బీజేపీ పెద్దన్న పాత్ర....

జనసేనకు రుచించడంలేదా...?

ఉప ఎన్నికకు జనసేన దూరం అందుకేనా,,,

బద్వేల్ ఉప ఎన్నిక...తెరచాటు సిత్రాలు

జనసేన అకస్మిక నిర్ణయం వెనక కారణమేమిటీ

ఏపీలో బీజేపీ అస్థిత్వం ఏమిటో ఎత్తిచూసేందుకేనా...?

బీజేపీ వాస్తవ బలమెంతో తేల్చడం కోసమేనా

పోటీకి దూరం...టీడీపీకి సొంత కారణాలు లేకపోలేదు

ఏపీ లో ఆసక్తికర ట్విస్ట్ రాజకీయాలు


(జానోజాగో వెబ్ న్యూస్-ఏపీ పొలిటికల్ బ్యూరో)

బద్వేల్, హుజూరాబాద్ అసెంబ్లీల ఉప ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో రెండు రాష్ట్రాల్లో అధికార, విపక్షాల మధ్య హోరా...హోరీ  పోరు అన్న ప్రచారం మొదలైంది. కానీ ఎవరూ ఉహించని విధంగా బద్వేల్ ఉప ఎన్నికకు తాము దూరంగా ఉంటామని తొలుత జనసేన, ఆ తరువాత టీడీపీ ప్రకటించడంతో హీటెక్కాల్సిన ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఊహించని ట్విస్ట్ లకు దారితీస్తోంది. ఓ రకంగా ఈ రాజకీయ పరిణామాలు టీడీపీ,  జనసేన  మధ్య పొత్తుకు దారి తీస్తోందన్న ప్రచారానికి నాందీ  పలికింది.  ఇదే నిజమైతే  జనసేనను దగ్గరకు తీసుకొనే టీడీపీతన పాత మిత్రుడు బీజేపీని దూరం చేసుకోదు. అదే సందర్భంలో  టీడీపీ కలసి పయనించాలి అనుకొనే జనసేన పార్టీకి బద్వేల్ ఉప ఎన్నికకు దూరంగా ఉందన్న కారణంతో టీడీపీకి దగ్గరవ్వాల్సిన అవసరంలేదు. ఎన్నికలకు ముందు బలమైన వైసీపీని ఓడించేందుకు ప్రతిపక్షాలుగా తాము ఏకమవుతున్నా అని ప్రకటించి ఈ పార్టీలు దగ్గరయ్యేందుకు వీలుంది. కానీ బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నికల మాటున ట్విస్ట్ రాజకీయాలకు మాత్రం తెరలేచింది అని చెప్పాలి.  

కడప జిల్లాలోని బద్వేల్‌ నియోజకవర్గ ఉపఎన్నికకు దూరంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. దివంగత ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య సతీమణికే టికెట్‌ ఇచ్చిన కారణంగా సంప్రదాయాలను గౌరవించి బద్వేల్‌లో పోటీ చేయడం లేదని ప్రకచించింది. ఇదే తరహా ప్రకటన అంతకు ముందే జనసేన నేత పవన్ కళ్యాణ్ కూడా చేశారు. ఈ రెండు పార్టీల మధ్య బద్వేల్ ఉప ఎన్నికల విషయంలో ఒకే సారుప్యత ఉండటంతో ఆ రెండు పార్టీల మధ్య పొత్తుపొడుస్తోంది అని ఇట్టే ఎవరైనా చెబుతారు. కానీ టీడీపీకి, బీజేపీకి జనసేన సహజ మిత్రుడు. వారు ఒక్కటవ్వడానికి ప్రత్యేకించి సందర్భాలు అవసరంలేదు. కానీ ప్రస్తుతం బీజేపీ, జనసేన గత ఏడాదిన్నర కింద తాము జతకడుతున్నామని, ఎన్నికలతోపాటు, ఉద్యమాలు, పోరాటాలు కలిసే చేస్తామని ప్రకటించాయి. కానీ ఆ ప్రకటన అమలు పరిస్థితి నాటి నుంంచి నేటి వరకు ఎక్కడా కనిపించలేదు. అయినా బద్వేల్ ఉప ఎన్నికలపై టీడీపీ, జనసేన పార్టీల ప్రకటన ఒకేలా ఉండటంతో ఆ పార్టీల మధ్య పొత్తు చిగురిస్తోందన్న కథనాలు  మీడియాలో వస్తున్నాయి. వాస్తవానికి ఈ రెండు పార్టీలు పాత మిత్రలే. వారి మధ్య  పొత్తుకు బద్వేల్ ఉప ఎన్నిక కారణం కానక్కర్లేదు. ఇక బీజేపీకి జనసేన రాం రాం చెబుతోందన్న కథనాలు  వస్తున్నాయి. ఇది మున్ముందు వాస్తవం కూడా కావచ్చు. లేక అని నిజం కాకపోవచ్చు. కానీ తనమిత్రపక్షం బీజేపీని ఏ మాత్రం సంప్రదించకుండా జనసేన బద్వేల్ ఉప ఎన్నికకు దూరమని ప్రకటించడంపై కాస్త ఆలోచించదగ్గ విషయమే. బీజేపీతో ఏ మాత్రం సంప్రదించకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకొన్నారా...? అంటే అవుననే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. దీని వెనక బలమైన కారణాలు లేకపోలేదని కూడా అంతర్గతంగా వినవస్తోంది. ఏమిటీ బీజేపీ విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బద్వేల్ ఉప ఎన్నికల సమయంలోనే పోటీకి దూరమన్న నిర్ణయం తీసుకోవడం వెనక బలమైన కారణముండొచ్చని రాజకీయ వర్గాల్లో ఓ చర్చ. బీజేపీ ఒంటెద్దు పొకడలు, ప్రతి విషయంలోనూ పెద్దన్న పాత్ర పోషించడం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు రుచించడంలేదని తెలుస్తోంది. 

 

కేంద్రంలో బలంగా ఉన్న బీజేపీ ఏపీలోనూ తన బలం అదేనని చేసే ప్రదర్శన జనసేన శ్రేణులకు విస్మయానికి గురిచేస్తోంది. ఇదే పవన్ కళ్యాన్ బద్వేల్ ఉప ఎన్నికలకు దూరంగా ఉండేలా నిర్ణయం తీసుకొనేందుకు కారణమైందన్న వాదన కూడా వినవస్తోంది. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల ప్రస్తావన బద్వేల్ ఉప ఎన్నికల నేపథ్యంలో కొనసాగుతోంది. నాడు తిరపతి లోక్ సభ ఉప ఎన్నికల సమయంలో తన అభ్యర్థిని బరిలోకి దించాలని జనసేన పార్టీ గట్టింగా భావించింది. దీనికి కారణం ప్రజారాజ్యం పార్టీ 2009లో చిరంజీవి తిరుపతి పోటీచేసి గెలవగా, తన సొంత నియోజకవర్గం పాలకొల్లులో ఆయన ఓడిపోయారు. ఇలా తిరుపతి ప్రజారాజ్యాన్ని ఆదరించింది. పైగా ఆ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం కూడా బలంగా ఉంది. ఈ  రెండు కారణాలు  సినీనటుుడిగా పవన్ కళ్యాణ్ ఇమేజ్ తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో గెలిచేందుకు దోహదపడతాయని నాడు భావించిన జనసేన ఆ స్థానం తనకే కేటాయించాలని బీజేపీ ముందు నాడు డిమాండ్ పెట్టింది. రాష్ట్రంలో వైసీపీ పాలనలో క్రైస్తవం పెరిగిపోతోంది, దేవాలయాలకు రక్షణ కరువైంది, హిందూ సంప్రదాయయం ప్రమాదంలో పడుతోందన్న అజెండాతో నాడు బీజేపీ పలు ఆందోళనలు చేపట్టింది. ఈ ఆందోళనలు, ఆధ్యాత్మిక కేంద్రంగా తిరుపతి ఉండటంతో  అక్కడ పోటీచేస్తే  తమకు కలిసొస్తుందని తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో తామే పోటీలో ఉంటామని బీజేపీ తేల్చిచెప్పింది. ఈ సీటు విషయంలో వెనక్కి తగ్గని బీజేపీ అవసరమైతే ఉమ్మడి అభ్యర్థిని నిలబెడదామని అది కూడా తమ కమలం  గుర్తుపైన బరిలో నిలపుదామని జనసేనకు ఆఫర్ కూడా చేసింది. ఈ సీటు విషయంలో అఖరి వరకు ఆశించిన జనసేన అధినేత  పవన్ కళ్యాణ్ ఇందుకోసం హస్తీన పర్యటన  కూడా చేసి నాడు బీజేపీ పెద్దలను కూడా కలిశారు.  కానీ అక్కడ కూడా జనసేనకు నిరాశే ఎదురైంది. చివరకు బీజేపీకే జై కొట్టాల్సి వచ్చింది. అంతే  కాకుండా వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ పై పలుమార్లు తీవ్ర విమర్శలు చేశారు. ఈ సమయంలో బీజేపీ నేతలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు పూర్తి స్థాయిలో అండగా నిలిచిన సందర్భాలు  లేవు. ఇలా మాట నెగ్గించుకొనే విషయంలో పెద్దన్న  పాత్ర పోషించిన బీజేపీ ఇతర విషయాలలో అండగా నిలవాల్సిన సమయంలోనూ ఆ పాత్రకు కమలం  నేతలు దూరంగా ఉండటాన్న జనసేన నాయకత్వం జీర్ణించుకోలేకపోతోందన్నది సమాచారం. ఏపీ రాష్ట్రంలో నామ మాత్రపు బలంగా ఉన్న బీజేపీ తమపైనే పెద్దన్న పాత్ర పోషిస్తోందన్న భావన జనసేన పార్టీలో అంతర్గతంగా నెలకొంది. ఈ కారణాల రిత్యే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అదును చూసి బద్వేల్ ఉప ఎన్నికలకు తాము దూరమని ప్రకటించి బీజేపీని ఎన్నికల్లో ఒంటరి చేశారని సమాచారం. కానీ వారసత్వ రాజకీయాలకు తాము వ్యతిరేకమని చెబుతున్న బీజేపీ ఈ ఎన్నికల్లో పోటీకి సై అంటోంది. ఇలా పోటీకి దిగిన బీజేపీకి  బయటి నుంచి మద్దతు జనసేన పార్టీ ప్రకటించినా ఉప ఎన్నికలకు తాము దూరమని పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనకు విలువ ఉండదు. ఇది జనసేన నాయకత్వానికి కూడా తెలుసు. ఒకవేళ తాను చేసిన ప్రకటనకు అనుగుణంగా బీజేపీ పోటీచేస్తే ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పార్టీ ఓటు బ్యాంకు ఏ పాటితో తెలిసిపోతుంది. బీజేపీ విషయంలో ఈ వాస్తవం బహిర్గతం కావాలని జనసేన భావిస్తున్నట్లు సమాచారం. అందుకే బద్వేల్  ఉప ఎన్నికకు దూరమని ప్రకటించి బరిలో నిలిచే బీజేపీ బలం ఏమిటో తెలిసొచ్చేలా పవన్ కళ్యాణ్ అస్త్రం వదిలారని రాజకీయ వర్గాల్లో చర్చసాగుతోంది.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: