ప్రతిపక్షం ప్రజాస్వామ్యానికి పునాది

పార్టీ మార్పిడులు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టుఆగస్ట్ 5వ తేదీన వనం జ్వాలా నరసింహారావుగారు  వ్రాసిన " తెలంగాణా  కోసమే చేరికలు " అనే ఆర్టికల్ ఆంధ్రజ్యోతి దినపత్రికలో  చదివిన తరవాత ఆయన స్వామిభక్తిని కొనియాడకుండ ఉండలేక  కొన్ని విషయాలను ప్రస్తావించకుండ ఉండలేక పోతున్నాను. తెలంగాణా రాష్ట్రసమితి లో  వారూ వీరు అనే తేడా లేకుండా, ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేకుండా అనునిత్యం ప్రజా ప్రతినిధులతో సహా వేలాది మంది చేరడం రాజకీయ పునరేకీకరణ ఆవశ్యకత మాత్రమే అని ఆ ఆర్టికల్ లో ఆయన పేర్కొనడము ఆత్మ వంచన మాత్రమే. సాధించుకున్న తెలంగాణాను అస్థిరపర్చడానికి వరుస కుట్రలు జరిగాయని వాటిని ఎదుర్కోవడానికి రాజకీయ పునరేకీకరణ అవసరమేర్పడిందని కె.సి.ఆర్ అన్నారనడము దౌర్భాగ్యం. ఒక దుర్నీతిని వెనకేసుక రావడం వ్యాసకర్త స్వామి భక్తికి,  దౌర్భల్యానికి నిదర్శనం. 2014 ఎన్నికలలో 63 సీట్లు , 2018 ఎన్నికలలో  88 సీట్ల తో   పూర్తి మెజారిటీ  సాదించిన, టి.అర్.ఎస్ కు వారి  ప్రభుత్వ సుస్థిరతకు భంగమెక్కడ?   ఇతర పార్టీల నుండి  పిరాయింపులను ప్రొత్సహించడము ఎందుకు? తన శాసన సభ్యుల మీద నమ్మకము లేకనా ? లేదా తమ కుటుంబ పాలనను, ఆగడాలను అడ్డుకునే ప్రతిపక్షాలను శాసన సభలలో  నిర్వీర్యం చేయడానికా..? ఆ విషయాన్ని వ్యాసకర్త విఙతకే వదిలేస్తున్నాను. ప్రతిపక్ష పక్ష పాత్ర పోషించలేని దుర్గతి లో ఉండడము వలననే  వారు ఆయా పార్టీలను వదిలి తెరాస లో చేరడానికి కారణమని ఆయన అన్నారు. సరే,  కె.సి.ఆర్ కు  ప్రతిపక్షం బలముగా ఉండాలనే చిత్తశుద్ది ఉన్నదా? ఉంటే ప్రతి పక్ష సభ్యులను మభ్య పెట్టి లాగడమెందుకో ? ఈ దుర్గతి లోకి నెట్టేయడమెందుకో ఆయన వివరించ గలరా ? అని ప్రశ్నిస్తున్నాను. ప్రతి పక్షాలను నిర్వీర్యం చేయడమే రాజకీయమనుకుంటే ఈ రాష్ట్రములో ప్రజాస్వామ్యానికి నూకలు చెల్లిన్నట్లేనని వ్యాసకర్త గమనించాలి. రాజకీయ పునరేకీకరణ పేరుతో చంద్రబాబు పంచన ఉండి ఉద్యమకారులపై దాడులు చేసిన  తెలంగాణా వ్యతిరేకులను అందల మెక్కించడము తెలంగాణా ప్రజలను, ఉద్యమకారులను దగా చేయడము కాదా? ఆయన తెలుపాలి. తెలంగాణా ఉద్యమాన్ని అణచి వేసే ప్రయత్నం జరిగిన మాట వాస్తవము. కేవలము జై తెలంగాణా నినాదంతో  తెలంగాణా రాదని వ్యూహాత్మకముగా పోవాలని కె.సి.ఆర్ భావించారన్నారు. కాని ఆయనకంటే వ్యూహాత్మకముగా కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులు, పార్లమెంట్ సభ్యులు వ్యవహరించిన తీరు ప్రస్తావించడాన్ని ఉద్దేశ్య పూర్వకముగానే  మరిచారు. సుధీర్ఘ కాలము పోరాటము జరిగినా, బలిదానాలు జరిగినా తెలంగాణా రాష్ట్రము కేవలము జై తెలంగాణ నినాదాల తో రాలేదని, శ్రీమతి సొనియా గాంధీ చిత్తశుద్ధి, కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుల వ్యూహాత్మక అడుగులతోనే సాధ్యమైనదనే వాస్తవాన్ని వ్యాసకర్త  గమనిస్తే ప్రజలు హర్షిస్తారు.

 


కె.సి.అర్ ది ఎప్పుడూ రాజీనామాల బాటనే, కాని అటు అసెంబ్లీ ఇటు పార్లమెంట్ లో క్రీయాశీలకముగా వ్యవహరించడానికి మన సభ్యుల అవసరముంటుదనే ద్యాస ఆయన కెప్పుడూ లేదు. అందుకే తెలంగాణా కాంగ్రెస్ సారధ్య బృందము "రాజీనామాలు ఆత్మహత్యా సదృశ్యము" అని ప్రకటించి వ్యతిరేకించినది. లోక్ సభ మరియు రాజ్య సభలలో కాంగ్రెస్ సభ్యులు ఉండి తెచ్చిన వత్తిడి వల్లనే తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైనదనేది  నిర్వివాదాంశం. లోక్ సభలో,  రాజ్య సభలో  తెలంగాణా బిల్లు ఆమోదం పొందటం ఒక్కడే ఒక్కడైనా కె.సి.ఆర్ తో సాధ్యమయ్యే దా? వ్యాసకర్త  ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఉద్యమాన్ని నీరు కార్చడానికి, బిల్లు పాసు కాకుండా చేయడానికి చంద్రబాబుతో సహా ఆంద్ర శక్తులు తీవ్రంగా ప్రయత్నం చేసిన మాట వాస్తవమే అయితే వాళ్లను ఎదురుకునే బలము లేని కె.సి.ఆర్ ను వ్యాసకర్త  గొప్పగా చూపే ప్రయత్నం చేశారు. లోక్ సభలో లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్ప్రేతో గందరగోళము సృష్టించినప్పుడు  కె.సి.ఆర్ ఎక్కడుండెనో  వ్యాసకర్త వివరిస్తే బాగుండేది. ఇతర పార్టీల  నుండి వచ్చిన వారిని చిల్లర రాజకీయాలకు వాడుకోవడము లేదని వ్యాసకర్త  వాస్తవాలను కప్పి పుచ్చి పేర్కొన్నారు.?

 

హుజూరాబాద్ ఎన్నికల దృష్ట్యా  కాంగ్రెస్ ను వీడి టి.అర్.ఎస్ లో చేరిన కౌశిక్ రెడ్డి కి, పార్టీలో చేరిన పది రోజులలో నామినేటడ్ ఎమ్ఎల్ సి పదవికి ఎంపిక చేయడము చిల్లర రాజకీయము కాక మరేమిటో ఆయన  చెప్పాలి. ముఖ్యమంత్రి అమలు చేస్తున్న అభివృద్ది, సంక్షేమ పథకాల  పట్ల ఆకర్షితులై,  తమ నియోజకవర్గాల అభివృద్దికి పార్టీలు మారితే తప్పేమిటని రచయిత నిస్సిగ్గుగా ప్రశ్నించారు. అంటే కెసిఆర్ రకమైన ప్రజాస్వామ్యాములో  అన్ని నియోజకవర్గాల అభివృద్ది సమాన ప్రాతిపదికన జరుగదు. ప్రతిపక్షాల ఎమ్.ఎల్.ఎ లు తమ పార్టీ లో  చేరితే కాని అభివృద్ది జరుగదని వ్యాసకర్త స్పష్టం చేస్తున్నారు. భవిష్యత్ లో మరికొందరు పార్టీ మారినా, తెరాస లో చేరినా ఆశ్చర్యం లేదేమో? అని చెప్పడము, తెరాస భవిష్యత్ కుత్సిత్స రాజకీయాలకు అద్దము పడుతుంది. ప్రజాస్వామ్యము బలముగా ఉండాలంటే  బలమైన ప్రతి పక్షముండాలి. బలమైన నాయకుడు ధీటైన ప్రత్యర్తిని కోరుకుంటాడు. గౌరవిస్తాడు. పిరికిపంద మాత్రమే ప్రత్యర్థిని దొంగ దెబ్బ తీసే ప్రయత్నిస్తాడు. అది ప్రజా స్వామ్యానికి హానికరం. టి.ఆర్.ఎస్, కెసిఆర్ వి  అవినీతిమయమైన పిరికిపంద  రాజకీయాలు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణా ను అప్పుల పాలు చేస్తూ తమ కుటుంబాన్ని అందలమెక్కించడానికి శతవిధాల ప్రయత్నిస్తూ రోజు రోజుకు తన ప్రతిష్టను దిగజార్చుకుంటున్న సమయములో  ఈ వ్యాసము వ్యాసకర్త ప్రతిష్టను దిగజార్చేలా ఉందని చెప్పక తప్పదు. బంగారు తెలంగాణా అని మభ్యపెడ్తూ బంగారము యొక్క విలువను కూడా మంటగలిపే ప్రయత్నం చేయడము తగదని వ్యాసకర్త గ్రహిస్తే మంచిది.

జి.నిరంజన్ 

సీనియర్ ఉపాధ్యక్షులు

తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: