ఆప్కాస్ ఉద్యోగుల్ని తిరిగి విధుల్లోకి తీసుకోవాలి

బకాయి జీతాలను చెల్లించాలి

సీఎం జగన్ కు టీడీపీ నేత నారా లోకేష్ బహిరంగ లేఖ


(జానో జాగో వెబ్ న్యూస్_  విజయవాడ బ్యూరో)

తొల‌గించిన ఆప్కాస్ ఉద్యోగుల్ని తిరిగి విధుల్లోకి తీసుకోవ‌డం, 20 నెల‌ల జీతాల బ‌కాయిలను త‌క్షణ‌ చెల్లించాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన గురువారం నాడు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి నారా లోకేష్ ఓ బహిరంగ లేఖ రాశారు. ఆ బహిరంగ లేఖ పాఠకులకోసం యధాతధంగా.

బ‌హిరంగ లేఖ 

గౌర‌వ‌నీయులైన శ్రీ వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి గారు,

ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్‌

అమ‌రావ‌తి

విష‌యం: తొల‌గించిన ఆప్కాస్ ఉద్యోగుల్ని తిరిగి విధుల్లోకి తీసుకోవ‌డం, 20 నెల‌ల జీతాల బ‌కాయిలను త‌క్షణ‌ చెల్లింపుల‌ గురించి..

అయ్యా! 

ముఖ్యమంత్రిగారూ! మీరిచ్చిన హామీలను మీకు గుర్తు చేసేందుకు ఇలా లేఖ‌లు రాయాల్సి రావ‌డం విచార‌క‌రం. పాద‌యాత్ర చేస్తూ కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల‌కు నేనున్నాను..నేను మీ గోడు విన్నానంటిరి. మీ మాట‌లు న‌మ్మి ఓట్లేసిన ఆ ఉద్యోగులంతా మీరు ముఖ్యమంత్రి కాగానే... వాళ్లకిచ్చిన హామీల‌న్నీ నెర‌వేర్చుతార‌ని ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు. నాడు ఊరూరా స‌భ‌ల్లో మారుమోగేలా కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ‌ భ‌ద్రత క‌ల్పించ‌డంతోపాటు ప్రతీ నెలా ఠంచ‌నుగా ఒక‌టో తేదీకి జీతం వ‌చ్చేలా చేస్తాన‌ని, ఏజెన్సీల వంటి ద‌ళారీ వ్యవ‌స్థ లేకుండా ప్రభుత్వం నుంచే నిర్వహిస్తామ‌ని హామీలిచ్చారు. సీఎం కాగానే హామీల‌న్నీ గాలికొదిలేశారు. మీ బులుగు కార్యక‌ర్తల‌కు కొలువుల్లో కూర్చోబెట్టేందుకు, మీ నేత‌లు పోస్టులు అమ్ముకోవ‌డం వ‌ల్ల ఏళ్లుగా ప‌నిచేస్తున్న కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల్ని తొలగించేశారు. కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల‌కు జీతాలిస్తున్న ఏజెన్సీల‌ను ర‌ద్దు చేసి A.P. Corporation for Outsourced Services (Apcos) కింద‌కి తీసుకొచ్చామ‌ని ప్రక‌టించి మ‌రో మోసానికి తెర‌తీశారు. ఒక్కవైద్య ఆరోగ్యశాఖ ప‌రిధిలో ప‌నిచేస్తున్న వేలాది మందిని Apcosలో తీసుకున్నట్టు ప‌త్రాలు ఇచ్చి, ప్రభుత్వ ఉద్యోగులు కింద సీఎఫ్ఎంఎస్ ఐడీలు క్రియేట్ చేసి ఉద్యోగుల గొంతు కోశారు. ఏజెన్సీలు లేకుండా మీకు జీతాలు ఎలా ఇవ్వగ‌ల‌మంటూ 20 నెల‌లు జీతాలు ఎగ్గొట్టి అంద‌రినీ ఉద్యోగాల్లోంచి తీసేసి పంపేయ‌డం అత్యంత దారుణ‌మైన నిర్ణయం. 

మీ ప్రభుత్వం చేసిన నిర్వాకాల వ‌ల్ల 20 నెల‌ల జీతాలు రాక‌, వేలాది మంది ఉద్యోగుల కుటుంబాలు ప‌స్తులుంటున్నాయి. మ‌రోవైపు ప్రభుత్వ ఉద్యోగులుగా వీరికి సీఎఫ్ఎంఎస్ లో న‌మోదు చేయ‌డంతో తెల్ల రేష‌న్‌కార్డులు రద్దయ్యాయి. వారు అమ్మ ఒడితోపాటు ప్రభుత్వ ప‌థ‌కాలు దేనికీ అర్హులు కాకుండా పోయారు. ఉద్యోగ‌భ‌ద్రత క‌ల్పిస్తాన‌ని ఇచ్చిన మాట త‌ప్పి ఉద్యోగాలే లేకుండా చేయ‌డం వేలాది కుటుంబాల‌కు తీర‌ని అన్యాయమే. మీరు సీఎం అయ్యాక‌ ఇప్పటివ‌ర‌కూ కాకినాడ జీజీహెచ్‌లో 66మందిని, 1700 యూపీహెచ్‌సీ ఉద్యోగులను,  180 మంది APCOS ఎంప్లాయీస్ ని తొల‌గించారు. APCOS నుండి 14నెలలు జీతాలు, అంత‌కుముందు ఏజెన్సీల నుంచి 6 నెల‌ల‌ పెండింగ్ జీతాలు ఇవ్వకుండా తొల‌గించ‌డంతో చిరుద్యోగుల కుటుంబాల‌తో స‌హా న‌డిరోడ్డున‌ప‌డ్డారు. పెండింగ్ జీతాలు అడుగుతున్నార‌ని...ఆరు వంద‌ల మందిని తీసేశారంటే ఎంత అరాచ‌కంగా వ్యవ‌హ‌రిస్తున్నారో అర్థం అవుతూనే ఉంది. ఉద్యోగులు త‌మ‌ని ఎందుకు తొల‌గించార‌ని సంబంధిత అధికారుల‌ని ప్రశ్నిస్తే, మీ ఏజెన్సీల కాంట్రాక్ట్ ముగిసిందని స‌మాధానం ఇవ్వడం ముమ్మూటికీ వేత‌న‌జీవుల‌ను మోస‌గించ‌డ‌మే ముఖ్యమంత్రి గారు. 

 ప్రజ‌ల ప్రాణాలు కాపాడ‌టానికి వేల‌కోట్ల అప్పులు చేయాల్సి వ‌చ్చింద‌ని ప‌దే ప‌దే చెబుతున్న మీ ఆర్థిక‌మంత్రి బుగ్గన గారు... కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల‌కు 20 నెల‌లుగా ఇవ్వని జీతాలు ఏ దారి మ‌ళ్లించారో చిరుద్యోగుల‌కు స‌మాధానం చెప్పాలి. మీ సొంత మీడియా సంస్థ సాక్షికి ఇచ్చిన యాడ్స్ 200 కోట్లకు పైగానే వుంటాయ‌ని ఆర్టీఐ ద్వారా వెల్లడైంది. వేలాది మంది కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల‌కు 20 నెల‌లు జీతాలు పెండింగ్ పెట్టి...వారు ఆక‌లి కేక‌ల‌తో న‌డిరోడ్డున ప‌డితే ప‌ట్టించుకోకుండా మీ సొంత మీడియా సంస్థకి ఆగ‌మేఘాల‌పై నిధులు త‌ర‌లించుకుపోవ‌డానికి  సిగ్గు అనిపించ‌డంలేదా? ఇప్పటికైనా క‌ళ్లు తెరిచి, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల 20 నెల‌ల జీతాల బ‌కాయిలు త‌క్షణ‌మే చెల్లించాలి. తొల‌గించిన ఉద్యోగులంద‌రినీ Apcosలోకి తీసుకుని ఉద్యోగ‌భ‌ద్రత క‌ల్పించాలి.

ఇట్లు

నారా లోకేష్‌

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యద‌ర్శి

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: