ప్రభుత్వం చేతికొచ్చిన మణికొండ వక్ఫ్ భూములను...

తిరిగి వక్ఫ్ బోర్డుకే ఇవ్వాలి

ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్ డిమాండ్

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

సుప్రీంకోర్టు తీర్పుతో ప్రభుత్వం అధీనంలోకి వచ్చిన 50వేల కోట్ల విలువైన మణికొండ దర్గా వక్ఫ్ భూములను తిరిగి వక్ఫ్ బోర్డుకు అప్పగించాలని, ఆ భూములపై వచ్చే ఆదాయాన్ని పేద ముస్లిం మైనార్టీల అభివృద్ధికి వినియోగించాలని  ఆవాజ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది.  ఈ మేరకు ఆవాజ్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్ ఓ ప్రకటన విడుదల చేశారు. రంగారెడ్డి జిల్లా మణికొండ జాగీర్ లోని హజ్రత్ సయ్యద్ హుస్సేన్ షా వలీ దర్గాకు చెందిన 1654 ఎకరాల, 32 గుంటల భూమికి సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో వక్ఫ్ బోర్డుపై రాష్ట్రప్రభుత్వం గెలిచింది. వక్ఫ్ పాలకమండలి అసమర్థత, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం ఫలితంగా  50 వేల కోట్ల రూపాయల విలువైన వక్ఫ్ భూములను వక్ఫ్ బోర్డు కోల్పోయింది. వక్ఫ్ పాలకమండలి చైర్మెన్ ను, సభ్యులను, అధికారులను సరైన వారిని నియమించి,  పాలక మండలిని సరిగా పని చేయించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది.  అందువల్లనే  50 వేల కోట్ల రూపాయల విలువ చేసే వక్ఫ్ బోర్డు భూములు  ప్రభుత్వ భూములుగా మారిపోయాయి. వక్ఫ్ బోర్డు 50వేల కోట్లు నష్టపోయింది. ఇది ప్రభుత్వం చేసిన కుట్ర తప్ప మరేమీ కాదు. వక్ఫ్ భూములను గుర్తించాల్సింది, వక్ఫ్ భూముల రికార్డులను నిర్వహించాల్సింది,  వక్ఫ్ బోర్డుకి చైర్మన్, సభ్యులను అధికారులను నియమించి, నిధులు సమకూర్చి సక్రమంగా పని చేయించాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే.  రాష్ట్ర  ప్రభుత్వాలు వక్ఫ్ పాలకమండలితో సరిగా పనిచేయించకపోవడం, రికార్డులను సరిగా నిర్వహించకపోవడం వల్లనే అనేక వక్ఫ్ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. వక్ఫ్ బోర్డు అవినీతి,  రాజకీయ పక్షపాతంతో కూనారిల్లుతోంది.  మణికొండ దర్గా వక్ఫ్ ఆస్తుల రికార్డులు సరిగా నిర్వహించకుండా, వక్ఫ్ భూములను గుర్తించి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయకుండా నిర్లక్ష్యం చేసింది గత పాలకులే. ఇప్పుడు వక్ఫ్ భూములకు రికార్డులు సరిగా లేవు అని ప్రభుత్వ  అధికారులే వాదించడం  హాస్యాస్పదం. ఈ తీర్పు వల్ల ల్యాంకో, ఎమ్మార్ ప్రాపర్టీస్, ఇంటర్ నేషనల్ బిజినెస్ స్కూల్ లాంటి వ్యాపార సంస్థలకు లబ్ది చేకూరుతుంటే, వక్ఫ్ బోర్డుకు, పేద మైనార్టీలకు నష్టం వాటిల్లుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచన చేసి, మణికొండ దర్గా వక్ఫ్ భూములను వక్ఫ్ బోర్డుకు అప్పగించాలని, ఆక్రమణలకు గురవుతున్న వక్ఫ్ ఆస్తుల రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. అని ఆయన ఆ ప్రకటనలో కోరారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: