ప్రైవేటు అన్‌ఎయిడెడ్‌ స్కూళ్లలో ఫీజుల ఖరారు

గ్రామాల్లో ఐదో తరగతి వరకు 10వేలు-ఆరు నుంచి పదికి...రూ.12 వేలు

పట్టణాలు, నగరాల్లో మరికొంత పెంపు-హాస్టల్‌, రవాణా, ఇతర చార్జీలు అదనం 

ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌.. ఉత్తర్వులు జారీ 

విద్యార్థులపై ఫీజుల మోత మోగనుంది


(జానోజాగో వెెబ్ న్యూస్-విజయవాడ బ్యూరో)

ఎయిడెడ్‌ పాఠశాలలకు ప్రభుత్వం ఇస్తున్న సాయం ఆపేసి.. ఫీజుల రూపంలో ఆ భారం విద్యార్థులపై వేసింది. ప్రైవేటుగా మారిన ఎయిడెడ్‌ పాఠశాలల్ని ఫీజులు వసూలు చేసుకోవడానికి అనుమతించింది. వాటికి ఫీజులు కూడా నిర్ణయించింది. అవి దాదాపుగా ప్రైవేటు పాఠశాలలు వసూలు చేస్తున్న స్థాయిలోనే ఉన్నాయి. గ్రామస్థాయి పాఠశాలల్లో 1నుంచి 5వ తరగతి వరకు రూ.10వేలు, 6 నుంచి పదోతరగతి వరకు రూ.12వేలు.. పట్టణాల్లో రూ.12వేలు, రూ.15 వేలుగా నిర్ణయించారు. నగరాల్లో రూ.15 వేలు, రూ.18 వేలు ఉంటాయని పేర్కొన్నారు. పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ ఈ మేరకు నిర్ణయించగా, ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్‌  ఉత్తర్వులు జారీచేశారు.


హాస్టల్‌ సౌకర్యం ఉంటే గ్రామాల్లో ఏడాదికి రూ.18 వేలు, పట్టణాల్లో రూ.20 వేలు, నగరాల్లో రూ.24 వేలు వసూలు చేయవచ్చని తెలిపారు. ఫీజులుగా వసూలు చేసిన మొత్తంలో 50శాతం ఉపాధ్యాయులకు, 15శాతం సిబ్బంది గ్రాట్యుటీ, బీమా తదితరాలకు, 15శాతం పాఠశాల నిర్వహణ, 20 శాతం పాఠశాల అభివృద్ధికి వినియోగించాలని స్పష్టంచేశారు. ఈ మేరకు లెక్కలు కూడా చూపించాలన్నారు. వాస్తవానికి ఇప్పటివరకు ఈ ప్రైవేటు ఎయిడెడ్‌ కళాశాలల్లో ఉచితంగా చదువు చెప్పారు. పిల్లల నుంచి పైసా వసూలు చేయలేదు. ఎయిడెడ్‌ పాఠశాలల ఉపాధ్యాయులను ప్రభుత్వం తీసేసుకోవడంతో ఇప్పుడు ఆయా పాఠశాలలు కొత్తగా నియమించుకుని వారికి జీతాలు కూడా చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో వాటిని ప్రైవేటుగా నిర్వహించుకునేందుకు అనుమతిచ్చింది. వాటిల్లో చదివే విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసుకోవడానికి తాజాగా ప్రభుత్వం అనుమతించింది.

అమ్మ ఒడి ఇప్పటికే ఓ ఏడాది లేదు :

 ప్రైవేటు అన్‌ఎయిడెడ్‌ పాఠశాలల పిల్లలకు కూడా అమ్మఒడి వర్తింపజేస్తామని, వారిపై పడే భారం ఏమీ ఉండదని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇప్పటికే ఐదేళ్లు ఇవ్వాల్సిన అమ్మఒడిని ఒక ఏడాది వాయిదా వేసేశారు. ఇక భవిష్యత్తులో ఏమవుతుందో తెలీదు. కొద్దో గొప్పో ప్రభుత్వ ఆధ్వర్యములో నడిచే పాఠశాలలపై ఆధారపడే దిగువ మధ్యతరగతి కుటుంబాలలోని పిల్లల తల్లిదండ్రులపై చదువుల విషములో అదనపు భారం పడబోతుందా!ఈ వింత పోకడ ప్రణాళికతో దిగువ మధ్యతరగతి కుటుంబాలలో ఆందోళనలు మొదలయ్యాయి. ఒక చేతితో యివ్వడం - మరియొక చేతితో తీసుకోవడం అంటే ఇదేనేమో.


 

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: