ఏపీకి వచ్చే బస్సులు రద్దు

ఆంధ్రాలో కర్ఫ్యూ నేపథ్యంలో టీఎస్‌ఆర్టీసీ నిర్ణయం 

(జానోజాగో వెబ్ న్యూస్-ఏపీ ప్రతినిధి)

ఆంధ్రప్రదేశ్ కు ఇకపై బస్సులు నడపకూడదని తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు హైదరాబాద్‌ నుంచి ఏపీకి వెళ్లే 250 బస్సులను తెలంగాణ ఆర్టీసీ రద్దు చేసింది. ముందస్తు రిజర్వేషన్‌లను కూడా అధికారులు రద్దు చేశారు. దీంతో హైదరాబాద్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ తదితర ప్రాంతాలతోపాటు కర్నూలు, శ్రీశైలం, బెంగళూరు వైపునకు  బస్‌ సర్వీసులు నిలిచిపోయా యి. బుధవారం కొన్ని సర్వీసులను ఏపీకి నడిపినప్పటికీ గురువారం నుంచి  18వ తేదీ వరకు హైదరాబాద్‌ నుంచి వెళ్లే అన్ని బస్సులను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు తెలంగాణ ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఏపీలో మధ్యాహ్నం 12 గంటల నుంచి కర్ఫ్యూ విధిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొ న్నారు. ‘ఏపీలో కర్ఫ్యూకు ముందే బస్సులు అక్కడికి చేరుకోవలసి ఉంటుంది. ఉదయం అక్కడికి చేరుకున్న బస్సులు తిరిగి మధ్యాహ్నం 12 లోపు ఆ రాష్ట్ర సరిహద్దులను దాటాలి. ఇది ఏమాత్రం సాధ్యం కాదు. మరోవైపు తెలంగాణలో రాత్రి 9 గంటల నుంచే కర్ఫ్యూ అమలవుతున్న దృష్ట్యా ఏపీ నుంచి బయలు దేరిన బస్సులు రాత్రి 9 గంటలలోపు డిపోలకు చేరుకోవడం సాధ్యం కాదు’ అని ఆ అధికారి వివరించారు. ఏపీకి ఆనుకుని ఉన్న సరిహద్దు జిల్లాల బస్సులు మాత్రం మధ్యాహ్నం 12 లోపు ఆయా డిపోలకు చేరుకునే అవకాశం ఉంటే రాకపోకలు సాగిస్తాయని చెప్పారు. ఈ మేరకు కోదాడ నుంచి విజయవాడ వరకు 6 బస్సులు మాత్రం తిరుగుతున్నాయి. హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వైపునకు వెళ్లే 48 బస్సులు కూడా నిలిచిపోయాయి.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: