గ్రామానికో ట్రాక్టర్‌.. 

ఏపీ సర్కార్‌ కసరత్తు

రెండు వేల జనాభా దాటిన 5,228 గ్రామాలకు అందజేత

గ్రామ అవసరాలకు వినియోగం


(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ బ్యూరో)

రాష్ట్రంలో రెండు వేల జనాభా దాటిన ప్రతి గ్రామానికి ఒక్కొక్క ట్రాక్టర్‌ చొప్పున సమకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆ ట్రాక్టర్లను సంబంధిత గ్రామ పంచాయతీలు బహుళ ప్రయోజనాలకు వినియోగించుకునేలా ప్రణాళికలు రచిస్తోంది. తద్వారా ట్రాక్టర్ల నిర్వహణకు అయ్యే వ్యయాన్ని ఆదాయం రూపంలో సదరు గ్రామ పంచాయతీలకు లభించేలా చర్యలు చేపడుతోంది. ఇలా చేయడం ద్వారా గ్రామాల్లో రోడ్ల పక్కన పెంచే మొక్కలకు ఆ ట్రాక్టర్‌ ద్వారానే నీటి తడులు అందించడం, నూరు శాతం మొక్కలను బతికించడం, గ్రామాల్లో ఇళ్ల నుంచి సేకరించే చెత్తను తరలించడం వంటి పనులను సులభతరం అవుతాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.

5,228 గ్రామాలకు ఉచితంగా అందజేత 

రాష్ట్రంలో 13,371 గ్రామ పంచాయతీలు ఉండగా, అందులో 5 వేలకు పైబడి జనాభా ఉండే గ్రామాలు 1,252 ఉన్నాయి. వీటిలో 1,161 గ్రామ పంచాయతీలకు ఇప్పటికే సొంత ట్రాక్టర్లు అందుబాటులో ఉన్నాయి. 5 వేల జనాభాకు పైబడిన గ్రామాల్లో 91 చోట్ల మాత్రమే పంచాయతీలకు సొంతంగా ట్రాక్టర్లు లేవు. ఇవి కాకుండా 2 వేలకు పైబడి, 5 వేల లోపు జనాభా ఉండే గ్రామాలు 5,137 వరకు ఉన్నాయి. వీటికి కూడా సొంత ట్రాక్టర్లు లేవు. ఈ నేపథ్యంలో 5 వేలకు పైబడిన జనాభా కలిగి సొంత ట్రాక్టర్లు లేని 91 పంచాయతీలతోపాటు, 5 వేల లోపు జనాభా కలిగిన 5137 పంచాయతీలకు కలిపి మొత్తం 5,228 గ్రామాలకు ప్రభుత్వం కొత్తగా ట్రాక్టర్లు అందజేయాలని నిర్ణయించింది. పంచాయతీరాజ్‌ శాఖ, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ద్వారా వీటిని ఉచితంగా సమకూరుస్తుంది. గ్రామాల్లో రోడ్లపక్కన పోగయ్యే చెత్తను తరలించడానికి, రోడ్ల పక్కన నాటే మొక్కలకు గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో నీటి తడులు అందించడం ద్వారా ప్రతి మొక్కను బతికించేందుకు ఈ ట్రాక్టర్లను ఉపయోగిస్తారు. అంతేకాకుండా గ్రామ పంచాయతీ ఇతర అవసరాలకు కూడా అవే ట్రాక్టర్లను ఉపయోగించుకునేలా చూస్తారు. 


 

పంచాయతీలపై నిర్వహణ భారం పడకుండా..

ట్రాక్టర్‌ రోజువారీ నిర్వహణ సంబంధించి పంచాయతీకి భారం కాకుండా ఉండేలా కొన్నేళ్లపాటు ఆ గ్రామానికి అదనపు ఆదాయం పొందేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. దానిపై పంచాయతీ అధికారులకు అవగాహన కల్పిస్తారు. రోడ్ల పక్కన నాటే మొక్కల పెంపకానికి గాను.. నాటిన ప్రతి మొక్కకు రెండేళ్లలో 56 విడతలుగా నీటి తడులు ఇవ్వడానికి (ఒక్కొక్క తడికి రూ.5 చొప్పున) రూ.280 చొప్పున ప్రభుత్వం ప్రైవేట్‌ వ్యక్తులకు చెల్లిస్తోంది. ఇలా 400 మొక్కలు ఒక యూనిట్‌గా చేసుకుని ప్రతి యూనిట్‌కు రూ.1.12 లక్షల చొప్పున అందజేస్తోంది. ఇకపై మొక్కలకు నీటి తడులు ఇచ్చే బాధ్యత ప్రైవేట్‌ వ్యక్తులకు కాకుండా గ్రామ పంచాయతీలకే అప్పగిస్తారు. తద్వారా ఆ మొత్తం గ్రామ పంచాయతీకి అదనపు ఆదాయంగా సమకూరుతుంది. గ్రామీణాభివృద్ధి శాఖ గత ఏడాది రాష్ట్రంలో 15 వేల కిలోమీటర్ల మేర, ఈ ఏడాది  10 వేల కిలోమీటర్ల మేర మొక్కలు నాటింది. సగటున ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో 1.60 కిలోమీటర్ల పొడవున ప్రస్తుతం మొక్కల పెంపకం కొనసాగుతుంది. పంచాయతీల ఆధ్వర్యంలోనే ట్రాక్టర్‌ ద్వారా నీటి తడులు అందజేస్తే ఒక్కొక్క గ్రామ పంచాయతీకి సరాసరి రూ.1.80 లక్షల వరకు అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ సొమ్మును ట్రాక్టర్‌ డీజిల్, డ్రైవర్, మరమ్మతు ఖర్చులకు వినియోగించుకునే వీలుంటుందని అధికారులు చెప్పారు.

 

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: