ఇంతటి నీచ రాజకీయాలా

నా భార్యను రాజకీయాల్లోకి లాగుతారా

నాడు తల్లిని అన్నారు...నేడు నా భార్యపై విమర్శలా

రాజకీయాలలో ఇలాంటి చర్యలు ఎపుడూ చూడలేదు

ప్రజల కోసమే ఎన్నో అవమానాలు భరిస్తున్నా

ఇపుడు ఇంతటి నీచ రాజకీయాలా

విలేకరుల సమావేశంలో కన్నీటి పర్యంతమమైన చంద్రబాబు

కంటతడి పెట్టిన టీడీపీ నేతలు


(జానోజాగో వెబ్ న్యూస్-ఏపీ  పొలిటికల్ బ్యూరో)

వైసీపీ నీచపు రాజకీయాలకు తెరలేపిందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. తన భార్యను ఉద్దేశించి వైసీపీ సభ్యులు  సభలో చేసిన వ్యాఖ్యనాలను తాను భరించలేకపోతున్నానని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన తర్వాత విజయవాడలో నిర్వహించిన ప్రెస్‌మీట్లో ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. ఆ సమయంలో అక్కడే ఉన్న టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, బుచ్చయ్యచౌదరి, పంచుమర్తి అనురాధ కంటతడిపెట్టుకున్నారు. భార్యపై, కుటుంబంపై అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు పరుష వ్యాఖ్యలు చేయడం దారుణమని చంద్రబాబు నాయుడడు అన్నారు. రాజకీయంగా ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోలేదనీ, కానీ కుటుంబంపై ఇంత దారుణంగా విమర్శలు చేయడంతో సహించలేకపోతున్నానని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో శాసనసభలో ఆవేశాలు, కోపాలుండేవని, సభ వాయిదా పడేదని, తిరిగి సమావేశమైన తర్వాత ఎవరిది తప్పయితే వారికి స్పీకర్ చెప్పేవారని ఆయన అన్నారు. అప్పుడు తన తల్లిని దూషించారు.. ఇప్పుడు తన భార్య విషయం తీసుకువచ్చి అవమానించారంటూ భోరున విలపించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీలో తన తల్లిని దూషించారని చంద్రబాబు తెలిపారు. దీనిపై గట్టిగా వైఎస్‌ను ప్రశ్నించానన్నారు.

దీంతో తప్పు జరిగిందని క్షమించమని వై.ఎస్. అడిగారన్నారు. ఇవాళ వైసీపీ నేతలు నీచ రాజకీయాల కోసం తన భార్యను లాగే ప్రయత్నం చేశారన్నారు. రెండున్నరేళ్లుగా తనను అవమానిస్తూ వస్తున్నారని, ప్రజల కోసం భరిస్తున్నానన్నారు. దేశం కోసం తప్పితే స్వార్థం కోసం ఆలోచించలేదన్నారు. వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదన్నారు. తన భార్య ఏ రోజూ రాజకీయాల్లోకి రాలేదన్నారు. పెద్ద పెద్ద మహా నాయకులతో పని చేశానని, జాతీయ స్థాయిలో కూడా అనేక మంది నాయకులతో పని చేశానని చంద్రబాబు అన్నారు. గడిచిన రెండున్నరేళ్లుగా సభలో ఎన్నో విమర్శలు.. ప్రతి విమర్శలు చేసుకున్నామన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ రూలింగ్‌లో ఉన్నప్పుడు కానీ ఎప్పుడూ ఇలాంటి అనుభవాలు తాను చూడలేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఏనాడూ ఇంటినుంచి బయటకు రాని భువనేశ్వరిని లక్ష్యంగా చేసుకుని వైసీపీ నేతలు వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదన్నారు. భువనేశ్వరి చేసిన త్యాగం గొప్పదన్నారు. ప్రతి సంక్షోభంలోనూ ఆమె తనకు అండగా నిలిచారని చెప్పారు. వ్యక్తిగత దూషణలు చేస్తున్న వారి ఇళ్లల్లోని వారిని కూడా ఇలాగే తిడితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోవాలన్నారు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అవమానిస్తోందని, టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలను అవమానించడం పరిపాటిగా మారిందన్నారు. వైసీపీ నేతలు భువనేశ్వరి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని చంద్రబాబు చెప్పారు. తాను అధికారంలో ఉన్నప్పుడు ఎవరినీ వ్యక్తిగతంగా అవమానించలేదన్నారు. రాజకీయాల్లో విలువలు ఇంత నీచంగా పడిపోయాయనుకోలేదంటూ ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. ఆ సమయంలో అక్కడే ఉన్న టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, బుచ్చయ్యచౌదరి, పంచుమర్తి అనురాధ కంటతడిపెట్టుకున్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: