బార్లు, పబ్‌లపై ఎందుకు ఆంక్షలు లేవు

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న

(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)

తెలంగాణలో కరోనా పరిస్థితులపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కరోనా పరీక్షలు, చికిత్స, నియంత్రణపై నివేదిక సమర్పించింది. బార్లు, పబ్‌లు థియేటర్లపై ఎందుకు ఆంక్షలు విధించడంలేదో తెలపాలని హైకోర్టు ఆదేశించింది. ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు అతితక్కువగా చేస్తున్నారని, పూర్తిగా ర్యాపిడ్‌ టెస్టులపైనే దృష్టి పెట్టారని ఉన్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు 10 శాతం కూడా లేవని ధర్మాసనం పేర్కొంది.

ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు నెమ్మదిగా పెంచుతున్నామని ఏజీ వివరణ ఇవ్వగా.. రెండో దశ కరోనా వేగంగా విస్తరిస్తుంటే ఇంకా నెమ్మదిగా పెంచడమేంటని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు పెంచాలని స్పష్టం చేసింది. వివాహాలు, అంత్యక్రియల్లో జనం గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని హైకోర్టు సూచించింది. కరోనా పాజిటివ్‌, మరణాల రేటు వెల్లడించాలని, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రద్దీ ప్రాంతాల్లో పరీక్షల వివరాలు తెలపాలని ఆదేశించింది. రాష్ట్రంలో కరోనా చికిత్స కేంద్రాల వివరాలపై విస్తృత ప్రచారం చేయాలని, అనాథ, వృద్ధాశ్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించింది. కరోనా నిబంధనల అమలుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని, నిబంధనలు పాటించనివారిపై నమోదైన కేసులు, జరిమానాల వివరాలు వెల్లడిస్తూ 48గంటల్లో నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. 

✍️ రిపోర్టింగ్-డి.అనంత రఘు

న్యాయవాది. హైదరాబాద్

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: