తామర వైరస్‌తో నష్టపోయిన మిరప పంటకు,,

ఎకరాకు రూ.1 లక్ష పరిహారం ఇవ్వాలి

డిసెంబర్‌ 20న కలెక్టర్‌లకు వినతి పత్రాలు

- తెలంగాణ రైతు సంఘం పిలుపు


(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

తెలంగాణ రాష్ట్రంలో తామర వైరస్‌ సోకి చేతికి వచ్చిన మిరప పంట దెబ్బతింటున్నది. రైతులు పంటలను దున్నివేసి మరో పంట వేయటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. లక్షల రూపాయల పెట్టుబడులకు నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, ఎకరాకు రూ.1 లక్ష పరిహారం చెల్లించాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్‌ చేస్తున్నది. డిసెంబర్‌ 20న కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వాలని రైతులకు పిలుపునిచ్చింది. ఈ మేరకు తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి.జంగారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్ ఓ ప్రకటన విడుదల చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో భద్రాచలం, ఖమ్మం, మహబూబాబాద్‌, భూపాలపల్లి, ములుగు, వరంగల్‌, గద్వాల జిల్లాల్లో మిరప పంట ప్రధాన వాణిజ్య పంటగా వేస్తారు. ఎకరాకు రూ.2 లక్షల నుండి రూ.2.5 లక్షల వరకు పెట్టుబడులు పెడతారు. ఎకరాకు 20-30 క్వింటాళ్ళ వరకు దిగుబడులు సాధిస్తారు. ధర రూ.15,000లు ఉన్నచో ఎకరాకు రూ.1 లక్ష వరకు మిగులు ఉంటుంది అనే ఆశతో మొదటి నుండి ఈ పంట వేస్తున్నారు. ఈ సంవత్సరం ధర ఒక మోస్తరుగా బాగానే ఉంది. రైతులు పంట వస్తుందన్న ఆశతో ఎదురు చూస్తున్న ఈ తరుణంలో అకస్మాత్తుగా ''తామర వైరస్‌'' సోకి పంటంతా దెబ్బతిన్నది. చేను పసుపు పచ్చరంగుకు చేరి ఎండిపోతున్నది. నోటికాడికి వచ్చిన పంట దెబ్బతినడం రైతులు భరించలేకపోతున్నారు. ఇప్పటికే ఎకరాకు లక్ష యాబై వేల రూపాయల వరకు పెట్టుబడి పెట్టారు. ఇదంతా నష్టపోవాల్సి వస్తున్నది.


ప్రకృతి వైపరీత్యాల కింద క్రిమి కీటకాల దాడులకు పరిహారం చెల్లించాలని నిబంధన ఉంది. కానీ ప్రభుత్వం ఏ ప్రకృతి వైపరీత్యాలకు పరిహారం చెల్లించడం లేదు. స్పైసెస్‌బోర్డు స్పందించి ఈ నష్టానికి కారణాలను గుర్తించి బోర్డు ద్వారానైనా రైతులకు సహకరించాలి. కేరళలో ఉన్న బోర్డుకు సబ్‌బోర్డుగా వరంగల్‌లో ఒక బోర్డు ఉంది. ఆ బోర్డు పంటలను పర్యటించి నష్టాన్ని అంచనా వేయాలి. జరిగిన నష్టానికి ప్రభుత్వానికి నివేదిక పంపి రైతులకు నష్ట పరిహారం అందేట్లు చూడాలి. మూకుమ్మడిగా వైరస్‌ సోకడం వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసి పరిహారం పంపిిణీ చేయాలని తెలంగాణ రైతు సంఘం కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలను కోరుతున్నది. డిసెంబర్‌ 20న కలెక్టరేట్ల దగ్గర జరిగే ధర్నాలో రైతులు పాల్గొనాలని కోరారు. వారు ఆ ప్రకటనలో కోరారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: