వ్యాక్సినేషన్ తర్వాత 0.04% మందికే కొవిడ్
కీలక డేటాను విడుదల చేసిన కేంద్రం
(జానోజాగో వెబ్ న్యూస్-నెట్ వర్క్ డెస్క్)
కరోనా నుంచి రక్షణ పొందేందుకు టీకా తీసుకుంటున్నప్పటికీ పలువురు వైరస్ బారిన పడుతున్నారు. దీంతో వ్యాక్సిన్ సమర్థతపై ప్రజల్లో అనుమానాలు తలెత్తుతున్నాయి. టీకా తీసుకున్నాక కూడా వైరస్ బారిన పడినట్లయితే ఇక టీకా తీసుకుని లాభమేంటన్న భావన ప్రజల్లో నెలకొంటోంది. దీంతో కొందరు టీకా తీసుకునే విషయంలో వెనకడుగు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం కీలకమైన డేటాను విడుదల చేసింది. రెండు డోసుల టీకా తీసుకున్న వారు స్వల్ప సంఖ్యలోనే వైరస్ బారిన పడుతున్నారని పేర్కొంది. ఈ మేరకు ఐసీఎంఆర్ డైరెక్టర్ బలరాం భార్గవ్ డేటాను విడుదల చేశారు.
రెండు డోసుల టీకా తీసుకున్న 10 వేల మందిలో కేవలం ఇద్దరు నుంచి నలుగురు మాత్రమే కొవిడ్ బారిన పడుతున్నారని బలరామ్ భార్గవ్ తెలిపారు. ఒకవేళ కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయినప్పటికీ తీవ్రమైన అనారోగ్యం బారిన పడడం లేదని పేర్కొన్నారు. ఐసీఎంఆర్ విడుదల చేసిన డేటా ప్రకారం భారత్ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్ టీకాను ఇప్పటివరకు 1.1 కోట్ల మంది తీసుకున్నారు. ఇందులో 93 లక్షల మంది మొదటి డోసు వేసుకోగా.. 17 లక్షల మంది రెండు డోసులూ స్వీకరించారు. మొదటి డోసు తీసుకున్న వారిలో 4,208 మంది కొవిడ్ బారిన పడగా.. రెండో డోసు తీసుకున్న వారిలో కేవలం 695 మందికి మాత్రమే కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అంటే రెండు డోసులు తీసుకున్న వారిలో కొవిడ్ బారిన పడుతున్నవారు 0.04 శాతం మాత్రమే అని డేటా చెబుతోంది.
ఇక సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తున్న కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నవారు కూడా స్వల్ప సంఖ్యలోనే కొవిడ్ బారిన పడినట్లు డేటా విశ్లేషిస్తోంది. 11.6 కోట్ల మంది ఇప్పటి వరకు కొవిషీల్డ్ తీసుకోగా.. తొలి డోసు తీసుకున్న 10 కోట్ల మందిలో 17,145 మందికి కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అలాగే రెండు డోసులూ తీసుకున్న కోటిన్నర మందిలో కేవలం 5,014 మంది మాత్రమే కొవిడ్ బారిన పడినట్లు ఈ డేటా వెల్లడిస్తోంది. దీని ప్రకారం కొవిషీల్డ్ రెండు డోసులూ తీసుకున్న మొత్తం జనాభాలో 0.03 శాతం మంది మాత్రమే కొవిడ్ బారిన పడుతున్నట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌కు సంబంధించిన డేటా ఆధారంగా ఈ శాతాలను నిర్ధారించినట్లు నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ తెలిపారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: