అలరించిన అంధుల సంగీత విభావరి
- అంధుల క్రికెట్ విజేతలకు బహుమతి ప్రధానం
- ప్రతి ఏటా అంధుల సంక్షేమ సంఘానికి యాబై వేల విరాళం ప్రకటించిన ఎంపీ పోచా
(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)
స్పందన అంధుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని నంద్యాల మున్సిపల్ టౌన్ హాల్లో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి సంగీత విభావరి ప్రేక్షకులను విశేషంగా అలరించింది. ఈ సందర్భంగా నంద్యాల డివిజన్ దివ్యాంగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ అధ్యక్షతన జరిగిన సభలో ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని స్పందన సంక్షేమ సంఘం గత రెండు రోజులుగా నిర్వహించిన రాష్ట్రస్థాయి అంధుల క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతి ప్రధానం చేశారు. విన్నర్స్ గా నిలిచిన కర్నూలు జట్టుకు ట్రోఫీతో పాటు 20 వేల నగదు బహుమతి, రన్నర్స్ గా నిలిచిన తిరుపతి జట్టుకు ట్రోఫీతో పాటు 15 వేల నగదు బహుమతి ప్రధానం చేశారు.
మ్యాన్ ఆఫ్ ద సీరిస్ గా కర్నూల్ జట్టు కెప్టెన్ అంతర్జాతీయ అంధుల క్రికెట్ క్రీడాకారుడు ప్రేమ్ కుమార్, కర్నూలు జట్టుకు చెందిన రవీంద్ర బెస్ట్ బ్యాట్స్ మ్యాన్ గా, తిరుపతికి చెందిన హేమంత్ కుమార్ బెస్ట్ బౌలర్ గా వ్యక్తిగత అవార్డులను మున్సిపల్ చైర్ పర్సన్ షేక్ మాబున్నిసా అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ పోచా మాట్లాడుతూ అంధులు వికలత్వం అధిగమించి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి విజయాలు సాధించాలని కోరారు. స్పందన అంధుల సంక్షేమ సంఘం నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ కు, సంగీత విభావరికి 50 వేలు విరాళంగా అందజేశారు. అదే విధంగా ప్రతి ఏటా ఈ సంఘం కార్యక్రమాలకు 50 వేలు ప్రకటించారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న చైర్ పర్సన్ మాబున్నిసా మాట్లాడుతూ యువత చిన్న అపజయాలకే కుంగుబాటుకు లోనై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, అటువంటి వారు క్రికెట్ ఆడి, సంగీతంలో రాణిస్తున్న అంధుల యొక్క ఆత్మ విశ్వాసం నుండి స్పూర్తి పొందాలన్నారు. స్పందన అంధుల సంక్షేమ సంఘం నిర్వాహకులు చంద్రశేఖర్, పుల్లయ్య మాట్లాడుతూ ప్రతినెల ఈ సంఘం తరఫున అంధులకు ఆర్థిక సహకారం అందిస్తున్నామని, క్రికెట్, సంగీత విభావరి ద్వారా అంధులలో ఉత్తేజాన్ని నింపి ఆత్మవిశ్వాసంతో విజయాలు సాధించడానికి దోహద పడుతుందని ఏర్పాటు చేశామన్నారు. ప్రతియేటా క్రికెట్, సంగీత విభావరి దాతల సహకారంతో నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి, చైర్ పర్సన్ షేక్ మాబున్ని లతో పాటు వైస్ చైర్మన్ గంగి శెట్టి శ్రీధర్, పురపాలక కమిషనర్ వెంకట కృష్ణుడు, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మనోహర రెడ్డి, జిల్లా చైర్మన్ బైసాని రమేష్, కౌన్సిలర్లు సమద్,మనోరంజని సావిత్రి, చంద్రశేఖర రెడ్డి, వార్డు ఇంచార్జ్ లు పార్థసారథి, సుధాకర్, రాయలసీమ ఆర్తో ఆసుపత్రి చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, స్పందన అంధుల సంక్షేమ సంఘం నిర్వాహకులు చంద్రశేఖర్, పుల్లయ్య, హుసేని, ఓబులేసు, గుర్రప్ప, రమణ, తదితరులు పాల్గొన్నారు. తదుపరి నిర్వహించిన రాష్ట్రస్థాయి అంధుల సంగీత విభావరిలో గాయకులు ప్రేమ్ కుమార్, శ్రీనివాస్, లలిత, భవాని అద్భుతంగా పాడిన తెలుగు, హిందీ పాటలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కీ బోర్డు పై కిరణ్, రిథమ్ ప్యాడ్ పై శ్రీనివాస్ అందించిన సంగీతం పాటలకు వన్నె తెచ్చింది. ఈ కార్యక్రమాలకు అంధులకు సహకారంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన ఎన్సిసి విద్యార్థులు చేసిన సేవలకు అభినందిస్తూ ప్రశంసాపత్రాలు అందజేశారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: