న్యాయవ్యవస్థ లో.. బహుజనుల పరిస్థితి అగమ్యగోచరం

సమాజతీరులో మార్పు వచ్చేది ఎన్నడు


రాజ్యాంగం 1950  లో అమలులోకి వచ్చినప్పటికీ  బహుజనులు న్యాయమూర్తులు, ప్రధాన న్యాయమూర్తులు కాలేకపోవడం చాల విచారకరం. మన ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టులో ప్రస్తుతం వున్న న్యాయమూర్తుల సంఖ్య 20 మంది. వీరిలో ఇద్దరు న్యాయమూర్తులు ఎస్ సి సామజిక వర్గం వారు, ఒకరు బి సి సామజిక వర్గం వారు, ఇక మిగిలిన వారు అందరూ కూడా ఉన్నత వర్గాల వారే ఉండటం విశేషం. ఇప్పుడు రాబోయే ఏడుగురు న్యాయమూర్తులు, ఎవరి పేర్లైతే సుప్రీమ్ కోర్టు కోలీజీయం సిఫారసు చేసిందో వారిలో ఆరుగురు ఉన్నత వర్గాల వారు. ఇక వీరిలో ఇద్దరు రెడ్డి సామాజికవర్గం వారు, ఇద్దరు కమ్మ సామాజికవర్గం వారు, ఒకరు కొప్పుల వెలమ సామజిక వర్గం, ఒక బీసీ మహిళా ఉన్నారు.  ఇక రాబోయే వారితో న్యాయమూర్తులు బ్రాహ్మణా - 7 , కమ్మ - 4, రెడ్డి  - 4, కాపులు  - 4 , ముస్లిం -1, కళింగ-1  వెలమ - 1 , అరవలు - 1, బి సి - 3, ఎస్ సి - 2 అవుతుంది.  వీరిలో గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ గారికి మే నెలతో 58 సంవత్సరాలు. గౌరవ సుప్రీమ్ కోర్ట్ లోక్ ప్రహరీ వర్సస్ యూనియన్ అఫ్ ఇండియా కేసులో ఉన్నత న్యాయస్థానాలకు న్యాయమూర్తుల నియామకాలలో వయసు పరిమితి కనిష్టంగా 45  మరియు గరిష్టంగా 55  మించరాదని  సూచింది.

ఎస్ సి, ఎస్ టి, బి సి న్యాయవాదులను పరిగణలోకి తీసుకోకుండా చేస్తున్న అడ్డంకులు ఏంటి మరియు వాటిని ఎలా అధిగమించాలి అనే విషయం ఎస్ సి, ఎస్ టి, బి సి మేధావులు, సంఘ సంస్కర్తలు మరియు మాజీ న్యాయమూర్తులు ఆలోచించాలి. ఇప్పటికే 75 సంవత్సరాలు గడుస్తున్నది, ఇంకా  ఎస్ సి, ఎస్ టి, బి సి న్యాయవాదులు న్యాయమూర్తులు కాలేకపోతున్నారు. భారత దేశంలో హిందూ ముస్లిం భాయ్ భాయ్, కానీ హిందుత్వంలో ఒక కులం వాడు ఇంకో కులం వారితో కలవలేరు. ఇక కులం కూకటివేళ్ళు కొన్ని వందల వేల సంవత్సరాల నుండి వస్తున్నవి. న్యాయవాద వృత్తిలో కులం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. 


మాజీ న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ గారు 2020 సంవత్సరంలోనే  ఎస్ సి, ఎస్ టి, బి సి న్యాయవాదులలో మేధావులను మరియు అర్హులను న్యాయమూర్తులుగా సిఫారసు చేయాలని రెండు మార్లు పత్రిక ముఖంగా చెప్పారు. ఇంతే కాకుండా ప్రస్తుత న్యాయ శాఖ మంత్రి  కిరెన్ రెజ్జు గారు కూడా ఇదే విషయాన్నీ నొక్కి వక్కాణించారు. ఇవే కాకుండా, రాజ్య సభలో పోయిన నెలలో జాన్ బ్రిట్టాస్ అనే కేరళ ఎంపీ గారు కూడా ఇదే విషయాన్నీ చెబుతూ, ఒక న్యాయమూర్తి గురించి చెప్పాలంటే, ఆయన తాత గారు సుప్రీమ్ కోర్టు న్యాయమూర్తి, తండ్రిగారు హై కోర్టు న్యాయమూర్తి, ఆయన మామగారు న్యాయమూర్తి ఇలా ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసారు, ఇలా చెప్పుకుంటే పోతే చాలా పెద్ద చిట్టా తాయారు అవుతుంది అని చెప్పారు.  

రాజ్యాంగ సూత్రాల ప్రకారం రేజర్వేషన్లు 50 % మించరాదు. అంటే ఎస్ సి, ఎస్ టి, బి సి ల రిజర్వేషన్ 50 % మించరాదు. మిగిలిన 50 % ఓపెన్ కేటగిరీ లో ఉంటుంది. అలాంటప్పుడు, ఎస్ సి, ఎస్ టి, బి సి ల ప్రాతినిధ్యాన్ని ఉన్నతవర్గాలు ఎలా తీసుకుంటారు.ఇది అన్యాయం కాక మరేంటి, ఈ పరిస్థితుల దృష్ట్యా మనం తెలుసుకోవాల్సిందేంటంటే మనం ఇలాగే మౌనంగా ఉంటే ఇంకో యాభై సంవత్సరాలు గడిచిపోతాయి. గడిచిన 75 సంవత్సరాలలో 1980 వరకు సుప్రీమ్ కోర్టులో ఒక ఎస్ సి న్యాయమూర్తి కూడా లేరు, స్వతంత్రం వచ్చిన ౩౦ సంవత్సరాల వరకు  సుప్రీమ్ కోర్టులో సామజిక ప్రతిబింబం లేదు. ఇక మన ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టులో సుమారుగా 1990  ల చివరవరకు ఒక ఎస్ సి న్యాయమూర్తి కూడా లేరు. ఇది సామజిక పరిస్థితి. ఇంకా చెప్పాలంటే డాక్టర్ బాబా సాహెబ్ అంబెడ్కర్ గారు చెప్పినట్టు ఇప్పటి నియామకాలలో కుల హిందువులు ముఖ్యంగా ఉన్నత వర్గాల వారి కులాలకు న్యాయం చేసిన విధంగా ఉన్నాయి. ఇక దళిత హిందువులు ఉన్నప్పటికీ, వీరికి ప్రతిబింబించేం దుకు ఎవరూ ఈ నియామకాల్లో లేకపోవటం గమనార్హం.  ఇది సామజిక పరిస్థితి. 

 శ్రీ కరియా ముండా ఎస్ సి, ఎస్ టి పార్లమెంటరీ కమిటీ రిపోర్టులో ఇలాంటి చాలా విషయాలు చర్చించారు. ఆ తర్వాత జస్టిస్ శ్రీ ఏం ఎల్ వెంకటాచలయ్య గారు వాటిని ఇంకా విశదీకరించి  ఎస్ సి, ఎస్ టి, బి సి లకు ఎక్కడ అన్యాయం జరుగుతుంది, వారికీ సామజిక న్యాయం ఎలా అందించాలి అనే విషయాలను తన రిపోర్టు ద్వారా తెలియచేసారు. ఇప్పటికి ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 20 రాబోయే వారితో అది 27.  అయినప్పటికీ వీరిలో ఎస్ సి, ఎస్ టి న్యాయవాదులు లేరు. ఇక ఇంతే కాకుండా, ఎస్ సి, ఎస్ టి, బి సి ల విషయంలో వారిని 55 లేక 56  సంవత్సరాలలో న్యాయమూర్తులను చేయడం వలన  ఇక వారు ప్రధాన న్యాయమూర్తి కాకుండానే పదవి విరమణ పొందుతారు. శ్రీ నాచియప్పన్ గారి రిపోర్టులో న్యాయమూర్తులను న్యాయమూర్తులే ఎంపిక చేసుకోవడాన్ని తప్పు పట్టారు. ఉన్నత న్యాయ వ్యవస్థలో  కూడా రేజర్వేషన్లు అమలు చెయ్యాలనే విషయాన్నీ వారు ప్రతిపాదించారు.

ఇప్పటికి 75 సంవత్సరాలలో ఎస్ సి సామజిక వర్గానికి ఇచ్చిన న్యాయమూర్తి పోస్టులు రెండే, ఇంకా బి సి సామజిక వర్గానికి ఇచ్చిన పోస్టులు రెండే. ఇక మిగిలిన న్యాయమూర్తులు కుల హిందువులే (క్యాస్ట్ హిందువులే)  ఎక్కువగా ఉన్నారు. ఇక ఇలాంటి పరిస్థితులలో సీనియర్ న్యాయవాది మరియు డీఎంకే ఎంపీ విల్సన్ గారు చెప్పినట్టు, ఎస్ సి, ఎస్ టి, బి సి న్యాయమూర్తులు లేకపోవటం వల్ల వారికీ సరైన న్యాయం జరగడం లేదు. ఇప్పటికి ఎస్ సి న్యాయమూర్తులు ఇద్దరే ఉన్నారు. ఇక వీరి సంఖ్య పెరగాలంటే ఇంకో 75  సంవత్సరాలు పూర్తి అవ్వాలేమో అనిపిస్తుంది. ఇక ఈ ఇద్దరు పదవీ విరమణ పొందినా, ఇంకా వేరే ఎవరైనా పదవీ విరమణ పొందినా, ఎస్ సి మరియు బి సి సామజిక వర్గం వారికి, ఇద్దరికి మించి  సంఖ్య పెరిగేలా లేదు. ఇదే రాజ్యాంగ స్ఫూర్తి, ఇదే సామజిక న్యాయం. సామజిక న్యాయం కోసం వీరు నోర్లు తెరిచి ప్రజా వేదికగా చర్చ చేసి, ప్రజలను చైతన్యవంతులను చేసి, దీనిని సాదించుకోవాల్సి ఉంది. వీరు, ఈ విషయం పై ప్రభుత్వాలను, ప్రభుత్వ ప్రతినిధులను కదిలించి సాధించుకోవాల్సి వుంది.    

అధికారణాలు 16 (4), 16 (4A ), 16 (4B ) మరియు 335 ప్రకారం ప్రభుత్వంలో నియామకాలకు ఎస్ సి, ఎస్ టి మరియు బి సి లకు తగిన రిజర్వేషన్ కల్పించే అధికారాన్ని రాష్ట్రాలకు ఇచ్చారు. న్యాయ శాఖ ప్రభుత్వంతో సంబంధం లేకపోయినా వారి జీతాలు మరియు అన్ని ఖర్చులు భరించేది ప్రభుత్వం అంటే ప్రజలే. మరి ప్రజలే పాలకులైనప్పుడు, సామాజికత లేక సామజిక ప్రతిబింబం ఉండాలి అనుకోవడంలో తప్పేమి లేదు. రాష్ట్రంలో ఎస్ సి న్యాయవాదుల సంఖ్య 4,8౦౦, ఇంకా బి సి ల సంఖ్య సుమారుగా 9000  నుండి 11000  వరకు ఉండొచ్చు. హై కోర్టులో రెగ్యులర్ ప్రాక్టీస్ ఉన్నవారు, అనుభవజ్ఞులు, మేధావులు అయినా  ఎస్ సి, ఎస్ టి మరియు బి సి లకు తగిన ప్రాధాన్యత ఇచ్చి ఉంటే రాజ్యాంగంలోని సామజిక న్యాయం జరిగేది.  

న్యాయమూర్తులు ఎంత మంది ఉన్నాకానీ, బహుజన (ఎస్ సి మరియు బి సి) న్యాయమూర్తులు ఇద్దరికి మించి ఉండరాదు అన్నట్టుగా ఉంటున్నాయి ఈ నియామకాలు. 2019 నుండి  ఇప్పటి వరకు జరిగిన నియామకాలలో ఏడుగురు న్యాయవాదులు న్యాయమూర్తులు గా నియమింపబడిన వారే. ఇక వీరిలో ఒకరు మాత్రమే సామజిక వర్గానికి చెందిన వారు. ఇక ఇప్పుడు నియమింపబడి వారిలో ఒకరు సామాజికం వర్గానికి చెందిన వారు. వీటిని బట్టి చూస్తే సామజిక స్పృహ, సామాజికత, సామజిక న్యాయం జరగటానికి ఇంకా చాల సమయం పడుతుంది అనిపిస్తోంది.

రచయిత-సాల్మన్  రాజు  మంచాల

 హైకోర్టు న్యాయవాది.అమరావతి.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: