భారతదేశంలోనే మొదటి రిజర్వేషన్ల పితామహుడు...

ఛత్రపతి సాహు మహారాజ్

ఘన నివాళ్లులర్పించిన ఆంధ్ర బహుజన ప్రజావేదిక


(జానోజాగో వెబ్ న్యూస్-కదిరి ప్రతినిధి)

అనంతపురం జిల్లా, కదిరిలో "ఆంధ్ర బహుజన ప్రజావేదిక" ఆధ్వర్యంలో ఛత్రపతి సాహు మహరాజ్ గారి 148వ జయంతిని ఆయన చిత్ర పటానికి పూలమాల సమర్పించి ఘనంగా జరుపుకోవడం జరిగింది.  భారతదేశ చరిత్రలో దళిత, బహుజనులను బ్రాహ్మణుల పెత్తనం నుండి విముక్తి చేయటానికి సైద్ధాంతికంగా, పాలనపరంగా  మహాత్మ జ్యో తిబాపూలే, ఛత్రపతి శివాజీ ల వారసుడిగా కృషి చేసి భవిష్యత్ భారతానికి సామాజిక న్యాయ, ప్రజాస్వామిక తాత్విక పునాదిని ఏర్పరచి ప్రజల రాజుగా మిగిలిపోయిన మహానీయుడు, రాజర్షి ఛత్రపతి సాహుమహారాజ్ .

         1874 జూన్ 26 న రాధాబాయి, జయసింగ్ ఆబాసాహేబ్ ఘాట్గేలకు జన్మించిన యశ్వంతరావుఘాట్గేనే ఆ తర్వాత కాలంలో సాహు మహారాజ్ గా  ప్రసిద్ది చెందుతాడు. ఘాట్గేలు మహారాష్ట్ర లో వెనుకబడిన తరగతులకి చెందిన కున్భీ, వ్యవసాయం చేసుకొని జీవించేవారు. కొల్హాపూర్ రాజ్యంలో వారసులు లేకుంటే నాల్గవ శివాజీ భార్య రాణీ ఆనందబాయి 1884 మార్చి,17న  దత్తపుత్రుడిగా స్వీకరించి  యశ్వంతరావుఘాట్గేకి ముద్దుగా "సాహు" అని పేరు పెట్టుకుంటది. మూడేళ్ళకే తల్లిని కోల్పోయిన సాహు, 1886 మార్చి 20న తండ్రి మరణంతో 11 ఏళ్ళకే తల్లిదండ్రులిద్దరులేని  వాడైనాడు.

          యుక్తవయసు రాగానే 1894 ఎప్రిల్ 2 న సింహాసనం అధిష్టిస్తాడు సాహు. 1900 వ సంవత్సరం అక్టోబర్ నెలలో ఒక రోజు సాహు మహారాజ్ పంచగంగా నదిలో స్నానం చేస్తున్న సమయంలో బ్రాహ్మణ పురోహితుడు స్నానం  చేయకుండానే వచ్చి సాహు మహారాజ్ క్షత్రియ వంశస్తుడు కానందున ఒక వ్యవసాయం  చేసుకునే కులానికి చెందిన శూద్రుడైనందున ఈశడిoపుతో వేదోక్త మంత్రాల బదులు పౌరాణిక  మంత్రాలు చదివి అవమానిస్తాడు. పుట్టుకతోనే మనిషి కులం నిర్ణయించబడుతుందనీ రాజైనంత మాత్రాన,  దత్తత వచ్చినంత మాత్రాన క్షత్రియుడిగా మారిపోడని వాదనకు దిగుతాడు. ఈ సంఘటన సాహు మహారాజ్ ని మహాత్మ జ్యోతిబాపూలే సత్యశోధక సమాజ్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే వారసత్వాన్ని ఎన్నుకోవడానికి కారణమైతది. బాస్కరరావు జాదవ్ అనే ఉద్యోగిని  "సత్యశోధక్ సమాజ్" నడిపే బాధ్యతలు అప్పచెప్పి "మరాఠ దీనబందు" పేరుతో పత్రికని నడిపించి సత్యశోధక సమాజ తాత్విక దృక్పథాన్ని ప్రచారం చేయించిండు.  


            బ్రాహ్మణేతరులకి పురోహిత శిక్షణనిచ్చేందుకు సత్యశోధక్ సమాజ్ ఆధ్వర్యంలో పాఠశాల ప్రారంభమైంది. కొల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో వందలాది వివాహాలు, వేడుకలు సత్యశోధక్ సమాజ్ పద్దతిలో జరిగాయి.  బ్రాహ్మణేతరులని ఉన్నతోద్యాగాల్లోకి తెస్తే తప్ప వారి సామాజిక హోదాలో, జీవితాల్లో మార్పు రాదని, బ్రాహ్మణ ఆధిపత్యానికి అడ్డుకట్టపడదని భావించిండు.  

             వెనుకబడిన కులాల వారందరికి స్కూల్స్, హాస్టల్స్  ప్రారంభించి విద్యని ఒక ఉద్యమంగా నడిపిండు. కొల్హాపూర్ పట్టణంలో హాస్టల్స్ కాలనీనే నిర్మించిండు. 1901లో జైన హాస్టల్, విక్టోరియ మరాఠ హాస్టల్, 1906లో ముస్లీంలకు, 1907లో వీరశైవ లింగాయత్ లకు, 1908లో అంటరానివారికి, మరాఠాలకీ 1921లో దర్జీ మరియు నేత కులస్తులకి  నామ్ దేవ్ హాస్టల్‌, విశ్వకర్మలకి సోనార్ హాస్టల్స్ నిర్మించిండు. ప్రతి గ్రామంలో కనీసం ఒక ప్రాథమిక పాఠశాలనేర్పరచి  అందరికి, అన్ని కులాల వారికి ఉచిత నిర్భంధ ప్రాథమిక విద్యనందించిండు. మల్లయుద్ధం, క్రీడలు వంటి అంశాల్లో శిక్షణకు క్రీడా పాఠశాలలు ఏర్పాటు చేసిండు. 


 

           జులై 26,1902 భారత దేశ చరిత్రలో ఒక చరిత్రాత్మక దినం. ఆ రోజు ఛత్రపతి సాహు మహారాజ్ ప్రభుత్వం, ప్రభుత్వ పాలన వ్యవహారాల్లో  "ఎవరి జనాభా ఎంతో వారి వాటా అంత" ఉండాలనే ఆలోచనతో  ప్రభుత్వోద్యోగాలన్నింటిలో వెనుకబడినవర్గాల వారికి  50% రిజర్వేషన్ లు కల్పిస్తూ సంచలనాత్మక ఉత్తర్వులని జారీ చేసింది. మొదటిసారిగా బ్రాహ్మణేతరులు గౌరవప్రదమైన ఉద్యోగాలు పొందారు. గ్రామ పరిపాలన రంగంలో వంశపారంపర్యంగా వచ్చే  ముఖ్యులైన పటేల్ ( పాటిల్ ), పట్వారీ ( కులకర్ణి ) వ్యవస్థని 1918 లో రద్దు చేసిండు. 

             టీచర్ ట్రైనింగ్ మరియు పాటిల్‌ ట్రైనింగ్ స్కూల్స్ పెట్టించిండు. గంగారామ్ కాంబ్లే అనే అంటరాని వ్యక్తి ఆధారం చూపించమంటే సాహు డబ్బిచ్చి హోటల్ పెట్టిస్తే ఎవరు ఆ హోటల్ కి రాకుంటే సాహు స్వయంగా తన పరివారంతో వెళ్ళి ముందు తను  టీ తాగి తన వాళ్ళందరికి తాగిస్తాడు. 

           1919,సెప్టెంబర్ 6న అంటరానితనాన్ని పాటించడం నేరమని  ప్రకటన ఇచ్చారు. 1920 మే,3వ తేదిన వెట్టిచాకిరి వ్యవస్థని రద్దు చేస్తూ చట్టం చేశారు. 1919 నవంబర్ 6న వెలువడిన చట్టం ప్రకారం అన్ని విధాల వృత్తుల్లోను, ఉద్యోగాల్లోను ఉండే అస్పృశ్యులకు ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యాన్ని కల్పించిండు. అంబేడ్కర్ ఆస్పృశ్యుల హక్కుల సాధన కోసం ఒక పత్రిక నడుపుటకు 2500 రూపాయలు ఇవ్వడంతో "మూక్ నాయక్" పత్రిక ప్రారంభమౌతది. 1920,ఎప్రిల్ 15న నాసిక్ లో అంబేడ్కర్ మరియు మిత్రులు  అంటరానివారికోసం ఒక హాస్టల్ కట్టాలనుకుంటే ఆ కార్యక్రమ ప్రారంభోత్సవానికి హాజరై ఐదు వేల రూపాయలు ఇస్తాడు సాహు. 1920 లో అంబేడ్కర్ ఇంగ్లాండ్ వెళ్ళి చదువుకొనుటకై ఆర్థిక సహాయం చేశారు. అంబేడ్కర్ విదేశాల్లో ఉన్నంత కాలం "మూక్ నాయక్" పత్రిక నిర్వహణ కి ఆర్థిక సహాయం చేసిండు. 

Uploading: 1858560 of 2670968 bytes uploaded.

 

              కొల్హాపూర్ సంస్థానంలో బాలికల కోసం ప్రత్యేకంగా పాఠశాలలు ప్రారంభం చేసిండు. ఉన్నత విద్యలోకి బాలికలను ప్రోత్సహించేందుకు ఉపకారవేతనాలు, ప్రోత్సాహక బహుమతులు ఏర్పాటు చేసిండ్రు. వెనుకబడిన ఆడపిల్లలకు ఉచిత భోజన, వసతి సదుపాయాలు కల్పించిండు. 1919 జూన్ లో బాల్య వివాహాల రద్దు చట్టం  వచ్చింది. 1919 జులై 12న కులాంతర, వర్ణాంతర వివాహాలను  చట్టబద్దం చేస్తూ చట్టం తెచ్చిన "కొల్హాపూర్ స్పెషల్ మ్యారేజీ ఆక్ట్ - 1918" ప్రకారం  ఎందరో యువతీ యువకులు తమకు నచ్చిన భాగస్వామ్యులని ఎన్నుకున్నారు. విడాకులు మంజూరు చేయడంలో స్త్రీల నిర్ణయానికే ప్రాధాన్యతనిస్తూ 1919 ఆగష్ట్ 2న విడాకుల చట్టం మరియు స్పెషల్ మ్యారేజీ ఆక్ట్ అప్పుడు దేశంలో సంచలనాలను సృష్టించాయి. 1920 జనవరి 17న జోగిని, దేవదాసీ వ్యస్థను రద్దు చేసిండు . ప్రభుత్వం దేవదాసీల పునరావాసానికి చర్యలు తీసుకుంది. 1919 జులైలో వ్యభిచార వృత్తిలో ఉన్న స్త్రీలకు పునరావాసాన్ని కల్పించాల్సిందిగా అధికారులను ఆదేశించిండు. సాహు 1920 లో రూపొందించిన హిందూ న్యాయశాస్త్రం లోని అనేక అంశాలను స్వాతంత్రానంతరం రూపొందిన "హిందూ పర్సనల్ లా" లో భాగంగా భారత పార్లమెంట్ ఆమోదించింది.

              కరువు వచ్చినపుడు రైతులకు అన్ని రకాల పన్నులను, రుణాలని మాఫీ చేసిండు, అప్పుల కింద రైతుల ఆస్తులని, పనిముట్లనీ, పశువులని బలవంతంగా జప్తు చేసే చర్యలను నిషేధిస్తూ 1894 లోనే చట్టం చేసిండు. 1918 లో తన రాజ్యంలో వడ్డీ వ్యాపారాన్ని పూర్తిగా నిషేధిస్తూ సహకార సంఘాలని ఏర్పాటు  చేసిండు. రాధానగరి, పనాలా, కరవీర్, శిరోల్ వంటి ప్రాజెక్ట్ లని నిర్మించిండు."కింగ్ ఎడ్వర్ట్ అగ్రికల్చరల్ ఇన్సిట్యూట్" ద్వారా రైతులకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేసిండు. తన తండ్రి పేరుతో ఏర్పరచిన "జైసింగ్ రావు ఘాట్గే టెక్నికల్ ఇన్సిట్యూట్" ద్వారా సాంకేతిక శిక్షణ లభించి పరిశ్రమలు ఏర్పడ్డాయి. చక్కర కర్మాగారాలు, బట్టల మిల్లులు, గోనే సంచుల ఫ్యాక్టరీలు, చిన్న తరహా కుటీర పరిశ్రమలు ఏర్పడ్డాయి. 

              స్వాతంత్రo గురించి సాహు 1917 , డిసెంబర్ 27 నాసిక్ లో జరిగిన సభలో "ఇపుడున్న కులవ్యవస్థ యధాతథంగా కొనసాగుతూ ఉండేట్లైతే ఒకవేళ మన చేతికి రాజకీయాధికారం వచ్చినప్పటికీ అదొక నియంతృత్వ రాజ్యంగానే తయారవుతుంది. స్వరాజ్యం పేరిట ఒక నియంతృత్వ రాజ్యం ఏర్పడటాన్ని నిరోధించాలంటే కనీసం పదేళ్ళ పాటు వెనుకబడిన కులాలకు విద్యా, ఉద్యోగాల్లో ప్రాతినిధ్యం కల్పించే విధానం కొనసాగాలి" అని అన్నాడు. బొంబాయి ప్రెసిడెన్సి బ్రిటీష్ ప్రభుత్వ సెక్రటరీ లార్డ్ విల్లింగ్టన్ కు 1917,డిసెంబర్ 29 న లేఖ రాస్తూ "వెనుకబడిన కులాలను, ముఖ్యంగా అస్పృశ్యులను సామాజికంగా అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకతను గురించి గతంలో నేను ప్రస్తావించి ఉన్నాను. కొత్తగా రూపొందుతున్న భారత రాజ్యాoగంలో ఈ కులాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించవలసిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అస్పృశ్యులకు సంబంధించి మరింత శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని" నా అభిప్రాయం. ప్రభుత్వం నియమించబోయే స్థానిక పాలక మండళ్ళలో వెనుకబడిన కులాలకు, అస్పృశ్యులకు తగిన ప్రాధాన్యత కల్పిoచాలని  కోరిండు. ముంబాయిలో కార్మికుల ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ "రష్యా, జర్మనీ, ఇంగ్లాండ్ లలో వలే యుక్త వయసు వచ్చిన ప్రతి వ్యక్తికి ఓటు హక్కు ఉండాలి" అన్నాడు. 

               1917 లో మరాఠ ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ "నేనిక్కడికి ఒక మహారాజ్ గా రాలేదు ఒక సామాన్యుడిగా వచ్చాను. మీరు నన్ను మీలోని ఒక శ్రామికుడిగా, రైతుగా భావించవచ్చు. నా పూర్వీకులు ఇదే పని చేశారు, అనడం సాహు మహారాజ్ ఎంతటి నిగర్వి, సామాన్య ప్రజలకు ఎంత దగ్గరగా చేరువయ్యాడో అర్థం చేసుకోవచ్చు. 

            కేవలం మహారాష్ట్రకే కాకుండా దక్షిణ భారతంలో జస్టీస్ పార్టీ ఉద్యమంతో పాటు  భారతదేశం మొత్తం మీద ప్రభావం చూపిన సాహు మహారాజ్ మే 6, 1922న మరణించిండు. వీరిని ఆదర్శంగా తీసుకొని బహుజన రాజ్యాధికార సాధన కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలైన బహుజనులు అందరూ మాతో కలిసి రావాలని పిలుపునిచ్చారు.    

           ఈ కార్యక్రమంలో ఆంధ్ర బహుజన ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షులు అంపావతిని గోవిందు, కదిరి నియోజకవర్గం కన్వీనర్ యాటగిరి ప్రసాద్, జిల్లా కో-కన్వీనర్ కె.సాయిశీనా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.ఆర్.హరిప్రసాద్, ఎస్.లక్ష్మన్న, కదిరి టౌన్ కమిటీ మాజీ కన్వీనర్ వెంకటేశ్వరగౌడ్, కదిరి టౌన్ కమిటీ కో-కన్వీనర్ సి.ఆంజనేయులు, నిజామోద్దీన్, చౌడప్ప, రామచంద్ర, తిరుపాలు, సురేష్, నరసింహులు, రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: