అవార్డును తిరస్కరించిన మరో గాయని


 

పద్మ అవార్డులు దక్కడం పట్ల  పలువురు ఆనందం వ్యక్తంచేస్తే..ఇంకొందరు అవార్డు గ్రహితలు వాటిని ఏకంగా తిరస్కరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మవిభూషణ్‌ను పశ్చిమ్ బెంగాల్ మాజీ సీఎం, సీపీఎం నేత బుద్ధదేవ్ భట్టాచార్య తిరస్కరించిన విషయం తెలిసిందే. తాజాగా, బెంగాల్‌కు చెందిన మరొకరు పద్మశ్రీ అవార్డును తిరస్కరించారు. ప్రముఖ బెంగాలీ గాయని సంధ్యా ముఖర్జీ (90) పద్మశ్రీ జూనియర్ ఆర్టిస్ట్‌‌కు ఎక్కువ అర్హమైందని, తన స్థాయికి తగదని పేర్కొన్నారు. సంధ్య ముఖర్జీ కుమార్తె సౌమి సేన్‌గుప్తా మాట్లాడుతూ.. పద్మశ్రీ గ్రహీతగా తన పేరును ప్రకటించినా.. తీసుకోడానికి సిద్ధంగా లేనని ఢిల్లీ నుంచి ఫోన్ చేసిన ఉన్నతాధికారులకు నా తల్లి చెప్పారని తెలిపారు. 90 ఏళ్ల వయసులో తనకు పద్మశ్రీకి ఎంపికచేయడం అవమానంగా భావించారని ఆమె అన్నారు. అవార్డుల జాబితాలో పద్మశ్రీగా పేరు పెట్టడానికి ఆమె సమ్మతి కోరుతూ కేంద్ర అధికారులు సంప్రదించిన సమయంలో పై విధంగా స్పందించారు. ‘గాయనిగా దాదాపు ఎనిమిది దశాబ్దాల జీవితంలో 90 ఏళ్ల వయసప్పుడు పద్మశ్రీకి ఎంపిక కావడం గాయకురాలిగా ఆమె స్థాయిని కించపరచడమే’ అని సేన్‌గుప్తా అన్నారు. దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్ తర్వాత పద్మశ్రీ నాలుగోది. ‘‘పద్మశ్రీ ఓ జూనియర్ ఆర్టిస్ట్‌కు ఎక్కువ.. గీతాశ్రీ సంధ్య ముఖోపాధ్యాయ్‌కు కాదు.. ఆమె కుటుంబం, అభిమానులు పాటలతో అనుభూతిచెందుతారు’’ అని వ్యాఖ్యానించారు. బెంగాల్‌లో సంగీతానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఆ రాష్ట్రానికి చెందిన గాయకులు ఎస్డీ బర్మన్, అనిల్ బిస్వాస్, మదన్ మోహన్, రోషన్, సలీల్ చౌదరితో సహా అనేక మంది హిందీ చలనచిత్ర రంగంలో తమదైన ముద్రవేశారు. ఇక, సంధ్యా ముఖర్జీ 2011లో పశ్చిమ బెంగాల్ అత్యున్నత పౌర పురస్కారం ‘బంగా బిభూషణ్’ను అందుకున్నారు. ఈ అవార్డును మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటుచేయగా.. తొలి పురస్కారం గాయనికి దక్కింది. అలాగే, 1970లో ఉత్తమ మహిళా నేపథ్య గాయనిగా జాతీయ చలనచిత్ర పురస్కారానికి ఎంపికయ్యారు. ఇదిలావుంటే పద్మ అవార్డులకు ఎంపికైన వ్యక్తులు తిరస్కరించడం చాలా అరుదుగా జరుగుతుంది. గతంలో ప్రముఖ గాయని ఎస్.జానకి, బాలీవుడ్ సినీ రచయిత సలీం ఖాన్‌లకు పద్మ అవార్డులను ప్రకటించగా వారు తిరస్కరించారు. అలాగే, ప్రముఖ చరిత్రకారిణి రోమిల్లా థాపర్ తనకు 1974లో ప్రకటించిన అవార్డును 1984 స్వర్ణ దేవాలయం ఘటనకు నిరసనగా 2005లో తిరిగిచ్చారు. రచయిత కుష్యంత్ సింగ్ ఇదే కారణంతో పద్మ భూషణ్‌ను తిరిగిచ్చేసినా.. 2007లో మళ్లీ పద్మవిభూషణ్‌ను స్వీకరించారు. ఇదిలావుంటే 2013లో తనకు లభించిన పద్మ భూషణ్ అవార్డును ప్రముఖ గాయని ఎస్ జానకి తిరస్కరించిన విషయం తెలిసిందే. ఇంతకాలం తర్వాత పద్మ భూషణ్ ఇవ్వడం వల్ల లాభం ఏమిటని ప్రశ్నిస్తూ.. భారతరత్న పురస్కారం లభిస్తే స్వీకరిస్తానని తిరస్కరించారు. తనకు అవార్డులు అక్కరలేదని, అభిమానుల ఆదరణ చాలని చెప్పారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: