ఏడుగురు భార‌త షట్ల‌ర్ల‌కు కొవిడ్


(జానో జాగో వెబ్ న్యూస్-నెట్ వర్క్ డెస్క్)

సీని, క్రీడా రంగాలపై కరోనా పంజా విసిరింది. కరోనా దాడికి గురైన జాబితాలో ఇపుడడు బ్యాడ్మింటన్ రంగం కూడా చోటు చేసుకొంది. ఇండియా ఓపెన్ బ్యాడ్మింట‌న్ టోర్నీలో క‌రోనా క‌ల‌క‌లం రేపుతోంది. ఏడుగురు భార‌త షట్ల‌ర్ల‌కు కొవిడ్ సోకింది. ఈ టోర్నీ మొన్న‌ ప్రారంభమైంది. ఈ టోర్నీలో నేడు రెండో దశ మ్యాచ్‌లు జరగాల్సి ఉండ‌గా, ఆట‌గాళ్ల‌కు క‌రోనా ప‌రీక్ష‌లు చేశారు. దీంతో స్టార్ ష‌ట్ల‌ర్ కిదాంబి శ్రీకాంత్‌ సహా ఏడుగురికి పాజిటివ్ గా తేలిన‌ట్లు ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఫెడరేషన్‌ (బీడబ్ల్యూఎఫ్‌) ఓ ప్రకటనలో తెలిపింది. క‌రోనా సోకిన కిదాంబి శ్రీ‌కాంత్‌తో పాటు అశ్విని పొన్నప్ప, రితికా రాహుల్‌ థక్కర్, ట్రెస్సా జోలీ, మిథున్‌ మంజునాథ్‌, సిమ్రన్‌ అమాన్‌ సింఘీ, కుషి గుప్తాను ప్రత్యేక ఐసోలేషన్‌ కేంద్రానికి త‌ర‌లించిన‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ ఏడుగురు షట్ల‌ర్ల‌ డబుల్స్‌ పార్ట్‌నర్ల‌ను కూడా టోర్నీ నుంచి నిష్క్ర‌మింప‌జేసిన‌ట్లు తెలిపింది. ఆ ఏడుగురు ష‌ట్ల‌ర్ల‌తో త‌ల‌ప‌డాల్సిన ష‌ట్ల‌ర్లను నేరుగా తదుపరి రౌండ్లకు ప్రమోట్‌ చేస్తున్న‌ట్లు బీడబ్ల్యూఎఫ్ ప్ర‌క‌టించింది.


బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (బీఏఐ) కూడా ఈ విష‌యాన్ని ధ్రువీకరించింది. కాగా, ఇటీవ‌లే సాయి ప్రణీత్‌కు కూడా కరోనా సోక‌డంతో ఆయ‌న టోర్నీ నుంచి నిష్క్రమించాడు. అలాగే, ఈ టోర్నీలో ఆడాల్సిన‌ ఇంగ్లాండ్‌కు చెందిన ఇద్దరు క్రీడాకారులకు కూడా క‌రోనా సోకింది. దీంతో ఇంగ్లాండ్‌ జట్టు ఈ టోర్నీ నుంచి ఇప్ప‌టికే తప్పుకుంది. భారీ క‌రోనా కేసులు న‌మోద‌వుతుండ‌డంతో ఈ టోర్నీ నిర్వహణపై సందేహాలు వ‌స్తున్నాయి. బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా దీనిపై నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంది. క‌రోనా నియంత్ర‌ణ కోసం జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ప్ప‌టికీ ఏడుగురికి వైర‌స్ సోక‌డంతో ఈ టోర్నీని ర‌ద్దు చేస్తార‌న్న ఊహాగానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: