ముస్లిం స్త్రీలు,,,

ధీర నారీమణులు


గత కొన్ని దశాబ్దాలుగా చాలామందిలో ఓ అపోహ ఉంది.ముస్లిం స్త్రీలు బానిసల్లా జీవిస్తుంటారని,నాలుగు గోడల్లో నలిగిపోతారని భావిస్తూ ఉంటారు.నేటి పురుషాధిక్య వ్యవస్థలో అన్ని సమాజాల్లోని స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలే ముస్లిం స్త్రీలు ఎదుర్కోవచ్చునేమో కానీ కేవలం ముస్లిం స్త్రీలు మాత్రమే సమస్యలు ఎదుర్కొంటున్నారనేది దుష్ప్రచారం మాత్రమే.ఒక పధకం ప్రకారం కుట్రపూరితంగా యూరప్ సామ్రాజ్యవాదులు, దేశీయ ఫాసిస్టులు తమ గుప్పిట్లో ఉన్న మీడియా ద్వారా ఇస్లామోఫోబియాను పెంచి పోషించారు.ముస్లిం స్త్రీలు, పురుషుల మధ్య ఎడం పెంచే పధకాలు రచిస్తున్నారు.ఈ కుట్రలేవీ ముస్లిం సమాజంలో అమలయ్యే అవకాశాలు లేవు.ముస్లిం స్త్రీలు ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు నిదర్శనాలు.తమ సాంస్కృతిక విలువలను కాపాడుకుంటూనే ఎలా ధైర్యంగా బతకాలో వారికి తెల్సు. మొత్తం ముస్లిం సమాజం సామాజిక, ఆర్థిక, రాజకీయ వెనుకబాటుతనంలో ఉందన్నది నిజం.అంతేకాని కేవలం స్త్రీ మాత్రమే కాదు.అలాగని మతఛాందసం అసలు లేదని కాదు.సరియైన ఇస్లామియా ధార్మిక పరిజ్ఞానం లేని కొంతమంది ఒకటీ అర మత పండితులు జారీ చేసే అర్థం పర్థం లేని ఫత్వాలు ముస్లిం స్త్రీ స్థానం పట్ల అపోహలు పెంచుతున్న విషయం వాస్తవమే.నిజానికి ఈ ఫత్వాల వెనకున్నది ఆర్థిక, రాజకీయ కారణాలే అని సునిశితంగా పరిశీలించిన వారెవరికైనా అర్ధమతుంది.ఇస్లాం వరకట్నం నిషేధించి స్త్రీ ఆర్థిక భద్రత కొరకు ఖచ్చితంగా పురుషుడు మహర్ చెల్లించాలని చెప్పింది. పురుషునిపై ఆర్థికంగా ఆధారపడే దుస్థితి నుండి తప్పించేందుకు తండ్రి ఆస్థిలో,భర్త ఆస్థిలో,కుమారుని ఆస్థిలో,సోదరుని ఆస్థిలో కూడా హక్కును కల్పించింది.కానీ ముస్లిం సమాజంలో ఇవేమీ అమలు కావటం లేదన్నది నిజం.వీటిపై దృష్టి పెట్టి పురుష సమాజాన్ని సంస్కరించాల్సిన కొంతమంది మత పండితులు మౌలిక సమస్యలను విస్మరించి సమాజ ప్రగతికి ఏధంగానూ ఉపయోగపడని సునిశిత విషయాలకే ప్రాధాన్యం ఇవ్వటం శోచనీయం. ఈ స్థితిపై ముస్లిం స్త్రీలు ఇస్లాం స్పూర్తితో ఉద్యమించాల్సిన అవసరం ఉంది."ధర్మం ప్రకారం పురుషులకు కల అన్ని హక్కులూ మహిళలకూ ఉన్నాయని పవిత్ర ఖుర్ఆన్ బోధిస్తుంది. జ్ఞానార్జన ముస్లిం స్త్రీ,పురుషుల విధియై ఉన్నది అని చెప్పిన మహాప్రవక్త ముహమ్మద్(స)బోధ సాక్షిగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేయాలి.ముస్లిం స్త్రీలు కేవలం పిల్లల్ని కంటూ ఇంటికే పరిమితమవ్వాలనే భావన ఇస్లాంకు సంబంధించింది కాదు.కుటుంబ పోషణకు సంబంధించిన ప్రధాన బాధ్యత పురుషునిపై మోపబడింది.అంతే తప్ప అవసరమనుకున్నప్పుడు స్త్రీలు ధర్మసమ్మతమైన ఏ ఉపాధి రంగంలోనైనా అడుగుపెట్టవచ్చు.స్వయాన ప్రవక్త(స)సతీమణి ఖతీజా (ర)వ్యాపారం నిర్వహించారు. ఆయన మేనత్త సఫియా గారు కోట రక్షణకు నిలబడ్డారు.కుమార్తె ఫాతిమా(ర)సైనికులకు వైద్య సేవలందించారు.ప్రవక్త గారి కాలంలో అస్మా సాలెహా మహిళా నాయకురాలిగా,రబియా గొప్ప సూఫీ కవయిత్రిగా ఖ్యాతి గడించారు.ప్రవక్త ముహమ్మద్(స)వీరందరినీ ప్రోత్సహించారు.ఇలాంటి చైతన్యానికి ముస్లిం స్త్రీలు ప్రతీకలు. ఈ చైతన్యమే ముస్లిం స్త్రీలను షాహిన్ బాగ్ ఉద్యమకారిణులుగా మలిచింది.తలపై హిజాబ్  చుట్టుకున్న ప్రతి స్త్రీపై,టోపీ,గడ్డం పెట్టుకున్న ప్రతి ముస్లిం పురుషునిపై మతఛాందస ముద్ర వేయాలని చూడటం అనాగరికం.ఇజ్రాయెల్ దురాక్రమణకు వ్యతిరేకంగా పోరాడుతున్న పలస్తీనా స్త్రీల నుండి మొదలు ఫాసిజానికి వ్యతిరేకం గళమెత్తిన భారతీయ ముస్లిం స్త్రీల వరకూ అందరూ హిజాబ్ ధరించేవారే.కనుక హిజాబ్ను ,టోపీ,గడ్డాలను వెనుకబాటుతనంగా ప్రచారం చేయటం కుట్ర తప్ప మరేమీ కాదు.ప్రతి పురుషుడు ఇంట్లో ప్రవేశించే ముందు భార్యకు సలాం చేసి మరీ ప్రవేశించాలని చెప్పి దైవప్రవక్త ముహమ్మద్(స)పురుషాహంకారాన్ని తుత్తునియలు చేసారు.సర్వ విషయాలలోనూ భర్త భార్య అభిప్రాయాలను గౌరవించాలని బోధించారు.ధర్మసమ్మతమైన ప్రతి విషయంలోనూ భార్య అనుమతి తప్పనిసరి. ముస్లిం పురుషులు స్త్రీలను రాచిరంపాన పెడ్తారనే ప్రచారాన్ని చేసేవారికి,నమ్మేవారికి ముస్లిం కుటుంబాల్లో ఉండే అన్యోన్యతలు ,ప్రేమానురాగాలు తెలియవు.తన ఇంటిలో ముస్లిం స్త్రీ ఓ రాణిలా జీవిస్తుందనేది నిజం.

                         రాజరిక వ్యవస్థలో స్త్రీలను బానిసలుగా, ఫ్యూడల్ వ్యవస్థలో పనిముట్టుగా,నేటి ఆధునిక వ్యవస్థలో స్వేచ్ఛ ముసుగులో స్త్రీని కేవలం ఓ అంగంగా ,డబ్బులు సంపాదించే యంత్రంలా మార్చిన నయా పురుష ప్రపంచ కుట్రల్ని నేటి ఆధునిక స్త్రీ అర్థం చేసుకోవాలి.ఈ కుట్రలకు లొంగకుండా ముస్లిం స్త్రీలు తమ సంస్కృతిని పరిరక్షించుకుంటూనే తమ హక్కుల కోసం,స్వయం సమృద్ధి కోసం పోరాడాలి.ఏ సమాజంలో అయితే స్త్రీలకు సరియైన స్థానం ఉండదో ఆ సమాజం అభివృద్ధి చెందదు.ఈ వాస్తవాన్ని గ్రహించి పాలకులు ముస్లిం స్త్రీల విద్యాభివృద్ధికి నిజాయితీగా కృషి చేయాలి.రంజాన్ మాసంలో వచ్చే జకాత్ సొమ్ముతో బాలికల పాఠశాలలు స్థాపించే బాధ్యత ముస్లిం పురుష ప్రపంచం తలకెత్తుకోవాలి.ఈ క్రమంలో జాగృతమై తమ హక్కుల కోసం గొంతెత్తుతున్న అన్ని వర్గాల మహిళలతో కల్సి ఉద్యమించటం,అవసరమైతే నాయకత్వం వహించటం ముస్లిం స్త్రీల చారిత్రక బాధ్యత.

రచయిత-కవి కరిముల్లా

వినుకొండ-ఆంధ్రప్రదేశ్

సెల్ నెం- 94415 02990

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: