ఏపీలో భారీ పారిశ్రామిక పార్కులు

3,155 ఎకరాల్లో వైఎస్సార్‌ జగనన్న మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌ ఏర్పాటు

801 ఎకరాల్లో వైఎస్సార్‌ ఎలక్ట్రానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ క్లస్టర్‌

వీటి ద్వారా రూ.35,000 కోట్ల పెట్టుబడులు..లక్ష మందికి ఉపాధి

ఈ నెల 23న ప్రారంభించనున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-ఏపీ ప్రతినిధి)

రాష్ట్రంలో భారీ పారిశ్రామిక విప్లవం దిశగా శరవేగంగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్ర పారిశ్రామిక గతిని మార్చేసేందుకు అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసిన రెండు భారీ పారిశ్రామిక పార్కుల ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు ఏపీ మౌలిక వసతుల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) కరోనా వంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటూ సకాలంలో పారిశ్రామిక పార్కులను అందుబాటులోకి తీసుకొచ్చింది. వైఎస్సార్‌ జిల్లా కొప్పర్తిలో 3,155 ఎకరాల్లో అభివృద్ధి చేసిన వైఎస్సార్‌ జగనన్న మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌ (ఎంఐహెచ్‌), 801 ఎకరాల్లో అభివృద్ధి చేసిన వైఎస్సార్‌ ఎలక్ట్రానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌  క్లస్టర్‌ (వైఎస్సార్‌ ఈఎంసీ)లను ఈ నెల 23న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారు. వైఎస్సార్‌ జగనన్న ఎంఐహెచ్‌ ద్వారా రూ.25,000 కోట్ల భారీ పెట్టుబడులు 75,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుందని అంచనా.


వైఎస్సార్‌ ఈఎంసీ ద్వారా రూ.10,000 కోట్ల పెట్టుబడులతో 25,000 మందికి ఉపాధి కల్పించనుంది. గరువారం వైఎస్సార్‌ ఈఎంసీ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ డిక్సన్‌ సంస్థకు తొలి దశలో అభివృద్ధి చేసిన నాలుగు షెడ్లను  అందించనున్నారు. కొప్పర్తి డిక్సన్‌ యూనిట్‌లో పని చేయడానికి తీసుకున్న ఉద్యోగులకు నియామక పత్రాలను అందజేస్తారు.

కీలక_ఒప్పందాలు

ఈఎంసీలో డిక్సన్‌ సంస్థ రూ.127 కోట్ల పెట్టుబడితో హెచ్‌ఏసీ కెమెరా, ఐపీ కెమెరా, డీవీఆర్‌ యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ యూనిట్‌ ద్వారా 1,800 మందికి ఉపాధి లభించనుంది. డిక్సన్‌ రూ.80 కోట్ల పెట్టుబడితో ల్యాప్‌ట్యాప్‌లు, ట్యాబ్లెట్స్‌ తయారీ యూనిట్‌ను కూడా ఏర్పాటు చేస్తోంది. ఈ యూనిట్‌ ద్వారా మరో 1,100 మందికి ఉపాధి లభించనుంది.

వీటితో పాటు ఫాక్స్‌కాన్, డీజీకార్న్, రెసల్యూట్, ఆస్ట్రమ్‌ వంటి పలు సంస్థలతో పెట్టుబడుల ఒప్పందాలను ప్రభుత్వం కుదుర్చుకోనుంది. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే విధంగా తైవాన్‌కు చెందిన ప్రభుత్వ రంగ  ప్రమోషన్స్‌ ఏజెన్సీ, రష్యాకు చెందిన ఏజెన్సీ, మన దేశంలోని ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్స్‌ అసోసియేషన్స్‌ (ఐఈఎస్‌ఏ)లతో ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు.

వైఎస్సార్‌ జగనన్న ఎంఐహెచ్‌లో ఏర్పాటైన 18 ఫార్మా, సిమెంట్, పెయింట్స్‌ తయారీకి చెందిన యూనిట్లను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు.      ఈ 18 యూనిట్ల ద్వారా మరో 2,000 మందికి ఉపాధి లభిస్తుంది.వైఎస్సార్‌ జగనన్న ఎంఐహెచ్‌లో రూ.401 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చిన పిట్టి రైల్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ లిమిటెడ్‌కు ఎకరం రూ.10 లక్షలు చొప్పున 117.85 ఎకరాలను ప్రభుత్వం ఇప్పటికే కేటాయించింది. ఈ యూనిట్‌ ద్వారా మరో 2,000 మందికి ఉపాధి లభించనుంది.


రెండు భారీ యూనిట్లకు శంకుస్థాపన : రెండు పారిశ్రామిక పార్కుల ప్రారంభోత్సవంతో పాటు మరో రెండు భారీ యూనిట్లకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శంఖుస్థాపన చేయనున్నారు. బద్వేల్‌ వద్ద రూ.956 కోట్ల పెట్టుబడితో సెంచురీ ప్లైబోర్డ్‌ ఇండియా లిమిటెడ్‌ యూనిట్‌ పనులకు డిసెంబర్‌ 23 ఉదయం ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఈ యూనిట్‌ ద్వారా 2,266 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించడంతోపాటు రైతులకు ప్రయోజనం కలగనుంది. సుమారు 22,500 ఎకరాల్లో సాగు చేసిన రూ.315 కోట్ల విలువైన యూకలిప్టస్‌ చెట్లను ఈ సంస్థ రైతుల నుంచి కొనుగోలు చేయనుంది. పులివెందులలో రూ.110 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ అండ్‌ రిటైల్‌ లిమిటెడ్‌ యూనిట్‌ పనులకు డిసెంబర్‌ 24న సీఎం జగన్‌ శంకుస్థాపన చేయనున్నారు. ఈ యూనిట్‌ ద్వారా 2,122 మందికి ఉపాధి లభించనుండగా అందులో అత్యధికంగా మహిళలకు అవకాశం రానుంది.


23న ప్రారంభించే కంపెనీలివే : స్వర్ణముఖి కాంక్రీట్స్, శ్రీ దుర్గా సిమెంట్స్, ఫిలెమన్‌ లైఫ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, అవన్ని ఆర్గానిక్స్, రాయలసీమ ఎన్విరాన్‌ కేర్, బీఎస్‌ ల్యాబొరేటరీస్, యునోటెక్‌ బిల్డింగ్‌ ప్రోడక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, శ్రీ గణేష్‌ శానిటేషన్, ఎస్‌ పెయింట్స్‌ మాన్యుఫాక్చరర్స్, అక్షర నోట్‌బుక్‌ అండ్‌ బైండింగ్‌ ఇండస్ట్రీ, ఆర్‌డీఎల్‌ ల్యాబ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్,  సుమిత్ర ల్యాబ్స్, మణి కెమ్‌ ఫార్మా, శ్రీ లక్ష్మి మేఘన ఎంటర్‌ప్రైజెస్, ఎస్‌ఎన్‌ఆర్‌ ఫార్మా, శ్రీ లక్ష్మీ బయో ఆర్గానిక్స్, ఒబ్లి ఇండస్ట్రీస్, స్టార్‌ పేపర్‌ బోర్డ్స్‌.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: