ఏపీ, తెలంగాణ కలయిక...
కలలో కూడా సాధ్యం కాదు
సమస్యలను దారిమళ్లించేందుకే ఈ వ్యాఖ్యలు
కాంగ్రెస్ నేత జి.నిరంజన్
(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)
తెలంగాణా ఆంధ్ర రాష్ట్రాలు తిరిగి విలీనం చేయాలనే కుట్ర జరుగుతుందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సీనియర్ ఉపాధ్యక్షులు జి.నిరంజన్ విమర్శించారు. అది అడ్డుకోవటానికి ప్రాణ త్యాగానికైనా సిద్దమని కొందరు, రెండు రాష్ట్రాలు ఒకటైతే తప్పేమిటని మరికొందరు తమ రాజకీయ స్వప్రయోజనాలకు , తెలంగాణా ప్రజల మనోభావాలు, ఆత్మ స్థైర్యము దెబ్బతీసే విధంగా మాట్లాడటం తగదన్నారు. ఈ సందర్భంగా జి.నిరంజన్ మాట్లాడుతూ...ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారిని తెలంగాణా ప్రజలు క్షమించరు. తెలంగాణా ఉద్యమంతో ఎటువంటి సంబందం కానీ, సానుభూతి కానీ లేని వారు మాత్రమే రాజకీయ దురుద్దేశంతో, స్వార్థ బుద్దితో రెండు రాష్ట్రాలు కలిసే కుట్ర జరుగుతోంది, ఈ వ్యాఖ్యలు అసందర్భంగా చేస్తున్నారు. ప్రధాన సమస్యల నుండి ప్రజల దృష్టిని మరల్చడానికే ఈ అసందర్భ వ్యాఖ్యలు. 60 సంవత్సరాల పోరాటంతో, ప్రాణత్యాగాలతో సాధించుకున్న తెలంగాణాను తిరిగి విలీనము చేసే సాహసము కె.సి.ఆర్ తో సహా ఎవరూ చేయలేరు, ఒక వేళ చేస్తే బ్రతికి బట్ట కట్ట లేరు. తెలంగాణా రావడము ఆలస్యమవుతుందని, నిరాశ నిస్పృహలతో ఆత్మ హత్యలతో జీవితాలను బలి చేసుకున్న అమర వీరుల త్యాగాలను మరిచి కొందరు తమ రాజకీయాలకు తెలంగాణా ప్రజలను కృంగదీసే వ్యాఖ్యలు చేయడము సహించరానివి. 60 సంవత్సారాల పాటు రెండు రాష్ట్రాలుగా విడగొట్టకుండా సమైక్యముగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నాలు విపలమైన తరవాతనే, విధ్యార్థులు యువజనుల బలిదానాలతో చలించిపోయిన శ్రీమతి సోనియా గాంధి గారు తెలంగాణా రాష్ట్రం సాకారము చేశారు. ఆ విషయాన్ని ఎవరూ మరిచిపోకూడదు. ఈ విషయమై అనవసర అపోహలు కల్పించడం క్షంతవ్యము కాదు. సోనియా గాంధీ గారు మాతృ హృదయముతో చేసిన మేలును తృణీకరించినట్లవుతుంది తెలంగాణా ఏర్పడిన తరువాత ప్రజలు కోరుకున్న విధముగా పరిపాలన సాగకుంటే, ఆకాంక్షలు నెరవేరకుంటే సరిదిద్దుకునే సత్తా ప్రజాస్వామ్యబద్దముగా తెలంగాణా ప్రజల కున్నది. కానీ తిరిగి కలువడమనేది కలలో కూడా జరుగదు. స్వార్థ రాజకీయాలు చేసే వారు దింపుడు కళ్లెం ఆశలు మానుకోవాలి. ప్రజలను ఆందోళనకు గురిచెయవద్దు. మరిన్ని ఆత్మ హత్యలకు గురి చేయవద్దు. అని ఆయన వ్యాఖ్యానించారు.
Post A Comment:
0 comments: