ఏ రైతు నష్టపోకూడదు
వ్యవసాయ సలహా కమిటీలను యాక్టివేట్ చేయండి
ధాన్య సేకరణలో మిల్లర్ల పాత్ర లేకుండా చేయండి
ప్రతి ఇంటికి రేషన్ చేరాలి
నాణ్యతలో రాజీపడొద్దు
ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి
(జానోజాగో వెబ్ న్యూస్-ఏపీ ప్రత్యేక ప్రతినిధి)
రాష్ట్రంలోని ఏ రైతు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉందని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇందుకోసం రైతులు ఏ పంట వేయాలి అన్న దానినుంచి పంట కొనుగోలు వరకు అంతా ప్రభుత్వమే చూడాలని ఆయన ఆదేశించారు. ఇందుకోసం వ్యవసాయ సలహా కమిటీలను యాక్టివేట్ చేయాలని, అన్ని అంశాలపై వ్యవసాయ సలహా కమిటీలకు పూర్తి అవగాహన కల్పించాలని ఆయన ఆదేశించారు. క్రాప్ ప్లానింగ్ మొదలు రైతులకు అండగా ఆ కమిటీలు ఉండాలన్నారు. ఈ ప్రక్రియలో మహిళా రైతులకు కూడా భాగస్వామ్యం కల్పించాలని చెప్పారు. ధాన్యం సేకరణలో ఎక్కడా మిల్లర్ల ప్రమేయం ఉండొద్దని స్పష్టం చేశారు. ధాన్యం ఏ మిల్లుకు పంపాలన్నది అధికారులే నిర్ణయించాలన్నారు. ఎక్కడా రైతులకు ఏ విధంగానూ నష్టం కలగకూడదని అన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా పక్కాగా ధాన్యం సేకరణ జరగాలని, రేషన్ బియ్యం డోర్ డెలివరీలో ఎక్కడా ఏ లోపం ఉండొద్దని అధికారులను హెచ్చరించారు. ముఖ్యమంత్రి తన క్యాంపు కార్యాలయంలో ధాన్యం సేకరణ, రేషన్ బియ్యం డోర్ డెలివరీపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ధాన్యం సేకరణలో ఎక్కడా మిల్లర్ల ప్రమేయం ఉండకూడదన్నారు. ఏ ఊరి పంట ఏ మిల్లర్ దగ్గరకు వెళ్తోంది అన్న విషయం అధికారులకు మాత్రమే తెలియాలన్నారు. అందుకు అవసరమైతే జిల్లాల కలెక్టర్లు సొంతంగా గోనె సంచులు సేకరించాలని సూచించారు. ధాన్యం కొనుగోలులో తేమ చూడడం కోసం, ఆర్బీకేల వద్ద ఆ మీటర్లు కూడా ఉన్నాయని. మిల్లుల వద్దకు ధాన్యం రవాణా చేయడంలో వ్యయ నియంత్రణ కోసం ఊరికి దగ్గరలోని మిల్లర్ వద్దకు పంపించవద్దన్నారు. అందుకోసం జిల్లా యూనిట్‌గా తీసుకుని, ధాన్యాన్ని మిల్లుల దగ్గరకు పంపించాలన్నారు. మనం కొనుగోలు చేస్తామని చెప్పిన టైంకు మనమే కొనుగోలు చేయాలన్నారు. మొత్తం ప్రక్రియ అంతా కూడా ప్రభుత్వమే చేపట్టాలి. ఇంకా ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ...
‘‘ఆర్బీకేకు సంబంధించి వ్యవసాయ శాఖకు ఎంత బాధ్యత ఉందో, పౌర సరఫరాల శాఖకు కూడా అంతే బాధ్యత ఉంది. కాబట్టి రైతు కోరిన విత్తనాలు పౌర సరఫరాల శాఖ ఇవ్వాలి. అందుకోసం పౌర సరఫరాల శాఖ కూడా ఆర్బీకేను ఓన్ చేసుకోవాలి. రైతులు బయట విత్తనాలు కొని మోసపోకుండా వ్యవసాయ శాఖ చూడాలి. వారికి అవసరమైన విత్తనాలు ఆర్బీకేల ద్వారా సరఫరా చేయాలి. ఈ క్రాపింగ్ నుంచి మార్కెటింగ్ వరకూ రెండూ కలిసి పనిచేయాలి వ్యవసాయ సలహా కమిటీలను యాక్టివేట్ చేయాలి. ఆ మేరకు ఆ కమిటీలకు అన్ని అంశాలపై అవగాహన కల్పించాలి. క్రాప్ ప్లానింగ్ మొదలు ఆ కమిటీలు రైతులకు అండగా నిలవాలి. వ్యవసాయ సలహా కమిటీలు గ్రామాల్లో ఆర్బీకేలతో కలిసి పని చేయాలి. అన్నింటిలోనూ మహిళా రైతుల ప్రమేయం కూడా ఉండాలి. ఆ కమిటీల బాధ్యతలు. వాటి పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించాలి. రాష్ట్ర స్థాయిలో ఈ ప్రక్రియను పౌర సరఫరాల శాఖ మంత్రి పర్యవేక్షిస్తారు. ఎక్కడా రైతు ఇబ్బంది పడకూడదు. ఏ విత్తనం వేస్తే బాగుంటుంది? ఏది సాగు చేస్తే పంట కొనుగోలు చేస్తారన్నది రైతులకు ఆ కమిటీలు ముందే చెప్పాలి. అలాగే రైతులకు ధాన్యంతో తగిన ఆదాయం రాకపోతే (ఉత్పత్తి పెరిగి ధరలు తగ్గడం వంటి కారణాల వల్ల), ఏ పంట వేస్తే తగిన ఆదాయం వస్తుందన్న విషయాన్ని రైతులకు చెప్పాలి. ఆ మేరకు వారికి ప్రత్యామ్నాయం చూపాలి. అంతే తప్ప రైతుల ఆదాయం మాత్రం తగ్గకూడదు’’. అని సీఎం సూచించారు. రేషన్ బియ్యం డోర్ డెలివరీలో ఎక్కడా ఏ లోపం లేకుండా చూడాలన్నారు. బియ్యం తీసుకోవడంలో ఎవరూ మిస్ కాకుండా చూడాలన్నారు. ఆ మేరకు ఎండీయూ (మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్)లు పని చేయాలని సూచించారు. ప్రతి నెలా నిర్ణీత వ్యవధిలోగా తప్పనిసరిగా బియ్యం పంపిణీ జరగాలని ఆదేశించారు. కావాల్సినన్ని వేయింగ్ స్కేల్స్ (తూకం యంత్రాలు) కొనుగోలు చేయండని సూచించారు. బియ్యం క్వాలిటీలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వద్దని ఎవరైనా ఇంటి వద్ద రేషన్ మిస్ అయితే గ్రామ, వార్డు సచివాలయంలో తీసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. దీనికి అవసరమైన కార్యాచరణ సిద్దం చేయండని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు.
Post A Comment:
0 comments: