రధాన రహదారుల వెంట వెళ్లే వాహనాలతో ట్రాఫిక్ జామ్ అయి బస్సులు, లారీలు, ద్విచక్ర వాహనదారులు, బాటసారులు,


గంటలకొద్దీ ప్రధాన రహదారులపై నిరీక్షణ చేసిన ట్రాఫిక్ ను నియంత్రణ చేయవలసిన   అధికారులు మాత్రం కనబడరు, అందుకు కారణం సమాచారం అందించే నీఘు నేత్రాలు ( సీసీ కెమెరాలు )   పనిచేయకపోవడం, నిఘా నేత్రాలు (సీసీకెమెరాలు) పనిచేయడం లేదని తెలుసుకున్నారో, ఏమో తెలియదు గానీ గడివేముల గ్రామంలో ద్విచక్ర వాహన దొంగలు ఇళ్ళ ముందు ఉంచిన వాహనాలను కొన్ని రోజుల క్రితం వాహనాలను వరుసగా దొంగలించారు. రాత్రి గస్తీ తిరిగే పోలీసులు ఒక వైపు తిరుగుతుంటే మరో వైపు యథేచ్ఛగా వాహనాలను దొంగిలించుకుని వెళ్ళిపోయి పోలీసులకే సవాలుగా మిగిలిపోయారు.

వాహన చోదకులను (దొంగలు) పోలీసులకు చూపించే నిఘా నేత్రాలు (సిసి కెమెరాలు) లేకపోవడంతో పోలీసులు ద్విచక్ర వాహన దొంగలను ఎలా పట్టుకోవాలి, ఎలా దొంగతనాలు జరగకుండా, వీటిని కట్టడి చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.

ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు అధికారులు చొరవ తీసుకుని ప్రధాన రహదారుల వెంట ఏర్పాటు చేసిన నీఘు నేత్రాలను ( సీసీ కెమెరా )  తయారు చేయించి, గడివేముల గ్రామంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా, ద్విచక్ర వాహన చోరుల (దొంగల) నుండి వాహనాలను కాపాడాలని గడివేముల గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు.


 పేదలకు చెందాల్సిన ఇళ్లు..పార్టీ నేతలకే  ఇస్తున్నారు

బీజేపీ నాయకురాలు విజయశాంతి


పేదలకు చెందాల్సిన డబుల్ బెడ్రూం ఇళ్లు కాస్త టీఆర్ఎస్ నేతలకు దారిమళ్లుతున్నాయని బీజేపీ నాయకురాలు విజయశాంతి విమర్శించారు. డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపుల్లో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రుగుతున్నాయ‌ని ఆమె ఆరోప‌ణ‌లు గుప్పించారు. టీఆర్ఎస్ నేత‌లు డ‌బ్బులు తీసుకుని అన‌ర్హుల‌కు ఇళ్లు కేటాయిస్తున్నార‌ని ఆమె చెప్పారు. ''పేదల‌కు చెందాల్సిన డబుల్ బెడ్రూం ఇండ్లను కొందరు టీఆర్ఎస్ లీడర్లు బేరం పెట్టి దందా చేస్తున్నరు. లక్ష, రెండు లక్షల రూపాయ‌ల‌ చొప్పున వసూలు చేసి రాత్రికి రాత్రే లిస్టులు మార్చేస్తున్నరు. పలుచోట్ల ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకొని అధికారులపై ఒత్తిడి తెచ్చి తమ పార్టీ నేతలు, కార్యకర్తలు, అనుచరుల పేర్లు చేరుస్తున్నరు. 

తాజాగా వనపర్తి జిల్లా కొత్తకోట మండలం మిరాసిపల్లిలో నిర్మించిన 20 డబుల్ బెడ్రూం ఇండ్లను 3 నెలల కిందట ఎమ్మెల్యే ఆలం వెంకటేశ్వర్‌‌‌‌ రెడ్డి...గ్రామస్తులకు పంపిణీ చేశారు. ఎలాంటి భూమి, జాగ లేకుండా... గుడిసెల్లో ఉండే పేదలను కాదని, అప్పటికే ఇండ్లు ఉన్నవాళ్లకు డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించారు. 

ఇవి దక్కినవాళ్లలో ఇండ్లు, ఇతర ఆస్తిపాస్తులు ఉన్న గ్రామ సర్పంచ్ తల్లితో పాటు... ఎమ్మెల్యే అనుచరులున్నరు. ఇందుకోసం ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష వరకు వసూలు చేశారు. దీనిపై గ్రామానికి చెందిన ఎ.కొండన్న, సి.లక్ష్మయ్య, బోయ ఊశన్న, పి.మన్యం, చంద్రయ్య తదితరులు కలెక్టర్ కు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

చివరికి బాధితులంతా హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్టు... రాష్ట్ర హౌసింగ్ సెక్రటరీ, వనపర్తి జిల్లా కలెక్టర్, మిరాసిపల్లి గ్రామ సెక్రటరీకి ఇటీవల నోటీసులు జారీ చేసింది. ల‌బ్దిదారుల వివరాలతో హాజరు కావాలని ఆదేశించింది.

ల‌బ్దిదారుల వివరాలు పరిశీలించిన అనంతరం... సగం మంది అనర్హులు ఉన్నట్టు తేలడంతో మొత్తం కేటాయింపులు రద్దు చేసి తిరిగి అర్హులను ఎంపిక చేయాలని హైకోర్టు తీర్పు చెప్పింది. అలాగే సీఎం సొంత జిల్లా సిద్దిపేటలోని దుబ్బాక మున్సిపాలిటీ... పెద్ద‌పల్లి జిల్లా మంథ‌ని, మ‌హ‌బూబాబాద్, వ‌రంగ‌ల్ కార్పొరేష‌న్‌లో కూడా అచ్చు గుద్దినట్టు ఇలాంటి ఘ‌ట‌న‌లే జ‌రిగాయి. అర్హుల‌కు తీవ్ర అన్యాయం చేస్తున్న ఈ ప్రభుత్వానికి రానున్న ఎన్నిక‌ల్లో త‌గిన గుణ‌పాఠం చెబుతామ‌ని ల‌బ్దిదారులు హెచ్చ‌రిస్తున్నరు'' అని విజ‌య‌శాంతి ఆరోపించారు.

 క్రమంగా పెరుగుతున్న...కరోనా కేసులు


కరోనా నుంచి విముక్తిపొందిందని భావిస్తున్న తరుణంలో దేశంలో మళ్లీ కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. దీంతో భారత్ లో కరోనా వ్యాప్తి నిలకడగా కొనసాగుతోంది. రోజువారీ కొత్త కేసులు కొంచెం అటూఇటుగా 2 వేలకు పైగానే నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 4,49,197 మందికి కరోనా పరీక్షలను నిర్వహించగా 2,483 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. 

ఇదే సమయంలో 1,970 మంది కరోనా నుంచి కోలుకోగా... 1,399 మంది మృతి చెందారు. కేరళ సహా పలు రాష్ట్రాలు మరణాలను సవరించిన నేపథ్యంలో ఎక్కువ మరణాలు నమోదయ్యాయి. దేశంలో రోజు వారీ పాజిటివిటీ రేటు 0.55 శాతంగా ఉండగా... రికవరీ రేటు 98.75 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో 15,636 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

కొన్ని రోజులుగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఢిల్లీ, ఛత్తీస్ గఢ్, కర్ణాటక రాష్ట్రాలు మళ్లీ మాస్క్ లను తప్పనిసరి చేశాయి. దేశంలో ఇప్పటి వరకు 187 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్ డోసులను వేశారు. నిన్న ఒక్కరోజే 22.83 లక్షల మంది టీకాలు వేయించుకున్నారు.

 ఆ విద్యుత్ స్థంభాన్ని తొలగించండి సారూ

విద్యుత్ అధికారులకు ఓ కుటుంబం వినతి

ఎంతగా చెప్పినా విద్యుత్ అధికార్లు స్పందించడంలేదని బాధిత కుటుంబం ఆరోపణ


(జానో జాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)

ప్రమాదం జరిగాక మేలుకొనే కంటే ప్రమాదం జరగకముందే మేలుకొంటే ఉత్తమం. తమకు ప్రమాదం పొంచివుంది మహాప్రభు, తమ  ఇంటి ఆవరణలో ఉన్న విద్యుత్ స్థంభాన్ని తొలగించండి అని విద్యుత్ అధికార్లు ఏ మాత్రం స్పందించడంలేదని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. వివరాలలోకి వెళ్లితే.. నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలోని పెసరవాయి గ్రామంలో ఎస్సీ కాలనీకి చెందిన జి.వెంకట రమణ ఇంటి ఆవరణంలో కరెంటు పోల్ ఉన్నది.


కరెంటు నిరంతరాయంగా ఈ స్తంభానికి విద్యుత్ సరఫరా  ఉండడం వలన వారు నివాసమున్న ఇంటిపైన నిర్మించిన  ఇంటి లోకీ వెళ్లాలంటే కరెంటు తీగలు వాటికి సంబంధించిన విద్యుత్ బాక్స్, ప్రజలకు వినోదాన్ని అందించే డిష్ వైర్లు దాటుకుంటూ పిల్లలు పెద్దలు ఇంటి లోకి వెళ్లాలంటే చాలా ప్రమాదకరంగా ఉందని, వరుణదేవుడు కనికరించి వర్షం పడింది అంటే ఆ ఇల్లంతా కరెంటు సప్లై వస్తుందని, గత  మూడు  సంవత్సరాల నుండి విద్యుత్ శాఖ కార్యాలయానికి వెళ్లి అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఈ స్తంభం గురించి వారు పట్టించుకోవడం లేదని  వెంకటరమణ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తోంది.

పక్క రాష్ట్రంలో ఒక ఇంటి మీద కరెంటు తీగలు వెళ్లడం బాలుడు ఆడుకుంటూ వెళ్లి కరెంటు తీగలు పట్టుకోవడంతో విద్యుత్ షాక్ తగిలి మరణించడం జరిగింది. ఇలాంటి సంఘటన పునరావృతం కాక ముందే విద్యుత్ శాఖ అధికారులు స్పందించి మాకు న్యాయం చేస్తారని వెంకటరమణ కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు.



 అలా 15 నిమిషాల నుంచి 45 నిమిషాలకు చరణ్ పాత్ర పెంచారటా


ఆచార్య చిత్రంలో రామ్ చరణ్ పాత్ర సమయంపై కూడా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి 'ఆచార్య' పైనే ఉంది. ఈ నెల 29వ తేదీన థియేటర్లకు రానున్న ఈ సినిమా కోసం అంతా ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో చరణ్ ఎంతసేపు కనిపించనున్నాడనేది మొదటి నుంచి అందరిలో ఆసక్తిని రేపుతున్న విషయం. ఇక ఇంటర్వెల్ కి ముందు ఆయన కనిపిస్తాడా? ఆ తరువాత ఎంట్రీ ఇస్తాడా? అనేది మరో ప్రశ్నగా చర్చల్లో ప్రధానమైన అంశమై కూర్చుంది.

ముందుగా ఈ సినిమాలో 'సిద్ధ' అనే పాత్రను గెస్టుగా చూపించాలని అనుకున్నారు. తెరపై ఈ పాత్రను ఓ 15 నిమిషాల పాటు చూపించాలనుకున్నారు. కానీ ఆ పాత్రలో మంచి స్టఫ్ ఉండటంతో పెంచుతూ వెళ్లారట. అలా 15 నిమిషాలు మాత్రమే అనుకున్న ఈ పాత్ర నిడివి 45 నిమిషాలకు పెరిగినట్టుగా చెబుతున్నారు.

చరణ్ పాత్ర ఇంటర్వెల్ కి ముందు .. ఆ తరువాత కూడా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాలో ఆయన సరసన నాయికగా పూజ హెగ్డే అలరించనుంది. చిరంజీవి - మణిశర్మ కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన సినిమాలన్నీ మ్యూజికల్ హిట్లే. అదే దారిలో ఈ సినిమా కూడా వెళుతుందేమో చూడాలి.

 స్వేచ్ఛగా అభిప్రాయాలను వెల్లడించే వేదికగా ట్విట్టర్

ఇదే ఎలాన్ మాస్క్ మనోగతం


స్వేచ్ఛగా అభిప్రాయాలను వెల్లడించే వేదికగా ట్విట్టర్ ను మార్చాలన్నదే ఎలాన్ మాస్క్ మనోగతంగా ఉన్నట్లు ఆయన సన్నిహితులు వెల్లడిస్తున్నారు. ప్రపంచంలో ఎలక్ట్రిక్ కార్ల పరంగా మేటి సంస్థ టెస్లా. అంతరిక్ష పరిశోధన, శాటిలైట్ కమ్యూనికేషన్ల సేవల్లో దూసుకుపోతున్న సంస్థ స్పేస్ ఎక్స్. వీటి అధినేత అయిన ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను చాలా వేగంగా, అతి స్వల్ప వ్యవధిలోనే తన సొంతం చేసుకున్నారు. స్వేచ్ఛగా అభిప్రాయాలను వెల్లడించే వేదికగా ట్విట్టర్ ను అభివృద్ది చేయాలన్నది ఆయన సంకల్పం. 

ట్విట్టర్ లో 8.7 కోట్ల మంది ఎలాన్ మస్క్ ను ఫాలో అవుతుంటారు. కొత్త సాంకేతికతలను ముందుగానే పసిగట్టగల మేధావిగా మస్క్ కు గుర్తింపు ఉంది. 44 బిలియన్ డాలర్ల భారీ మొత్తానికి ట్విట్టర్ ను చేజిక్కించుకున్న తర్వాత ఎలాన్ మస్క్ మొదటి ట్వీట్ పెట్టారు.

‘‘స్వేచ్ఛగా మాట్లాడగలగడం ప్రజాస్వామ్యానికి పునాది. మానవాళి భవిష్యత్తుకు సంబంధించి కీలకమైన అంశాలకు చర్చా వేదికగా ట్విట్టర్ ఉంటుంది. ఇప్పటి కంటే ట్విట్టర్ ను మరింత మెరుగ్గా తయారు చేయడానికి సుముఖంగా ఉన్నాను. కొత్త ఫీచర్లు, విశ్వాసాన్ని పెంచడం కోసం ఆల్గోరిథమ్ లను ఓపెన్ సోర్స్ చేస్తాం. స్పామ్ బాట్లను ఓడిస్తాం. ట్విట్టర్ కు ఎంతో సత్తా ఉంది. దీన్ని వెలుగులోకి తీసుకొచ్చేందుకు కంపెనీ, యూజర్లతో కలసి పనిచేస్తా’’ అంటూ ట్విట్టర్ యజమానిగా ఎలాన్ మస్క్ మొదటి చేశారు. 

 ప్రేక్షకుల అంచనాలకు తగ్గకుండా ఎన్టీఆర్ తో కొత్తచిత్రం

దర్శకులు కొరటాల శివ 


ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఎన్టీఆర్ తో తీసే చిత్రం ఉంటుందని దర్శకుడు కొరటాల శివ పేర్కొన్నారు. కొరటాల తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'ఆచార్య' రెడీ అవుతోంది. ఈ నెల 29వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. నిరంజన్ రెడ్డి - అవినాశ్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని అందించారు. ఈ సినిమా తరువాత ఆయన ఎన్టీఆర్ తో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. 

 'ఆచార్య' సినిమా ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ సినిమాకి సంబంధించిన ప్రస్తావన రావడంతో కొరటాల స్పందించారు. 'జనతా గ్యారేజ్' లో ఎన్టీఆర్ ను ఒక రేంజ్ లో చూపించాను. ఎన్టీఆర్ లుక్ ను ..  పాత్రను కొత్తగా చూపించడం వలన ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ సినిమాకి అనూహ్యమైన విజయాన్ని ముట్టజెప్పారు. 

ఇటీవల 'ఆర్ ఆర్ ఆర్' సంచలన విజయం సాధించిన తరువాత, ఎన్టీఆర్ తో నేను చేయనున్న సినిమాపై నా బాధ్యత మరింత పెరిగింది. ప్రేక్షకుల అంచనాలకు ఎంతమాత్రం తగ్గకుండా ఎన్టీఆర్ పాత్ర  ఉంటుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ ను నెక్స్ట్ లెవెల్లో చూస్తారని మాత్రం కచ్చితంగా చెప్పగలను. మాస్ ఎలిమెంట్స్ .. ఎమోషన్స్ విషయంలో ఎంత ఏ మాత్రం తగ్గకుండా ఈ కథ నడుస్తుంది" అని చెప్పుకొచ్చారు.

 చిందుకూరు గ్రామ సచివాలయాన్ని సందర్శించిన అధికార్లు

సమస్యలపై ఆరా...పలు అంశాలపై సూచనలు చేసిన అధికార్లు

(జానో జాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)

నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలోని చిందుకూరు గ్రామానికి నంద్యాల  డివిజనల్ లెవెల్ పంచాయతీ అధికారులు శ్రీనివాసులు, డిఎల్పీఓ అడ్మిన్ రాంబాబు చిందుకూరు గ్రామంలోని  సచివాలయాన్ని సందర్శించారు. చిందుకూరు గ్రామంలో త్రాగునీరు, పారిశుద్ధ్య పరిస్థితి గురించి,  ప్రజలకు వన్ టైమ్ సెటిల్మెంట్ గురించి అవగాహనను ఎలా కల్పించాలి, సచివాలయ నిర్వహణ గురించి సచివాలయ సిబ్బందికి సూచనలు, సలహాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ విజయసింహారెడ్డి, ఈవోఆర్డీ ఖాలిక్ బాషా, చిందుకూరు గ్రామ పంచాయతీ కార్యదర్శులు జి.గోపాల్, ఎస్.కరీం, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.




 ఒరిజినల్ టెస్లా వెహికిల్ ఇదే. దీనికి గూగుల్ మ్యాప్స్‌తో పనిలేదు


ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర పోస్ట్ చేసిన ఓ చిత్రం అందర్నీ ఆకర్షిస్తోంది. అంతేకాదు ఓ గొప్ప సందేశాన్ని కూడా ఇస్తోంది. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే వారిలో ఆనంద్ హీంద్ర ముందువరుసలో ఉంటారు. స్ఫూర్తినింపే, ఆలోచింపజేసే, ప్రేరణ కలిగించే పోస్టులు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా అలాంటి పోస్టే ఒకటి షేర్ చేస్తూ టెస్లా సీఈవో, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌ను ట్యాగ్ చేశారు. దీని వెనక ఓ కారణం కూడా ఉంది. మస్క్ కంపెనీ టెస్లా డ్రైవర్‌తో పనిలేకుండానే దూసుకుపోయే కార్లను ఉత్పత్తి చేస్తోంది. ఈ కార్లకు బోల్డంత సాంకేతిక పరిజ్ఞానం, గూగుల్ మ్యాప్స్ సపోర్ట్ అవసరం.

అయితే, అలాంటివేవీ అవసరంలేని ‘ఒరిజనల్ టెస్లా వాహనం’ ఇదేనంటూ ఆనంద్ మహీంద్రా ఓ ఎద్దులబండి ఫొటోను పోస్టు చేశారు. దానిపై ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. బండిని నడిపే వాడు, వెనకనున్న ఇద్దరు కూడా కునుకు తీస్తుండగా, ఎద్దులు మాత్రం గమ్యం దిశగా దూసుకుపోతున్నాయి. ఈ ఫొటోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా.. దీని ఫీచర్లను కూడా వివరించారు.

‘‘ఒరిజినల్ టెస్లా వెహికిల్ ఇదే. దీనికి గూగుల్ మ్యాప్స్‌తో పనిలేదు. ఇంధనం కొనాల్సిన పనిలేదు. పొల్యూషన్ అంతకంటే లేదు. ఇది పూర్తిగా స్వయం చాలక వాహనం’’ అని కామెంట్ తగిలించారు. దీనికి కావాల్సిందల్లా ఇల్లు, పనిచేసే ప్రదేశాన్ని సెట్ చేసుకోవడమే. ఆ తర్వాత ఎంచక్కా బండెక్కి ఓ కునుకు తీసినా గమ్యాన్ని చేరుకోవచ్చు అని రాసుకొచ్చారు. అంతేకాదు, ఈ ట్వీట్‌పై రియాక్షన్ కోరుతూ ఎలాన్ మస్క్‌ను ట్యాగ్ చేశారు. ఇప్పుడీ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. ఆనంద్ మహీంద్రా సమయస్ఫూర్తికి అందరూ హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ఎడ్లబండితో తమకున్న అనుభవాలను పంచుకుంటున్నారు.

 రాష్ట్ర నాయకత్వంపైనే నాకు అసంతృప్తి : హార్థిక్ పటేల్


కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వంపై తనకు అసంతృప్తి  లేదని, ఉన్నదంతా  పార్టీ రాష్ట్ర నాయకత్వంపైనేనని గుజరాత్ కాంగ్రెస్ నేత  హార్థిక్ పటేల్ అన్నారు. కాంగ్రెస్‌పై ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేస్తూ బీజేపీకి దగ్గరైనట్టుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో గుజరాత్ కాంగ్రెస్ నాయకులు హార్దిక్ పటేల్ స్పందించారు. పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకలపై తనకు ఏమాత్రం అసంతృప్తి లేదన్నారు. తాపీ జిల్లాలోని సోన్‌గఢ్‌లో నిన్న విలేకరులతో మాట్లాడిన హర్దిక్ పటేల్.. తాను బీజేపీలో చేరబోతున్నట్టు మీడియాలో వస్తున్న వార్తలను కొట్టిపడేశారు. 

రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీపై తనకు ఏమాత్రం అసంతృప్తి లేదని స్పష్టం చేశారు. ఉన్నదల్లా రాష్ట్ర నాయకత్వంపైనేనని పేర్కొన్నారు. శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్నాయని, ఈ నేపథ్యంలో బలమైన, నిబద్ధత కలిగిన వ్యక్తులకు బాధ్యతలు అప్పగించాలని కోరుకుంటున్నానని, రాష్ట్ర నాయకత్వంతో తనకున్న ఏకైక సమస్య అదేనని వివరించారు. కాంగ్రెస్ ఓ కుటుంబం లాంటిదన్న హార్దిక్.. ఇక్కడ ఎవరైనా తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పొచ్చని అన్నారు.

 నేను పార్టీ పెట్టడానికి మీ అయ్యే కారణ

కేటీఆర్ కు షర్మిళ కౌంటర్


టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి వై.ఎస్.షర్మిళ ఘాటుగా సమాధానం ఇచ్చారు. తెలంగాణలో పార్టీ పెట్టడానికకి మీ అయ్యే కారణమని కేటీఆర్ కు ధీటుగా సమాధానమిచ్చారు. ఇదిలావుంటే అన్న మీద కోపం ఉంటే అక్కడ రాజకీయ పార్టీ పెట్టుకోవాలే కానీ... తెలంగాణలో పార్టీ ఎందుకు పెట్టుకున్నారంటూ వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిలను మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణతో ఆమెకు ఏం సంబంధమని అడిగారు. ఆమె తండ్రి వైఎస్సార్ తెలంగాణకు బద్ధ వ్యతిరేకి అని చెప్పారు. కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన షర్మిల ఆయనకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. 

అన్న మీద కోపం ఉంటే తెలంగాణలో పార్టీ పెట్టడమేంటని కేటీఆర్ అంటున్నారని...  తాము పార్టీ పెట్టడానికి కారణం కేటీఆర్ అయ్య కేసీఆర్ అని షర్మిల అన్నారు. రైతుల ఆత్మహత్యలు చూడలేక, నిరుద్యోగుల ఆత్మహత్యలు చూడలేక, రీడిజైన్ల పేరుతో ప్రజాధనాన్ని దోచుకోవడం చూడలేకే తెలంగాణలో పార్టీ పెట్టాల్సి వచ్చిందని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్, కేసీఆర్ లాఠీ దెబ్బలు తిన్నారా? అని ప్రశ్నించారు. 

ఇన్నాళ్లు బీజేపీతో డ్యూయెట్లు పాడింది మీరు అని షర్మిల అన్నారు. ఇక్కడ ఉన్నది వైఎస్సార్ బిడ్డ అని... సింహం సింగిల్ గానే వస్తుందని చెప్పారు. తమకు వైఎస్సార్ బొమ్మ ఉందని, వైఎస్సార్ అనే పేరు ఉందని అన్నారు. వైఎస్సార్ సంక్షేమ పాలనే తమ ఆస్తి అని చెప్పారు. ముమ్మాటికీ టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఓట్లను చీలుస్తామని అన్నారు. పేదవాడికి వైఎస్సార్ సంక్షేమ పాలనను అందిస్తామని చెప్పారు.

 ఇది పోలీసుల వైఫల్యమే: ఢిల్లీ హైకోర్టు స్పష్టీకరణ


ఢిల్లీ పోలీసుల తీరుపై ఆ రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది.  ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధికారిక నివాసంపై దాడి విషయంలో పోలీసులది ఘోర వైఫల్యమేనని ఢిల్లీ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. దాడిని అడ్డుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు, ఈ వైఫల్యానికి కారణమెవరో తేల్చాలని నగర పోలీస్ కమిషనర్‌ను ఆదేశించింది. ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాపై కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ యువమోర్చా గత నెల 30న సీఎం నివాసంపై దాడికి దిగింది. బారికేడ్లను తొలగించి విధ్వంసానికి పాల్పడింది.

ఈ ఘటనపై ‘ఆప్’ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విపిన్ సంఘి నేతృత్వంలోని ధర్మాసనం నిన్న విచారించింది. దాడి ఘటనలో పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. కేజ్రీవాల్ నివాసం వద్ద సరైన భద్రతా ఏర్పాటు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి బాధ్యులెవరో తేల్చి రెండువారాల్లోగా తమకు నివేదిక సమర్పించాలని కమిషనర్‌ను ఆదేశిస్తూ తదుపరి విచారణను వచ్చే నెల 17వ తేదీకి వాయిదా వేసింది.

 వాక్ స్వాతంత్ర్యానికి అనువైన వేదికగా ట్విట్టర్‌ను తీర్చిదిద్దుతా


వాక్ స్వాతంత్ర్యానికి మరింత అనువైన వేదికగా ట్విట్టర్‌ను తీర్చిదిద్దుతానని ఎలాన్ మాస్క్ వెల్లడించారు. మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ఎట్టకేలకు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సొంతమైంది. రెండు వారాల క్రితం ట్విట్టర్‌లోని 9.2 శాతం వాటాను కొనుగోలు చేసిన మస్క్.. తాజాగా సంస్థ మొత్తం షేర్లను కొనుగోలు చేశారు. ఒక్కో షేర్‌కు 54.20 డాలర్ల చొప్పున సంస్థలోని మొత్తం షేర్లను 46.5 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసి ట్విట్టర్‌ను తన వశం చేసుకున్నారు. 

ఈ సందర్భంగా మస్క్ మాట్లాడుతూ.. వాక్ స్వాతంత్ర్యానికి మరింత అనువైన వేదికగా ట్విట్టర్‌ను తీర్చిదిద్దుతానని ప్రకటించారు. మరోవైపు, ట్విట్టర్ కొనుగోలు ఒప్పందం వార్తల నేపథ్యంలో నిన్న ట్విట్టర్ షేర్ ధర 3 శాతం పెరిగింది. కాగా, ట్విట్టర్ కొనుగోలుకు అవసరమైన నిధులను బ్యాంకుల ద్వారా మస్క్ సమకూర్చుకున్నట్టు ‘ద వాల్ స్ట్రీట్ జర్నల్’ పేర్కొంది.

ట్విట్టర్‌ను మస్క్ సొంతం చేసుకున్నట్టు తెలియగానే యూజర్లు ఆయనకు కంగ్రాట్స్ చెప్పడంతో పాటు ఆయన శైలిలోనే పలు సరదా ప్రశ్నలు సంధించారు. ‘మస్క్.. నన్ను స్పేస్ నుంచి ట్వీట్ చేయనిస్తారా?’ అని ఒకరు అడిగితే, ‘బ్యాన్ చేసిన ఖాతాల్లో తొలుత మీరు దేనిని పునరుద్ధరిస్తారు?’ అని మరొకరు ప్రశ్నించారు. ట్విట్టర్‌ను ‘హేట్ స్పీచ్’కు వేదికగా మార్చొద్దని ఇంకొకరు కోరారు. ట్విట్టర్ కొనుగోలుకు మస్క్ వెచ్చించిన మొత్తం శ్రీలంక సంక్షోభానికి కారణమైన అప్పుల మొత్తంతో సమానమని మరో యూజర్ కామెంట్ చేశాడు.

 పాకిస్తాన్ నుంచి భారీగా ఇండియాకు హెరాయిన్


దాయాది దేశాల నుంచి ఉగ్రముప్పే కాకుండా తాజాగా హెరాయిన్ తో ముప్పు ఏర్పడింది. పాకిస్థాన్ నుంచి మన దేశంలోకి పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలు సరఫరా అవుతున్నాయి. తాజాగా గుజరాత్ సముద్ర తీరంలో భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుబడ్డాయి. పాక్ నుంచి అక్రమంగా తరలిస్తున్న రూ. 280 కోట్ల విలువైన హెరాయిన్ ను ఇండియన్ కోస్ట్ గార్డ్స్, గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ స్వాధీనం చేసుకున్నాయి. నిన్న రాత్రి సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ లో డ్రగ్స్ పట్టుబడ్డాయి. మాదకద్రవ్యాలతో భారత సముద్ర జలాల్లోకి ప్రవేశించిన పాకిస్థాన్ ఫిషింగ్ బోటును గుజరాత్ తీరంలో పట్టుకున్నారు.

అరేబియా సముద్రం మీదుగా హెరాయిన్ స్మగ్లింగ్ జరుగుతోందంటూ నిఘా వర్గాల నుంచి సమాచారం అందడంతో ఆపరేషన్ చేపట్టారు. ఇండియా వైపు వస్తున్న పాకిస్థాన్ పడవ 'అల్ హజ్' ను అడ్డుకున్న అధికారులు అందులో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా షిప్ లో పెద్ద ఎత్తున హెరాయిన్ ను గుర్తించారు. దానిని స్వాధీనం చేసుకున్న అధికారులు, షిప్ లో ఉన్న వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారణ నిమిత్తం కచ్ జిల్లాలోని జాఖౌ తీరానికి తరలించారు.

 ఆ నిర్ణయాన్ని వెంటనే ఉప సంహరించుకోవాలి: సోమువీర్రాజు


ఉపాధ్యాయుల సెలవుల విషయంలో ఏపీ విద్యాశాఖ తీసుకొన్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఏపీ బీజేపీ చీఫ్ సోమువీర్రాజు డిమాండ్ చేశారు. ఏపీలోని పాఠశాలలకు మే 6 నుంచి జులై 3 వరకు సెలవులు ప్రకటించిన‌ప్ప‌టికీ ఉపాధ్యాయులకు మాత్రం మే 20 వరకు సెలవులు ఉండ‌బోవ‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసిన విష‌యం తెలిసిందే. దీనిపై బీజేపీ ఏపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు ఏపీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పిస్తూ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఉపాధ్యాయులకు సెలవులు ఇవ్వకూడదన్న నిర్ణయాన్ని విద్యాశాఖ వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సెలవులు వేసవిలో కాకుండా వర్షాకాలంలో ఇస్తారా? అని సోము వీర్రాజు ప్రశ్నించారు. మే7వ తేదీతో ఫైనల్ ప‌రీక్ష‌లు అయిపోతున్న దశలో వాల్యుయేషన్ డ్యూటీ లో ఉండే ఉపాధ్యాయులకు ఆర్జిత సెల‌వులు ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ విధంగా డొంక తిరుగుడుగా వ్యవహరిస్తోందని సోము వీర్రాజు ఆరోపించారు. 


 జ్ఞాన గంగ ప్రసాదం సర్వీస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో...

గడివేములలో చలివేంద్రం ఏర్పాటు

(జానో జాగో వెబ్ న్యూస్-గడివేముల  ప్రతినిధి)

నంద్యాల జిల్లా, గడివేముల మండలం లోని గడివేముల గ్రామంలో జ్ఞాన గంగ ప్రసాదం సర్వీస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో గడివేముల మండల కేంద్రమైన గడివేముల లో స్థానిక ఎంపీడీవో, ఎమ్మార్వో, పోలీస్ స్టేషన్ల,వద్దకు వచ్చే ప్రజలు వారి సమస్యలను తీర్చుకోవడానికి వచ్చే ప్రజల దాహార్తి తీర్చుకోవడానికి జ్ఞాన గంగా ప్రసాదం సర్వీస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో పోతి రెడ్డి రామకృష్ణారెడ్డి గారు చల్లటి నీళ్లను ఇచ్చి దాహార్తిని తీర్చడానికి చలివేంద్ర కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ


వేసవికాలంలో సూర్యభగవానుడి ప్రతాపం తీవ్రంగా ఉన్న తరుణంలో ప్రజలకు కొంతైనా సేవ చేయాలన్న ఉద్దేశంతో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని, త్రాగు నీటిని వృధా చేయకుండా ప్రభుత్వ కార్యాలయాల వద్దకు వచ్చే ప్రజలు అందరూ చలివేంద్ర కేంద్రంలోనీ నీటిని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నామని ఆయన తెలిపారు.
త్రాగు నీటిని వృధా చేస్తే రేపటి తరాలకు మిగిలేవి కన్నీళ్లే అని ఆయన హితవు పలికారు. ఈ కార్యక్రమంలో కోడుమూరు ఎస్ ఐ విష్ణు నారాయణయాదవ్,నంద్యాల జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు,దుర్వేసి గ్రామానికి చెందిన కృష్ణ యాదవ్, బూజు నూరు గ్రామానికి చెందిన పంట రామచంద్రారెడ్డి, శ్రీనివాస్ యాదవ్, చంద్ర శేఖర్ యాదవ్, బిలకలగూడూరు గ్రామానికి చెందిన మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.





 ఎయిడ్స్ కేసులలో...ఏపీ నెంబర్ వన్

 అత్యధిక ఎయిడ్స్ కేసుల జాబితాలో ఏపీ నెంబర్ వన్ రాష్ట్రంగా నిలిచింది. అరక్షిత లైంగిక కార్యకలాపాల వల్ల మన దేశంలో ఎంతో మంది ఎయిడ్స్ బారిన పడుతున్నారు. కండోమ్స్ వాడకుండానే శృంగారంలో పాల్గొంటుండటం వల్ల ఎయిడ్స్ వ్యాధికి గురవుతున్నారు. మన దేశంలో గత పదేళ్లలో 17.08 లక్షల మంది ఎయిడ్స్ బారిన పడినట్టు ఎయిడ్స్ నివారణ సంస్థ తాజాగా ప్రకటించింది. 2011 నుంచి 2021 మధ్య కాలంలో 17,08,777 మందికి ఎయిడ్స్ సోకిందని చెపేర్కొంది.  

అయితే ఎయిడ్స్ బారిన పడుతున్న వారి సంఖ్య గత దశాబ్ద కాలంగా క్రమంగా తగ్గుతూ వస్తోంది. 2011-12 మధ్య కాలంలో 2.4 లక్షల మంది ఎయిడ్స్ బారిన పడగా... 2020-21 మధ్య కాలంలో ఆ సంఖ్య 85,268కి పడిపోయింది. ఏపీలో గత పదేళ్లలో 3,18,814 మందికి ఎయిడ్స్ సోకింది. 

ఇక అత్యధిక ఎయిడ్స్ కేసుల జాబితాలో ఏపీ నెంబర్ వన్ రాష్ట్రంగా నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలు ఉన్నాయి. మధ్యప్రదేశ్ కు చెందిన చంద్రశేఖర్ అనే సమాచార హక్కు చట్టం కార్యకర్త అడిగిన ప్రశ్నకు ఈ మేరకు ఎయిడ్స్ నివారణ సంస్థ సమాధానమిచ్చింది.

 ఆ దేశాల్లో వ్యాధుల ప్రభావం ఉండదటా


మనం తినే ఆహారమే మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. జీవితంలో ఆహార శైలీ ప్రాముఖ్యత అంతగా ఉంది. వ్యాధులు, అనారోగ్య సమస్యలతో బాధపడే వారి సంఖ్య ఏటేటా పెరిగిపోతోంది. కానీ, ప్రపంచంలోని కొన్ని దేశాల ప్రజలు ఇప్పటికీ ఆరోగ్యంతో, ఎక్కువ కాలం పాటు చక్కగా జీవిస్తున్నారని తెలుసా..? ప్రపంచంలోని బ్లూజోన్ ప్రాంతాలుగా పరిగణించే నికోయ ( కోస్టారికా), ఇకారియా (గ్రీస్), సార్డినా (ఇటలీ), లోమ లిండా (క్యాలిఫోర్నియా), ఒకినవా (జపాన్) ప్రాంతాల్లో వ్యాధుల రేటు ప్రపంచంలోనే తక్కువగా ఉంది. అందుకే ఇక్కడి వారు శతాయుష్షుతో వర్ధిల్లుతున్నారు. ఆరోగ్య పరంగానే కాదు, శారీరకంగా ఫిట్ గా ఉండడం ఇక్కడి ప్రజల్లో చూడొచ్చు. ఇదంతా వారి జీవనశైలి, ఆహార అలవాట్ల బలమేనని భావిస్తున్నారు. 

పండ్లు, కూరగాయలు

బ్లూజోన్ ప్రాంత వాసులు తమ రోజువారీ ఆహారంలో పండ్లు, కూరగాయలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. పాలకూర, బ్రకోలీ, బ్రస్సెల్ స్ప్రౌట్స్, బటానీ, క్యాలీఫ్లవర్, చిలగడ దుంపలు తీసుకుంటారు. ఇవన్నీ బరువు నియంత్రణకు ఎంతో మేలు చేస్తాయి. వీటిల్లో పొటాషియం, ఫైబర్, ఫొలేట్, విటమిన్ ఏ, విటమిన్ సి తగినంత లభిస్తాయి. కనుక ఆరోగ్యంపై శ్రద్ధ ఉన్నవారు స్నాక్స్ కు బదులు పండ్లు, కూరగాయలకు చోటు ఇవ్వాలి.

ముడి ధాన్యాలు

అధిక ఫైబర్ ఉండే ఆహారాన్ని బ్లూజోన్ ప్రాంతంలోని వారు ఎక్కువగా తీసుకుంటున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఆహారంగా ముడి ధాన్యాన్ని వినియోగిస్తున్నారు. ముడి ధాన్యంలో ఫైబర్, ప్రొటీన్, బీ విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్, ఐరన్, జింక్, కాపర్, మెగ్నీషియం లభిస్తాయి. దీంతో గుండె జబ్బులు, టైప్ 2 మధుమేహం, ఊబకాయం,కొన్ని రకాల కేన్సర్ రిస్క్ లు తగ్గుతాయి.

నీరు తగినంత

మన శరీంలో నీటి పరిమాణమే ఎక్కువ. అందుకని నీటికి ప్రాధాన్యం ఇవ్వాలి. బ్లూజోన్ వాసులు ఇదే చేస్తున్నారు. నీటి పరిమాణం తగ్గకుండా చూసుకోవడం కూడా ఆయుష్షులో కీలక పాత్ర పోషిస్తుందని తెలిసింది. ముఖ్యంగా కోస్టారికాలోని నికోయ వాసుల ఆరోగ్య రహస్యాల్లో ఇదీ ఒకటి.

పరిమాణం

ఏమి తింటున్నాం, ఎంత తింటున్నామన్నది కీలకం. ఆహారాన్ని కొద్ది మోతాదుల్లో తీసుకోవడం వల్ల శరీరంలో కేలరీలు అధికంగా పోగుపడవు. జపాన్ లోని ఒకినవా వాసులు కడుపునిండా ఆహారం తీసుకోకపోవడాన్ని గమనించాలి. 80 శాతం వరకే ఆహారం తీసుకుని, మిగిలిన 20 శాతాన్ని వారు ఖాళీగా ఉంచేస్తారు.  

శారీరకంగా చురుకుదనం

బ్లూజోన్ ప్రాంతాల్లో నివసించే వారు రోజూ జిమ్ కు వెళ్లి వ్యాయామాలు ఏమీ చేయరు. అయినా వారు ఎంతో చురుగ్గా ఉంటున్నారు. ఎలా సాధ్యం? ఎందుకంటే వారు ఒకే చోట కూర్చోరు. శారీరక కదలికలు ఉన్న పనులను చేస్తూ ఉంటారు. గార్డెనింగ్, నడక, సైక్లింగ్ ఇలా ఏదో ఒక కదలికలతో కూడిన పనితో సమయం గడుపుతుంటారు

 తెలుగులో మరోసారి ఎంట్రీ ఇస్తున్న రవీనా టాండన్


తెలుగు చలనచిత్రంలో మరోసారి బాలివుడ్ భామ రవీనా టాండన్ ఎంట్రీ ఇవ్వనున్నది. బాలీవుడ్ నుంచి వచ్చిన చాలామంది హీరోయిన్స్ తెలుగు తెరపై మెరిశారు. అలాంటి సీనియర్ హీరోయిన్స్ లో రవీనా టాండాన్ ఒకరు. తెలుగులో ఆమె కొన్ని సినిమాలు చేసినప్పటికీ, బాలకృష్ణ సరసన చేసిన 'బంగారు బుల్లోడు' సినిమా ఆమెకి మంచి హిట్ ఇచ్చింది. ఆ తరువాత ఆమె వరుస హిందీ సినిమాలు చేసుకుంటూ వెళ్లారు.

'కేజీఎఫ్ 2' సినిమాలో రవీనా పోషించిన ప్రధానమంత్రి పాత్ర ఆమెకి మంచి పేరు తెచ్చిపెట్టింది. రిమికా సేన్ అనే ఈ పవర్ఫుల్ పాత్రలో ఆమె గొప్పగా నటించింది. ఆ పాత్రలో నుంచి ఆమె ఎక్కడా బయటికి రాలేదు. ఈ మధ్య కాలంలో ఆమెకి దక్కిన మంచి పవర్ఫుల్ రోల్ ఇది. ఈ సినిమాలోని హైలైట్ ఎపిసోడ్స్ లో ఇది ఒకటి. 

ఈ సినిమా చూసిన హరీశ్ శంకర్, 'భవదీయుడు భగత్ సింగ్'లోని ఇక కీలకమైన పాత్ర కోసం ఆమెను సంప్రదించినట్టుగా సమాచారం. రవీనా పాత్ర గురించి ఆమెకి చెప్పడం .. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయని అంటున్నారు. ఈ సినిమాతో రవీనా తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వడం ఖాయమైపోయిందని చెబుతున్నారు. ఈ సినిమాలో పూజ హెగ్డే కథానాయికగా సందడి చేయనున్న సంగతి తెలిసిందే.

 అసాంఘిక కార్యక్రమాలపై... 

ఉక్కు పాదం మోపిన గడివేముల ఎస్సై హుస్సేన్ బాషా

(జానో జాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)

నంద్యాల జిల్లా,గడివేముల మండల పరిధిలోని ఎర్ర కనుమ తాండ, ఎల్ కే తండా, మరియు పై బొగుల పరిసర ప్రాంతాల్లోని గ్రామాల సరిహద్దుల్లో నాటు సారా తయారు చేస్తున్నారు అన్న విశ్వసనీయ సమాచారం తెలుసుకున్న


గడివేముల ఎస్ఐ హుస్సేన్ భాష తన  పోలీస్ సహచర సిబ్బందినీ వెంట తీసుకొని వెళ్లి నాటుసారా స్థావరాలపై  మెరుపు దాడులు చేసి నాటుసారా తయారు చేసే స్థావరాలను ధ్వంసం చేసి, నాటు సారా తయారుచేయడానికి నిల్వ ఉంచిన 8000 వేల లీటర్ల బెల్లం ఊటలను అక్కడికక్కడే నిర్వీర్యం చేశారు. గడివేముల మండలం లోని ఏ గ్రామంలో అసాంఘిక చర్యలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని,ఎంతటి వారినైనా వదిలేది లేదని హెచ్చరికలు జారీ చేశారు.


 మళ్లీ దేశంపై కరోనా పంజా...ఆ రాష్ట్రాల్లోనే ఎక్కువటా


దేశంలోని కరోనా కేసుల పెరుగుదలకు కారణం ఆ రాష్ట్రాలేనని అధికార్లు పేర్కొంటున్నారు. ఇదిలావుంటే దేశ వ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కొన్ని రోజులుగా ప్రతి రోజు 2 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. 12 రాష్ట్రల్లో వారం రోజుల నుంచి కేసులు క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ముందు వారంతో పోలిస్తే ఈ రాష్ట్రాల్లో కేసుల సంఖ్య రెట్టింపయింది. దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి కంటే కొత్త కేసులే ఎక్కువగా నమోదవుతున్నాయి. 

గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 3.02 లక్షల మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా 2,541 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇదే సమయంలో 1,862 మంది మహమ్మారి నుంచి కోలుకోగా... 30 మంది మృతి చెందారు. తాజా మృతులతో కలిపి ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 5,22,223కి చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 16,522 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 187 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు.

 అక్కడ మాత్రం పార్కింగ్ ఫ్రీ...రంజాన్ స్పెషల్


రంజాన్ స్పెషల్ పార్కింగ్ విషయంలోనూ కొనసాగుతోంది. హైదరాబాద్ లోని పాతబస్తీలో రంజాన్‌ మాసంలో నెల‌కొనే సంద‌డి అంతా ఇంతా కాదు. సంద‌ర్శ‌కుల‌తో ఆ ప్రాంతం అంతా క‌ళ‌క‌ళ‌లాడుతుంది. ఇక చివరి 10-12 రోజులు మార్కెట్ మ‌రింత‌ రద్దీగా ఉంటుంది. ఈ నేప‌థ్యంలో సమీపంలోని 6 ప్రాంతాల్లో వాహనదారుల కోసం ఉచిత పార్కింగ్‌ సౌకర్యం ఏర్పాటు చేసిన‌ట్లు ట్రాఫిక్ పోలీసులు ప్ర‌క‌టించారు. 

చార్మినార్‌ సమీపంలోని యునానీ ఆసుపత్రి ప్రాంగణం, కుడా స్టేడియం, మోతీగల్లీ పెన్షన్‌ ఆఫీసు, కోట్ల అలీజాలోని ముఫిదుల్లా నామ్‌ హైస్కూల్‌ ప్రాంగణం, పంచమొహల్లాలోని ఆర్టీసీ బస్టాండ్‌ ఖాళీ స్థలంలో సంద‌ర్శ‌కులు ఉచితంగా వాహ‌నాల‌ను పార్కింగ్ చేసుకోవ‌చ్చ‌ని తెలిపారు. ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే పోలీసుల దృష్టికి తీసుకురావాల‌ని వాహ‌న‌దారులకు సూచించారు. 

 పాకిస్తాన్ వర్సెస్ ఆప్ఘనిస్థాన్


భూభాగం విషయంలో పాకిస్తాన్, ఆప్ఘనిస్థాన్ మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంటోంది. తమ భూభాగంపై ఎయిర్ స్ట్రయిక్స్ చేసిన పాకిస్థాన్ పై ఆఫ్ఘనిస్థాన్ లోని తాలిబన్ ప్రభుత్వం మండిపడింది. తమ దేశంపై దండయాత్ర చేయాలని చూస్తే సహించబోమని హెచ్చరించింది. తాలిబన్ ల వ్యవస్థాపకుడు ముల్లా మొహమ్మద్ ఒమర్ కుమారుడు, ఆప్ఘనిస్థాన్ తాత్కాలిక రక్షణ మంత్రి ముల్లా మొహమ్మద్ యాకూబ్ మాట్లాడుతూ, యావత్ ప్రపంచంతో పాటు పొరుగుదేశం నుంచి కూడా తాము సమస్యలను ఎదుర్కొంటున్నామని అన్నారు.  

తమ భూభాగంలోని కునార్ పై పాకిస్థాన్ దండయాత్రకు పాల్పడటమే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. తమ దేశంపై దండయాత్రను క్షమించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. దేశ ప్రాధాన్యతల కోసం తాజా దాడులను ఇప్పుడు క్షమించామని... మరోసారి రిపీట్ అయితే క్షమించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. 

ఈ నెల 16న ఖోస్త్, కునార్ ప్రావిన్సుల్లో పాకిస్థాన్ ఎయిర్ స్ట్రయిక్స్ చేసింది. పాకిస్థాన్ మిలిటరీ హెలికాప్టర్లు ఈ దాడికి పాల్పడ్డాయి. ఈ దాడిలో 36 మంది ఆప్ఘనిస్థాన్ పౌరులు చనిపోయారు. వీరిలో 20 మంది చిన్నారులు ఉండటం గమనార్హం. ఆప్ఘనిస్థాన్ ను తాలిబన్లు చేజిక్కించుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు పాకిస్థాన్ సరిహద్దుల వద్ద ఎన్నో సార్లు ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.

మరోవైపు ఎయిర్ స్ట్రయిక్స్ తామే జరిపినట్టు పాకిస్థాన్ ఇంతవరకు ప్రకటించలేదు. ఆప్ఘన్ రక్షణ మంత్రి వ్యాఖ్యలపై స్పందించాలంటూ అడిగిన ప్రశ్నకు పాకిస్థాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి సమాధానమిస్తూ... రెండూ సోదర దేశాలని చెప్పారు. టెర్రరిజాన్ని రెండు దేశాల్లోని ప్రభుత్వాలు, ప్రజలు తీవ్ర సమస్యగా భావిస్తున్నారని అన్నారు. రెండు దేశాలు తీవ్రవాదం కారణంగా ఎంతో నష్టపోయాయని చెప్పారు. క్రాస్ బోర్డర్ టెర్రరిజంను అరికట్టడానికి ఇరు దేశాలు కలసికట్టుగా పోరాడాలని అన్నారు.

 సలార్ మామూలుగా ఉండదటా


రాథే శ్యామ్ పై పెట్టుకొన్న అంచనాలు తలకిందులు  కావడంతో ప్రభాస్ ఇక సలార్ పై భారీ ఆశలతో ఉన్నాడటా. ఇకపోతే ప్రశాంత్ నీల్ .. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ పేరు వినిపిస్తోంది. 'కేజీఎఫ్ 2' సినిమాతో ఆయన మరోసారి తన సత్తా చాటుకున్నాడు. ఈ సినిమా చూస్తుంటే హాలీవుడ్ సినిమాను చూస్తున్నట్టుగానే ఉంటుంది. పరిమితమైన బడ్జెట్ లోనే ఆయన ఈ స్థాయి అవుట్ పుట్ ను తీసుకురావడం గురించి ఇప్పుడు అంతా విశేషంగా చెప్పుకుంటున్నారు.

ఇప్పుడు అందరి దృష్టి ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న 'సలార్' పైనే ఉంది. ఈ సినిమా ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణ జరుపుకుంది. ప్రభాస్ కథానాయకుడిగా రూపొందుతున్న ఈ సినిమాలో ఆయన సరసన నాయికగా శ్రుతిహాసన్ అలరించనుంది. ఈ ఇద్దరి మధ్య లవ్ .. ఎమోషన్ ట్రాక్ నడుస్తుందని అంటున్నారు.

ఈ సినిమాలో భయంకరమైన ఒక లోయలో చిత్రీకరించిన ఛేజింగ్ సీన్స్ హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు. ఇక ప్రీ క్లైమాక్స్ కి సంబంధించిన యాక్షన్ సీన్ ను కూడా ఆల్రెడీ చిత్రీకరించారట. ఈ ఒక్క సీన్ కోసం 20 కోట్లవరకూ ఖర్చుచేసినట్టుగా సమాచారం. 'కేజీఎఫ్ 2' నిర్మాతనే ఈ సినిమాను నిర్మిస్తుండటం విశేషం.

 ఫ్రాన్స్ అధ్యక్షుడికి అభినందనలు చెప్పనున్న మోడీ


ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ తిరిగి ఎన్నిక కావడం పట్ల ప్రధాని మోదీ ఇప్పటికే ట్విట్టర్ లో అభినందనలు తెలియజేశారు. ఇంతటితో సరిపెట్టకుండా.. నేరుగా మెక్రాన్ ను కలసి అభినందించనున్నారు. ప్రధాని మోదీ మే 2 నుంచి 6వ తేదీ వరకు యూరోప్ లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్, జర్మనీ చాన్స్ లర్ ఒలాఫ్ స్కాల్జ్ తో ద్వైపాక్షిక వాణిజ్య సమావేశాల్లో పాల్గొననున్నారు. 

కోపెన్ హెగెన్ లో జరిగే ఇండియా-నార్డిక్ సదస్సును ఉద్దేశించి కూడా ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. భారత్-ఫ్రాన్స్ మధ్య సన్నిహిత రాజకీయ, రక్షణ సంబంధాలు కొనసాగుతున్నాయి. నూతన తరం సాంకేతిక టెక్నాలజీలపై కలసి పనిచేసేందుకు రెండు దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇప్పటికే రక్షణ ఉత్పత్తుల తయారీ విషయంలో ఆత్మినిర్భర్ భారత్ కు ఫ్రాన్స్ మద్దతుగా ఉంది.

 మహిళల అభివృద్దే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం

పాణ్యం శాసనసభ సభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి

(జానో జాగో న్యూస్ -గడివేముల ప్రతినిధి)  

నంద్యాల జిల్లా, గడివేముల మండల కేంద్రమైన గడివేముల గ్రామంలో పొదుపు మహిళా సంఘం కార్యాలయం నందు మహిళలకు సున్నా వడ్డీ మూడో విడత కార్యక్రమానికి కి పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని మహిళా గ్రూపు సంఘాలకు 1,44,18,000 రూపాయల చెక్కును అందించి, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

జ్యోతి ప్రజ్వలన చేస్తున్న ఎమ్మెల్యే కాటసాని రామ్ గోపాల్ రెడ్డి 

గడివేముల మండలం లోని 916 గ్రూపులో ఉన్న  10571 మంది మహిళలకు 1,44,18,000 రూపాయలను గౌరవనీయ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అందజేయడం జరిగిందని, ప్రతి గ్రామంలోని మహిళల అభివృద్ధి కి ప్రభుత్వం పెద్దపీట వేసిందని మహిళలలో ఆత్మవిశ్వాసం, మనోధైర్యం,నింపేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి  అమ్మ ఒడి,వైయస్సార్ చేయూత, వైయస్సార్ ఆసరా, జగనన్న తోడు, 0 వడ్డి రుణాల పథకాల ద్వారా వచ్చే రూపాయలను నేరుగా మహిళల సొంత బ్యాంక్ ఖాతాలో వేస్తున్నారని,

అందువల్ల మహిళలు మనోధైర్యంతో సమాజంలో ముందడుగు వేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గడివేముల మండల జెడ్ పి టి సి ఆర్ బి చంద్రశేఖర్ రెడ్డి,మండల రెవెన్యూ అధికారి నాగమణి, ఏ పీ ఎం అంబమ్మ, గడివేముల ఐక్య సంఘం ప్రెసిడెంటు రాధమ్మ, ఎంపీపీ నాగ మద్దమ్మ,కమ్యూనిటీ కోఆర్డినేటర్ జంగిలయ్య,లక్ష్మీనారాయణ, వి వో ఏ లు గోపి కృష్ణ, మద్దిలేటి,దీవెనమ్మ, మేరీ, గడివేముల మండలం లోని మహిళా పొదుపు సంఘాల సభ్యులు అందరూ పాల్గొన్నారు.

 అఖిల భారత యాదవ మహా సంఘం...

నంద్యాల జిల్లా అధ్యక్షుడిగా అంగజాల క్రిష్ణా యాదవ్

అఖిలభారత యాదవ మహాసభ కు హాజరైన పౌర సరఫరా శాఖ మంత్రి 

 (జానో జాగో న్యూస్ -గడివేముల ప్రతినిధి)                 

అఖిల భారత యాదవ మహా సంగం అధ్వర్యంలో విజయవాడ తుమ్మల పల్లి కళా సమితి భవనంలో యాదవ సోదరుల ఆత్మీయుల సమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళనం లో గడివేముల మండల పరిధిలోని దుర్వేసి గ్రామానికి చెందిన అంగజాల క్రిష్ణా యాదవ్ ను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కరుమూరి వెంకట నాగేశ్వరావు యాదవ్ చేతుల మీదుగా  అఖిల భారత యాదవ మహా సంఘం నంద్యాల జిల్లా అధ్యక్షుడి గా నియామక పత్రం తీసుకోవడం జరిగింది.


ఈ సందర్భంగా అంగజాల కృష్ణ యాదవ్ మాట్లాడుతూ నంద్యాల జిల్లాలోని యాదవ సోదరుల అందరినీ చైతన్య పరిచి, యాదవ సోదరులు కలిసికట్టుగా పని చేయడానికి ప్రయత్నం చేస్తానని, యాదవ సోదరుల పిల్లల విద్యాభివృద్ధికి మరియు ఉన్నత స్థితికి కృషి చేస్తానని తెలిపారు.నా మీద నమ్మకం తో నంద్యాల జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడు గా నియమించిన రాష్ట్ర అధ్యక్షులుకి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేశారు.

 నంద్యాల జిల్లా యాదవ సంఘం అధ్యక్షునిగా బాధ్యతలు చేపడుతున్న అంగజాల కృష్ణ యాదవ్

ఆంధ్ర ప్రదేశ్ యాదవ సంఘంకమిటీలోగడివేముల మండలం లోని చిందుకూరు గ్రామానికి చెందిన దేవ శంకర్ యాదవ్, పెరుగు శివకృష్ణ యాదవులు ఉండడం చాలా ఆనందంగా ఉందని నంద్యాల జిల్లా యాదవ సంఘం సభ్యులు మరియు యాదవ సంఘం సోదరులు, సోదరీమణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

నంద్యాల జిల్లా అధ్యక్షునిగా కృష్ణ యాదవ్ నియమించిన లిఖిత పూర్వక పత్రం 



 గద్దె దిగే ప్రసక్తే లేదు: శ్రీలంక ప్రధాని మహింద రాజపక్స


శ్రీలంకలో నెలకొన్న పరిస్థితి ఎంతకీ అదుపులోకి రావడంలేదు. దీంతో  శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం కొనసాగుతోంది. ప్రధాని మహింద రాజపక్స రాజీనామా చేయాలన్న డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. దేశంలో విదేశీ మారక నిల్వలు పూర్తిగా అడుగంటడంతో శ్రీలంక సంక్షోభంలో కూరుకుపోయింది. విదేశాల నుంచి అవసరమైన సరుకులను దిగుమతి చేసుకోలేకపోతోంది. ఫలితంగా మందులు, ఇంధనం, ఆహారంతోపాటు ఇతర నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.  ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలే దేశాన్ని సంక్షోభంలోకి నెట్టేశాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నిరసనకారులు అధ్యక్షుడు గొటబయ రాజపక్స, ప్రధాని మహింద రాజపక్స రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 

తాజాగా ఓ రేడియో ఇంటర్వ్యూలో మాట్లాడిన మహింద రాజపక్స రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అంతేకాదు, మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ను కూడా ఆయన తోసిపుచ్చారు. ఒకవేళ మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వస్తే అది తన నాయకత్వంలోనే జరగాలని అన్నారు. మరోవైపు, ఆర్థిక సంక్షోభంతో అల్లాడిపోతున్న శ్రీలంకకు భారత్ భారీ సాయం ప్రకటించింది. చమురును దిగుమతి చేసుకునేందుకు దాదాపు రూ. 3,820 కోట్ల రుణ సదుపాయం అందించేందుకు ముందుకొచ్చింది. శ్రీలంక చెల్లించాల్సిన 150 కోట్ల డాలర్ల దిగుమతి బిల్లును వాయిదా వేసేందుకు భారత్ అంగీకరించింది. అంతేకాదు, ఈ ఏడాది జనవరిలో ఇచ్చిన 40 కోట్ల డాలర్ల రుణ చెల్లింపు గడువును కూడా పొడిగించింది. కాగా, భారత్ మరో 100 కోట్ల డాలర్ల రుణం ఇస్తుందని శ్రీలంక ఆశిస్తోంది.

 పెట్రేగుతున్న కరోనా కేసులు


కరోనాకు పుట్టినిల్లుగా మారిన చైనా దేశంలో మరోసారి కరోనా పెరుగుదలతో వణుకుతోంది. కరోనా మహమ్మారి చైనాను పట్టిపీడిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న వేళ చైనాలో వైరస్ విజృంభిస్తోంది. ఆ దేశంలో వైరస్ తొలిసారి వెలుగుచూసినప్పుడు కూడా లేనంతగా ఇప్పుడు కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్క రోజే దేశవ్యాప్తంగా 24,326 కేసులు నమోదయ్యాయి. షాంఘైలో 12 మంది కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారు. 

రాజధాని బీజింగ్‌లో 10 మంది విద్యార్థులు వైరస్ బారినపడ్డారు. కరోనా కట్టడికి ఆ దేశం అవలంబిస్తున్న జీరో-కొవిడ్ విధానం సత్ఫలితాలను  ఇవ్వడం లేదు. అయినప్పటికీ ఇదే విధానాన్ని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా లాక్‌డౌన్‌తోపాటు కఠిన ఆంక్షలు విధించడంతో షాంఘైలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

 నైజీరియాలో భారీ పెల్లుళ్లు...భారీ ఎత్తున్న ప్రాణ నష్టం


నైజీరియాలోని ఓ చమురుశుద్ధి కర్మాగారంలో జరిగిన భారీ పేలుడులో 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. మరెంతోమంది గాయపడ్డారు. ముడిచమురు శుద్ధికేంద్రం వద్ద తొలుత ప్రారంభమైన మంటలు ఆ తర్వాత సమీపంలోని రెండు చమురు నిల్వ ప్రాంతాలకు విస్తరించినట్టు అధికారులు తెలిపారు. మృతులు, క్షతగాత్రుల సంఖ్యను ఇంకా లెక్కిస్తున్నట్టు అధికారులు తెలిపారు. 

చనిపోయిన వారంతా అక్రమ ఆపరేటర్లేనని పేర్కొన్నారు. చమురుశుద్ధి కేంద్రం యజమాని కోసం గాలిస్తున్నట్టు చెప్పారు. నైజీరియాలో ఉద్యోగాలు దొరక్క యువత చమురుశుద్ధి కేంద్రాలను అక్రమంగా ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే, అవసరమైన జాగ్రతలు పాటించకపోవడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.

అధిష్టానం సంబంధాలు పెరగాలి: ప్రశాంత్ కిశోర్


పార్టీ నేతలతో, కార్యకర్తలతో అధిష్టానం సంబంధాలు పెరగాల్సిన ఆవశ్యత ఎంతైనా ఉందని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ హైకమాండ్ కు స్పష్టంచేశారు. కాంగ్రెస్ ఒక దిశానిర్దేశం లేని పార్టీగా మారిపోయిందని, ఈ పరిస్థితుల్లో మార్పు వస్తే తప్ప వచ్చే ఎన్నికల్లో గెలవడం సాధ్యం కాదని ఆయన అన్నారు. కాంగ్రెస్‌లో చేరికకు సిద్ధమైన ఆయన వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించాలంటే పార్టీలో తొలుత చేయాల్సిన సంస్థాగత మార్పులపై అధిష్ఠానానికి ఇటీవల పలు సూచనలు ఇచ్చారు. అందులో భాగంగా పార్టీని కింది నుంచి బలోపేతం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో అధిష్ఠానం సంబంధాలు కోల్పోయిందని, వీటిని పునరుద్ధరిస్తేనే పార్టీ తిరిగి గాడిన  పడుతుందని ఆయన సూచించినట్టు పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు.

పార్టీ నేతలు,  కార్యకర్తలతో సంబంధాల విషయంలో బీజేపీ మెరుగ్గా ఉందని, కార్యకర్తలతో తరచూ సమావేశాలు నిర్వహిస్తూ పరిస్థితిని సమీక్షిస్తుందని పీకే అన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్‌లో 70 శాతం జిల్లా అధ్యక్షులతో ఇంత వరకు పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కానీ, రాహుల్ గానీ సమావేశాలు నిర్వహించలేదని అన్నారు. అంతేకాదు, ఢిల్లీ స్థాయిలో ఉన్న నేతలు బ్లాక్ అధ్యక్షులతో సమావేశం కాలేదని చెప్పారు. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలన్న ఆయన పార్టీలోని వృద్ధ నేతలను పక్కన పెట్టాలని, పనితీరు, ప్రజాబలం ఆధారంగా నేతలను గుర్తించాలని, లేదంటే పార్టీ భవిష్యత్ ఉండదని పీకే పేర్కొన్నట్టు సమాచారం. రాజస్థాన్‌లో జరగనున్న మేధోమదన సదస్సులో పార్టీ నిర్మొహమాటంగా అన్ని అంశాలను చర్చించాలని ఆయన సూచించినట్టు తెలుస్తోంది.

 నెల్లూరు జిల్లాలో కలపడంపై....హైకోర్టులో ప్రకాశం జిల్లా వాసుల పిటిషన్


కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో నెలకొన్న వివాదం కాస్త హైకోర్టుకు చేరింది. ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటైన సంగతి తెలిసిందే. మొత్తం 26 జిల్లాల్లో పాలన కూడా ప్రారంభమైంది. కానీ ప్రకాశం జిల్లాలో మాత్రం ఈ జిల్లాల విభజన వేడి తగ్గలేదు. మొన్నటి వరకు ప్రకాశం జిల్లాలో కొనసాగిన తమను నెల్లూరు జిల్లాలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తున్న స్థానికులు హైకోర్టును ఆశ్రయించారు. కందుకూరు, లింగసముద్రం, గుడ్లూరు, ఉలవపాడు, వలేటివారిపాలెం మండలాలను నెల్లూరు జిల్లాలో విలీనం చేయడాన్ని సవాల్ చేస్తూ లింగసముద్రం మండలం విశ్వనాథపురంకు చెందిన నాగేశ్వరరావు, ఉన్నం వీరాస్వామిలు పిటిషన్ దాఖలు చేశారు. సీఎస్, ప్రణాళికశాఖ ముఖ్యకార్యదర్శి, ప్రకాశం, నెల్లూరు జిల్లా కలెక్టర్లను పిటిషన్‌లో ప్రతివాదులుగా చేర్చారు.

ఈ పిటిషన్‌లో తాము ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రస్తావించారు. తమ మండలాలను నెల్లూరు జిల్లాలో విలీనం చేయడంతో ఇబ్బందులుపడుతున్నామన్నారు. దీనిపై తాము అభ్యంతరాలను చెప్పినా అధికారులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే కందుకూరు నుంచి ఒంగోలు చాలా దగ్గరని.. అదే నెల్లూరు అయితే చాలా దూరమని వివరించారు. ఈ ఐదు మండలాల నుంచి ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలుకు వెళ్లాలంటే 45 నుంచి 75 కి.మీ దూరం మాత్రమే ఉంటుందన్నారు. అదే తాము నెల్లూరుకు వెళ్లాలంటే 111 నుంచి 135 కి.మీ ఉందన్నారు.

ఈ కారణాలను పట్టించుకోకుండా విలీన ప్రక్రియ పూర్తి చేశారని అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే కందుకూరు టౌన్‌కు రామతీర్థం జలాశయం నుంచి మంచి నీరు వస్తుందని.. అది ప్రకాశం జిల్లా అధికార యంత్రాంగం పరిధిలో పనిచేస్తుందని గుర్తు చేశారు. కందుకూరును నెల్లూరు జిల్లాలో కలిపితే మంచి నీరు అందించే విషయంలో సమస్యలు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ మండలాల విలీనాన్ని అన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని గుర్తు చేశారు. పైన తెలిపిన అంశాలను పరిగణనలోకి తీసుకొని న్యాయం చేయాలని కోరారు.

 సూపర్ బాస్...ఉద్యోగులకు కార్ల బహుమతులు


లాభాలు వస్తే తనవల్లే అని యాజమాన్యాలు అనుకొనే రోజులివి. కానీ సంస్థలోని సిబ్బంది వల్లేనని చెప్పేవారు కొందరే ఉంటారు. ఆ కొందరిలో ఉద్యోగుల శ్రమ గుర్తించి బహుమతులు ఇచ్చేవారు అసలు ఉండరు అని స్పష్టంగా చెప్పేపరిస్థితి. కానీ ఓ యాజమాని మాత్రం తన గొప్ప మనస్సును ప్రతి ఏటా చాటుకొంటున్నాడు. సంస్థ అభివృద్ధికి నిరంతరం కృషిచేస్తున్న కనీసం 100 మంది ఉద్యోగులకు ఓ ఐటీ కంపెనీ ఊహించని కానుకలు ఇచ్చి, సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తింది. చెన్నై కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఐడియాస్2ఐటీ సంస్థ 100 మంది ఉద్యోగులకు మారుతీ సుజకీ కార్లను బహుమతిగా అందజేసింది. సంస్థ వృద్ధి కోసం ఉద్యోగుల నిరంతర కృషి, అసమాన భాగస్వామ్యానికి గుర్తింపుగా ఈ కానుకను అందించామని సదరు కంపెనీ ప్రకటించింది.

10 ఏళ్లకుపైగా సంస్థతో ప్రయాణం సాగిస్తున్న 100 మంది ఉద్యోగులకు కార్లను బహుమతి అందించినట్టు ఐడియాస్2ఐటీ మార్కెటింగ్ హెడ్ హరి సుబ్రమణియన్ చెప్పారు. ఉద్యోగుల కృషితో కంపెనీకి లభించిన సంపదను తిరిగి వారికే అందజేయాలనేది తమ ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. ఇక, సంస్థ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ మురళీ వివేకనందన్ ఉద్యోగులపై ప్రశంసలు కురిపించారు. తమ సంస్థ పురోభివృద్ధి కోసం ఉద్యోగులు ఎంతో పాటుపడ్డారని, ఎన్నో ప్రయత్నాలు చేశారని వారి సేవలను గుర్తించారు.

ఉద్యోగులకు కంపెనీయేమీ కార్లు ఇవ్వడం లేదని, వారే తమ కఠోర శ్రమతో సంపాదించుకున్నారని ఆయన కితాబిచ్చారు. సంస్థ నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకుంటే ఆదాయాన్ని ఉద్యోగులతో కూడా పంచుకుంటామని ఏడెనిమిదేళ్ల కిందటే తాము మాటిచ్చామని ఆయన గుర్తుచేసుకున్నారు. కార్లు అందజేయడం కేవలం ఆరంభం మాత్రమేనని, సమీప భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు చాలానే ఉంటాయని వివేకనందన్ సంకేతాలిచ్చారు.

ఈ ఐటీ కంపెనీలో మొత్తం 500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. సంస్థ తమ పనితీరును గుర్తించిన కార్లను బహుమతిగా అందించడంపై ఉద్యోగుల ఆనందానికి పట్టపగ్గాల్లేవు. యాజమాన్యం కానుకలపై సంబరపడుతున్నారు. ప్రత్యేక సందర్భాల్లో బంగారు నాణేలు, ఐఫోన్ల రూపంలో సంస్థ తన సంతోషాన్ని పంచుకుంటుందని ప్రశాంత్ అనే ఉద్యోగి చెప్పాడు. కాగా ఇటివలే చెన్నై కేంద్రంగానే పనిచేస్తున్న ఐటీ కంపెనీ కిస్‌ఫ్లో ఐదుగురు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు ఒక్కొక్కరికి రూ.1 కోటి విలువైన బీఎండబ్ల్యూ కార్లను బహుమతిగా ఇచ్చిన విషయం తెలిసిందే.

ఇక, తన దగ్గర పని చేసేవారికి వజ్రాల వ్యాపారి సావ్జీ ధోలకీయా ఏటా దీపావళి సందర్భంగా ఖరీదైన కార్లు, ఫ్లాట్‌లను బోనస్‌లుగా అందజేసే విషయం తెలిసిందే. దీపావళి వచ్చిందంటే చాలు ఆ సంస్థలో ఉద్యోగులకు ఊహించని రీతిలో బోనస్‌లు కానుకలు ఇస్తారు ధోలకీయా. 2018లో ఏకంగా 1500 మంది ఉద్యోగులకు ఖరీదైన కానుకలు అందించారు. ఇందులో 600 మందికి కార్లు, 900 మందికి ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఇచ్చారు. ఉద్యోగులే సంస్థ ఎదుగుదలకు కారణమని, వారి ద్వారా వచ్చిన సంపాదనను కొంత వారికి ఇవ్వాలనేది ధోలకీయా సిద్ధాంతం.