అర్హతున్న జర్నలిస్టులందరికీ గుర్తింపు కార్డులు
మంత్రి పేర్ని నాని
(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)
అర్హత ఉన్న ప్రతి జర్నలిస్ట్ కు ఈనెల 28 నుంచి అక్రిడేషన్ కార్డులు జారీ చేస్తామని సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. గుర్తింపు కార్డుల జారీ ప్రక్రియ పూర్తయ్యాక జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీఎం ఆదేశించినట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం సవరించిన మార్గదర్శకాలతో ఇచ్చిన జీవో 142 ప్రకారం అర్హత ఉన్న ప్రతి జర్నలిస్టు కు అక్రిడేషన్ కార్డు జారీ చేస్తామని ఆయన స్పష్టంచేశారు. ప్రభుత్వ జీవోను హైకోర్టు సమర్ధించినందున న్యాయస్థానం ఆదేశాల మేరకు ఈనెల 28 నుంచి అక్రిడేషన్లు జారీ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
పెండింగ్లో ఉన్న వారి అక్రిడేషన్లను పరిశీలించి సత్వరమే జారీ చేస్తామన్నారు. ఇకపై నిరంతరాయంగా అక్రిడేషన్లు జారీ చేస్తామన్న మంత్రి పాత్రికేయులు ఎప్పుడైనా కొత్తగా అక్రిడేషన్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. గుర్తింపు కార్డుల మంజూరు కోసం రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని.. రాష్ట్ర స్థాయి కమిటీలో ఐ అండ్ పీఆర్ (I&PR) కమిషనర్, జిల్లా స్థాయిలో కలెక్టర్ ఛైర్మన్గా ఉంటారన్నారు. కమిటీలో వైద్యారోగ్యశాఖ,లేబర్, హౌసింగ్, రైల్వే, ఆర్టీసీ, ఐఅండ్పీఆర్ అధికారులు సభ్యులుగా ఉంటారన్నారు. కమిటీలు ప్రభుత్వానికి చిన్న పేపర్లంటే చిన్నచూపు లేదని.. నిబంధనల మేరకు వారికి న్యాయం చేస్తామన్నారు. కొవిడ్ వల్ల మృతిచెందిన జర్నలిస్టుల కుటుంబాలకు సీఎం జగన్ ఖచ్ఛితంగా న్యాయం చేస్తారన్నారు. అక్రిడేషన్ల ప్రక్రియ ఆగిపోవడంతోనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు ప్రక్రియ ఆగిందన్నారు. గుర్తింపు కార్డుల జారీ ప్రక్రియ పూర్తయ్యాక జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీఎం ఆదేశించినట్లు మంత్రి నాని వెల్లడించారు.
Post A Comment:
0 comments: