ఏపీలో ఇమేజ్ డౌన్ పాలిటిక్స్
ప్రధాన పార్టీల అధినేతల వ్యూహ...ప్రతి వ్యూహాలు
రాష్ట్రంలో రాజుకొంటున్న రాజకీయ వేడి
మంగళగిరిపై టీడీపీ...కుప్పం వైసీపీ మాస్టర్ ప్లాన్
ఒకరి ఇమేజ్ ను ఇంకోరు దెబ్బతీసే వ్యూహాలు
(జానోజాగో వెబ్ న్యూస్-ఏపీ పొలిటికల్ బ్యూరో)
పార్టీ అధినేతల చరిష్మాయే ఆయా పార్టీలకు ప్రధాన వనరు. జనంలో పార్టీ మనుగడ సాధించాలంటే పార్టీ అధినేత చరిష్మాయే కీలకం. అదే దెబ్బతీస్తే ప్రత్యర్థి మటాష్. ఇపుడు ఏపీలో అదే తరహా పాలిటిక్స్ కొనసాగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఆయన ఇమేజ్ ను దెబ్బతీసే వ్యూహాన్ని వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నట్లు సమాచారం. ఈ సమాచారమున్న చంద్రబాబు నాయుడు సైతం మంగళగిరిలో తమ పట్టు సాధించి వైసీపీకి చెక్ పెట్టడం ద్వారా ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి కూడా అక్కడ చెక్ పెట్టాలని తెలుగుదేశం అధినేత యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో రెండు ప్రధాన పార్టీల అధినేత ల మధ్య ప్రచ్ఛన్న పోరు కొనసాగుతోంది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వేడి రాజుకుంది. ఎత్తులు పై ఎత్తులతో ఆధిపత్యపోరు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి నివాసం ఉంటున్న మంగళగిరి సెగ్మెంట్ పై మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టారు. వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. వైసిపి సారధి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం పై దృష్టి కేంద్రీకరించారు. ఫలితంగా అందరి దృష్టి దిశగా ప్రకంపనలు సృష్టిస్తోంది.
చంద్రబాబు వరుసగా విజయాలు సాధిస్తున్న టీడీపీ కంచుకోట చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంపై జగన్ తాజాగా ఫోకస్ పెట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది.ఇందులో భాగంగా కుప్పంలో జరిగిన పంచాయతీ, పరిషత్ ఎన్నికల్లో వరుస విజయాలు అందుకున్న వైసీపీ ఇప్పుడు కుప్పం మున్సిపాలిటీ పోరుపై దృష్టిపెట్టింది. ఇందుకోసం మంత్రి పెద్దిరెడ్డిని రంగంలోకి దింపింది. ఆయన ఎలాగైనా చంద్రబాబును తన సొంత నియోజకవర్గంలో దెబ్బతీయాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. చివరకు ఈ అంశం హైకోర్టు దాకా వెళ్లడం విశేషం.
ఎప్పుడైతే తన నియోజకవర్గం కుప్పంపై వైసీపీ ఫోకస్ పెట్టిందో అప్పుడే సీఎం జగన్ కు ప్రతిష్టాత్మకమైన మంగళగిరి నియోజకవర్గంపై చంద్రబాబు, టీడీపీ నేతలు ఫోకస్ పెట్టారు. అంతే కాదు తాజాగా జరిగిన పరిషత్ పోరులోనూ మంగళగిరిలో అనూహ్య విజయాలు అందుకున్నారు. ముఖ్యంగా దుగ్గిరాల మండలంలో టీడీపీ సాధించిన విజయాలు ఇప్పుడు వైసీపీకి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. అదే సమయంలో రాజధాని ప్రజలకు స్ధానిక వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణాైరెడ్డి మధ్య బాగా దూరం పెరిగింది అనే ప్రచారం ఉంది. దీంతో వైసీపీ పరిస్ధితి మంగళగిరిలో నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది. రెండు పార్టీల అధినేతలు రంగంలోకి దిగిన పరిస్థితుల్లో సమీప భవిష్యత్తులో దీని ప్రభావం స్థానాల్లో కూడా పడుతుందని ప్రచారం ఉంది.
Post A Comment:
0 comments: