కంటికి కనిపించకుండా...గట్టుచపుడు కాకుండా


డ్రగ్స్ పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా చాపకింద నీరులా చేరాల్సిన చోటుకు చేరుతోంది. ఎవరు వాటిని తీసుకొస్తున్నారు..ఎవరికి అందజేస్తున్నారు అన్నది అంతుపట్టని మిష్టరీగా ఈ వ్యవహారం మారింది. ఇదిలావుంటే హైదరాబాద్‌లో మారోమారు డ్రగ్స్ కలకలం రేగింది. డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాతో పాటు వినియోగిస్తున్న బడాబాబులను కూడా పోలీసులు అరెస్టు చేసి జైల్లోకి నెట్టడంతో హాట్‌టాపిక్‌గా మారింది. డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు, డీలర్‌గా భావిస్తున్న టోనీని అరెస్టు చేయడంతో కేసు కీలక మలుపు తిరిగింది. టోనీ రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు విస్తుపోయే వివరాలు పొందుపరిచినట్లు తెలుస్తోంది. టోనీ ఇండియాకి వచ్చిన దగ్గరి నుంచి నైజీరియాకి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసే వరకూ షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డ్రగ్స్ కేసులో ఇప్పటి వరకూ 23 మంది నిందితులను అరెస్టు చేయగా మరో 10 మంది తప్పించుకు తిరుగుతున్నారని పోలీసులు తెలిపారు. టోనీ అనుచరుల ద్వారా డ్రగ్స్ తెప్పించుకుంటున్న హైదరాబాద్‌కి చెందిన ఏడుగురు వ్యాపారవేత్తలు, వారి సహాయకులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. టోనీతో పాటు మరో ఇద్దరు ముఠా సభ్యులు అరెస్టయ్యారు. మహ్మద్ ఆసిఫ్ ఆరిఫ్ , షేక్ మహమ్మద్ షాహిద్ ఆలం, అఫ్తాబ్ పర్వేజ్, ఇర్ఫాన్, ఇమ్రాన్ బాబు భార్య ఫిర్దోస్, రెహమత్, సోమ శశికాంత్, గజేంద్ర ప్రకాష్, సంజయ్, అశోక్ జైన్ తదితరులు పరారీలో ఉన్నట్లు పోలీసులు చెప్పారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న టోనీ 2009లో నైజీరియా నుంచి ముంబైకి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. విగ్గులు, డ్రెస్సులు నైజీరియాకి ఎగుమతి చేసే వ్యాపారం చేశాడు. లగ్జరీ లైఫ్‌కి అలవాటుపడిన టోనీ ఈజీ మనీ కోసం డ్రగ్స్ సరఫరా చేయడం మొదలుపెట్టాడు. ఇంటర్నేషనల్ డ్రగ్ స్మగ్లర్ స్టార్ బాయ్‌తో పరిచయం కావడంతో అతని వద్ద నుంచి డ్రగ్స్ తెప్పించి ముంబై సహా ఇతర నగరాలకు సరఫరా చేశాడు. షిప్పుల్లో డ్రగ్స్ తెప్పించి నగరాలకు సరఫరా చేసేవాడు. అందుకోసం 60 మంది యువకులను నియమించుకున్నట్లు తెలుస్తోంది. సినిమా స్టైల్లో కస్టమర్లకు డ్రగ్స్ సరఫరా చేసేవాడు. ఇచ్చే వాళ్లెవరో.. తీసుకునే వాళ్లెవరో తెలియకుండా గుట్టుగా వ్యవహారం నడిపించేవాడు. వాట్సాప్, ఇంటర్నెట్ ఫోన్ కాల్స్‌లోనే మాట్లాడేవాడని తెలుస్తోంది. తాను సంపాదించిన డబ్బును వెస్టర్న్ యూనియన్ మనీ ట్రాన్స్ఫర్ ద్వారా నైజీరియాకు పంపించేవాడు. హైదరాబాద్‌‌కి చెందిన చాలా మంది బడాబాబులు టోనీకి కస్టమర్లుగా ఉన్నారు. నగరంలోని స్టార్ హోటల్స్, పబ్బులు, రిసార్ట్‌లకు పెద్ద మొత్తంలో డ్రగ్స్ సరఫరా చేసేవాడు. టోనీని కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరింత సమాచారం వచ్చే అవకాశాలున్నాయని పోలీసులు భావిస్తున్నారు. పది రోజుల పోలీస్ కస్టడీ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: