కులం ఆధారిత రిజర్వేషన్లు...

మతం మారితే ఎలా రద్దు అవుతాయి  

రాజ్యాంగంలో మత స్వేచ్చ ఇచ్చినపుడు...రిజర్వేషన్లకు మతం అడ్డంకి ఎందుకు


రాజ్యాంగం ఇచ్చిన ప్రాధమిక హక్కులలో మత స్వేచ్ఛ ఒకటి. ఈ మత స్వేచ్ఛను కాదనే హక్కు ఎవరికీ లేదు. మరి మతం మారితే కులం కూడా మారిపోతుందా, లేక మత స్వేచ్ఛ లేదా అనేదే పెద్ద ప్రశ్న. ఒక వ్యక్తి ఒక నిమ్న కులంలో పుట్టి పెరుగుతాడు, అతనికి పుట్టినప్పుడు తల్లి తండ్రులు ఒక మతాన్ని ఆచరించమని చెబుతారు. అతడు ఆ మతాన్ని ఆచరణలో పెరుగుతాడు. పెరిగిన తర్వాత తనకు కులాల గురించి, వాటిలోని మురికి గురించి తెలిసి మతం మారుతాడు, మతం మారినంత మాత్రాన, అతని కులం ఎక్కడికి పోతుంది అనేది ప్రశ్న. 

"రాజ్యాంగంలోని 25 (1) వ అధికరణ ప్రకారం  ప్రజా శాంతికి, నైతికతకు, ఆరోగ్యంకు ఈ భాగము యొక్క ఇతర నిబంధనలకు అధ్యదీనమై, అంతరాత్మననుసరించి, స్వాతంత్రంనకు, స్వేచ్ఛగా మతంను అవలంబించుటకు, ఆచరించుటకు, ప్రచారం చేయుటకు జనులందరూ సమాన హక్కు కలిగియున్నారు". ఇక్కడ వాడిన పదజాలం మనం బాగా తరచి చూస్తే జనులందరూ సమన హక్కు కలిగియుందురు అని రాయబడింది. మరి బీదవారు మతం మారితే రిజర్వేషన్ కోల్పోవలసివస్తే, ఉన్నత వర్గాల వారు మతం మారితే వారి ఉన్నత వర్గాల స్థాయి పోయి, వారు కూడా ఏ బి సి వర్గంలోనే లేక ఎస్ సి వర్గంలో ఉండాలి కదా.   


 

రాజ్యాంగం ఇచ్చిన ప్రాధమిక హక్కు మత స్వేచ్ఛ, మరి మతం మారిన పర్యవసానంగా రిజర్వేషన్ కోల్పోతారు అని చెప్పడం విడ్డూరమే. పోనీ ఈ మతం మారిన వారిని ఎవరైనా ఉన్నత వర్గాలతో సమన స్థాయిలో చూస్తారా అటే అది లేదు. అక్కడ వారిని కులాలను బట్టే కదా గుర్తించేది. అసలు మన దేశంలో కులం లేకుండా, మత పరంగా మనిషిని చూడలేం. అదే మన దౌర్బాగ్యం. అసలు మనిషిని మనిషిలా చూసే సంస్కృతి ఎప్పుడు లేదు. డాక్టర్ అంబేద్కరు రాసిన రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటికీ, మనుషులలో ఏమాత్రం మార్పు లేదు. సాటి మనిషి, ప్రక్కవాడిని కుల పరంగా కాకుండా ఎప్పుడూ చూడలేదు. ఇక ఈ విషయాలన్నీ పక్కన పెడితే, మతం మారితే కులం ఎక్కడికి పోతుంది అనేది ఎవరు వివరణ ఇవ్వడంలేదు. మతం మారడం అక్కడికి ఎదో నేరంగా పరిగణించబడుతున్నట్లు వుంది.  

మత స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించినప్పటికీ ప్రభుత్వాలు, కోర్టులు దీన్ని అసలు ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా ఉన్నట్లు మనకు అర్థం అవుతుంది. ఎందుకంటే, అసలు కోర్టులు మత స్వేచ్ఛ గురించి ఏమాత్రం చెప్పకుండా, రేజర్వేషన్లు వుండవు, ఇది తప్పుడు సర్టిఫికెట్ కింద వస్తుంది అనే వాదనలకు తావిస్తున్నాయి. రాజ్యాంగం లోని 25  వ అధికరణ ప్రకారం మత స్వేచ్ఛ ఉన్నపుడు మతం మరీనా వాడు కులం ఎలా మారతాడు అనే విషయం అటు ప్రభుత్వాలు, ఇటు కోర్టులు వివరించలేకపోతున్నాయి.

గౌరవనీయ సుప్రీమ్ కోర్టు వారు మహమ్మద్ సాదిక్ వర్సెస్ దర్బారా సింగ్ గురు కేసులో ఒక వ్యక్తి మతం మారవచ్చు కానీ, కులం అనేది ఒక వ్యక్తి పుట్టుకతో ముడిపడి వుంది. కులం మారడానికి అవకాశం లేదు అని తీర్పు ఇచ్చారు. ఎవరైనా ఏ మతమైనా స్వీకరించవచ్చు అంత మాత్రాన వారి కులం మారదని నిర్ణయించారు. సుప్రీమ్ కోర్టు తీర్పు అలావుంటే ఇప్పుడు మద్రాసు హై కోర్ట్ తీర్పు అందుకు భిన్నంగా వచ్చింది.  


మనం పాశ్చాత్య దేశాలలో గమనిస్తే, అక్కడ ఎవరు ఏ మతం ఎంచుకున్నా ఎటువంటి ఇబ్బంది ఉండదు. వారికీ ఉద్యాగాలలో ఎటువంటి సమస్య ఉండదు. కానీ మన దేశంలో మత స్వేచ్ఛ ఉన్నప్పటికీ, కచ్చితంగా వారు ఫలానా  మతంలోనే ఉండాలనే భావన ఇంకా కొందరిలో ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకు తార్కాణమే మనం వింటున్న ఈ తీర్పులు. ఈ తీర్పులను కెూడా పెద్ద పెద్ద అక్షరాలలో పేపర్లలో ప్రింట్ అవుతున్నాయి. ఇక మత స్వేచ్ఛ ఉంది అని చెప్పడానికి ఎవరికైనా ధైర్యం ఉందా. ఎందుకంటే కోర్టులు ఇచ్చే తీర్పులు రాజ్యాంగబద్దంగా ఉండాలి, కానీ మతం విషయంలో కోర్టులు ఇచ్చే తీర్పులు రాజ్యాంగంలోని అధికరణం 25 కి వ్యతిరేకంగా ఉన్నాయి అనడానికి నిదర్శనమే ఈ తీర్పులు.  

మతం అనేది భావజాలం. ఆధ్యాత్మికత వైపు నడిపే ఒక సాధనం. అదే కులం అనేది వృత్తి పరంగా మనుస్మృతి ఇచ్చిన గుర్తింపు. అసలు మనిషి ఉంటేనే మతం వుంది, కులం వుంది. మనిషి మతం లేకుండా, కులం లేకుండా ఉండగలడు కానీ మతం కానీ, కులం కానీ మనిషి లేకుండా ఉనికిలో ఉండవు. అలాంటప్పుడు, మతం మారితే రేజర్వేషన్లు లేవు అని చెప్పడం విడ్డూరమే. పూర్వం రోజుల్లో కులాల పరంగా వృత్తులు చేసే వాళ్ళు, కులపరమైన వృత్తులు చేసే వాళ్ళు కాబట్టి వారిని ఫలానా కులం అని గుర్తించారు. మరి ఇప్పుడు ఎవరు కూడా కుల వృత్తులు చేసే వారు లేరు. ఎవరు ఏ వృత్తినైనా ఎంచుకోవచ్చు. ఇప్పుడు కొత్త వృత్తులు కూడా వచ్చేసాయి. మరి ఇప్పుడు మతం లేని వారికీ రేజర్వేషన్లు ఎలా వర్తింపచేస్తారో కూడా చెప్పాలి.  

రేజర్వేషన్లు మతానికి ఇవ్వలేదు కానీ కులాలకు ఇచ్చారు అది కూడా అణగారిన వర్గాలకు ఇచ్చారు. మరి కులాలకు రేజర్వేషన్లు ఇచ్చినపుడు ఏ మతమైతే ఏంటి అనేది ప్రభుత్వాలు, కోర్టులు ఆలోచించాలి. కులపరంగా అతను వివక్ష ఎదురుకొన్నాడా లేక కులపరంగా అతనికి అవమానాలు జరిగాయా అనే విషయాన్నీ ముఖ్యంగా  గమనించాలి. అంతే కానీ, మతం మారాడు కాబట్టి  ఇక వీరికి రేజర్వేషన్లు వర్తించవు, వీరి పై క్రిమినల్ కేసులు పెట్టాలి అనేది పూర్తిగా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. రేజర్వేషన్లు కులాన్ని బట్టి ఉంటాయి కానీ మతాన్ని బట్టి ఉండవు.

మతాన్ని కులాన్ని వేరు వేరుగా చూడాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఈ దేశంలో ఎంతో మంది మతం మారిన వాళ్ళు ఉన్నారు. డాక్టర్ అంబేద్కరు హిందువుగా పుట్టి బౌద్ధ మతాన్ని స్వీకరించారు. అలాగే పెరియార్ రామస్వామి అసలు మతాన్ని, దేవుడిని నమ్మేవారు కారు. మద్రాసు హై కోర్టు దేవుడు లేడు అని ప్రచారం చేయడంలో తప్పు లేదు అని తీర్పు ఇచ్చింది. అలాగే మనవాళ్ళు చాల మంది సోషల్ మీడియాలో విదేశాలలో చాల మంది హైందవత్వం స్వీకరించారు అని ఫోటోలు, వార్తలు రాస్తుంటారు. మరి అక్కడి వాళ్ళు మతం మారితే సంతోషించే వీరు, ఇక్కడ వాళ్ళు వేరే మతం స్వీకరిస్తే ఎందుకు అసూయపడతారో అర్థం కావడంలేదు. విదేశీయులు మతం మారినప్పుడు సంతోషించే వీరు, వారికీ ఏ కులాన్ని అంటగడుతున్నారు, అదే మరి స్వదేశీయులు మతం మారితే చాల పెద్ద నేరమైపోయింది. అసలు రాజ్యాంగం ఏ మతమైనా స్వీకరించవచ్చు అని చెప్పినప్పుడు, అది నేరం ఎలా అవుతుంది. ప్రభుత్వాలు రాజ్యాంగం ఏమి చెప్పిందో దానిని అన్వయించుకొని, అర్థం చేసుకొని, రూల్స్ లో తగిన మార్పులు చేసి ప్రజలను ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలి. అలాగే కోర్టులు కూడా 25  వ అధికరణ ప్రకారం ఇష్టమైన మతాన్ని ఎవరైనా ఆచరించవచ్చు. మరి అలాంటప్పుడు కులాన్ని, మతాన్ని కలపకుండా, ఈ రెంటిని ఉద్యోగాలకు ముడిపెట్టకుండా ఉంటే చాలా మంచి జరుగుతుంది. కులానికి మతంతో సంబంధం లేదు. మతానికి కులంతో సంబంధం లేదు, మనిషి ఈ రెండు లేకుండా కూడా ఉండగలడు, కానీ ఉద్యోగం లేకుంటే ఇబ్బంది పడతాడు. మతం జీవన విధానంలో ఒక ఆధ్యాత్మిక భాగం, కులం అనేది వృత్తి, వృత్తిని బట్టే కులం నిర్ణయించారు ఆ రోజుల్లో. మరి ఇప్పుడు వృత్తిని బట్టి కులాన్ని నిర్ణయించే ప్రశ్న లేదు. ఇకనైనా ఈ కులమతాల గొడవలు పోవాలి, రిజర్వేషన్లలో మతం సంబంధం లేకుండా కులాన్ని చూసి రిజర్వేషన్ అమలు పరచాలి.  

✍️ రచయిత-మేకల రాజ రత్నం 

అంబేడ్కర్, జాతీయ అధ్యక్షులు,

ప్రజా సీమ రాష్ట్రాల షెడ్యూల్డ్,కులాల షెడ్యూల్డ్ తెగల హక్కుల పరిరక్షణ సంక్షేమ సంఘం ఆఫ్ ఇండియ

 ప్రొద్దుటూరు, (హీడ్ ఆఫీస్) వైఎస్ఆర్ కడప జిల్లా

సెల్ నెం: 90520 31473


,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: