ద్రవ్యోల్బణం, నిరుద్యోగంపై 

టిఆర్‌ఎస్‌ నేతల్ని నిలదీయాలి

నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలకు ఎన్నికల ప్రచారంలో షబ్బీర్‌ అలీ



(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)

పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రరావు, టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులను ప్రజలు ప్రశ్నించాలని మాజీ మంత్రి, శాసనమండలిలో మాజీ ప్రతిపక్ష నేత మహ్మద్‌ అలి షబ్బీర్‌ పిలుపునిచ్చారు. నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి కె.జానారెడ్డికి అనుకూలంగా మంగళవారం నల్గొండ జిల్లాలోని హాలియా పట్టణంలో మైనారిటీ సంఘం నాయకులతో జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. ముడి చమురు ధరలు గణనీయంగా తగ్గినప్పటికీ పెట్రోల్, డీజిల్‌ ధరలు అత్యధిక స్థాయిలో ఉన్నాయని షబ్బీర్‌ అలీ విమర్శించారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం, తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వం ముడి చమురు ధరల తగ్గింపునకు చర్యలు తీసుకోవడం లేదని, వినియోగారుదల ప్రయోజనాన్ని విస్మరిస్తున్నారని మండిపడ్డారు. సామాన్యులకు భారం కలిగించే విధంగా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు పెంచాయని ధ్వజమెత్తారు. ఇంధన ధరల పెంపు వల్ల అవసరమైన వస్తువుల ధరల పెరుగుదలకు దారితీశాయని ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా, ఎల్‌పిజి సిలిండర్ల ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయని, వాటి ధరల్ని నియంత్రించడంలో బిజెపి, టిఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు ఏవిధమైన చొరవ చూపలేదన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని రాయితీలను తొలగించిందని గుర్తు చేశారు. పర్యవసానంగా, పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా సామాన్య ప్రజల జీవితాలు దయనీయంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే బీజేపీ, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాల తప్పుడు విధానాలను తిప్పికొట్టాలని, కాంగ్రెస్‌ అభ్యర్థి జానారెడ్డిని ఎన్నుకోవాలని నాగార్జునసాగర్‌ నియోజకవర్గ ఓటర్లకు షబ్బీర్‌ అలీ విజ్ఞప్తి చేశారు.

మరో నిరుద్యోగి మహేందర్‌ యాదవ్‌ సిరిసిల్లలో ఆత్మహత్య చేసుకున్నాడు. నిరుద్యోగ యువతకు నైరాశ్యంతో ఆత్మహత్యలకు పాల్పడవద్దని, చావులు సమస్య పరిష్కారానికి మార్గం కాదని ఆయన విజ్ఞప్తి చేశారు. నిరుద్యోగుల హక్కుల సాధన కోసం కాంగ్రెస్‌ పార్టీ పోరాటం చేస్తుందని హామీ ఇచ్చారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగంపై టిఆర్‌ఎస్‌ నాయకుల్ని నిలదీయాలని ఆయన నిరుద్యోగులకు పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్‌ నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు తాజా నకిలీ వాగ్దానాలతో కాకుండా, గత ఏడు సంవత్సరాల పాలనలో చేసిన పనులు, అమలు చేసిన హామీలు, పురోగతి గురించి చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. తెలంగాణలో నమైదైన 19 లక్షల నిరుద్యోగులు సహా దాదాపు 30 లక్షల మంది యువకులు  నిరుద్యోగులుగా ఉన్నారని చెప్పారు. డీమోనిటైజేషన్‌ కారణంగా మొదట లక్షలాది ఉద్యోగాలు పోయాయని, తరువాత కరోనా వైరస్‌ కారణంగా లాక్‌డౌన్‌తో మరింతగా నష్టపోయారని చెప్పారు. మోడీ ప్రభుత్వ నిర్ణయాలకు సీఎం కేసీఆర్‌ మద్దతు ఇచ్చారన్నారు. ‘లక్ష ఉద్యోగాల కల్పన చేస్తామన్న మొదటి హామీనే కేసీఆర్‌ తంగులోకి తొక్కారని, రెండవసారి అధికారంలోకి వచ్చేముందు నిరుద్యోగ భత్యం నెలకు రూ .3,016 ఇస్తామని హామీ ఇచ్చి మరోసారి నిరుద్యోగ యువతను మోసం చేశారని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.91 లక్షల ప్రభుత్వంలో ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఇప్పుడు 50 వేల పోస్టులను మాత్రమే భర్తీ చేస్తామని కపట మాటలు చెబుతున్నారని విమర్శించారు. ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వం సీరియస్‌గా లేదని, నిరుద్యోగుల్ని నిర్లక్ష్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్‌ మోసాలతో ఆత్మహత్యకు పాల్పడిన నిరుద్యోగ యువకుడు సునీల్‌ కుమార్‌ నాయక్‌కు టీఆర్‌ఎస్‌ నాయకులు ఒక్కరు కూడా సంతాపం చెప్పలేదని షబ్బీర్‌ అలీ తప్పుపట్టారు.

 టిఆర్‌ఎస్, బిజెపిలను ఓడించి చరిత్ర గతిని మార్చే అవకాశం  నాగార్జునసాగర్‌ ప్రజలకు లభించిందని షబ్బీర్‌ అలీ అన్నారు. ‘సిఎం కెసిఆర్‌ వందల కోట్లు ఖర్చు చేసి, అధికారిక యంత్రాలను దుర్వినియోగం చేయడం ద్వారా ఎన్నికలలో విజయం సాధించాలని ఎత్తుగడలు వేస్తున్నారు. ప్రజలు తనకు అనుకూలంగా ఉన్నారనే తప్పుడు అభిప్రాయాన్ని ఆయన సృష్టిస్తున్నారు. కేసీఆర్‌ మరియు అతని కుటుంబం తెలంగాణ వనరులను వశం చేసుకున్నాయి. నాగార్జునసాగర్‌ ఓటర్లు విజ్ఞతతో ఆలోచన చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ను ఓడించడం ద్వారా  అహంకార, అమానవీయమైన కేసీఆర్‌ ప్రభుత్వ బారి నుండి తెలంగాణను విడిపించడానికి నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక నాంధి కావాలి.. ‘అని షబ్బీర్‌ అలీ పిలుపునిచ్చారు.

 తొలుత షబ్బీర్‌ అలీ, జమ్యెడ్‌–ఉల్‌–ఉలేమా–ఎ–హింద్‌ నల్గోండా జిల్లా అధ్యక్షుడు మౌలానా అహ్సానుద్దీన్‌ను కలిసి జానారెడ్డికి మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు. 2004లో గత కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 శాతం ముస్లిం రిజర్వేషన్లు ఇప్పటివరకు 20 లక్షల మంది పేద ముస్లింలకు ఎలా ప్రయోజనం చేకూరిందో మౌలానా అహ్సానుద్దీన్‌కు ఆయన వివరించారు. సిఎం కెసిఆర్‌ పిఎం మోడీ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారని, కేంద్రంలో బిజెపి ప్రభుత్వ విధానాలకు టిఆర్‌ఎస్‌ ఎప్పుడూ మద్దతు ఇస్తుందని చెప్పారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ల ఇస్తామని కేసీఆర్‌ హామీ ఇచ్చి ముస్లింలను మోసం చేశారని ఆరోపించారు. మైనారిటీల సంక్షేమానికి ఖర్చు చేసే తప్పుడు గణాంకాలతో ముస్లిం సమాజాన్ని తప్పుదారి పట్టించారని అన్నారు. టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయించిన మొత్తంలో 50% కూడా మైనారిటీల సంక్షేమం కోసం ఖర్చు చేయలేదని షబ్బీర్‌ అలీ ధ్వజమెత్తారు. అంతేకాకుండా, 2014లో టిఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాదాపు 80% మైనారిటీ సంస్థలు, వేలాది మదర్సాలు మూసేశారని తీవ్ర ఆరోపణ చేశారు.

 స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి జామియాట్‌–ఉల్‌–ఉలేమా కాంగ్రెస్‌ పార్టీతో ఉందని పేర్కొన్న మౌలానా అహ్సానుద్దీన్‌ నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల్లో జానారెడ్డికి మద్దతు ఇవ్వాలన్న అభ్యర్థనను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.

✍️ రిపోర్టింగ్-డి.అనంత రఘు

న్యాయవాది. హైదరాబాద్

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: