రేపు ఏపీ శాసనసభ ఉభయ సభల సమావేశం

సభలో ఆ 14 ఆర్డినెన్సుల బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం

 

(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ బ్యూరో)

రాష్ట్ర శాసనసభ గురువారం ఒకరోజు సమావేశం కానుంది. అదేరోజు ఉదయం 8:30 గంటలకు శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ, 9:30 గంటలకు శాసనమండలి వ్యవహారాల సలహా కమిటీ సమావేశాలు నిర్వహించి ఉభయ సభల్లో చర్చించాల్సిన, పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలపై నిర్ణయం తీసుకుంటారు. గురువారం సమావేశంలో మహిళా సాధికారతపై స్పల్పకాలిక చర్చ చేపట్టే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. బడ్జెట్‌ ప్రవేశ పెట్టడానికి ఈ ఏడాది మే 20న ఒకరోజు అసెంబ్లీ సమావేశమైంది. అది జరిగి శుక్రవారానికి ఆరు నెలలు అవుతుంది. ఆరు నెలలు ముగిసేలోపు అసెంబ్లీని మళ్లీ సమావేశపరచాల్సి ఉంటుంది. అందుకే గురువారం ఒకరోజు సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.


ఈ నెలాఖరులో లేదా వచ్చే నెలలో వారం/పది రోజులపాటు పూర్తిస్థాయి సమావేశాలను నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఎనిమిది జిల్లాల పరిధిలోని 11 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇవన్నీ ఏకగ్రీవమైతే మాత్రం అసెంబ్లీ సమావేశాలు ఈ నెలాఖరులోనే మళ్లీ జరగొచ్చు. ఒకవేళ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలింగ్‌ జరిగే పరిస్థితి వస్తే డిసెంబరు మూడోవారంలో సమావేశాలను నిర్వహించవచ్చని ప్రభుత్వ వర్గాల నుంచి అందిన సమాచారం. అయితే ఈ ఏడాది జులై 27 నుంచి నవంబరు 9వ తేదీ మధ్య రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మొత్తం 14 ఆర్డినెన్సులకు సంబంధించిన బిల్లులను సమావేశల్లో ప్రవేశపెట్టే అవకాశముంది. రాష్ట్రంలోని ఎయిడెడ్‌ విద్యాసంస్థలకు ప్రభుత్వ గ్రాంటు నిలిపివేత, వ్యవసాయ భూములకు ‘‘ల్యాండ్‌ పార్సిల్‌ నంబరు’’ ఇచ్చేలా వీలు కల్పించే చట్ట సవరణలతోపాటు మద్యం విక్రయిస్తూ వ్యాపార నిర్వహణే ప్రధాన విధిగా ఉన్న ఏపీ స్టేట్‌ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌బీసీఎల్‌)కు సంక్షేమ పథకాలు అప్పగించే కీలక చట్ట సవరణల ఆర్డినెన్సులూ జాబితాలో ఉన్నాయి.

సినిమా టికెట్లకు సంబంధించిన, భూములు, పట్టాదారు పాసుపుస్తకాలకు సంబంధించిన, మున్సిపల్‌ కార్పొరేషన్లకు సంబంధించిన  ఆర్డినెన్సుల బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

రెవెన్యూ :

ఆంధ్రప్రదేశ్‌ భూములు, పట్టాదారు పాసుపుస్తకాలపై హక్కులు (సవరణ) ఆర్డినెన్సు: వ్యవసాయ భూములకు ప్రస్తుతమున్న సర్వే నంబరు, సబ్‌ డివిజన్‌ నంబరు స్థానంలో ‘ల్యాండ్‌ పార్సిల్‌’ నంబరు ఇచ్చేందుకు వీలు.

ఆంధ్రప్రదేశ్‌ అసైన్డ్‌ భూముల బదలాయింపు నిషేధం (సవరణ) ఆర్డినెన్సు:

అసైన్డ్‌ ఇళ్ల స్థలాల విక్రయానికి ప్రస్తుతం ఉన్న 20 ఏళ్ల గడువు పదేళ్లకు తగ్గింపు.

ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ భూమి (వ్యవసాయేతర అవసరాలకు మార్పిడి) (సవరణ)


 

ఆర్డినెన్సు:

నాన్‌-అగ్రికల్చరల్‌ ల్యాండ్‌ అసెస్‌మెంట్‌ (నాలా) కింద జరిగే భూ వినియోగ మార్పిడిలో వివాదాలు వస్తే భూ పరిపాలనా ప్రధాన కమిషనర్‌కు బదులుగా జిల్లా అధికారులకు అప్పీల్‌ చేసుకునేందుకు వీలు. భూ వినియోగ మార్పిడి ఫీజును గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా కూడా చెల్లించేందుకు అవకాశం.

పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థలు

ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్‌ కార్పొరేషన్స్‌ (సవరణ) ఆర్డినెన్సు:

నగరపాలక సంస్థల్లో రెండో డిప్యూటీ మేయర్‌, పురపాలక సంఘాల్లో రెండో వైస్‌ ఛైర్మన్‌ ఎన్నికకు అవకాశం.

ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ (సవరణ) ఆర్డినెన్సు:

జిల్లా పరిషత్తుల్లో రెండో ఉపాధ్యక్షుడి ఎన్నికకు అవకాశం.

విద్య:

ఆంధ్రప్రదేశ్‌ ప్రైవేటు విశ్వవిద్యాలయాల (స్థాపన, నియంత్రణ) (సవరణ) ఆర్డినెన్సు: 

ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లోని ఇంజినీరింగ్‌, వ్యవసాయ విద్య కోర్సుల్లో 35 శాతం సీట్లు కన్వీనర్‌ కోటాలో భర్తీ. ప్రస్తుతం నడుస్తున్న విద్యాసంస్థలు బ్రౌన్‌ ఫీల్డ్‌ ప్రైవేటు విశ్వవిద్యాలయాలుగా మారేందుకు మూడేళ్లలో రూ.250 కోట్ల వ్యయం చేయాలని, కనీసం 50 ఎకరాల భూమి కలిగి ఉండాలని, న్యాక్‌ గుర్తింపునకు సంబంధించి 3.2 పాయింట్లు ఉండాలన్న నిబంధనలు.

ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ (సవరణ) ఆర్డినెన్సు:

ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ పరిధిలోకి ప్రైవేటు విశ్వవిద్యాలయాలు. వాటిల్లో బోధన రుసుముల ఖరారు, వాటిపై పర్యవేక్షణకు కమిషన్‌కు అధికారాలు.

ఆంధ్రప్రదేశ్‌ విద్య (సవరణ) ఆర్డినెన్సు:

ఎయిడెడ్‌ విద్యాసంస్థలకు ప్రభుత్వం చెల్లిస్తున్న గ్రాంటు నిలిపివేత, ఆస్తులతో సహా సిబ్బందిని ప్రభుత్వానికి అప్పగించటం, కేవలం గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ సిబ్బందిని మాత్రమే వెనక్కి ఇవ్వటం తదితర సవరణలు.

ఎక్సైజ్‌

 ఆంధ్రప్రదేశ్‌లో భారత్‌ తయారీ విదేశీ మద్యం, విదేశీ మద్యం వ్యాపార నియంత్రణ (సవరణ) ఆర్డినెన్సు:

మద్యం విక్రయాలు, వ్యాపార నిర్వహణ ప్రధాన విధిగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ బేవరేజస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌బీసీఎల్‌) చేయూత, ఆసరా, అమ్మఒడి వంటి సంక్షేమ పథకాల అమలు బాధ్యతల అప్పగింత. మద్యం ఆదాయం ఎస్సీ, ఎస్టీ, బీసీల ప్రయోజనాల్ని కాపాడేలా సంక్షేమ పథకాలకు వినియోగించాలన్న నిబంధన విధింపు.

దేవాదాయ

ఆంధ్రప్రదేశ్‌ ఛారిటబుల్‌, హిందూ మత సంస్థలు, దేవాదాయ (సవరణ) ఆర్డినెన్సు:

ధార్మిక పరిషత్తు ఉనికిలో లేని సందర్భంలో దేవాదాయ శాఖ మంత్రి, ముఖ్య కార్యదర్శి, కమిషనర్‌, తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ఆధ్వర్యంలోని కమిటీ ధార్మిక పరిషత్తుగా పనిచేసేందుకు, నిర్ణయాలు తీసుకునేందుకు అధికారం వీలు.

ఆంధ్రప్రదేశ్‌ ఛారిటబుల్‌, హిందూ మత సంస్థలు, దేవాదాయ (రెండో సవరణ) ఆర్డినెన్సు:

తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఏటా కామన్‌ గుడ్‌ ఫండ్‌ (సీజీఎఫ్‌) కింద రూ.40 కోట్లు, దేవాదాయ పరిపాలన నిధికి రూ.5 కోట్లు, అర్చక సంక్షేమ నిధికి రూ.5 కోట్లు తీసుకునేందుకు వీలు.

మరికొన్ని..

ఆంధ్రప్రదేశ్‌ స్వయం సహాయక బృందాల మహిళల కో కాంట్రిబ్యూటరీ పింఛను (సవరణ) ఆర్డినెన్సు:

అభయహస్తం పింఛను పథకానికి సంబంధించిన ఆర్డినెన్సు.

ఆంధ్రప్రదేశ్‌ సినిమా (నియంత్రణ) (సవరణ) ఆర్డినెన్సు: 

సినిమా టిక్కెట్లకు సంబంధించిన ఆర్డినెన్సు.

ఆంధ్రప్రదేశ్‌ బొవైన్‌ బ్రీడింగ్‌ (ఉత్పత్తి, కృత్రిమ గర్భధారణ నియంత్రణ) ఆర్డినెన్సు:

ఆంధ్రప్రదేశ్‌లో ఆవులు, గేదెలు పునరుత్పత్తి, కృత్రిమ గర్భధారణకు సంబంధించిన సేవల నియంత్రణ.

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


కుల, మతాలకు అతీతంగా ఏకమయ్యారు...అక్కడ మసీదు నిర్మించారు

ఇదే భారతీయత అని చాటి చెప్పారు,,,లౌకికత్వం అంటే ఏమిటో సరైన నిర్వచనం ఇచ్చారు

https://youtu.be/KbNgOVwoIzg 

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి


– ,  


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: