ఘనంగా ప్రారంభమైన అంధుల రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలు

- అంధుల ఆత్మవిశ్వాసం ప్రశంసనీయం

ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి

(జానోజాగో వెబ్ న్యూస్-నందికొట్కూరు ప్రతినిధి)

స్పందన అంధుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో రెండు రోజుల పాటు జరిగే రాష్ట్రస్థాయి అంధుల క్రికెట్ టోర్నమెంట్ పోటీలను శనివారం నంద్యాల ఎంపి పోచా బ్రహ్మానంద రెడ్డి లాంఛనంగా రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా నంద్యాల డివిజన్ దివ్యాంగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు, నంద్యాల క్రికెట్ సంఘం అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపీ పోచా మాట్లాడుతూ 

అంధులు క్రికెట్ ఆడటం ప్రశంసనీయమని,  కనిపించకపోయినా ఆత్మ విశ్వాసంతో అంధులు  జీవితంలో విజయాలు సాధించడానికి ముందుకు రావడం అవసరమన్నారు. దివ్యాంగుల రాష్ట్రస్థాయి బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీ విషయం అదే విధంగా చట్టబద్ధంగా దివ్యాంగుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు 5 శాతం నిధులు కేటాయించి వినియోగించే విషయం ముఖ్యమంత్రి దృష్టికి, పార్లమెంట్ దృష్టికి తీసుకు వెళ్తానన్నారు .

డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ ఈ టోర్నమెంట్ కు భోజన వసతి  నంది గ్రూపుల చైర్మన్ సుజల ఏర్పాటు చేస్తున్నారని, వివిధ జిల్లాల నుంచి వచ్చిన అంధ క్రీడాకారులు ఉండటానికి వసతి ప్రథమ నంది కళ్యాణమండపంలో ఏర్పాటు చేశామని, క్రికెట్ కిట్టును లయన్స్ క్లబ్ తరఫున బైసాని రమేష్, ట్రోఫీలను అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, నగదు బహుమతులు డాక్టర్ విజయ భాస్కర్ రెడ్డి, డాక్టర్ విజయ్ బాబు మిత్ర బృందం అందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పురపాలక వైస్ చైర్మన్ గంగి శెట్టి శ్రీధర్ మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమానికి కృషి చేస్తామన్నారు. స్పందన అంధుల సంక్షేమ సంఘం నాయకులు చంద్రశేఖర్, ఓబులేసు మాట్లాడుతూ వివిధ జిల్లాల నుండి  అంధ క్రికెట్ క్రీడాకారులు నంద్యాల క్రికెట్ పోటీలకు రావడం ఇదే మొదటిసారని, భవిష్యత్తులో కూడా అంధుల క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి వారిలో ఉత్తేజాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నెలకొల్పడానికి కృషిని కొనసాగిస్తామన్నారు.

సోమవారం నంద్యాల టౌన్ హాల్ లో ఉదయం 10 గంటలకు అంధుల సంగీత విభావరి, క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతి ప్రధానం, ఇటీవల విజయం సాధించిన కౌన్సిలర్ లకు సత్కార కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. అంధుల  క్రికెట్ ను, అంధుల సంగీత విభావరి తిలకించడానికి రావాల్సిందిగా ప్రజలను ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ పీజీ కళాశాల కరస్పాండెంట్ హేమంత్ రెడ్డి,లయన్స్ క్లబ్ అధ్యక్షులు మనోహర రెడ్డి, స్పందన అంధుల సంక్షేమ సంఘం నాయకులు చంద్ర శేఖర్ , పుల్లయ్య, ఓబులేసు, గుర్రప్ప, రమణ ,హుసేని, వివిధ జిల్లాల నుంచి వచ్చిన అంధ  క్రికెట్ క్రీడాకారులు పాల్గొన్నారు. తదుపరి నంద్యాల, నరసరావుపేట మధ్య జరిగిన ప్రారంభ మ్యాచ్ కు ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి టాస్ వేసి,  క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. బౌలింగ్ చేసి మ్యాచ్  ప్రారంభించారు. నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ సి సి విద్యార్థులు ఈ పోటీలలో అంధులకు సహకారం అందించారు.


  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: