విద్యాలయాలల్లో ఏం బోధించాలి,,,?


ఉపాధ్యాయులు ఒక బలమైన జాతిని నిర్మిస్తారని ప్రతీతి. విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం లో ఉపాధ్యాయులు, అధ్యాపకులు కీలక పాత్ర పోషిస్తారు అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ప్రభుత్వాలు రూపకల్పన చేసిన పుస్తకాలు వారికి కరదీపికలుగా ఉపయోగపడతాయి. వీటికి మించి వారు మరేమైనా బోధించడానికి అవకాశం ఉందేమో చూద్దాం! నాకు చిన్నప్పుడు ఓ ఉపాధ్యాయుడు మనదేశం గురించి గొప్పగా చెప్తూ,ఇతర దేశాల గురించి చెడుగా చెప్పేవారు. ఫలితంగా ఇతర దేశాలపై దురభిప్రాయం ఏర్పడింది. ముఖ్యంగా పొరుగు దేశమైన పాకిస్థాన్ పై నాకు విపరీతమైన ద్వేషం ఉండేది.ఇండియా, పాకిస్థాన్ ల క్రికెట్ మ్యాచ్ వస్తే నరాలు తెగే టెన్షన్ వచ్చేది. పాక్ క్రీడాకారుడు ఎవరైనా ఫోర్ కొట్టినా భరించలేక పోయేవాడిని.అదే దేశభక్తి అనుకునేవాడిని.

కొంత కాలం తర్వాత మరో ఉపాధ్యాయుడు ప్రతి దేశంలో మంచి,చెడులు వుంటాయని, చాలా దేశాల్లో ప్రజలు పన్నులు సక్రమంగా కడతారని,పాలకులు కూడా రాజకీయాన్ని వ్యాపారంగా చూడరని ఆయన ఉదాహారణలతో చెప్పారు. ఆటలని,ఆటలుగా చూడాలని, సచిన్ టెండూల్కర్ ఇంగ్లండ్ గడ్డపై ఒక అద్భుతమైన సెంచరీ కొట్టి ఔటైతే,అక్కడి ప్రేక్షకులు చప్పట్లు కొట్టి ఆయనను అభినందించారని పేపర్ క్లిప్పింగ్స్ కూడా చూపించారు.అప్పటినుంచి ఆటలని,ఆటలుగా చూడటం మొదలు పెట్టాను.


గఫార్ అనే మరో అధ్యాపకుడు భారత దేశ స్వాతంత్రం కోసం పోరాడిన ముస్లింల గురించి చెప్పేవారు. ఆయన సహకారంతో అనేక మంది ముస్లిం యోధుల గురించి తెలుసుకోగలిగాను.మధ్య యుగంలో  క్రూసేడులు పేరుతో జరిగిన యుద్ధాలని ఆయన తులనాత్మకంగా విమర్శించేవారు.వర్మ మరో ఉపాధ్యాయుడు సైన్స్ ప్రాధాన్యత గురించి తెలిపేవారు. వివిధ ఆచారాలు, పండుగలు గురించి పుస్తకాలలో ఉంటే వాటి గురించి చెప్పవచ్చని,ప్రత్యేకంగా వేడుకల్ని విద్యాలయాల్లో జరపనవసరంలేదని స్పష్టం చేశారు. ఉపాధ్యాయుల వ్యక్తిగత విశ్వాసాలని పిల్లలపై రుద్దకూడదని చెప్పేవారు.

రాజ్యాంగ విలువలు గురించి ఆయన తెలిపారు.మహనీయుల జయంతి, వర్ధంతి కార్యక్రమాలని జరిపేవారు. సత్యనారాయణ అనే మరో సైన్స్ ఉపాధ్యాయుడు పాఠం చెప్పి నోట్స్ మమ్మల్ని రాయమనేవారు.పాఠం అయిన వెంటనే క్విజ్ పోటీలు పెట్టేవారు.బహుమతులు ఇచ్చేవారు.విద్యార్థి సంఘాల్లో చేరమని చెప్పేవారు.చిన్న చిన్న నిరసన కార్యక్రమాలలో పాల్గొనమని చెప్పేవారు. యూరప్ ఖండంలో చాలా దేశాల్లో సరిహద్దులు మూసివేయరని,వివిధ దేశాల మధ్య రవాణా వ్యవస్థ ఉందని చెప్పారు.ఇతర దేశాలలో వర్ణ వివక్ష ఉన్నట్లే,మనదేశంలో అంటరానితనం ఉందని చెప్పారు. కులం,మతం ఆధారంగా స్నేహం చేయవద్దని చెప్పేవారు. మతగ్రంధాలలో చెప్పిన మాటలు ప్రపంచాన్ని తొలిదశలో మన పూర్వీకులు ఎలా అర్థం చేసుకున్నారో తెలుసుకోడానికి ఉపయోగపడతాయని చెప్పారు. చెకుముకి పుస్తకం చదవమని ప్రోత్సహించారు. పొదుపుని ప్రోత్సహించారు. ఆ రోజులలో ఉపాధ్యాయులు బోధనకే పరిమితము అయ్యేవారు.విద్యా విధానం కూడా అలానే ఉంది. ఇప్పుడు ఉపాధ్యాయులు అనేక పాత్రలు పోషిస్తున్నారు. విద్యా విధానం మారింది. అప్పుడు,ఇప్పుడు మంచి ఉపాధ్యాయులు వున్నారు.కాకపోతే వీరిని బోధనకే పరిమితం చేస్తే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తారు.ఇది చరిత్ర చెప్తున్న సత్యం.

రచయిత-యం.రాం ప్రదీప్

తిరువూరు

9492712836

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: