కట్టుదాటిన సభ తీరు

భువనేశ్వరీపై అధికార పక్షం వ్యాఖ్యలతో భగ్గుమన్న టీడీపీ

సీఎం అయ్యాక సభలో అడుగుపెడతానన్న చంద్రబాబు

ప్రెస్ మీట్ లో కంటతడి పెట్టిన బాబు

ఇలాంటి నీచ రాజకీయాలు చూడలేదని టీడీపీ అధినేత కంటతడి

ఈ సమావేశాలకు వెళ్లేది లేదని స్పష్టీకరణ

భవిష్యత్తు సమావేశాలకు వెళ్లే విషయంలో అపుడు ఆలోచిస్తామని నిర్ణయం

బాబుయే వాతావరణం రెచ్చగొట్టారన్న చంద్రబాబు

రాష్ట్రవ్యాప్తంగా తెలుగుతమ్ముళ్ల ఆందోళనలు


(జానోజాగో వెబ్ న్యూస్-ఏపీ పొలిటికల్ బ్యూరో)

సభా నియమాలు కట్టుదాటి ఏపీ శాసనసభ సమావేశాలు తీరు సాగుతోందా...? అన్నట్లు పరిస్థితి నెలకొంది. ప్రజా సమస్యలపై చర్చించే వేధిక కావాల్సిన శాసనసభ కాస్త అధికార, విపక్షాల మధ్య పోరుకు వేదికైంది. విమర్శ, ప్రతి విమర్శ నేపథ్యంలో అధికార పక్షం వైపు నుంచి వచ్చిన వ్యాఖ్యలు అసెంబ్లీలో తీవ్ర దుమారం రేపాయి. తన భార్యను ఉద్దేశించి అధికార పక్షం సభ్యులు సభలో మాట్లాడిన తీరు సరైంది కాదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలాంటి సభలో తాను ఉండనని, సీఎం అయ్యాకే తిరిగి ఈ సభకు వస్తానని ఆయన  సవాల్ చేసి సభ నుంచి వెళ్లిపోయారు. ఆయన వెంట ఇతర టీడీపీ నేతలు వెళ్లిపోయారు. ఈ పరిణామాలపై స్పందించిన అధికార పక్షం సభ్యులు ఇద్దంతా రాజకీయ లబ్ధికోసమే చంద్రబాబు ఆడుతున్న డ్రామా అని ఆగ్రహం వ్యక్తంచేశారు. సభలో వాతావరణ  చెడిపోయేలా చంద్రబాబుయే రెచ్చగొట్టారని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అన్నారు. సభలో తాను లేనని, తాను వచ్చే  సరికి చంద్రబాబు ఏమోషనల్ గా మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఇదిలావుంటే  అధికార పక్షం తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ తీరు పట్ల తెలుగు  తమ్ముళ్లు ఆందోళనలకు దిగారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజూ వాడీవేడీగా సాగుతున్నాయి. మొదటి రోజు అంతా అసెంబ్లీలో వైసీపీ సభ్యులు ఇష్టానుసారం మాట్లాడారని టీడీపీ సభ్యులు ఆరోపించిన విషయం విదితమే. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై కూడా టీడీపీ అభ్యంతరం తెలిపింది. అయితే రెండో రోజు కూడా సభలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సభలో మంత్రులు కొడాలి నాని, కురసాల కన్నబాబు వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం తెలుపుతూ నిరసన వ్యక్తం చేశారు. రైతు సంక్షేమం, వ్యవసాయంపై అసెంబ్లీలో హాట్ హాట్‌గా చర్చ జరుగుతుండగా మధ్యలో టీడీపీ అధినేత చంద్రబాబు టాపిక్ వచ్చింది. బాబు పేరును ప్రస్తావించిన మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు కాస్త సభలో ఉద్రిక్తతను రగిల్చాయి. కొడాలి నాని చంద్రబాబు పేరును సభలో పదే పదే ప్రస్తావించడంతో టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తంచేశారు. చంద్రబాబు పేరెందుకు వస్తోందంటూ టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై స్పందించిన కొడాలి నాని ‘చంద్రబాబులా మేం లుచ్చా పనులు చేయడం లేదు’ అని వ్యాఖ్యానించారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన టీడీపీ సభ్యులు ‘చంచల్ గూడ జైల్లో సమావేశాలు పెట్టుకునే పార్టీ వైసీపీ’ అంటూ పేర్కొన్నారు. అంతేకాకుండా వెంటనే కొడాలి నాని తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని టీడీపీ పట్టుబట్టింది. నాని వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందించారు. ‘వ్యవసాయంపై చర్చతో పాటు బాబాయికి గొడ్డలి పోటు, తల్లికి ద్రోహం సహా అన్ని విషయాలపై చర్చకు సిద్దమే’ అని బాబు ఒకింత సవాలే విసిరారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేయడంతో మరో మంత్రి కన్నబాబు.. హెరిటేజ్ సంస్థ విషయం ప్రస్తావనకు తెచ్చారు. ఇలా అటు వైసీపీ సభ్యులు.. ఇటు టీడీపీ సభ్యులు ఎవ్వరూ తగ్గలేదు. దీంతో కాసేపు సభలో గందరగోళమే నెలకొంది. చంద్రబాబు మాట్లాడిన అనంతరం మంత్రి కన్నబాబు మాట్లాడుతుండగా.. టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అడ్డు తగిలారు. దీంతో ‘పార్టీ లేదు బొక్కా లేదన్న ఓ పార్టీ అధ్యక్షుడ్ని తొలిసారి చూస్తున్నాం. కుప్పం మా లెక్కలోకే లేదన్న అచ్చెన్న గురించి ఇంకేం మాట్లాడగలం’ అంటూ కన్నబాబు సెటైర్లు వేశారు. అంతేకాదు.. మంగళగిరిలో తనయుడు ఓటమిని తట్టుకున్న చంద్రబాబు కుప్పం ఓటమిని తట్టుకోలేరా..? అంటూ కన్నబాబు వ్యంగ్యంగా మాట్లాడారు. దీనిపై టీడీపీ సభ్యులు స్పందిస్తూ.. ‘జైలులో మీటింగ్ పెట్టుకునే పార్టీ’ అంటూ గతంలో కన్నబాబు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. ఇలా ఈ విషయాలే సుమారు అరగంటకుపైగా అక్కడ మంత్రులు మాట్లాడటం.. ఇక్కడ టీడీపీ తెలుగు తమ్ముళ్లు పరస్పర ఆరోపణలకు దిగడం, సభలో నారా భువనేశ్వరీ ప్రస్తావన రావడం వివాదానికి దారి తీసింది.

ఉద్వేగానికి గురైన చంద్రబాబు

వైసీపీ ఎమ్మెల్యేల వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందించారు. ‘ఇన్నేళ్లూ ఎన్నో అవమానాలు పడ్డాను. నా భార్య, నా కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. నా భార్యను అవమానించేలా మాట్లాడారు. నా కుటుంబ సభ్యులను కూడా రోడ్డుపైకి లాగారు. ఎప్పుడూ లేని అవమానాలు భరించాను. సభలో ఎన్నో చర్చలు చూశాం కానీ.. ఇంత అవమానం ఎప్పుడూ ఎదుర్కోలేదు’ అని తీవ్ర భావోద్వేగంతో చంద్రబాబు మాట్లాడారు.  ‘‘పెద్ద పెద్ద మహానాయకులతో పని చేశాం. జాతీయ స్థాయిలో కూడా అనేక మంది నాయకులతో పని చేశాం. గడిచిన రెండున్నరేళ్లుగా సభలో ఎన్నో విమర్శలు.. ప్రతి విమర్శలు చేసుకున్నాం. ఏనాడూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ.. రూలింగ్‌లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ ఇలాంటి అనుభవాలు నేను చూడలేదు. అదే విధంగా ఇన్నేళ్లుగా జరగని అవమానాలను భరించాం. నిన్న కూడా ముఖ్యమంత్రి.. కుప్పం ఎన్నికల తర్వాత నేను రావాలి. నా ముఖం చూడాలన్నా కూడా వ్యక్తిగతంగా తీసుకోలేదు. ఈ హౌస్‌లో పడరాని అవమానాలు పడిన తర్వాత బాధాకరమైన సందర్భాలున్నాయి. వ్యక్తిగతంగా, పార్టీ పరంగా విమర్శించారు. ఇన్ని సంవత్సరాలుగా ఏ పరువు కోసం పని చేశానో.. ఇన్నేళ్లుగా బతికామో.. నా కుటుంబం, నా భార్య విషయం కూడా తీసుకొచ్చి(మాట్లాడుతుండగానే మైక్ కట్ చేసిన స్పీకర్) అవమానించారు. మళ్లీ సీఎం అయ్యాకే అసెంబ్లీలో అడుగు పెడతా’’ అని చంద్రబాబు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: