చుండూరు అమరవీరుల స్మృతి దినోత్సవం

కుల మతాల మధ్య వివక్ష తార తమ్యాలను నిర్మూలిద్దాం

-కులాలు మతాల మధ్య ఉన్న అడ్డు గోడల్ని కూలుద్దాం 

ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే వివక్షను నిర్మూలిద్దాం సమ సమాజం వివక్ష తార తమ్యాలు లేని జీవన విధానాన్ని ఆచరిద్దా౦ చుండూరు మాలలపై అమానుష దాడి... ఆగస్టు 06, 1991  తదనంతర పరిణామాలు. రాజ్యాంగం ఇచ్చిన సర్వమానవ సమానత్వ స్పూర్తితో కల్పించబడిన ప్రాతినిధ్య హక్కుల అమలులో పాలక కులాలు ఎన్నో అవాంతరాలు కల్పించనప్పటికీ., దళితులు విద్యా సముపార్జన ద్వారా ఒక చైతన్యవంతమైన సమాజంగా పరిణామం చెందడం ప్రారంభమైంది.. విద్యా ఉద్యోగ అవకాశాలలో ముందడుగు వేస్తూ, తమ జీవనం కోసం అగ్రకులాల మీద ఆధారపడడం తగ్గడంతో కుల వ్యవస్థ బానిస సంకెళ్లకు తెంచుకుని, ఆధిపత్య కులాలకు పుట్టుకతో సంక్రమిపజేయబడిన కొన్ని అన్యాయమైన హక్కులను ప్రశ్నించడం మొదలు పెట్టింది దళిత సమాజం,, దళితులలొ వస్తున్న ఈ ప్రశ్నించే స్వభావాన్ని జీర్ణించుకోలేక అగ్రవర్ణాలు, ఎప్పటికప్పుడు దళితుల మీద దాడులకు, దోపిడీలకు తెగబడుతూనే ఉన్నాయి.. ఆ క్రమంలో జరిగిన అమానుష కాండనే.. చుండూరు నరమేధం..

         గుంటూరు జిల్లాలో ఓ అగ్రవర్ణ సామాజిక ఆధిపత్యం ఎక్కువ ఉన్నప్పటికీ, తెనాలి మండలంలో ఒక అభివృద్ది చెందిన గ్రామం అయిన చుండూరు మరియు పరిసర ప్రాంతంలో మరో సామాజిక వర్గం ఆధిపత్యం అధికంగా ఉండేది... అక్కడ మాలలు బాగా చదువుకుని విద్యలో ముందు ఉండి, రైల్వే మొదలగు ప్రభుత్వ సంస్థలతో పాటు, మార్కెట్ ప్రాంతమైన తెనాలిలో చిన్న చిన్న ఉద్యోగాలు సంపాదించుకుని గౌరవమైన జీవితాలు గడుపుతూ ఉండేవారు.. విద్య ఉపాధి కోసం అగ్రవర్ణాల మీద ఆధారపడే అవసరం లేకపోవడంతో, వీరి మీదఅజమాయిషీ చెలాయించే అవకాశం లేక అగ్రవర్ణ అహంకారం దెబ్బతిన్నది..

        దీని వలన ఎన్నో గొడవలు జరిగినప్పటికీ, ఆత్మాభిమానంతో సంఘటితం అయిన మాలలను ఎదుర్కొవడం సాధ్యం కాక ప్రతీసారీ రాజీ పడాల్సి వచ్చింది .. దీనితో ఆర్థికంగా, సామాజికంగా బలమైన అగ్రకులాలన్నింటికీ మాలలు కంటగింపుగా మారడంతో, వీరంతా మాలల మీద కక్ష తీర్చుకొనే అవకాశం కోసం వేచి చూడడం మొదలైంది....

ఘటనా క్రమం 

🔹 జులై 07, 1991 🔹

        అప్పటికే మాలల సామాజిక చైతన్యాన్ని చూసి ఓర్వలేక పోతున్నఅగ్రవర్ణాలు రవి అనే ఒక పోస్టు గ్రాడ్యుయేట్ కుర్రాడు చూపించిన ఆత్మాభిమానాన్ని జీర్ణించుకోలేకపోయారు.. జులై 7 తారీఖున సినిమా హాలులో సినిమా చూసే క్రమంలో గమనించకుండా కుర్రి శ్రీనివాస్ రెడ్డి అనే కుర్రాడికి కాలు తగిలింది.. పొరపాటున జరిగిందని చెబుతున్నప్పటికీ వినకుండా... "మీ....నా కొడుకులకు కొంచెం చదువు అబ్బగానే కళ్ళు నెత్తికొస్తాయి" అంటూ దూషించడం మొదలెట్టడంతో, రవి ఎదురు తిరిగి,, "మీఅగ్రవర్ణ .... కొడుకులకు నెత్తిలో కాక ...వస్తాయా ఏంట్రా" అని చొక్కా పట్టుకున్నాడు..ఆ సమయంలో సినిమా హాల్లో SC లు 100మంది ఉన్నారు. అప్పుడు జరిగిన గొడవలో రవి, మిగిలిన SC యువకులు శ్రీనివాస్ తో ఘర్షణ పడ్డారు.. తరువాత అతను ఒంగోలు వెళ్ళిపోయాడు..

        ఈ ఘటనకు కోపోద్రిక్తులైన అగ్రవర్ణాలు, రవి ఆచూకీ చెప్పమని స్కూల్ టీచర్ అయిన ఆయన తండ్రి భాస్కర్ రావుని తీసుకెళ్ళి తీవ్రంగా కొట్టడం జరిగింది.. ఈ విషయం తెలుసుకుని ప్రమాదం గ్రహించిన రవి ట్రైన్ దిగి చుండూరు రాకుండా, పక్కనే ఉన్న పెదగాదెలవర్రు వైపు పరిగెత్తి ఒక ఇంట్లో తలదాచుకున్నాడు..వెంబడించిన అగ్రవర్ణాలు అతని మీద దొంగతనం అభియోగం మోపి, అక్కడే దాక్కున్న రవిని పట్టుకుని కొట్టి , మళ్ళీ చుండూరుకు తీసుకొచ్చి తీవ్రంగా కొట్టి, అవమానించారు.. బలవంతులైన అగ్రవర్ణాలతో గొడవ పడడం ఎందుకని, భాస్కర్ రావు గారు, ఆ విషయాన్ని బయటికి చెప్పలేదు..

        ఆప్పటికే సంఘటితంగా ఉన్న మాలలు, ఇంత జరుగుతున్నా కుల పెద్దలకు చెప్పి పోలీసు కంప్లైంట్ ఇవ్వకుండా లొంగిపోయినందుకు భాస్కర్ రావు కుటుంబానికి 25 రూ॥ జరిమానా విధించారు... అగ్రవర్ణాల దాడులను ప్రశ్నించడంతో అహం దెబ్బ తిన్నఅగ్రవర్ణాలు కులస్తులు, కలిసి మాలలను సాంఘికంగా బహిష్కరించాలని తీర్మానం చేసి వారి భూములలో ఆ వూరి దళితులను పని చేయకుండా నిర్ణయించారు... దళితులను వారి నివాస ప్రాంతాల్లో రోడ్డు మీద నడవడాన్ని కూడా నిషేదించారు.. దీనితో నెలకొన్న ఘర్షణ వాతావరణాన్ని సరి చేయడానికి సెక్షన్ 144 విధించి.. సర్కిల్ ఇన్స్పెక్టర్ సాయిబాబు ఆధ్వర్యంలో అగ్రకులాల రక్షణ కొరకు పోలీసు పికెట్ ఏర్పాటు చేసింది అప్పటి  ప్రభుత్వం..

       ఇలా మాలలు తిరగబడకుండా నిరోధించేందుకు పోలీసు పికెటింగు ఏర్పాటు చేయించుకుని, July 12 వ తేదీన., చుండూరు అగ్రవర్ణాలు, మొదుకూరు, దుండిపాలెం, వలివేరు మొదలైన గ్రామాల అగ్రవర్ణాలను కలుపుకుని మాల పల్లి పై దాడి చేశారు..ఆ దాడిని సమర్ధవంతంగా తిప్పికొట్టడంతో అగ్రకులాలు చెల్లా చెదురుగా పారిపోయారు..  దీంతో కండ బలంతో మాలలను ఎదుర్కోలేమని గ్రహించి, పోలీసుల సాయంతో పథక రచన చేసారు...

🔹 ఆగస్టు 04, 05,, 1991 🔹

        ఆగస్టు 4 న రాజబాబు అనే కుర్రవాడు టీ కొట్టు దగ్గర పేపరు చదువుతుండగా, తమ అమ్మాయిలను ఏడిపించాడు అనే నెపం వేసి తీవ్రంగా కొట్టి, తిరిగి వాళ్ళే పోలీసు రక్షణ కోరి మాల పల్లిని పోలీసు నిర్బoధంలో ఉండేలా చేసారు... తరువాతి రోజు.. అంటే ఆగస్టు 5 న, ముందురోజు ఘటన పై వివరణ కోరుతూ, రేషన్ దుకాణం నడుపుతున్న యాకోబుకి తహసీల్దారు సమన్లు జారీ చేయడంతో,తహసీల్దారు కార్యాలయంలోకి వెళుతున్న యాకోబుని పట్టుకుని కత్తితో పొడిచి, తీవ్రగాయాల పాలు అయ్యేలా చేయడంతో అతనినిసబ్ ఇన్స్పెక్టర్ రక్షించి తెనాలి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించాడు... ఆరోజు చాలా మంది యాకోబుని చూడడం కోసం తెనాలి వెళ్ళగా, అదే అదునుగా భావించి, వారు పోలీసు సాయంతో రూపొందించుకున్న కుట్రను అమలు చేసారు..

🔹 ఆగస్టు 06, 1991🔹

         మాలలతో ఎదురు పడి పోరాడే దైర్యం లేక, CI సాయిబాబు ఆధ్వర్యంలో పోలీసులతో "మిమ్మల్ని అరెస్టు చేయడానికి మంగళగిరి నుండి CRPF వాళ్ళను తెప్పిస్తున్నారు ఊరు వదిలి పారిపోయి ప్రాణాలు దక్కించుకోమంటూ" వాళ్ళను భయపెట్టసాగారు., అప్పటికీ వాళ్ళు ససేమిరా అనడంతో వాళ్ళని బలవంతంగా అక్కడి నుండి పొలాల్లోకి తరిమారు...

           ముందుగా అనుకున్న పథకం ప్రకారమే, చుండూరు, మోదుకూరు, మెదలగు గ్రామాల అగ్రవర్ణాలు బృందాలుగా ఏర్పడి, ఇనుపరాడ్లు, కత్తులు, గొడ్డళ్ళతో సిద్ధంగా ఉన్న చోటికే, పోలీసులు తమని తరుముతున్నారనే విషయం తెలియక, అటువైపు పరుగులు తీసి అగ్రవర్ణాల మూకలకు చిక్కారు...

🔹  ఆ ఘటన ఎంత హేయమైన అమానవీయ కాండో, తృటిలో చావుని తప్పించుకున్న అప్పటికి 18 సం॥ల యువకుడైన దాయిరి ధనరాజ్ మాటల్లో తెలుస్తుంది... --          దేవరపల్లి జయరాజు, మండ్రు రమేష్ లతో పాటు పొలాల్లో పరిగెడుతున్న ధనరాజ్ ను మోదుకూరు అగ్రవర్ణాలు  ట్రాక్టర్లు, స్కూటర్లు వేసుకుని వెంబడించి పట్టుకోబోయారు., వారికి మండ్రు రమేష్, జయరాజు దొరికిపోగా విచక్షణా రహితంగా గొడ్డళ్ళతో నరికారు, వారినుండి తప్పించుకున్న ధనరాజ్ ను ఇంకోఅగ్రవర్ణాల బృందం పట్టుకుని, ఇనుప రాడ్లతో కొడుతూ తీవ్రంగా హింసించసాగారు, ఇంతలో అందులో ఒకరు, తమ గ్రామంలో మల్లికార్జున అనే వికలాంగుడికి కూడా కనీసం ఒక దళితుడినైనా చంపాలని ఆశ కాబట్టి వీడిని ఇక్కడే పారిపోకుండా ఉంచి ఆ వికలాంగుడిని తీసుకొచ్చి చంపిద్దాం అనుకుని... ఇనుప రాడ్డుతో కాలు విరగ్గొట్టి, పొలాలలో దొరికిన పశువుల ఇంజక్షన్ తో అతి క్రూరంగా రక్తాన్ని బయటకు లాగి ఇక పారిపోలేడని నిర్ణయించుకున్నాక అక్కడి నుండి మల్లికార్జున కోసం వెళ్ళడంతో, ధనరాజ్ పక్కనే ఉన్న కాలువలో దూకి ఈత కొట్టుకుంటూ తన ప్రాణాలు కాపాడుకున్నాడు...

--            ఆ సమయానికి తను కొత్తగా కొన్న అర ఎకరం పొలంలో పని చేసుకుంటున్న రూబేను చెప్పిన దాని ప్రకారం ఆగస్టు 7 వ తేదీన మల్లె పొదలలో ఉన్న జాలాది ఇమ్మానుయేలు, జాలాది ముత్తయ్య, మల్లెల సుబ్బారావు మృతదేహాలు కనుగొనడం జరిగినది.. జాలాది ఇమ్మానుయేలు మృతదేహం మీద అసంఖ్యాక కత్తి పోట్లు ఉన్నాయి, మెడ మీద లోతుగా నరికినట్లు తెలుస్తుంది, ముత్తయ్య మృతదేహం అయితే మరీ ఘోరం, తను బ్రతికి ఉండగానే చేయి నరికి శరీరం నుండి వేరు చేసి పారేయడం బట్టి చూస్తే అక్కడ వర్ణించడానికి మాటలు చాలని ఎంత దారుణ హింసాకాండ జరిగినదో అర్థం అవుతుంది.

--       మిగతావారు తప్పించుకుని పారిపోయి ఉంటారు అనుకున్నప్పటికీ, ఆగస్టు 8 న అంగలకుదురు రాజమోహన్ (మాదిగ) శవాన్ని మూట కట్టి ఉన్న గోతాం, పక్కనే ఉన్న తుంగభధ్ర కాలువలో దొరకడంతో అనుమానం వచ్చి మిగతావారి ఆనవాలు కోసం వెతుకగా కొంచెం దూరంలో జాలాది ఇస్సాకు శవం గల గోతా మూట దొరికింది, అక్కడి నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంటూరి లాకుల వద్ద సంకురు సాంసోను మరియు దేవరపల్లి జయరాజుల మృత దేహాలు గలిగిన మూటలు, ఇంకొంచెం దూరంలో మోదుకూరు-ఆలపాడు రోడ్డు దగ్గర ఒక పంట కాలవలో మండ్రు రమేష్ శవం కలిగిన గోనె సంచి దొరికింది...

ప్రపంచ చరిత్రలో మానవత్వానికే మచ్చగా చెప్పే విధంగా ఇంత దారుణంగా చంపి ముక్కలు చేసి గోనేసంచిలో కట్టి నీళ్ళలో విసరడం, అగ్రవర్ణాల పైశాచికత్వానికి నిదర్శనం... ఆ శవాలు ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయంటే., తన తమ్ముడు మండ్రు రమేష్ మృతదేహాన్ని తెనాలి ప్రభుత్వ ఆస్పత్రిలో చూసి తట్టుకోలేక మండ్రు పరిశుద్ధ రావు అక్కడికక్కడే గుండె పోటుతో చనిపోయాడు., ఈ శవాల పరిస్థితిని చూసి చలించిపోయిన డాక్టరు పోస్టు మార్టం చేసిన తరువాత ఆత్మహత్యకు పాల్పడ్డాడు..

--           ఇంత ఘోరాతిఘోరం జరుగుతుంటే అక్కడే పికెట్ లో ఉన్న పోలీసు బృందం మాట్లాడకపోగా, అగ్రవర్ణాల పిల్లలు స్కూల్ నుండి క్షేమంగా రావడానికి పోలీసు వాహనాలు పంపి తమ స్వామి భక్తి చాటుకున్నారు.. కావాలని మాలలను మృత్యు కుహారాల వైపు ఎగదోసిన పోలీసులు, ఆ పొలాల్లోకి పరిగెత్తిన వారి అరుపులు విని వారి స్త్రీలు కాపాడమని కాళ్ళు పట్టుకుని వేడుకుంటుంటే కరుణించకపోగా.. "అవి అరుపులు కాదు, వాళ్ళు పొలాల్లో పనిచేస్తూ ఆహ్లాదం కోసం పాటలు పాడుకుంటున్నారు" అని వెకిలిగా మాట్లాడుతూ వికృతానందం పొందారు.. అదే రాత్రి మాల పల్లి మీద దాడి చేసి ఇళ్ళను ద్వంసం చేసిన అగ్రవర్ణాల ముఠాలతో చేతులు కలిపి "మీ దగ్గర ఏముంది బూడిద అదే వారి పక్కన ఉంటే డబ్బుల కట్టలు వస్తాయి" అని సిగ్గు లేకుండా మాట్లాడి పోలీసు వ్యవస్థనే అసహ్యించుకునేలా చేసారు..

--           తరువాత కూడా అక్కడ అలాంటి ఘటనలు ఏమీ జరగలేదంటూ బుకాయించి కేసు కూడా నమోదు చేయలేదు.. ఆగస్టు7 న మూడు శవాలు దొరికిన తరువాత మాత్రమే పై స్థాయి పోలీసు యంత్రాంగం ముందుకు కదిలింది.. ఇంత భయంకరమైన హత్యాకాండ జరిగితే కొన్ని అగ్రవర్ణాల పత్రికలు కూడా దానిని గుర్తించడానికే ఇష్టపడక తనకు దళితుల మీద ఉన్న వివక్షను బయట పెట్టుకుంది...

తదనంతర పరిణామాలు

🔹 ఆగస్టు 10, 1991- చుండూరు మీద దండెత్తిన మాలలు 🔹

      ఆ నోటా ఈ నోటా పాకిన మాలల మీద మారణకాండ విషయం చుట్టూ పక్కల మాల పల్లెలను చుండూరు వైపు కదిలేలా చేసింది..  ఏ నాయకుడు లేకుండా, సంఘం పిలుపు లేకుండా,, మాలలు స్వచ్చందంగా 20 వేల మంది వరకు చుండూరులో పొగయ్యారు.. అందరూ కలిసి మాల అమరవీరులను చుండూరు నడిబొట్టున ఖననం చేయాలని నిర్ణయించారు.. ఈ విషయం అనోటా ఈనోటా పాకింది.. అగ్రకులాలు మాలల మీద మళ్లీ దాడి చేసేందుకు సిద్ధం అయ్యాయి.. ఈసారి మాలలు కూడా పూర్తి ఏర్పాట్లతో సిద్ధం అయ్యారు..

      పోలీసులను ఛేదించి, శవయాత్రను అగ్రవర్ణాల ఇళ్ల మధ్య నుండి తీసుకువెళ్లేందుకు నిర్ణయించారు.. మాల అమరవీరుల శవయాత్ర అగ్రవర్ణాల కాలనిలోకి రాగానే అగ్రవర్ణాల ఇళ్లలో నుండి ఇటుకరాళ్లు, రాళ్లు విసరడం మొదలుపెట్టారు.. మాలల కోపం కట్టలు తెంచుకుంది.. మాలలు అక్కడ అగ్రవర్ణాలను ఇళ్ళలో దూరి లాక్కొచ్చి కొట్టడం మొదలుపెట్టారు.. ఈ ఘర్షణలలో గొర్రెపాటి మల్లారెడ్డి మరణించడం జరిగింది. పోలీసుల ప్రమేయంతో ఇరువర్గాలు శాంతించాయి.. అగ్రవర్ణాల ఇళ్ల మీద ప్రతిదాడి చేస్తూ ముందుకు సాగి.. అమరవీరులను చుండూరు నడిబొడ్డున ఖననం చేశారు.. 

        మాలల ఈ తిరుగుబాటు,, అగ్రవర్ణ అహంకారం మీద దెబ్బ కొట్టింది.. దీనితో రాష్ట్రవ్యాప్తంగా అగ్రవర్ణాలు తమ ఈగోకి సంబంధించిన విషయంగా తీసుకున్నారు.. కారంచేడు ఘటనలో ఈ దురాగతాలకు తాము పాల్పడలేదు అని బొంకిన అగ్రవర్ణాలు, ఈ సారి పూర్తిగా తమ పంథా మార్చుకున్నాయి... అగ్ర కులాలన్నీ ఏకమై పూర్తిగా సిగ్గు విడిచి ఈ దాడులు మేమే చేసాం మరియు ""ఇలాంటి చుండూరులు చాలా జరుగుతాయి"" అంటూ దళితులను భయభ్రాంతులకు గురి చేయాలని ప్రయత్నాలు చేసింది..

--        అగ్రకులాలన్నింటినీ ఒక తాటిమీదకు తేవడానికి బీహార్ రణవీర్ సేన తరహాలో "సర్వ జనాభ్యుదయ పోరాట సమితి" పేరుతో ఒక వేదికను ఏర్పాటు చేసుకుని ఆగస్టు 17 న గుంటూరు బందుకు పిలుపునిచ్చారు.. ఈ అగ్రకుల దౌర్జన్యపరులు ఒక చోట చేరి, తమ బల ప్రదర్శనలో భాగంగా దళితులు అధికంగా చదువుకుంటున్న ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీ మీద పెట్రోలు బాంబులతో దాడి చేసి దొరికిన దళిత విధ్యార్థులపై విచక్షణారహితంగా దాడి చేసారు... ఆ దాడిని ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీ విద్యార్థులు విజయవంతంగా తిప్పికొట్టి, అగ్రకుల రౌడీ మూకలను తరిమి కొట్టారు..

"ఇలాంటి చుండూరులు ఇంకా చాలా జరుగుతాయి... ఖబద్దార్

"అడుక్కు తినే వాళ్ళకి ఆత్మాభిమానమెందుకు"

          అంటూ అగ్రకుల దురహంకార పూరితమైన నినాదాలు చేస్తూ ప్రదర్శనలు చేస్తూ దళిత వాడలపై దాడులు చేసారు..

        ఇంత జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు పోలీసులు.. అగ్రకుల మీడియా కూడా వీరికి విస్తృతమైన ప్రచారం కల్పించి వీరిని దేశోధ్ధారకులుగా చిత్రీకరించింది..

 దళిత మహాసభ పోరాటం

          ఈ ఘటనలు అన్నీ, దళితుల్లో భయాన్ని కల్పించకపోగా ఒక రాష్ట్ర వ్యాప్త ఐక్య ఉద్యమాన్ని నిర్మించుకుని, పోరాటాలు చేయాల్సిన అవసరాన్ని గురించేలా ప్రేరేపించాయి... కత్తి పద్మారావు గారి ఆధ్వర్యంలో ఒక దళిత ఐక్య ఉద్యమం ఉవ్వెత్తున లేచి, దళిత ఐక్యపోరాటాలకు కార్యరూపం కల్పించింది.. ఈ ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నాలలో భాగంగా పద్మారావుగారిని నిర్భంధించడం, దళితుల ప్రదర్శనల మీద పోలీసులతో దాడులు చేయించడం లాంటి పనులకు పూనుకుంది అప్పటి ప్రభుత్వం

        అదే క్రమంలో సెప్టెంబరు 10 వ తేదీన శాంతియుతంగా ధర్నా చేస్తున్న సభ మీద పోలీసులతో దాడి చేయించి, ప్రధాన సాక్షి, మరియు యువ నాయకుడిగా ఉన్న కొమ్మేర్ల అనిల్ కుమార్ నే ధ్యేయంగా చేసుకుని కాల్చి చంపి హత్య చేయించారు..

       ఇలా ఎన్ని అవాంతరాలు కల్పిస్తున్నప్పటికీ ఉద్యమం రోజురోజుకూ, బలపడుతూ, తీవ్ర రూపం దాలుస్తూ జాతీయ స్థాయిని ఆకర్షిస్తుండడంతో అగ్రకులపార్టీలు నష్ట నివారణ చర్యలకు దిగి రాజీ ప్రయత్నాలు ప్రారంభించాయి.. ""న్యాయం కావాలి.. పరిహారం కాదు"" నినాదంతో ముందుకు వెళుతున్న ఉద్యమం, SC ST చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి, కేసులో జాప్యం నిరోధించేందుకు SC ST చట్టం ప్రకారమే ప్రత్యేక కోర్టు చుండూరులో ఏర్పాటు చేయాలని చేసిన డిమాండుకు తల ఒగ్గి పార్టీలకు అతీతంగా 107 మంది MP లు స్వచ్చందంగా ముందుకు కదిలి ప్రధాని రాష్ట్రపతులతో సమావేశమై, 1993లో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయడానికి సహకరించారు.. మొత్తం 219 మంది మీద 12 FIR లు నమోదు చేసారు...

         అప్పటికీ అడుగడుగునా అవాంతరాలు ఏర్పరిచి కేసుని నీరుగార్చే ఉద్దేశంతో, విచారణలకు సహకరించకుండా కేసు తీర్పు జాప్యం చేయించేందుకు ప్రయత్నాలు చేసాయి అగ్రకుల ప్రభుత్వాలు., వీటితోపాటుగా దళితుల ఐక్యతను దెబ్బ తీసే చర్యలకు ఒడిగట్టి ఉద్యమాన్ని దెబ్బ కొట్టడంలో సఫలీకృతం అయ్యాయి..

🔹ఇప్పటికీ దక్కని న్యాయం 🔹

      చంద్రబాబు రాజకీయ ప్రవేశం, వర్గీకరణ చిచ్చుతో దళితుల ఐక్యతను ముక్కలు చేయడం వలన ఉద్యమం బలహీనమై, 16 ఏళ్ళ తరువాత జులై 31,2007 న ప్రత్యేకకోర్టు 123 మంది మీద సాక్ష్యాలు లేవని విడుదల చేసి కేవలం 21 మందికి జీవిత ఖైదు, 35 మందికి ఒక సంవత్సరం శిక్షతో సరిపెట్టి కంటితుడుపు తీర్పు వెలువరించినపుడు బలంగా పోరాటం చేసే నాయకులే కరువైపోయారు...

       మళ్ళీ హై కోర్టులో కేసు వెళ్ళినప్పటికీ న్యాయ వ్యవస్థలో గూడుకట్టి ఉన్న అగ్రకుల ఆధిపత్యం ముందు కేసు నిలవలేకపోయింది., దళితులు పోరాడి స్పెషల్ పబ్లిక్ల్ ప్రాసిక్యూటర్ గా నియమించుకున్న బొజ్జా తారకం గారితో ప్రభుత్వాలు గానీ, పోలీసులు గానీ సహకరించకపోవడంతో విచారణలో తీవ్ర జాప్యం జరిగేలా చేసి, దళిత ఉద్యమం నీరుకార్చిన తరువాత తీర్పు వెలువరించేలా రూపొందించిన కుట్రలో, అగ్రకుల ఆధిపత్య  న్యాయ వ్యవస్థ నిస్సిగ్గుగా పాలుపంచుకుంది..

ఆఖరికి ఘటన జరిగిన 23 సంపత్సరాలకు, 22 ఏప్రిల్ 2014, ఎల్. నరసింహ రెడ్డి, ఎం. ఎస్. కే. జైస్వాల్ లతో కూడిన హైకోర్టు ధర్మాసనం, మనుధర్మాన్ని మళ్ళీ వల్లిస్తూ అందరినీ నిర్దోషులుగా విడుదల చేసి తన అగ్రవర్ణ ఆలోచనా విధానాన్ని మరొక సారి చాటుకుంది..

🔹  భావి దళిత నాయకత్వం నేర్చుకోవాల్సిన పాఠాలు 🔹

         23 ఏళ్ళ ఈ అవిశ్రాంత ఉద్యమంతో ముఖ్యంగా 4 అంశాలు గమనించవచ్చు..

1) మొదటి అంశం:- రాజకీయ వ్యవస్థ:- 

         ఇక్కడ మనం ఇప్పటి దాకా ఇలా దాడి జరిగిన సందర్భాలను కారంచేడు నుంచీ గమనిస్తే, దాడి చేసిన వారు అధికారంలో ఉన్న కులాలు గానీ అధికారంలో ఉన్న కులాలతో సన్నిహిత సంబంధాలు గల కులాలు గానీ అవ్వడం గమనించవచ్చు... తరువాత ఒక కులం ఆధిపత్యం ఉన్న పార్టీ పోయి మరో కుల ఆధిపత్యం ఉన్న పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా, దళితులకు వ్యతిరేకంగా వారి ప్రయోజనాలు కోసం ఒకరికొకరు సహకరించుకుంటూనే ఉంటారు.. అంటే దళితుల పట్ల అగ్రకుల వైఖరి ఒకే విధంగా ఉంటుందని గ్రహించి వారి మాయలో పడి ఐక్యతను దూరం చేసుకోకూడదు..

2)రెండవ అంశం:- పోలీసు వ్యవస్థ:-

       ఇప్పటి దాకా జరిగిన ప్రతీ దాడిలో పోలీసు వ్యవస్థ మొత్తం అగ్రకులాల కాపలా కుక్కగా మాత్రమే వ్యవహరించి, అగ్రకులాల దాడులను ఏమాత్రం ఆపకపోగా సహకరించి, దళితుల నుండి ప్రతిఘటనను మాత్రం నిరోధించి ఒక "న్యాయమైన యుద్ధం" జరగకుండా మాత్రమే నిరోధించినది.

3)మూడవ అంశం:- న్యాయ వ్యవస్థ:- 

        మనువాదాన్ని మోస్తూ దళితులకు సంబంధించిన కేసుల మీద చిన్న చూపుతో కావాలనే జాప్యం చేస్తూ కేసులను నీరుగారేట్టు చేసి, అగ్రకులాలతో రాజీపడడం తప్ప వేరే మార్గం లేని పరిస్థితులను కల్పించడంలో న్యాయ వ్యవస్థ కీలక పాత్ర పోషించడం ఇక్కడ ముఖ్యంగా గమనించాలి. ఆ కుట్రలో భాగమే 2014లో సుప్రీంకోర్టులో వేసిన కేసు నేటికీ విచారణకు రాకపోవడం.

4)నాలుగవ అంశం:- మీడియా:- 

        దళిత సమస్యలు పట్టనట్టు వ్యవహరిస్తూ, అగ్రకుల అనుకూల విధానాలకు విస్తృత ప్రచారం కల్పించి, అగ్రకుల భావజాలాన్ని ప్రజల మెదళ్ళ మీద రుద్ధేందుకు చేసే నిరంతర కృషిని గమనించాలి... మండల్ కమీషన్ వ్యతిరేక ఉద్యమాన్ని దేశ వ్యాప్తంగా విస్తృత పరిచేందుకు వెనక ఉన్న మీడియా పాత్రను మనం ఇక్కడ ఉదాహరణగా చెప్పుకోవచ్చు..

దీనిని బట్టి మనకు అర్థం అవుతుందేమిటంటే పైన పేర్కొనబడిన వ్యవస్థలన్నీ అగ్రకులాలు తమ ప్రయోజనాలు కాపాడుకోవడానికి ఏర్పరచుకున్న వనరులే గానీ, వాటికి ఈ దేశ మూల వాసులైన ప్రజల బాగోగులు ఏ మాత్రం పట్టవని తెలుసుకొని., తమ అభివృద్ధికి తామే కృషి చేసుకుంటూ ముందడుగు వేస్తూ, సామాజికంగా చైతన్యవంతం అవుతూ, ఐక్యత తో రాజకీయ శక్తిగా పీడిత కులాల ప్రజలు ఎదగాల్సిన అవసరం ఉంది...

         బాబా సాహెబ్ చెప్పినట్లు "మేకలను బలి ఇస్తారు గానీ, పులులను కాదు" అందుకే స్వయం వికాసమనే నినాదంతో ముందుకు వెళ్ళి దళిత ఆత్మగౌరవ పోరాటాలతో పులులుగా మారాల్సిన అవసరం ఉంది...

"చరిత్ర నుండి పాఠాలు నేర్చుకోకపోతే, చరిత్ర మీకు గుణపాఠం నేర్పుతుంది" అన్న బాబాసాహెబ్ అంబేద్కర్ మాటలను గుర్తు చేసుకుంటూ, జరిగిన చరిత్రనుండి పాఠాలు నేర్చుకుని, అందుకు తగిన వ్యూహాలను నిర్మించుకుంటూ భవిష్య పీడిత కులాల నాయకత్వం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది...

అలా ముందుకు వెళ్ళడానికి స్పూర్తినిచ్చే క్రమంలో తమ ప్రాణాలు త్యాగం చేసిన చుండూరు అమర వీరులకు నివాళులు అర్పిస్తూ.

*జై భీమ్.!!జైమీమ్ 

రచయిత-ఉమర్ ఫారూఖ్ ఖాన్

జాతీయ అధ్యక్షుడు

ముస్లిం నగారా&టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ 


,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: