*అగ్రరాజ్యం అమెరికా* కి *,,,

లోపలి నుండే ఓ పెద్ద ఎదురు దెబ్బ!* 

 


    వరస ఎదురు దెబ్బలు తింటున్న అమెరికాకు మరో ఎదురు దెబ్బ! ఐతే ఈసారి బయటి నుండి కాదు. అమెరికా పాలక వ్యవస్థ నుండే! ఇటీవల అమెరికా ఇమ్మిగ్రేoట్ పాలసీ నవ్వులపాలైన విషయం తెల్సిందే. దానికి నిరసనగా నిన్న హైతీలోని అమెరికా ప్రత్యేక రాయబారి డేనియల్ పూటే ఏకంగా రాజీనామా చేసాడు. ఇప్పటికే ఇరాక్,  ఆఫ్ఘనిస్తాన్ తదితర చోట్ల అమెరికాకి వరస ఎదురు దెబ్బలు తెలిసిందే. అవి చాలక తగుదునమ్మా అంటూ ఇండో ఫసిఫిక్ ప్రాంతంలో "ఆకస్" పేరిట ఓ కొత్త సైనిక కూటమిని ఈమధ్యే ఏర్పరిచింది.  యుద్ధ వాతావరణం సృష్టించే ఉన్మాదానికి దిగుతోన్న వేళ, స్వంత దేశంలో తన స్వంత ప్రభుత్వానికి చెందిన ఓ దేశపు ప్రత్యేక రాయబారి రాజీనామా చేయడం ముమ్మాటికీ ఓ రాజకీయ ఎదురు దెబ్బే!

   సెంట్రల్ అమెరికా దేశం హైతీ పేరు వింటే ఒకప్పటి  రాజకీయ పరిణామాలు గుర్తుకు వస్తాయి. అక్కడి అమెరికా సైనిక జోక్యం గుర్తు వస్తుంది. ఏమైనా వర్తమాన ప్రపంచ రాజకీయ చరిత్ర పుటల్లో అమెరికా దుష్టత్వానికి చేదుగుర్తుగా హైతీ కి ఓ పుట నమోదైనది. 

 


     నేడు హైతీ రెండు సంక్షోభాల్ని భరిస్తూ ఉంది. ఒకటి భూకంపం కాగా, రెండోది రాజకీయ సంక్షోభం. అది అసలే పేద దేశం. పైగా పై రెండు కారణాల వల్ల నేడు హైతీ ప్రజలు పేదరికం, ఆకలి, హింస, నిరుద్యోగాలతో తల్లడిల్లుతున్నారు. పొట్ట చేత పట్టుకొని ఏదో ఓ విదేశానికి వెళ్తున్నారు. పనులు దొరుకుతాయనే గంపెడు ఆశతో అమెరికా బాట పట్టారు. వారిని అమానుషంగా మెడపట్టి దేశం నుండి బయటకు గెంటివేసే దుర్మార్గానికి అమెరికా పూనుకుంది. గత ఆదివారం నుండి గెంటివేసే ప్రక్రియను అది చేపట్టింది. ఆఘమేఘాల మీద 12 విమానాల్లో 1400 మంది నిరుపేద హైతీయన్లను హైతీ కి బైడెన్ ప్రభుత్వం తిరిగి పంపించింది. కాబూల్ నుండి విమానాలతో అత్యవసరంగా మరియు సురక్షితంగా బయటకు తరలించే బాధ్యత తన నెత్తి మీద వున్నా, తుది గడువు ముంచుకొచ్చే వరకూ దున్నపోతులా అమెరికా ప్రభుత్వం జాప్యం చేసింది. అదే బైడెన్ సర్కార్ మరోవైపు అస్టదరిద్ర్యులైన హైతీ కన్నీటి వలస కార్మికుల్ని బలవంతపు తరలింపుకై ఎమర్జెన్సీ ఫ్లయిట్స్ ను నడిపించింది. ఈ ద్వంద్వ  వైఖరిని బట్టబయలు చేసే  ఒక ఉదాహరణగా పూటే రాజీనామా నిలుస్తుంది.

      అమెరికా ఇమ్మిగ్రేన్ట్ విధానం వికటిస్తోంది. దానికి నిరసనగా హైతీ లోని అమెరికా ప్రత్యేక రాయబారి గురువారం రాజీనామా చేయడం విశేషం. ఈ సందర్భంగా అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ కి పంపిన రాజీనామా లేఖలో పూటే ఇలా వ్యాఖ్యానం చేశారు. 

    *"వేలాదిమంది హైతీ శరణార్ధుల్ని, వలస జీవుల్ని హైతీకి వెనక్కి పంపించే అమానుషమైన మరియు వ్యతిరేక ఫలితాల్ని కూడా ఇచ్చే మా అమెరికా ప్రభుత్వ నిర్ణయంతో ఏకీభవించ లేకపోతున్నా"* 

     పై రాజీనామా లేఖలో ఆయన చేసిన మరికొన్ని వ్యాఖ్యలను కూడా గుర్తు చేయాలి. అమెరికా చేత బలవంతంగా వెనక్కి పంపబడే వేలాది మందిని ఇముడ్చుకోగలిగే స్థితి ప్రస్తుత హైతీ ఆర్ధిక వ్యవస్థకి లేని విషయాన్ని కూడా ఆయన లేఖలో స్పష్టం చేసాడు. అది అత్యంత పేదరికంలో వున్నదని చెప్పారు. 

      అమెరికా ప్రభుత్వ ప్రాథమ్యాలు క్రమంగా మారుతున్నాయి. అది ఆఫ్ఘనిస్తాన్ ని పూర్తిగా వదిలేసింది. యూరోప్ ని వెనక సీటులోకి నెట్టింది. మధ్యప్రాచ్యం పై ప్రధాన గురిని విడనాడుతోంది. పొద్దెరగని కొత్త బిచ్చగాడి వలె ఇప్పుడు చైనా పైకి ప్రధాన గురిపెట్టింది. ఎప్పటి నుంచో తన  దురాక్రమణ పర్వానికి ఆలంబనగా అట్లాంటిక్ మహా సముద్రంతో పాటు ప్రాంతీయ సముద్రాలైన మధ్యధరా, కాస్పియన్, బాల్కన్, బాల్టిక్, ఎర్ర, నల్ల సముద్రాలు ఉండేవి. వాటిని ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తోంది. లేదంటే రెండవ వరసలోకి తోసేస్తోంది. నేడు పసిఫిక్, హిందూ మహాసముద్రాలతో పాటు, దక్షిణ చైనా, కొరియా, తైవాన్ వంటి ప్రాంతీయ సముద్రాల మీదికి గురిపెడుతోంది.

   ఈమధ్యే "ఆకస్" పేరిట మూల ఆంగ్ల రాజ్యాలతో అది కొత్తసైనిక కూటమిని  ఏర్పరచిడం తెలిసిందే. (బ్రిటన్ వలసలతో ఏర్పడ్డ దేశాలే అమెరికా, ఆస్ట్రేలియాలు! ఆ మూడు దేశాలూ  మూలంలో Anglo sphere లోనివే) అంటే ఆసియాపైకి ఆంగ్లో సైనిక కూటమి నేడు యుద్ధ సన్నాహక దశకు శ్రీకారం చుట్టింది. ఈ దశలో అమెరికా పెరటిదొడ్డి హైతీ విషయం మీద స్వయంగా స్వంత రాయబారి నుండి ఎదురుదెబ్బ తగలడం గమనార్హం!

     ప్రపంచ వ్యాప్తంగా అమెరికా సామ్రాజ్యవాద దుష్ట విధానాల్ని లోకానికి వెల్లడించిన జాన్ పెర్కిన్స్  కోవలోకి డేనియల్ పూటే రాకపోవచ్చు. కానీ నేడు అమెరికా రాజకీయ ప్రతిష్ట, ప్రాభవాలు ఇంటా బయటా క్రమక్రమంగా దెబ్బ తింటున్నాయి. ఈ దశలో పూటే వ్యక్తంచేసిన తాజా రాజకీయ నిరసన అమెరికా స్థానాన్ని మరింత మసక బారించి తీరుతుంది. 

    డేనియల్ పూటే తాజా రాజీనామా పరిణామాన్ని విస్తృతంగా ప్రచారం చేద్దాం. పతన దిశలో అమెరికా సామ్రాజ్యవాద రాజకీయ ప్రయాణాన్ని నిశితంగా పరిశీలిద్దాం. నేడు ఇండో పసిఫిక్ వైపు దాని కొత్త సైనికయానాన్ని వ్యతిరేకించాల్సిన భావి కర్తవ్యానికి పదునుపెట్టే సాధనంగా ఈ ఘటనను మలుచుకుందాం. 


   ✍ రచయిత_*ఇఫ్టూ ప్రసాద్* (పిపి)

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: