సీనియర్ సినిమా పాత్రికేయలు,,,

శిరోమణి అండా రామారావు ఇకలేరు 


సౌమ్యులు ఆత్మీయ మిత్రులు, సీనియర్ సినిమా పాత్రికేయ శిరోమణి శ్రీ అండా రామారావు గారు ఇవాళ ఉదయం 11 గంటలకు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కనుమూశారు.  ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత  వరకు సినిమా కబుర్లలో మునిగి తేలేవారు!  ఘంటసాల గానామృతం, యుగపురుషుడు  ఎన్టీఆర్ పేర్ల తో వాట్స్ యాప్ లో ప్రత్యేక గ్రూప్ లు ఏర్పాటుచేసి  అనేక విషయాలు అలుపు  లేకుండా పంచుకునే వారు!  అనేక పాటల వీడియో లను అప్ లోడ్ చేసే వారు!  ఫోన్ చేసి గంటకు తక్కువ కాకుండా మాట్లాడే వారు!  ఎన్నో విశేషాలు ఆసక్తిగా నాన్ స్టాప్ గా చెప్పేవారు!  బిజీ గా వున్నా అని చెప్పినా వదిలే వారు కాదు!  గంట మాట్లాడితేనే ఆయనకు తృప్తి! 

హైదరాబాద్ లో జర్నలిస్ట్ కాలనీ లోని స్థలాన్ని అమ్మి ఆదోనిలో ఇల్లు కట్టుకుని అక్కడే స్థిరపడ్డారు!  పిల్లలు లేరు కాబట్టి, ఎక్కడున్నా ఒక్కటే అనే వారు!భార్యాభర్తలిద్దరం అనారోగ్యులమే , ఆసుపత్రికి అందుబాటులో ఉండాలి, ఇంట్లో మందులతో  ఆసుపత్రి  వార్డు గా మార్చుకున్నాం  అని చెప్పేవారు!  1996 లోనే గుండెపోటు కు గురయ్యారు! ఆ తరువాత ఇదంతా బోనస్ జీవితమే అని చెబుతుండే వారు!

ఈనాడులో జర్నలిస్ట్ జీవిత ప్రస్థానం ప్రారంభించారు!  సీనియర్ సబ్ ఎడిటర్ గా ఉంటూ ఉదయం పత్రిక లోకి అడుగు పెట్టి సినిమా పేజీ ఇంచార్జి గా చేశారు!  అనంతరం జయ, రాజు దంపతులు  ప్రారంభించిన సూపర్ హిట్ మేగజైన్ లో చేరారు!   మ్యూజిక్ ఛానెల్ మేగజైన్ సొంతగా ప్రారంభించి నడిపించలేకపోయారు !  ఎం.ఎస్.రెడ్డి గారి దగ్గర పిఆర్ఓ గా పని చేశారు!  

ఘంటసాల అంటే ప్రాణం!  ఎన్టీఆర్ అంటే యమా ఇష్టం!  "మీ ఘంటసాల" పుస్తకం ప్రచురించారు. మురారి  గారు తీసుకొచ్చిన "తెలుగు నిర్మాతల చరిత్ర" పుస్తకానికి సహకారం అందించారు. పాత సినిమాలు, అలనాటి పాటలను అమితంగా ఇష్టపడేవారు! సినిమా రంగానికి సంబంధించిన  సమాచారం పుక్కిట   పట్టి తనకు తానే సాటి అనిపించుకున్నారు! 

వాట్స్ యాప్ లో ఘంటసాల గ్రూప్ లో రోజూ ఎన్నో వీడియొ లు పంపిస్తుండే వారు!  రెండు మూడు రోజులకు ఒకసారి ఫోన్ చేసి విశ్లేషించే వారు! ఆరోగ్యం జాగ్రత్త, అనవసరం గా శ్రమ పడుతున్నారు  అని చెప్పినా వినేవారు కాదు!  పోనీ, పుస్తకం రాయండి అని మూడు రోజుల క్రితమే చెప్పాను!  పుస్తకానికి ముందు "కన్నవి విన్నవి"  శీర్షికతో కళ పత్రిక లో కాలమ్ రాస్తాను అన్నారు!  పది రోజుల్లో పంపిస్తా అని మూడు రోజుల క్రితం చెప్పారు!  అదే రోజు ఆసుపత్రిలో చేరారు!  వెంటిలేటర్ పై ఉండి ఇవాళ తుది శ్వాస విడిచారు!  మంచి సినిమా జర్నలిస్ట్ ను కోల్పోయాం!  మిత్రునికి నివాళి. వారి శ్రీమతి గారికి ప్రగాఢ సానుభూతి 

రచయిత- డాక్టర్ మహ్మద్ రఫీ

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

               

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: