అమర్ జవాన్ జ్యోతిని ఆర్పడంలేదు


దేశంలో మరోమారు జాతీయ రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికలు సమీపించేకొద్ది రాజకీయ వేడ రాజుకోవడం సహజం. ఇపుడు అదే జరుగుతోంది. న్యూఢిల్లీలోని ఇండియా గేట్ వద్దనున్న 'అమర్ జవాన్ జ్యోతి'ని ఆర్పడం లేదని, జాతీయ యుద్ధ స్మారకం వద్దనున్న జ్యోతితో కలుపుతున్నామని కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. 1971 పాకిస్థాన్ తో యుద్ధం సమయంలో అమరులైన జవాన్లకు గుర్తుగా వెలిగించిన అమర్ జవాన్ జ్యోతిని ఆర్పేస్తున్నారన్న కథనాల నేపథ్యంలో ప్రతిపక్షాలపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. జ్యోతిని తరలించే విషయంపై ప్రభుత్వ వర్గాలు వివరణ నిచ్చాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా వార్ మెమోరియల్ వద్ద ఉన్న జ్యోతులతో కలిపి ఈ జ్యోతిని వెలిగిస్తారని అధికారులు చెబుతున్నారు. జ్యోతిని ఆర్పేస్తారంటూ తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని, అందులో వాస్తవం లేదని అన్నారు. చాలా యుద్ధాల్లో చాలా మంది సైనికులు మరణించారని, అలాంటప్పుడు 1971 యుద్ధంలో అమరులైన జవాన్లకు ప్రత్యేకంగా జ్యోతి ఎందుకు? అని అంటున్నారు. అమరులైన అందరు జవాన్లకు కలిపి వార్ మెమోరియల్ లోనే జ్యోతిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇండియాగేట్ పై కేవలం మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిషర్ల కోసం పోరాడిన జవాన్ల పేర్లు, ఆంగ్లో–ఆఫ్ఘన్ యుద్ధంలో పోరాడిన వారి పేర్లే ఉన్నాయని, అది ఆక్రమణవాద పాలనను గుర్తు చేస్తుందని అన్నారు. అదే నేషనల్ వార్ మెమోరియల్ వద్ద 1971 సహా అన్ని యుద్ధాల్లో అమరులైన జవాన్ల పేర్లున్నాయని, కాబట్టి జ్యోతిని అక్కడికే తరలిస్తున్నామని అధికారులు స్పష్టం చేశారు. ఏడు దశాబ్దాలుగా అమరుల కోసం ఓ నేషనల్ వార్ మెమోరియల్ ను నిర్మించలేని ప్రతిపక్షాలు.. అమరులందరి పేర్లను రాసిన వార్ మెమోరియల్ కు అమరజవాన్ల జ్యోతిని తరలించడంపై వ్యాఖ్యలు చేయడం వింతగా ఉందని ప్రభుత్వం అసహనం వ్యక్తం చేసింది. ఇదిలావుంటే అమర్ జవాన్ జ్యోతిని తరలించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై రాహుల్ గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు. 50 ఏళ్ల తర్వాత జ్యోతిని ఆర్పేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘యుద్ధంలో అమరులైన జవాన్ల త్యాగాలకు గుర్తుగా ఎన్నో ఏళ్లుగా వెలుగుతున్న జ్యోతిని ఇవాళ ఆర్పేయబోతున్నారు. అది చాలా విచారకరమైన విషయం. కొందరికి దేశ భక్తి, త్యాగాలు అంటే ఏంటో తెలియవు. అయినా మేం మళ్లీ ఆ అమర్ జవాన్ జ్యోతిని సైనికుల కోసం వెలిగిస్తాం’’ అని రాహుల్ ట్వీట్ చేశారు. కాగా, 1972 జనవరి 26న అమర్ జవాన్ జ్యోతిని ఇందిరా గాంధీ తొలిసారి వెలిగించారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: