కరోనా వారియర్ గా,,,ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్
కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి లో ఆక్సిజన్ కాంసన్ ట్రేటర్స్ కాన్సెంట్రేటర్స్ ఏర్పాటు చేస్తాం
బెడ్ లు కూడా దొరకని స్థితిలో ప్రజలు ఉన్నారు
కర్నూలు ప్రజలకు సహకారంలో ముందువరుసలో ఉంటా
ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్
(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో హఫీజ్ ఖాన్ కరోనా వారియర్ గా మారారు. కరోనా మహమ్మారి కాలనాగులా విషం కక్కుతున్న సమయంలో ఆక్సిజన్ అందక కొందరు, ఆక్సిజన్ కొనలేక మరికొందరు అల్లాడిపోతున్న తరుణంలో నేనున్నానని ఆపన్న హస్తం అందించేందుకు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ దయార్థ హృదయంతో ముందుకు వచ్చారు. యుఎంఎంసి ఆస్పత్రి, హౌస్టన్, హఫీజ్ ఖాన్ ట్రస్ట్ నేతృత్వంలో ఆక్సిజన్ కాన్సెంట్రేటర్స్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చారు. ఇందులో భాగంగా.కంటి వైద్యశాలలో జగన్ అన్న కరోనా కేర్ సెంటర్ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ తెలిపారు. పేద, మధ్య తరగతి కుటుంబాల్లో ఎంతోమంది ఆక్సిజన్ అందక విలవిలలాడిపోతున్నారని తమ విలువైన ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వీరి బాధలను దృష్టిలో పెట్టుకొని ఎంతో కొంత వారికి సహకరించాలని ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఆయన తెలిపారు. కరోనా బారిన పడి ఎంతో మంది ఆస్పత్రి పాలవుతున్నారని, ఆసుపత్రులలో బెడ్లు లేని పరిస్థితి ఉందని, దీంతో పాటు ఆక్సిజన్ కొరత కూడా నెలకొందన్నారు.
నగరంలో 70 శాతం మంది ప్రజలకు ఆక్సిజన్ అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. వీరిలో ఎంతో మంది ఆక్సిజన్ కొనలేని పేద మధ్య తరగతి కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఇందుకోసమే వారికి అండగా నిలవాలన్న సంకల్పంతో వారికి కొంతలో కొంత అయినా సహకారం అందించేందుకు ముందుకు వచ్చామన్నారు. జిల్లా కలెక్టర్ వీరపాండియన్, కమిషనర్ బాలాజీతో మాట్లాడానని ప్రభుత్వ ఆసుపత్రిలో జగనన్న కరోనా కేర్ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చామన్నారు. ఆక్సిజన్ అవసరం ఉన్న వారికి సరైన సమయంలో అందించేందుకు ఆక్సిజన్ కాన్సెంట్రేటర్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీంతో ఎంతో మందికి ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఇందులోనే నెబులైజర్ కూడా ఉందని, అది రోగులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కరోనా చికిత్స పొంది కోలుకొని ఇంటికి వచ్చిన వారికి కూడా ఎంతో మందికి ఆక్సిజన్ అవసరం అవుతుందని, అటువంటి వారు కూడా మాక్స్ ధరించి తాను అందజేసిన ఆక్సిజన్ ఉపయోగించవచ్చని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇది తొమ్మిది లీటర్ల సామర్థ్యం కలిగి ఉంటుందని ఆయన తెలిపారు. 30, 60, 90 శాతం ఆక్సిజన్ ను మూడు రకాలుగా అందిస్తుందని తెలిపారు. జగనన్న కేర్ సెంటర్ ద్వారా ఎంతో మందికి లబ్ధి చేకూరుతుందని, ప్రతి బెడ్ కు ఒక్కటి చొప్పున ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆర్థికంగా లేని వారు ఆక్సిజన్ సిలిండర్ కొనలేని వారు ఎంతో మందికి ఉపయోగకరంగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. కరోనా రోగులకు ఎన్నో సౌకర్యాలు చేకూర్చేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎంతగానో సహకారం అందిస్తున్నారన్నారు. సమాజంలో ఉన్న ప్రజలకు సహకరించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. మునుముందు కూడా కర్నూల్ నగర ప్రజలకు తాను అండగా నిలుస్తానని ఆయన హామీ ఇచ్చారు.
Post A Comment:
0 comments: