ఆ బిల్లును వెనక్కి తీసుకుంటున్నాం

హైకోర్టుకు తెలిపిన ఏపీ ఏజీ

(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ బ్యూరో)

మూడు రాజధానులపై  నిర్ణయం తీసుకొన్న ఏపీ ప్రభుత్వం ఆ బిల్లును వెనక్కి తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు తెలిపింది. ఏపీ ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ శ్రీరాం హైకోర్టుకు తెలిపారు. మూడు రాజధానులపై అసెంబ్లీలో పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. కాసేపట్లో అసెంబ్లీలో సీఎం వైఎస్‌ జగన్‌ అధికారికంగా ప్రకటిస్తారని ఏజీ కోర్టుకు తెలిపారు. కాగా, 2019 సెప్టెంబర్‌ 13న రాజధానిపై అధ్యయనానికి జీఎన్‌రావు నేతృత్వంలో ప్రభుత్వం  కమిటీని ఏర్పాటు చేసింది. 2019 డిసెంబర్‌ 20న పరిపాలన వికేంద్రీకరణకు జీఎన్‌రావు కమిటీ సిఫార్సు చేసింది. 2019 డిసెంబర్‌ 29న జీఎన్‌రావు కమిటీ, బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూప్‌ నివేదికలపై అధ్యయనానికి ప్రభుత్వం హైపవర్‌ కమిటీని నియమించింది. మూడు రాజధాలను ఏర్పాటు చేయాలని 2020 జనవరి 3న హైపవర్‌ కమిటీ తెలిపింది. మూడు రాజధానుల వల్ల అన్ని ప్రాంతాల్లో అభివృద్ధికి అవకాశముందని హైపవర్‌ కమిటీ పేర్కొంది. 2020 జనవరి 20న హైపవర్‌ కమిటీ నివేదికకు ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. మూడు రాజధానుల బిల్లును ఏపీ అసెంబ్లీ ఆమోదించింది. 2020 జనవరి 22న శాసనమండలి ముందుకు మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెట్టగా, వికేంద్రీకరణ బిల్లును సెలక్ట్‌ కమిటీకి శాసనమండలి పంపించింది. 2020 జూన్‌ 16న మరోసారి అసెంబ్లీ ముందు వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెట్టగా, 2020 జూన్‌ 17న పరిపాలన వికేంద్రీకరణ బిల్లుకు ఏపీ అసెంబ్లీ రెండో సారి ఆమోదం తెలిపింది. 2020 జులై 18న మూడు రాజధానుల బిల్లును ప్రభుత్వం గవర్నర్‌కు పంపింది. 2020 జులై 31న పరిపాలన వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్‌ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: