మంచి సినిమాలు రావా,,?

ఇలాంటి చిత్రాలతోనూ సినీ పరిశ్రమకు  పునర్జీవం

సామాన్యుడికి సినిమా అందుబాటులో ఉండాలి

సినీ పరిశ్రమ  పరిరక్షణ ఎంతో అవసరం-

ఇందుకు  ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టాలి


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టిక్కెట్ల ధరలు తగ్గించడంతో పాటు, టిక్కెట్ల అమ్మకానికి ఆన్లైన్ విధానాన్ని అమలు చేస్తుంది. ఆన్లైన్ విధానానికి అందరూ ఆమోదం తెలిపారు. టికెట్ల ధరల విషయంలో ప్రభుత్వం మరోసారి ఆలోచించాలని పలువురు సినీ ప్రముఖులు కోరుతున్నారు. టిక్కెట్ల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచిదే. సినిమా చూసేవారికి ఈ నిర్ణయం ఊరటనిచ్చింది. ఒకప్పుడు సినిమా మాత్రమే ప్రజలకు వినోద సాధనంగా ఉండేది. ఇప్పుడు టీవీ,సెల్ ఫోన్ వంటి సాధనాలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. దీంతో సినిమాకి వెళ్ళేవారి సంఖ్య తగ్గింది. పైగా కరోనా మహమ్మారి సినిమా పరిశ్రమకి తీవ్ర నష్టాలని తెచ్చింది. సినీ పరిశ్రమను పైరసీ వెంటాడుతోంది. అందుకే ఎక్కవ సినిమా హాళ్ళల్లో సినిమాలని వేస్తున్నారు. ఇప్పుడు సినిమాలు 50రోజులు,100 రోజుల ఆడే పరిస్థితులు లేవు. ఒక సినిమా ఎంత వసూలు చేసిందనే విషయాన్నే సినీ పండితులు లెక్కలోకి తీసుకుంటున్నారు. ఇప్పటికే చాలా సినిమా హాళ్లు మూతబడ్డాయి. కొన్ని కల్యాణ మండపాలుగా మారిపోయాయి.


సినీ పరిశ్రమ అత్యంత ఆకర్షణీయమైనది. తక్కువ సమయంలో ఎక్కువ గుర్తింపు ని ఈ పరిశ్రమలో పొందవచ్చు. దర్శక నిర్మాతలు మంచి కథలపై దృష్టి పెట్టాలి. మంచి సంగీతం, మంచి హాస్యం ఉంటే ఏ సినిమాకైనా ఆదరణ లభిస్తోంది. గతంలో జంధ్యాల, ఈవివి సత్యనారాయణ వంటి వారు చాలా తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో సినిమాలు తీసి పేరు ప్రఖ్యాతులు పొందడంతో పాటు, సినీ ఇండస్త్రీని లాభాల బాట పట్టించారు. మంచి కథ, కథనం ఉన్న నువ్వే కావాలి, మాతృదేవోభవ వంటి అనేక సినిమాలు అన్ని వర్గాలకు నచ్చాయి. సామాజిక సమస్యలపై తీసిన సినిమాల్ని కూడా ప్రజలు ఆదరించారు. ఆకలి రాజ్యం, వందేమాతరం, రేపటి పౌరులు, యువతరం కదిలింది, నేటి భారతం, ఒరేయ్ రిక్షా, ఒసేయ్ రాములమ్మ తాజాగా సూర్య నటించిన జై భీం వంటి సినిమాలు విమర్శకుల నుండి కూడా ప్రశంసలు పొందాయి. అనేక అవార్డులు దక్కించుకున్నాయి. వాణిజ్యపరంగా కూడా విజయం సాధించాయి.


సినీ నిర్మాతలు సినిమాలపై పెట్టే ఖర్చుని కూడా తగ్గించుకోవాలి. భారత దేశంలో అనేక అందమైన ప్రదేశాలు ఉన్నాయి.  ఇటువంటి ప్రదేశాలలో షూటింగ్లు జరిపితే ఖర్చులు కలిసొస్తాయి. ఆ ప్రదేశాలకు గుర్తింపు కూడా లభిస్తుంది. మంచి సినిమా తీస్తే  తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారు. మితిమీరిన హింస, శృతిమించిన శృంగారం తదితర అంశాలపైనే ఎక్కువ మంది దర్శకులు దృష్టి సారిస్తున్నారు. సినిమా ప్రధానంగా వినోద సాధనమే అయినప్పటికీ, సామాజిక సందేశం ఇవ్వవలసిన అవసరం ఉంది. విజయశాంతి నటించిన కర్తవ్యం అనేకమంది మహిళలు పోలీసు ఉద్యోగాల్లో రావడానికి స్ఫూర్తినిచ్చింది. ప్రముఖుల జీవిత చరిత్రలు ఆధారంగా సినిమాలు తీయవచ్చు. సైన్స్ ఫిక్షన్ సినిమాలకి కూడా ఆదరణ ఉంటుంది.  ప్రభుత్వాలు కూడా సినిమాని ఒక పూర్తి స్థాయి పరిశ్రమగా గుర్తింపు ఇవ్వాలి. మంచి సినిమాలకి రాయితీలు ప్రకటించాలి. షూటింగులకి అనుమతులని త్వరగా మంజూరు చేయాలి. పైరసీని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలి. సినీ ఇండస్ట్రీ ద్వారా అనేక వేల మంది ఉపాధి పొందుతున్నారు. వీరిలో జూనియర్ కళాకారుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఇటువంటి వారిని గుర్తించి వారికి ప్రోత్సాహకాలు అందించాలి. చిన్న నిర్మాతలకి సహకారం అందించాలి. అగ్రహీరోల సినిమాలు క్రమం తప్పకుండా విడుదల అయ్యేటట్లు చూడాలి. వారు కొంత రెమ్యునరేషన్ తగ్గించుకోవాలి. చిన్న సినిమాలకు ఒక్కోసారి సినిమా హాళ్లు కూడా దొరకడం లేదు. వారికి కూడా కొన్ని సినిమా హాళ్లని కేటాయించాలి. తద్వారా ఇంకా అనేక మంచి సినిమాలు వచ్చే అవకాశం ఉంటుంది.

రచయిత-యం.రాం ప్రదీప్

తిరువూరు

9492712836

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  


 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: