దాన్యం కొనుగోలు కేంద్రాల్లో,,
సమస్యలు పరిష్కరించండి
మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలంగాణ రైతు సంఘం లేఖ
(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)
దాన్యం కొనుగోలు కేంద్రాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్ కోరారు. ఈ మేరకు ఆయన ఓ లేఖ రాశారు. లేఖ సారాంశం ఇలావుంది...రాష్ట్రంలో యాసంగి లో రికార్డ్ స్థాయిలో దిగుబడి వచ్చింది. పంట బాగా వచ్చిందని రైతులు సంతోషించారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు కూడా ప్రారంభించింది. పంటని కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లిన రైతుల కు అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. వాటిని పరిష్కరించాలని కోరుతున్నాం. ఐకేపీ కేంద్రాలు, సహకార సంఘాల కేంద్రాల్లో తేమ పేరుతో, తాలు పేరుతో క్వింటా ధాన్యం నుండి రెండు నుండి రెండున్నర కిలోలు తరుగు తీస్తున్నారు. ఐకెపి కేంద్రాల్లో కొనుగోలు పూర్తయిన తర్వాత మిల్లులకు దాన్యం వెళ్ళేదాకా రైతులే కాపలాగా ఉండాలని చెబుతున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసిన తర్వాత రైస్ మిల్లు దగ్గరికి వెళ్లిన తర్వాత మళ్లీ తరుగు తీస్తున్నారు.కొనుగోలు కేంద్రాలకు వచ్చిన తర్వాత తేమ ఎక్కువగా ఉందని ఆర పెట్టమని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు చెప్పడం వల్ల రైతులు పంటను ఆరబెడుతున్నారు.అకాల వర్షాల వల్ల ఆరబెట్టిన పంట తడిసిపోతుంది. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు సిద్ధం కావడం లేదు, సకాలంలో కొనుగోలు చేయకపోవడం వల్ల అనేక కేంద్రాల్లో పది పదిహేను రోజులు రైతులు ఎదురు చూడాల్సిన పరిస్థితి దాపురించింది. డబ్బులు కూడా సకాలంలో అందే పరిస్థితి లేదు. కష్టకాలంలో ఆరుగాలం కష్టపడి పండించిన రైతు మార్కెట్కు తెచ్చిన తర్వాత తీవ్రంగా నష్టపోవడం శోచనీయం. ఈ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నాము.అనేక జిల్లాల్లో గన్నీ బ్యాగుల కొరత వుంది. తెలంగాణ రైతు సంఘం కార్యకర్తలు కొనుగోలు కేంద్రాలను సందర్శించినప్పుడు ఈ సమస్యలు దృష్టికి వచ్చాయి. ఈ సమస్యలు పరిష్కరించి రైతులను ఆదుకోవాలని కోరుతున్నాం. అని ఆ లేఖలో టి.సాగర్ పేర్కొన్నారు.
Post A Comment:
0 comments: