హోరా...హోరీ పోరులో గెలుపెవ్వరిదీ...?

ఓటర్లను సామాజిక వర్గాల వారీగా ఆకర్షించే యత్నం

అన్ని వర్గాలకు మేమున్నామన్న హామీ

సిట్టింగ్ సీటుపై వైసీపీ ప్రత్యేక నజర్

ఉనికి కోసం టీడీపీ ఫైట్

కాలుమోపేందుకు కమలం ఆసక్తి

తిరుపతిలో వేడెక్కుతున్న రాజకీయం

(జానోజాగో వెబ్ న్యూస్-ఏపీ పొలిటికల్ బ్యూరో)

ప్రస్తుతం ఏపీ రాష్ట్ర రాజకీయాలు తిరుపతి చుట్టూనే తిరుగుతున్నాయి. గెలుపుపై ధీమాతో ఉన్న వైసీపీ అతివిశ్వాసంతో ముందుకెళ్లకుండా జాగ్రత్తలు తీసుకొంటోంది. ఎన్నికల్లో వ్యూహాత్మకంగా తలపడుతోంది. ఇక వరుస ఓటములతో కుంగిపోయిన టీడీపీ తిరుపతి లోక్ సభ స్థానంలో తన భవిష్యత్తును నిర్ణయించుకొనేందుకు సమాయత్తమవుతోంది. ఇక ప్రతి ఎన్నికల్లో నామ మాత్రం పోటీ ఇవ్వలేని బీజేపీ హిందుత్వ అజెండా తిరుపతిలో ప్రయోగించాలని ఆసక్తిచూపుతోంది. తద్వారా ఏపీలో రాజకీయ ఎంట్రీ ఇవ్వాలని ఆ పార్టీ శ్రమిస్తోంది. బీజేపీకి జనసేన బాసటగా నిలిస్తూ జనంలోకి వెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఇలా తిరుపతి లోక్ సభ ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలకూ ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ హోరాహోరీ పోరులో ప్రజల మొగ్గు ఎటు అన్నది ఎన్నికలు సమీపించే కొద్ది ఆసక్తిగా మారుతోంది.

ఇదిలావుంటే తిరుపతి లోకసభ ఉప ఎన్నికలో ఓటర్లను ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలు ఎత్తుగడలు వేస్తున్నాయి. ఓ వైపు క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహిస్తూ.. మరోవైపు నియోజకవర్గాల్లో బలమైన సామాజిక వర్గాల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఆత్మీయ సమ్మేళనాలు, ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తూ ఓట్లను రాబట్టుకునే ప్రయత్నాల్లో నిమగ్నమ య్యాయి. తిరుపతి లోక్‌సభ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు అన్ని పార్టీలు శ్రమిస్తున్నాయి. లోక్‌సభ పరిధిలోని సత్యవేడు, సూళ్లూరుపేట, గూడూరు ఎస్సీలకు రిజర్వ్‌ అయ్యాయి. ఏడు నియోజకవర్గాల పరిధిలో వర్గాల వారీగా ఓటర్ల లెక్క తేల్చి వారిని ఆకర్షించేందుకు ప్రత్యేక వ్యూహాలను అమలు చేస్తున్నారు. ప్రముఖ నేతల పర్యటన దగ్గర నుంచి చిన్నచిన్న సమావేశాల వరకు ఆయా సామాజిక వర్గాల కోణంలోనే చూస్తున్నారు.

టీడీపీ... ముందు నుంచి బీసీ వర్గాల్లో పట్టున్న టీడీపీ ఆయా నియోజకవర్గాలపై దృష్టిసారించింది. తిరుపతి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో అధిక ఓట్లు ఉన్న ఓ వర్గ నేతలతో ప్రచారం చేపట్టింది. వెనుకబడిన కులాలు అధికంగా ఉన్న తిరుపతిలో ఆ వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులను రంగంలోకి దించింది. తాము అధికారంలో ఉన్నప్పుడు వెనుకబడిన వర్గాలకు చేసిన మేలును, పార్టీ పదవుల్లో కల్పించిన అవకాశాలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.

బీజేపీ నేతలు సామాజిక వర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ వారిని దగ్గరకు చేర్చుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తొలుత ఓ బలమైన వర్గంతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తాజాగా వెనుకబడిన వర్గాలతోనూ సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వం వారికి అందిస్తున్న పథకాలను వివరించి ఎన్నికలో భాజపాకు అండగా నిలవాలని కోరుతున్నారు. నెల్లూరు పరిధిలోని నాలుగు నియోజకవర్గాల్లోని తీర ప్రాంతాల్లో మత్స్యకార కుటుంబాలు అధికంగా ఉండటంతో ఆ వర్గానికి చెందిన నేతలను ప్రచారానికి తీసుకొస్తున్నారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తిరుపతిలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఓ సామాజిక వర్గీయులపై దాడులు చేస్తున్నారని, దీన్ని సహించేది లేదని ఆయన తన ప్రసంగంలో పేర్కొన్నారు. తద్వారా ఆ వర్గాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారని చెబుతున్నారు.

అధికార వైసీపీ కూడా వర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తోంది. ఇప్పటికే ఎస్సీ వర్గం వారితో తిరుపతిలో సమావేశం నిర్వహించింది. సమావేశానికి మంత్రులు హాజరయ్యారు. తాజాగా మరో సామాజిక వర్గీయులతో పార్టీలోని ఆ వర్గం ఎమ్మెల్యేలు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. మొత్తంగా అన్ని పార్టీలు నియోజకవర్గాల్లోని ఓటర్లను అనుసరించి అక్కడ వారితో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాయి.

తిరుపతి కేంద్రంగా పోరు!

టీడీపీ..బీజేపీ అధినేతల రాకఊపందుకున్న ఎన్నికల ప్రచారం

తిరుపతి కేంద్రంగా లోకసభ ఉప ఎన్నిక పోరు ను ఉద్ధృతం చేసేందుకు అన్ని పార్టీలు సమాయత్తమవుతున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీల ప్రముఖ నేతలు తిరుపతిలోనే మకాం వేసి ఎన్నికల ప్రచార సరళిని సమీక్షించి తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఒకే రోజు రెండు జాతీయ పార్టీల అధినేతలు తిరుపతి వచ్చారు. టీడీనీ అధినేత నారా చంద్రబాబునాయుడు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా సోమవారం తిరుపతిలో ప్రచారం నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆయా పార్టీల నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు.

తిరుపతి ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న అన్ని పార్టీలు ఇందుకు అనుగుణంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. రాష్ట్రస్థాయి నేతలు అందరూ తిరుపతిలోనే మోహరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు గత 20 రోజులుగా తిరుపతిలోనే ఉంటూ తమ పార్టీ అభ్యర్థి తరఫున ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆ పార్టీ ఎంపీలు జీవీఎల్‌ నరసింహారావు, సుజనా చౌదరి, సీఎం రమేష్‌ ఇలా అందరూ పార్టీ అభ్యర్థి గెలుపునకు రంగంలోకి దిగారు. పార్టీ సీనియర్‌ నేతలు విష్ణువర్ధన్‌రెడ్డి, భానుప్రకాష్‌రెడ్డి, సామంచి శ్రీనివాస్‌ తదితరులు క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తున్నారు. భాజపాకు మద్దతు ఇస్తున్న జనసేన నేతలు వీరికి తోడుగా నిలుస్తున్నారు. ఆ పార్టీ పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహన్‌ రెండు పార్టీల మధ్య సమన్వయం ఏర్పర్చేందుకు ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఇప్పటికే తిరుపతిలో రోడ్‌షో నిర్వహించడంతోపాటు బహిరంగ సభలో పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. వాస్తవానికి సోమవారం (12వ తేదీ) కూడా ఆయన తిరుపతి రావాల్సి ఉన్నా తన పక్కనే ఉన్న సిబ్బంది కరోనా బారినపడటంతో తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. సోమవారం ఉదయం భాజపా జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా తిరుపతిలో పర్యటించనున్నారు. ఉదయం విమానాశ్రయం నుంచి భాజపా, జనసేన కార్యకర్తలు నిర్వహించే ర్యాలీలో పాల్గొంటారు. అక్కడి నుంచి అలిపిరి వరకు ర్యాలీ చేపట్టనున్నారు. అలిపిరి వద్ద కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడతారు. మరోవైపు తెదేపా అధినేత చంద్రబాబునాయుడు సైతం సోమవారం తిరుపతిలో పర్యటించనున్నారు. సాయంత్రం 4 గంటల సమయంలో తిరుపతి రైల్వేస్టేషన్‌ నుంచి కృష్ణాపురం ఠాణా వరకు రోడ్‌షో నిర్వహించనున్నారు. అనంతరం కృష్ణాపురం ఠాణా వద్ద ప్రసంగిస్తారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి తరఫున పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు శైలజానాథ్‌ సోమవారం తిరుపతిలో ప్రచారం నిర్వహించనున్నారు. దీంతో ఒక్కసారిగా తిరుపతిలో ప్రచారం మరింత వేడెక్కనుంది. జాతీయ పార్టీల అధ్యక్షులు ప్రచారానికి వస్తుండటంతో పోలీసులు సైతం అప్రమత్తమయ్యారు. ఇందుకు అవసరమైన బందోబస్తును ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: