ఎంఐఎం పార్టీ విస్తరణ...

ప్రాంతీయ పార్టీలకు ఓ సవాల్

దేశంలో అనూహ్యంగా మారుతున్న రాజకీయ సమీకరణలు

బిహార్‌లో 5 సీట్లు గెలిచిన జోష్‌లో ఎంఐఎం

పశ్చిమ బెంగాల్‌లో దీదీకి ముచ్చెమటలు పట్టిస్తున్న అసద్‌

వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌లో పట్టు సాధించాలనే ప్రణాళిక

తమిళనాడులో మూడు సీట్లకు పోటీ

ఏపీ మున్పిపల్‌ ఎన్నికల్లో కూడా పోటీ

ప్రాంతీయ పార్టీల్లో విశ్వసనీయత ఎంతా...?


గత దశాబ్ద కాలంగా భారత దేశ రాజకీయాలు ఓ అనూహ్య మలుపు తిరుగుతున్నాయి. ఒకపుడు హైదరాబాద్‌ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న ఆల్‌ ఇండియా మజ్లిస్‌ ఇత్తెహాదుల్‌ ముస్లిమీన్‌ (ఎంఐఎం) జంటనగరాలకే పరిమితమై ఉండేది. దాని వ్యవస్థాపకుడు సలావుద్దీన్‌ ఓవైసీ హైదరాబాద్‌ నగరంలోని పాతబస్తీతో పాటు తెలంగాణలోనూ తను చనిపోయే వరకు ఒంటి చెత్తో పార్టీని నడిపించారు. ఆయన మరణానంతరం ఆయన వారసుడిగా ఆయన పెద్ద కుమారుడు అసదుద్దీన్‌ ఒవైసీ తండ్రి పార్టీని తన భుజస్కంధాలపై వేసుకొని  పార్టీని కేవలం హైదరాబాద్‌, తెలంగణాకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా విస్తరించుకుంటూ పోతున్నారు. క్రమంగా  అంచెలంచెలుగా దేశంలోని ప్రతి రాష్ర్టంలోనూ అభ్యర్థులను నిలబెడుతూ ఆ పార్టీ రాజకీయంగా దూసుకెళ్తోంది. అంతేకాదు పలు రాష్ట్రాల్లో తన శక్తి మేర ఎంఐఎం అభ్యర్థులను గెలిపించుకుంటున్నారు అసద్‌.

ప్రస్తుతం దేశంలోని ఐదు  రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి.. అయితే ఎంఐఎం దక్షిణాదిలోని తమిళనాడులో కూడా ఎంట్రీ ఇచ్చింది. అక్కడ ప్రాంతీయపార్టీతో పొత్తు పెట్టుకుంది. ఇవన్నీ ఒక ఎత్తయితే  పశ్చిమ బెంగాల్‌ లో కూడా ఎంట్రీ ఇచ్చి మమతా బెనర్జీకి ముచ్చెమటల పట్టిస్తున్నారు అసదుద్దీన్ ఓవైసీ. ఇటీవల పశ్చిమ బెంగాల్‌ పర్యటనలో పురపురా షరీఫ్‌ దర్గాకు చెందిన మత గురువుతో కలిసి పోటీ చేస్తానని చెప్పారు. కాగా పురపురా షరీప్‌కు చెందిన మత గురువు అబ్బాస్‌ సిద్దిఖీ కూడా కొత్త పార్టీ ఏర్పాటు చేసి ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. అటు తర్వాత ఆయన తను పోటీ చేయను కింగ్‌ మేకర్‌ అవుతానని ప్రకటించుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఎంఐఎం పార్టీ పశ్చిమ బెంగాల్‌లో తన సత్తా చాటడానికి రావడంతో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఆందోళన చెందుతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఇటీవలే ఆయన బీహార్‌లో పోటీ చేసి ఐదు అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్నారు. క్రమంగా తన రాష్ర్టంలో కూడా ఎంట్రీ ఇచ్చి ఓట్లు చీల్చుతారన్న బెంగ దీదీని వెంటాడుతోంది. 

లౌకికవాదం విషయంలో ప్రాంతీయ పార్టీల విశ్వసనీయత ఎంతా...?

లౌకికవాద విషయంలో బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం భారతీయ ముస్లింలలో కాంగ్రెస్ పై నమ్మకం సన్నగిల్లింది. దీంతో దేశంలోని ముస్లింలు బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం ప్రాంతీయ పార్టీలకు ఎక్కడికక్కడ చేరువయ్యారు. దీంతో దేశంలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడి ప్రాంతీయ పార్టీల హవా కొనసాగింది. అయితే వాజ్ పేయి పేరుతో కేంద్రంలో బీజేపీ నాయకత్వం ప్రాంతీయ పార్టీలను కూడగట్టుకొని సంకీర్ణ ఎన్డీయే సర్కార్ ను ఏర్పాటు చేశారు. ఆ సమయంలోనే 2002లో గుజరాత్ లో బీజేపీ ప్రభుత్వ హయాంలో గోద్రా అల్లర్ల ఘటనతో ముస్లిం సమాజంపై పెద్దఎత్తున్న హత్య, అత్యాచార ఘటనలు జరిగాయి. ఆ సమయంలో కేంద్రంలో వాజ్ పేయి నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం, ఆ ప్రభుత్వంలో లౌకికపార్టీలుగా చెపుకొనే ప్రాంతీయ పార్టీలు భాగస్వాములుగా ఉండటం తెలిసిందే. ఆ పార్టీలు సైతం కేంద్రంలోని వాజ్ పేయి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి గుజరాత్ అల్లర్ల విషయంలో నిలదీయలేకపోయాయి. నాటి నుంచి ఎన్డీయే ప్రభుత్వంలో లౌకిక పార్టీలుగా చెపుకొనే ప్రాంతీయ పార్టీలు భాగస్వాములుగా మారాయి. ఈ నేపథ్యంలో ప్రాంతీయ పార్టీలపై విశ్వాసం సన్నగిల్లడంతో దేశంలోని ముస్లింలు తమకు ఎంఐఎం పార్టీయే ప్రత్యామ్నాయ శక్తిగా భావించడం మొదలైందన్నది రాజకీయ విశ్లేషకుల మాట. ఈ నేపథ్యంలోనే ఓ నాడు హైదరాబాద్ లోని పాతబస్తీకే పరిమితమైన ఎంఐఎం ఇపుడు దేశవ్యాప్తంగా విస్తరించి ప్రాంతీయ పార్టీలకు సవాల్ గా మారుతోంది. ఇది ప్రాంతీయ పార్టీలు అనుసరించిన తపుడు విధానాల ఫలితమేనని చెప్పవచ్చు.

అసద్‌ అసలు టార్గెట్‌ ఉత్తరప్రదేశ్‌...!

పశ్చిమ బెంగాల్‌లో ఎంఐఎం సత్తా చాటుతుందో లేదో పక్కన పెడితే వచ్చే ఏడాది 2022లో ఉత్తరప్రదేశ్‌ శాషనసభకు జరిగే ఎన్నికల్లో మాత్రం తన సత్తా చాటలని అసద్‌ కంకణం కట్టుకున్నారు. అసద్‌ అంటే ఉర్దూలో సింహం. యూపీలో అసద్‌ ప్రత్యక్షంగా రంగంలోకి దిగితే ముస్లిం ఒటర్లను ఆకర్షించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఒక వేళ యూపీలో ఆయన ఓట్లను చీల్చగలిగితే దేశ రాజకీయాల్లో అసద్‌ తనదైన ముద్ర వేయగలరు. ఇక బీజేపీ విషయానికి వస్తే హిందూపార్టీ కనక తమ ఖాతాలోకి ముస్లిం ఓట్లు మాత్రం ఖచ్చితంగా  పడవని బీజేపీకి కూడా తెలుసు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అసదుద్దీన్ ఓవైసీ సీఏఏ చట్టాన్ని రద్దు చేయాలని యూపీలో పెద్ద ఎత్తున ప్రచారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.  అధికార బీజేపీకి ఒవైసీతో పెద్ద ఇబ్బందే.. ఎందుకంటే ఆసద్‌ ముస్లిం ఒట్లను గంపగుత్తగా తన ఖాతాలోకి వేసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇక సమాజ్‌వాది పార్టీ విషయానికి వస్తే యాదవ్‌ ఓటు బ్యాంకుపై ఆధారపడుతుంది. బహుజన్‌ సమాజ్‌పార్టీ విషయానికి వస్తే దళితుల ఓట్లు గాలం వేసేందుకు గట్టిప్రయత్నాలు చేస్తుంది. తృణమూల్‌ కాంగ్రెస్‌ కూడా  ముస్లిం ఓటర్ల కంటే హిందు ఓట్లపైనే ఆధారపడాల్సి వస్తుంది. ఇవన్నీ ప్రాంతీయపార్టీలు ఉదాహరణకు తెలంగాణ రాష్ర్టసమితి (టీఆర్‌ఎస్‌), శరద్‌పవార్‌కు చెందిన ఎన్‌సీపీ, సీపీఎం ఇవన్నీ ఒక ప్రాంతం లేదా ఒక రాష్ర్టంలో అధికారంలో ఉన్నాయి.

ఇక కాంగ్రెస్‌ విషయానికి వస్తే..

గత ఆరు దశాబ్దాల నుంచి కాంగ్రెస్‌ పార్టీకి ముస్లింలు ఓటు వేస్తూ వస్తున్నారు. మహాత్మాగాంధీ కాలం నుంచి ముస్లింలంతా కాంగ్రెస్‌ పార్టీ వెనుకే నడిచారు. ప్రస్తుతం పరిస్థితులు మారాయి.. ఓవైసీ వాదన ఏమిటంటే గత ఆరు దశాబ్దాల నుంచి ముస్లింలు కాంగ్రెస్‌కు ఓటేసినా ముస్లిం సమాజానికి ఏం మేలు జరిగిందని ప్రశ్నిస్తున్నారు. విద్యలో వెనుకబడి ఉన్నామని... 1952 నుంచి ప్రతి ఎన్నికల్లోనూ మూస్లింలు ఓటేసి మోసపోతున్నారని ఆసద్‌ వాదిస్తున్నారు. ఒక వేళ ముస్లింలు ఎంఐఎంకు ఓటేస్తే..  వారికి గుర్తింపు లభిస్తుంది. ముస్లిం సమాజం తమను స్కూళ్లు ఏర్పాటు చేయాలని, ఆస్పత్రులు నిర్మించాలని ఉద్యోగాలు కల్పించాలని కోరవచ్చునని అంటున్నారు. ముస్లిం సమాజాన్ని కేవలం ఓట్లు మాత్రమే కాకుండా ఎన్నికల్లో గెలిపించాలని గట్టిగా అభ్యర్థిస్తున్నారు అసద్‌. దాని ఫలితం బిహార్‌ ఎన్నికల్లో కనబడింది. ఇదే జోష్‌తో పశ్చిమ బెంగాల్‌లో పాగా వేయగలమనే నమ్మకంతో అసద్‌ ఉన్నారు.. 

బీజేపీపైనే అసద్‌ గురి

బిహార్‌, బెంగాల్‌ కంటే కూడా ఉత్తరప్రదేశ్‌పైనే అసద్‌ ఫోకస్‌ పెట్టనున్నారు. వచ్చే ఏడాది మార్చిలో జరిగే ఎన్నికల్లో ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేప అధికారంలో ఉంది. యోగి ఆదిత్యనాథ్‌ హిందూ గొంతుకను బలంగా వినిపిస్తున్నారు. యూపీలో మైనారిటీలపై దాడులు తదితర అంశాలు ముస్లింలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. రాష్ర్టంలో రాజకీయంగా తాము పట్టుకోల్పోతున్నామన్న ఆందోళన కూడా వారిని వెంటాడుతోంది. సెక్యూలరీ పార్టీలు కాంగ్రెస్‌, సమాజ్‌వాది పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ముస్లింలకు ప్రత్యేక ఆదరణ లభించేది. ఒక వేళ ఎంఐఎం బిహార్‌, పశ్చిమ బెంగాల్‌లో తమ ఉనికిని కాపాడుకుంటూ కొన్ని ఓట్లు సాధిస్తే.. ఉత్తరప్రదేశ్‌లో కొత్త ఉత్సాహంతో రాష్ర్టంలో పాగా వేయడానికి దారి సులువవుతుంది.

తమిళనాడులో పోటీ

ఎంఐఎం తమిళనాడులో కూడా తన ఉనికిని చాటుకోవడానకి ప్రయత్నాలు మొదలుపెట్టింది. అమ్మా మక్కల్‌ మున్నేట్ర కజగం (ఎఎంఎంకె)తో చేతులు కలిపింది.  రాష్ర్టంలో మొత్తం మూడు స్థానాల్లో పోటీ చేసింది. ఇదిలావుంటే తమిళనాడు, పుదుచ్చేరిలో ఏప్రిల్‌6న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఫలితాలు మే 2న వెల్లడికానున్నాయి. అసద్‌ ఖాతాలో ఎన్ని సీట్లు పడుతాయో తేలిపోతుంది

మున్సిపల్‌ ఎన్నికలతో ఏపీలో ఎంట్రీ

ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో ఎంఐంఎం తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. పొరుగున ఉన్న రాష్ర్టంలో కూడా ఎంఐఎం జెండాను ఎగురవేస్తామన్నారు అసద్‌. కర్నూలు, అనంతపూర్‌, విజయవాడ మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసింది. మున్సిపల్‌ ఎన్నికలను తాను తేలికగా తీసుకోవడం లేదని అసద్ స్పష్టం చేశారు. అయితే ఈ ఎన్నికల్లో ఎంఐఎంకు అనుకూల ఫలితాలు ఏమీ రాలేదు. మొత్తానికి చూస్తే రాబోయే రోజుల్లో ఎంఐఎం దేశంలోని అన్నీ రాష్ట్రాల్లో తమ ఉనికిని చాటుకొనే స్థాయికి ఎదిగే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.

✍️ రచయిత-లక్కాకుల కృష్ణమోహన్‌

సీనియర్‌ జర్నలిస్టు-హైదరాబాద్

సెల్‌ : 9705472099

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: