ఒక అనురాగ గీతిక ఆగిపోయింది !


(సినీ నేపధ్య గాయకులు, రాగ మాధురి  వ్యవస్థాపకులు శ్రీ జి.ఆనంద్ ఇక లేరు! కాసేపటి క్రితం కరోనా తో  పోరాడుతూ కనుమూశారు !  మూడు రోజుల నుంచి కొద్దిపాటి లక్షణాలతో  ఇంట్లోనే చికిత్స పొందుతున్నారు!  ఇవాళ సాయంత్రం శ్వాస సమస్య మొదలయ్యింది !  వారు ఉండేది మా గాంధీ నగర్ లో ! చివరకు  హస్తినాపురం  లో వెంటిలేటర్ సౌకర్యం దొరికింది!  కానీ, ప్రాణం దక్కలేదు !  కరోనా కు మరో అద్భుత గాయకుడు వెళ్లిపోయారు !  అశ్రు నివాళి! పిల్లలు అమెరికా లో వున్నారు ! వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ! 


ఆనంద్ గారి పూర్తి పేరు గేదెల ఆనందరావు !  జి.ఆనంద్ గా, రాగమాధురి  ఆనంద్ గా సుపరిచితులు !  ఊరు శ్రీకాకుళం జిల్లా లోని  తులగం అనే చిన్న పల్లెటూరు!  వారి నాన్న గారు మంచి పౌరాణిక నటులు !  శ్రీరాముడి  పాత్రకు ఆ రోజుల్లో ఆయన పెట్టింది  పేరు !  వారి ఇద్దరబ్బాయిలు లవ కుశ పాత్రలను పోషించే వారు !  అలా ఆనంద్ గారి రంగస్థల ప్రస్థానం నటుడి గా చిన్నప్పుడే మొదలయ్యింది !  సినిమా పాటల పోటీలు ఎక్కడ జరిగినా మొదటి బహుమతి ఆనంద్ గారిదే! 

1972 లో పండంటి కాపురం సినిమాకు కోరస్  సింగర్ గా సినీ నేపధ్య ప్రస్థానం మొదలయ్యింది !  అమెరికా అమ్మాయి సినిమా లో "ఒక వేణువు వినిపించెను  అనురాగ  గీతిక" పాట సూపర్ డూపర్ హిట్ తో ఆనంద్ పేరు మారు మ్రోగింది !  కల్పన  సినిమా లో "దిక్కులు చూడకు రామయ్య"  పాట ఇప్పటికీ  ఎవర్  గ్రీన్!  ఆమె కథ, దాన వీర సూర కర్ణ, ప్రాణం ఖరీదు ఇలా చాలా సినిమాల్లో 2500 పైగా పాటలు పాడారు!  200 ఆల్బమ్స్  చేశారు!  1987 లో గాంధీనగర్ రెండవ వీధి సినిమా కు సంగీత దర్శకత్వం  వహించారు!  సినిమా అవకాశాలు బాగా వున్నప్పుడే రాగ మాధురి సంస్థ ను స్థాపించి సంగీత విభావరి లు విరివిగా నిర్వహించే వారు !  అమెరికా లో నాటి, నేటి సినీ గాయకులందరినీ  తీసుకెళ్లి అనేక విభావరి లతో అలరించారు !  7000 మ్యూజికల్ నైట్స్ నిర్వహించినట్లు అప్పుడప్పుడు కలసినప్పుడు చెబుతుండే వారు !  షిరిడి సాయిబాబా, విష్ణు పురాణం లాంటి పలు టీవి సీరియల్స్ కు సంగీతం అందించారు !  డబ్బింగ్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందారు !

 

చెన్నై నుంచి హైదరాబాద్ కు వచ్చి గాంధీ నగర్ లో స్థిర పడ్డారు!  ఎంతో సౌమ్యులు !  ఎంతో ఒదిగి వుంటారు !  ఇద్దరం కలసి  అనేక సాంస్కృతిక సభల్లో అతిధులుగా పాల్గొనే వాళ్ళం!   రవీంద్రభారతి, త్యాగరాయ గానసభ లకు వెళ్లే వాళ్ళం!  ఎంతో ప్రేమగా మాట్లాడతారు !  వారి అనుభవాలను ఎంతో ఆత్మీయంగా చెప్పేవారు !  మళ్ళీ లీడ్ సింగర్ గా ఒక పూర్తి స్థాయి సినీ సంగీత విభావరి నిర్వహించాలనే  కోరిక ఉండేది !  వై కె నాగేశ్వరరావు గారితో అనే వారు ...కరోనా తగ్గాక రవీంద్రభారతి లో నాలుగు గంటలు నాన్ స్టాప్ గా పాడాలి అని !  వై కె గారు ఇటీవల చనిపోయాక, అదే గుర్తు చేసుకుని బాధపడ్డారు !  కిన్నెర రఘురాం గారు చేస్తారండి  అని చెప్పాను!  ఆగస్టు లో ప్లాన్ చేద్దాం అన్నారు!  ఎప్పుడు ఫోన్ చేసినా, రఫీ జాగ్రత్త గా వుండండి అంటూ నాకు ధైర్యం చెబుతుండే వారు !  ఎక్కడికి వచ్చినా ఎన్నో జాగ్రత్తలు తీసుకునే వారు !  ఈ మధ్య ఇంట్లోనే వుంటూ ఎక్కడికి రావడం లేదు !  అలాంటిది కరోనా కు చిక్కారు!  హైదరాబాద్ ఆసుపత్రుల్లో బెడ్లు లేవు !  వెంటిలేటర్లు  లేవు!  చివరకు నగర శివారు లో దొరికింది కానీ, ఆసుపత్రికి చేరుకున్న కాసేపటికే  కనుమూశారు !  మరో అద్భుత గాయకుడిని, మంచి మనసున్న ఆత్మీయుడిని కోల్పోయాం!  కన్నీటి నివాళి.


 మంచి గాయకుడి మహాభినిష్క్రమణ 

ఆనంద్ గారి అంత్యక్రియలు ఉదయం ఏడున్నర గంటలకు హైదరాబాద్  వనస్థలిపురం  దగ్గరలో సాహెబ్ నగర్ స్మశాన వాటికలో నిర్వహించారు. బావమరిది, మేనకోడలు మాత్రమే పాల్గొన్నారు . కరోనా కావడం తో ఎవ్వరిని పిలవలేదు.  ఇంటికి తీసుకు రానివ్వలేదు. ఆసుపత్రి నుంచి నేరుగా స్మశానానికి తరలించారు.  ఒక మంచి గాయకుడి మహాభినిష్క్రమణ ఇంత సింపుల్ గా జరిగిపోయింది . విచారకరం, దురదృష్టకరం  

✍️ రచయిత- డాక్టర్ మహ్మద్ రఫీ

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: