మీ పిల్లలలో ఇవి కనిపిస్తే అప్రమత్తంకండి


ప్రస్తుతం కరోనా, ఒమిక్రాన్ బాధితుల్లో ఎక్కువగా పిల్లలే అవుతున్నారని, వారిలో కనిపించే మార్పులను గమనించాలని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తితో దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. థర్డ్ వేవ్‌లో కేసులు భారీగా నమోదవుతున్నా.. ఆస్పత్రిల్లో చేరేవారి సంఖ్య తక్కువగా ఉండటం ఊరట కలిగిస్తోంది. అయితే, ఈసారి పిల్లలపై కరోనా ఎక్కువ ప్రభావం చూపుతోందని వైద్యులు ఆందోళన చెందుతున్నారు. ఢిల్లీ నగరంలో కోవిడ్-19 కారణంగా ఆసుపత్రిలో చేరుతున్న చిన్నారుల సంఖ్య పెరుగుతోంది. ఇన్ఫెక్షన్ బారిన పడిన పిల్లలలో కొద్ది మందికి మాత్రమే ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఉన్నప్పటికీ తల్లిదండ్రులు ఇదో హెచ్చరికని వైద్యులు అంటున్నారు. ఢిల్లీలోని లోక్ నాయక్ ఆస్పత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సురేశ్ కుమార్ మాట్లాడుతూ..మూడు వారాల్లో 27 మంది పిల్లలు మా ఆస్పత్రిలో చేరారని తెలిపారు. వీరిలో 13 మందికి ఇంకా చికిత్స కొనసాగుతోందని, మిగతావారిని డిశ్చార్జ్ చేశామన్నారు. ‘ముగ్గురికి ఆక్సిజన్ లేదా వెంటిలేషన్‌పై చికిత్స అందజేస్తున్నాం.. పుట్టుకతో వచ్చిన లోపాలు సహా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు’ అని చెప్పారు. డిసెంబరు నుంచి కోవిడ్-19 బారినపడ్డ 31 మంది గర్భిణిలకు ఆస్పత్రిలో ప్రసవం చేశామని తెలిపారు. మొదటి వేవ్‌లో 306 మంది, రెండో వేవ్‌లో 78 మంది గర్భిణిలకు సాధారణ ప్రసవాలు జరిగాయన్నారు. కొంత మంది నవజాత శిశువుల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినా.. లక్షణాలు అంత తీవ్రంగా లేవని వైద్యులు పేర్కొన్నారు. రెయిన్‌బో ఆస్పత్రుల వైస్ ప్రెసిడెంట్ దినేశ్ వశిష్ట మాట్లాడుతూ.. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ఆస్పత్రుల్లో చేరే చిన్నారుల సంఖ్య పెరుగుతుందని వెల్లడించారు. ‘నోటిద్వారా ఔషధాలు తక్కువగా తీసుకోవడం, బద్ధకం వంటి కారణాలతో పిల్లలు ఆస్పత్రుల్లో చేరుతున్నారు.. అనారోగ్య సమస్యలతోనూ అడ్మిట్ అవుతున్నారు’ అని చెప్పారు. తీవ్ర జ్వరం, వాంతులు, నీళ్ల విరేచనాలు వంటివి పిల్లల్లో కోవిడ్ లక్షణాలు. వీటికి ఇంట్లో చికిత్స నిర్వహణతో చాలా వరకు తగ్గుముఖం పడుతుందని ఢిల్లీ ప్రభుత్వం కోవిడ్ హోమ్ ఐసోలేషన్ రోగుల పర్యవేక్షణ అధికారి డాక్టర్ గౌరవ్ తుక్రాల్ చెప్పారు. ఢిల్లీలో హోమ్ ఐసోలేషన్‌లో ఉన్న రోగులందరిలో దాదాపు 5 % మంది 18 ఏళ్లలోపు వారేనని, వీరిలో ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య 1% కంటే తక్కువగా ఉందని తుక్రాల్ తెలిపారు. పిల్లలలో కోవిడ్ సమస్యలలో మల్టీ-సిస్టమ్ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్ ప్రధానమైంది.. జ్వరం, గొంతునొప్పి, ముక్కు కారడం, దగ్గు వంటి వాటిని నిశితంగా గమనించాలని వైద్యులు సూచిస్తున్నారు. ‘చాలా తక్కువ శాతం మంది పిల్లల్లో న్యుమోనియా, శ్వాస వేగంగా తీసుకోవడం, ఆక్సిజన్ స్థాయి తగ్గిపోవడం జరుగుతుంది. తేలికపాటి నుంచి మధ్యస్థ అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లలలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, పెదవులు లేదా ముఖం నీలంగా మారడం, ఛాతీ నొప్పి, ఒత్తిడి, సరిగా స్పందించపోవడం వంటివి హెచ్చరిక సంకేతాలని, వీటి గమనించడం చాలా ముఖ్యం.. అటువంటి వారికి తక్షణ వైద్య సహాయం అవసరం కావచ్చు’ అని ఢిల్లీకి చెందిన పిల్లల వైద్య నిపుణురాలు డాక్టర్ ప్రీతి చద్దా అన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: