14 ఏళ్ళు అధికారంలో ఉండి,,,
ఎన్ని త్యాగాలు చేశారు
డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి ప్రశ్న
(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ ప్రతినిధి)
వెలిగొండ ప్రాజెక్టు కోసం ప్రాణాలైనా ఇస్తామంటున్న టీడీపీ నేతలు గత పద్నాలుగేళ్లుగా ఇందుకోసం ఎన్ని త్యాగాలు చేశారో ప్రజలకు వివరించాలని వైసీపీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. ప్రాజెక్టు నిర్మాణ దశనుంచి ముగింపు వరకూ వైఎస్ కుటుంబ ప్రమేయమే ఉందని.. టీడీపీ చేసింది శూన్యమని ఆయన అన్నారు. గత ఐదేళ్లలో వెలిగొండలో దమ్మిడి పని చేయకుండా ఇప్పుడు మాత్రం ప్రాజెక్టు కోసం ప్రాణాలు ఇస్తామంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఏలూరి అన్నారు. వెలిగొండలో ఏదో అన్యాయం జరిగిపోతుందని టీడీపీ వగలమారి ఏడుపులు ఏడుస్తుందని ఎద్దేవా చేసిన ఏలూరి.. ప్రజలకు వాస్తవాలు తెలుసు గనుకనే టీడీపీ నాయకులు చేస్తున్న విడ్డూరపు ధర్నాలను పట్టించుకోవడం లేదని చెప్పారు.
ఎక్కడైనా పనులు జరగకుంటే దీక్షలు, ధర్నాలు చేస్తారు.. కానీ పని జరుగుతున్న ప్రాజెక్టు వద్దకు వెళ్లి.. ధర్నాలు చేయడంలో అర్థమేమిటో చెప్పాలన్నారు. ఇక రాయలసీమ, పోతిరెడ్డి పాడు ప్రాజెక్టులు కడితే వెలిగొండకు అన్యాయం జరుగుతుందని టీడీపీ నేతలు గతంలో ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ద్వారా సీఎం జగన్ కు మంచి పేరు వచ్చింది కనుకనే ప్రాంతాల మధ్య చిచ్చు రేపాలని వెలిగొండను తెరమీదకు తెచ్చి అనవసర వివాదాన్ని సృష్టిస్తున్నారని చెప్పారు. ఏమి జరిగినా వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి వచ్చే ఏడాది నీళ్లు ఇచ్చి తీరతామని ఆయన స్పష్టం చేశారు. ఇకనైనా టీడీపీ నేతలు మాత్రం వెలిగొండ విషయంలో విషపు ప్రచారాన్ని మానుకోవాలని సూచించారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: